గురువారం, ఏప్రిల్ 30, 2009

అంటరాని వసంతం

'అంటరానితనం నేరం' ఇది గడిచిన ఐదారు దశాబ్దాలుగా మనం గోడల మీద చూస్తున్న ఓ వాక్యం. స్వాతంత్రానికి ముందు కొన్ని వందల ఏళ్ళపాటు మన దేశంలో అమలైన అంటరానితనం కొన్ని కులాలని కనీస హక్కులకి, ఆత్మవిశ్వాసానికీ దూరం చేసింది. వారి కళలకి, సంస్కృతికీ చరిత్రలో దొరికిన స్థానం స్వల్పమే.. తమ కనీస అవసరాలు తీర్చుకోడానికి సైతం ఎన్నో పోరాటాలు చేశారు వారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటారు జి. కళ్యాణ రావు. కొన్ని తరాల వెతలనీ, పోరాటాలనీ అక్షరబద్ధం చేసి ఆయన విడుదల చేసిన నవల 'అంటరాని వసంతం'.. ఈ నవల పరిచయం 'పుస్తకం' లో...

మంగళవారం, ఏప్రిల్ 28, 2009

నాయికలు-ఇల్లేరమ్మ

"ఇదేం పేరూ?" ఇల్లేరమ్మ గురించి నేను చెప్పినప్పుడు చాలా మంది అడిగిన మొదటి ప్రశ్న ఇది. వాళ్ళలో చాలా మంది పుస్తకాలు చదవని వాళ్ళు. ఇంకొందరు అప్పుడప్పుడు మాత్రమే చదివే వాళ్ళు. లేక పోతేనా.. అసలు పేరు సుశీల అనీ, ఆరిందాలా ఇల్లిల్లూ తిరుగుతుందని పక్కింటి తాతగారు ఇల్లేరమ్మ అని పేరు పెట్టారనీ వాళ్లకి నేను వివరంగా చెపాల్సి వచ్చేదే కాదు. తన బాల్యంలో జరిగిన సంఘటన లన్నీ కథలు గా మలచి, డాక్టర్ సోమరాజు సుశీల అందించిన సంకలనం 'ఇల్లేరమ్మ కతలు.' ముగ్గురు చెల్లెళ్ళున్నా ఒక్కళ్ళ చేత కూడా 'అక్కా' అని పిలిపించుకోలేని ఇల్లేరమ్మే ఇందులో నాయిక.

ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న వెంకటేశ్వర రావు గారు 'చిన్నింజనీరు.' ఆయనది ట్రాన్స్ఫర్ల ఉద్యోగం. ఏడాదికో, రెండేళ్ళకో ఓసారి ఊరు మారిపోతూ ఉండాలి. పాత స్నేహితులని మర్చిపోవడం, కొత్తవాళ్ళని వెతుక్కోవడం, అప్పుడప్పుడు మళ్ళీ పాత వాళ్ళని గుర్తుచేసుకోవడం.. ఇలా అన్న మాట. సుశీల కి ముగ్గురు చెల్లెళ్ళు -- చిన్నారి, ఇందు, బుజ్జి. వాళ్ళమ్మ కన్నా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం సుశీలకి. 'నానీ' అని పిలుస్తారాయన. 'నీ కన్నా యేడాది వెనుక పుట్టినందుకు నాకు నువ్వు అక్కవై పోయావా?' అంటూ చిన్నారి 'అక్కా' అని పిలవకుండా తనుకూడా 'నానీ' అనే పిలుస్తుంది.. ఆమెని చూసి మిగిలిన ఇద్దరూను..

ఇల్లిల్లూ తిరిగి అందరి అజా కనుక్కుంటుందని గుంటూరు తాతగారు సుశీలకి 'ఇల్లేరమ్మ' అని పేరు పెట్టేశారు. తనదేమో చిన్నజడ . అందుకే చిన్నారి 'ఇల్లేరమ్మ-ఎలక తోక' అని ఏడిపిస్తూ ఉంటుంది. ఇల్లేరమ్మ అస్సలు బాధ పడదు. 'బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటకూడదు' అన్న రహస్యం వాళ్ళమ్మ చెప్పేసింది కదా.. చెల్లెళ్ళ కోసం ఇల్లేరమ్మ ఎన్ని కష్టాలు పడినా, అదేమిటో ఎవరూ గుర్తించరు. అసలు చదువొద్దని ఏడుస్తున్న చిన్నారిని ఈడ్చుకుంటూ బడికి తీసుకెళ్ళి చేర్పించిందే ఇల్లేరమ్మ. అలాంటి చిన్నారి పక్కలో బల్లెమైపోతుంది.. 'డబల్ ప్రమోషన్ కొట్టి నీ క్లాసులో నీ పక్కనే కూర్చుంటా' అని బెదిరిస్తూ ఉంటుంది.

ఇల్లేరమ్మకి వాళ్ళమ్మ కన్నా నాన్నంటే భలే ఇష్టం. ఆయన కూడా అంతే.. ఇంటికి రాగానే 'నానీ' అనే పిలుస్తారు. తను ఏం చెప్పినా కాదనకుండా చేస్తారు. వాళ్ళమ్మ తెలివిగా తనకి కావలసినవి ఇల్లేరమ్మ చేత చేయించుకుంటూ ఉంటుంది.. 'అప్పచ్చులు' లంచమిచ్చి. ఓసారలాగే గుంటూరులో ఉన్నప్పుడు పాయసం చేసిపెట్టి, 'మల్లీశ్వరి' సినిమాకి ప్రయాణం చేసేసింది. సరిగ్గా సినిమా టైముకే సిమెంట్ బస్తాలు రావడం తో ప్రోగ్రాం కేన్సిల్ అయ్యింది.. అలిగిన ఇల్లేరమ్మ పార్కుకెళ్ళి కూర్చుంది.. నాన్నొచ్చి బతిమాలారు. అసలు ప్రయాణం చేసిన అమ్మేమో నాన్నెదురుగా ఇల్లేరమ్మని తిట్టడం. వాళ్ళ నాన్న చేసే 'బంగాళా ఉల్లిఖారం' కూరంటే తనకి మరీ ఇష్టం. మధ్యలో సిగరెట్ కాల్చకుండా ఆ కూర వండడం ఎంత కష్టమో..

గుంటూరు నుంచి ఏలూరు, అక్కడి నుంచి విజయవాడ బదిలీలు. గుంటూరు నుంచి వచ్చేస్తున్నప్పుడు అందరూ తనకి ఎన్ని ప్రెజెంట్లు ఇచ్చారని. అమ్మకైతే జాకెట్ ముక్కలూ, అరటి పళ్ళే.. అదే తనకైతే కేరం బోర్డు, డిక్షనరీ..ఇలా ఎన్నో.. 'దీని సామాన్లకే జీపు పట్టేలా లేదని' అక్కడా అమ్మ తిట్లే .. ఏలూరులో ఉన్నప్పుడు తాతగారి తద్దినం వస్తుంది. ఎన్ని కూరలో.. ఎన్ని పిండి వంటలో.. 'మళ్ళీ తద్దినం ఎప్పుడు వస్తుందో ఏమిటో' అనుకుంటుంది. తనతో ఆటలకి పార్కుకొచ్చిన బుజ్జి తప్పిపోతే అమ్మ ఎంత హడావిడి చేసింది. చందర్రావు సైకిల్ మీద తీసుకొచ్చి దింపాక ఇల్లేరమ్మని ఒకటే తిట్టడం. 'ఈసారి నేను తప్పిపోయి చూపిస్తా..నన్నెక్కడ వెతకగలరో అదీ చూస్తా' అనుకుంటుంది.

విజయవాడ వెళ్ళాకా ఎన్ని పనులు చేసిందని? మల్లెపూలు కట్టిచ్చి నందుకు చెల్లెళ్ళ దగ్గర పదేసి పూలు ఫీజు గా వసూలు చేసిందా..ఇంటివారిచ్చిన పాసుతో లక్ష్మి టాకీసులో 'జయసింహ' శతదినోత్సవంలో రామారావునీ, అంజలినీ, శ్రీరంజనినీ దగ్గరనుంచి చూసి, ఆటోగ్రాఫు తీసుకుందా.. నారింజా సమ్మర్ స్కూల్ పెట్టి తలకి అర్ధ రూపాయి ఫీజు వసూలు చేసిందా.. చెల్లెళ్ళతో కలిసి అమ్మకి ఇడ్లీ పిండి రుబ్బి ఇచ్చిందా.. అబ్బో చాలానే చేసింది. విజయవాడ చల్లా వారింట్లో అద్దెకి దిగి రేడియో సంగీతోత్సవాలు జరిపించిందో లేదో, వాళ్ళ నాన్నగారికి హైదరాబాదు బదిలీ.. ఆ బదిలీ ఆపడానికి అమ్మకి తెలియకుండా శనివారం ఒంటిపొద్దులు కూడా చేసింది.. ప్చ్.. ఏ దేవుడూ కరుణించలా..

హైదరాబాదులో గోషా బడిలో చదువు. 'ఆడ పిల్లలు గోగు కాడల్లా ఎదిగొస్తున్నార్రా వెంకటేసూ' అని బంధువులు గోలెడితే 'చదివినంతా చదువు చెప్పిస్తా.. ఉన్న ఎనిమిదెకరాల్లొ తలో రెండెకరాలూ రాసిస్తా' అంటారు నాన్న. అంతే అమ్మాయిలంతా వాళ్ళ వాళ్ళ రెండెకరాల్లో ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు. 'మామిడితోట వేస్తా' నంటుంది బుజ్జి. అంతేనా ప్రతి వేసవిలోనూ మిగిలిన ముగ్గురూ వచ్చి పళ్ళు తిని వెళ్ళ వచ్చని' ఆహ్వానిస్తుంది కూడా. ఇంతలొ వాళ్ళకో తమ్ముడు పుడతాడు. హాస్పిటల్లో వాడిని చూసి 'ఐతే నా రెండెకరాలూ గోవిందేనా' అంటుంది బుజ్జి... చదివే అలవాటున్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన, అందరి చేతా.. ముఖ్యంగా పిల్లల చేత.. చదివించాల్సిన పుస్తకం 'ఇల్లేరమ్మ కతలు.'

ఆదివారం, ఏప్రిల్ 26, 2009

సత్యభామ-2

(సత్యభామ-1 తర్వాత)
ఊరు ఊరంతా మరొక్క సారి ఉలిక్కిపడింది. రామాలయం, రచ్చబండ, నాయుడి కొట్టు, చెరువు గట్టు.. ఇలా ప్రతీ చోటా ఇదే చర్చ. "సత్తెమ్మ గారిని నీళ్ళమీద నడవమని శ్రీకృష్ణుల వారు ఆజ్ఞాపించారట.. స్వామి సెలవిచ్చిన రోజున అమ్మ మన ఊరి చెరువు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తారట.." కామాక్షి, వామాక్షి ఊళ్ళో ఆడవాళ్ళకి, కుచేలుడు ఊళ్ళో మగవాళ్ళకి చెప్పిన వార్త ఇది. పెద్దగా చదువుకోని, పనిపాటలు చేసుకునే జనమంతా నోరెళ్ళ బెట్టారట. చదువుకున్న వాళ్ళు మాత్రం కొట్టిపారేశారు.

మొత్తం మీద ఊరిలో రెండు వర్గాలు తయారయ్యాయి. ఐతే నమ్మకాల కోసం వాళ్ళెవరూ కొట్లాడుకోలేదు. అమ్మ వాళ్ళ దురదృష్టం ఏమిటంటే, తాతగారు సత్యభామ ప్రకటనని అస్సలు నమ్మలేదు సరికదా "ఆమెకి పిచ్చి ముదిరిపోయింది" అన్నారట. అంతేనా.. పిల్లలెవరినీ పొరపాటున కూడా అటువైపు వెళ్ళద్దని మరోమారు హెచ్చరించారు. సత్యభామ ప్రకటన ఊళ్ళో కన్నా, చుట్టూ పక్కల ఊళ్లలో ఎక్కువ సంచలనం రేపిందట. దానితో ఎక్కడినుంచో భక్తులు బళ్ళు కట్టుకుని మరీ రావడం మొదలెట్టారు.

ఇంట్లో అమ్మమ్మకి మరో రకం సమస్య. కామాక్షి, వామాక్షి రోజూ ఏదో వేళలో పెరట్లోకి వచ్చి ఆవిడకి సత్యమ్మ మహిమలు వర్ణించి వర్ణించి చెప్పి వెళ్ళేవాళ్ళు. దానితో ఆవిడకి 'ఏ పుట్టలో ఏ పాముందో.. నమ్మితే ఏం' అన్న భావన మొదలైంది. అసలే తొమ్మిది మంది పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చెయ్యాలా అన్న దిగులుతో ఉన్న ఆవిడకి సత్యభామ ని నమ్మడం లో తప్పు కనిపించలేదు. అలా అని తాతగారికి ఎదురు చెప్పలేదు . అందుకని, ఉభయతారకంగా, తాతగారు, పెద్ద మామయ్యా చూడకుండా అమ్మ వాళ్ళు సత్యభామ ఇంటికెళ్ళి చూసి రావడానికి ఆవిడ అనుమతిచ్చేసింది.

అమ్మ వాళ్ళ పెద్దక్క, రెండో అక్క ఇలాంటివాటికి కొంచం దూరంగా ఉండేవాళ్ళు. ఇంకా మిగిలిన ఐదుగురూ వంతులేసుకుని సత్యభామ ఇంటికెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. సత్తెమ్మ గారికి పాద పూజ చేసుకోడం కోసం భక్తులు పోటీలు పడడం చూసి వీళ్ళకి నవ్వాగేది కాదట. వీళ్ళని చూసి ''పాపలూ.. మీరు ఆడ పిల్లలు కాదమ్మా..దేవ కన్యలు.." అనేదట ముద్దు ముద్దుగా.. జామ చెట్టు కాపుకి రావడం తో పాద పూజ చేసిన భక్తులకి కాయనో, పిందెనో ప్రసాదించేదట, చెట్టు మీదనుంచే.. చూస్తుండగానే ఆవిడకి నెమలి కన్నుల విసనికర్ర, వెండి కిరీటం సమకూరాయి.

ఇంటి పెరట్లో అమ్మా వాళ్ళ ఆటల్లో సత్యభామ ఒక భాగమైపోయింది. ఆరోజు సత్యభామ ఇంటి దగ్గర డ్యూటీ చేసినవాళ్ళు మిగిలిన వాళ్లకి తామే ఒకరు సత్యభామగా మరొకరు భక్తుడిగా నటించి చూపేవారట. సమస్యల స్థాయి కూడా నెమ్మదిగా పెరిగింది. కోడిపుంజు, గేదె ల నుంచి పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టు కోవడం, అప్పులు తీర్చడం లాంటి ప్రశ్నలు అడిగే వారట భక్తులు. ఇక ఊళ్ళో సత్యభామని నమ్మని వాళ్ళంతా "ఇంకెప్పుడు నడుస్తుంది చెరువు మీద" అనుకోడం మొదలు పెట్టారు. ఈ విషయం సత్తెమ్మ దాకా వెళ్ళింది. దానితో ఆవిడ ప్రకటించింది.. "రేపు మనూరి చెరువు మీద నడవమని స్వామి సెలవైంది.." (వివరాలు తర్వాతి భాగం లో)

శనివారం, ఏప్రిల్ 25, 2009

రేగడివిత్తులు

మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికీ మన రాష్ట్రం లో అధిక శాతం ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో వ్యవసాయాన్ని ప్రధానాంశంగా చేసుకుని వచ్చిన రచనలు బహు తక్కువ. గడిచిన దశాబ్ద కాలంలో ఐతే, ఈ రంగాన్ని గురించి వచ్చిన పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని, గ్రామీణ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని చంద్రలత రాసిన నవల 'రేగడివిత్తులు.' ఈ నవల గురించి నా వ్యాసం 'పుస్తకం' లో..

***

‘విత్తనం తో విప్లవం’ ఇది ‘రేగడివిత్తులు’ నవల ద్వారా రచయిత్రి చంద్రలత ఇచ్చిన సందేశం. పుష్కర కాలం క్రితం ఉత్తరమెరికా తెలుగు సభ (తానా) నిర్వహించిన నవలల పోటీలో ప్రధమ బహుమతి రూ. 1.2 లక్షలు అందుకున్న ఈ నవల, నాలుగు దశాబ్దాల కాలంలో వ్యవసాయం లోనూ, వ్యవసాయాన్ని నమ్ముకున్న ఓ పల్లెటూరి కుటుంబంలో వచ్చిన మార్పులని నిశితంగా చిత్రించింది.

వ్యవసాయం తో పాటు, సామాజిక, ఆర్ధిక అంశాలు, తెలంగాణా ప్రాంతంలో దొరతనం, వెనుకబాటు తనం, ఆంద్ర గోబ్యాక్ ఉద్యమం, ఆ సమయం లో తెలంగాణా ప్రాంతం లో ఉన్న ఆంధ్ర కుటుంబాలు ఎదుర్కొన్న సమస్యలు, రెండు ప్రాంతాల ఆచారాలు, వ్యవహారాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు..ఇలా ఎంన్నో అంశాలను స్పృశించింది ఈ నవల.

యాభై-అరవై ల మధ్య కాలంలో మొదలయ్యే కథలో ప్రధాన పాత్ర రామనాధం. గుంటూరు జిల్లా రేపల్లె కి చెందిన వ్యవసాయ కుటుంబంలో రెండో కొడుకు. అన్నగారు రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాధం చదువుకుని గవర్నమెంటులో  ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గల వాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్ల రేగడి నేలను చూసిన రామనాధం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక.

తల్లిని, అన్నగారిని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్య తో కలిసి నడిగడ్డ కి వచ్చిన రామనాధం ఓ దొర దగ్గర పొలం కొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయం లోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాధానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డ కి వలస వస్తుంది.

మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాధం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడం తో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

మరో పక్క ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం, ప్రజల్ని రెచ్చగొట్టే నాయకులు, చదువుకొనే విద్యార్ధుల — ముఖ్యంగా అమ్మాయిల — సమస్యలనూ చర్చిస్తుంది ఈ నవల. ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయం లోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు.. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా. పెళ్ళయ్యాక పూర్తి కొత్త సంస్కృతిలో ఆ అమ్మాయి ఎదుర్కొనే సమస్యలు, వాటిని ఆమె ఎలా పరిష్కరించుకుంది లాంటి విషయాలు ఆసక్తి గా చదివిస్తాయి.

కల్తీ ఎరువులు, విత్తనాలు, పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్ లో ధర పడిపోవడం, దళారీల పాత్ర.. ఇలా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలనూ స్పృశిస్తూ సాగుతుంది కథ. అదే సమయంలో రాంనగర్ పక్కగా హైవే రావడం, పట్టణ సంస్కృతి ప్రభావం, మనుషుల మధ్య పెరిగే దూరాలనూ కళ్ళముందు ఉంచుతుంది. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఆ కుటుంబానికి ఆనంద విషాదాలు ఏక కాలంలో అనుభవంలోకి రాడాన్ని, ఇటు అమ్మాయి వాళ్ళు, అటు అబ్బాయి వాళ్ళు తమకి కొత్తవైన సంప్రదాయాలను ఆసక్తి గా గమనించడం ఈ నవలలో చూడొచ్చు.

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎక్కడ మొదలై, ఎలా కొనసాగుతాయి అన్న విషయాన్ని చాలా వివరంగా చిత్రించారు. ముఖ్యంగా డబ్బు మనుషుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు తెస్తుంది అనే విషయాన్ని ఉత్తరార్ధం లో కళ్ళకు కడతారు రచయిత్రి. ఉమ్మడి కుటుంబాన్ని నేపధ్యంగా ఎంచుకోవడం వల్ల విస్తారమైన కేన్వాస్ ఏర్పడింది. పెద్ద తరం ఆలోచనల నుంచి, కుర్రకారు ప్రేమల వరకు ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి.

వ్యవసాయంతో పాటు పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా హరిత విప్లవపు అవాంచిత ఫలితమైన ‘కాంగ్రెస్ గడ్డి’ గురించి సందర్భోచితంగా వివరించారు. అలాగే పెద్ద యెత్తున ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల జరిగే పరిణామాలనూ తెలిపారు. రామనాధానికి ఉన్న ఆత్మ విశ్వాసం, ఆశా వహ దృక్పధం, తొణకని నైజం, కుటుంబ సభ్యులతో పాటు తోటి రైతుల గురించీ ఆలోచించే అతని తత్త్వం కథకి బలాన్ని ఇచ్చాయి. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాధం. ఆశావహ దృక్పధం తో ముగుస్తుంది కథ.

ఈ నవలలో లోపాలు లేవా అంటే ఉన్నాయి.. కొన్ని పాత్రలు అర్ధంతరంగా మాయమవడం, అక్కడక్కడ వచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు, కొన్ని సన్నివేశాలు అతి వివరంగా రాసి మరి కొన్నింటిని రెండు మూడు డైలాగులతో దాట వేయడం.. ఇత్యాదులు.  ఐతే ఇవేవీ నవల చదవడానికి అడ్డు కాదు. వదలకుండా చదివించే గుణం ఈ నవలకున్న ప్లస్ పాయింట్. తానా అవార్డు కమిటీ సభ్యులు అభిప్రాయ పడినట్టుగా ఈ నవలకు చక్కటి ఎడిటింగ్ అవసరం.

పల్లెటూళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళు, వ్యావసాయిక నేపధ్యం ఉన్నవారు ఈ నవలను పూర్తిగా ఆస్వాదిస్తారు. ఈ అంశాలపై ఆసక్తి ఉన్నవారిని కూడా వదలక చదివిస్తుంది ఈ నవల. తానా ప్రచురించిన 420 పేజీల ‘రేగడి విత్తులు’ (Regadi Vittulu – Chandralatha) నవల వెల రూ. 195. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.

మంగళవారం, ఏప్రిల్ 21, 2009

అపార్ధం

'మాట వెండి ఐతే మౌనం బంగారం' అని సామెత. ఇది నిజమనిపించే సంఘటనలు చాలా జరిగాయి నాకు. ముఖ్యంగా నాకు కావలసిన వాళ్ళతో మాట పట్టింపు వచ్చిన ప్రతిసారి నాకు తెలియకుండానే ఈ సామెత గుర్తొస్తుంది. చాలా మాటలకి ఒకటి కన్నా ఎక్కువ అర్ధాలే ఉంటాయి. పలికే విధానం లో తేడాలు కూడా అర్ధాలను మార్చేస్తాయి. మనం ఒక అర్ధంలో అన్న మాటలు అవతలి వాళ్ళు మరొక అర్ధంలో తీసుకున్నప్పుడు వివరణ ఇవ్వక తప్పని పరిస్థితులు ఉంటాయి.

అదేం అదృష్టమో కాని చిన్నప్పటినుంచీ 'నా ఉద్దేశం అదికాదు' అని కొన్ని వేల సార్లు చెప్పి ఉంటాను. తప్పులు మనకి చాలా నేర్పిస్తాయి. నాకు మాట్లాడడాన్ని కొంతవరకు నేర్పించాయి. 'కొంతవరకు' అనడం ఎందుకంటే ఇప్పటికీ అపార్ధాలు దొర్లుతున్నాయి కాబట్టి. ఇవి కూడా నేను బాగా దగ్గర వాళ్ళు అని ఫీలయ్యే వాళ్ళతోనే ఎక్కువ. అవును..ఎక్కువగా మాట్లాడేది వాళ్ళతోనే కదా. ఈ అపార్ధాలు మళ్ళీ రెండు రకాలు. మాటల్లో పొరపాటు, జరిగిన పొరపాటును సరిచేసుకునే క్రమంలో జరిగే పొరపాటు. రెండోది మరీ దారుణం.

అవతలి వాళ్ళు మనం చెప్పేది నమ్మనప్పుడు 'ఒట్టు' అనడం చాలా మందికి అలవాటు. నాకెందుకో కొంచం ఊహ తెలిసిన నాటి నుంచే 'ఒట్టు' మీద నమ్మకం పోయింది. నా మిత్రుల్లో కొందరు దొంగ ఒట్లు వేసుకునే వాళ్ళు. అలా ఎందుకు అని అడిగితే, ఒట్టుని మరీ అంట సీరియస్ గా పట్టించుకో నవసరం లేదనే వాళ్ళు. బహుశా అందుకే అనుకుంటా.. నేను 'ఒట్టు' అనడం మానేశా. 'ఒట్టేయ్.. నమ్ముతాను' అని అవతలి వాళ్ళు అడిగినా నేను వేయననే వాడిని. ఇప్పటికీ ఎవరైనా 'ఒట్టు' అనబోతే 'ఒట్టు వేయొద్దు ప్లీజ్' అంటాను నేను.

మనం చెప్పే నిజం నిజమేనని అవతలి వాళ్ళని ఒప్పించడానికి ఒట్టు ఉపయోగ పడుతుందేమో.. కాని ఒట్టు లేకుండా కూడా ఆ పని చేయొచ్చు కదా. అయినా నమ్మకం మనుషుల మీద ఉండాలి కాని ఒట్ల మీద కాదు. ఇలాంటి విషయాలలో వాదించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక పాయింట్ వరకు చెప్పి వదిలేస్తా. ఇక అర్ధం చేసుకోవడం, చేసుకోక పోవడం అవతలి వాళ్ళ ఇష్టం. చిన్నప్పుడోసారి నేను నా క్లాస్మేట్ ని దొంగతనానికి ప్రోత్సహించానని అనుమానించి, వాళ్ళ నాన్న మా నాన్నకి కంప్లైంట్ చేశారు. నేను చెప్పింది నమ్మకుండా నాన్న నన్ను పనిష్ చేశారు. ఓ వారం తర్వాత క్లాస్మేట్ వాళ్ళ నాన్న మా నాన్నకి సారీ చెప్పారు..నా పాత్ర లేదని తెలిసి.

అపార్ధం కారణంగా నాకు శిక్ష పడిన సందర్భాలు చాలానే ఉన్నప్పటికీ ఇది ఎందుకో నాకు బాగా గుర్తుండి పోయింది. ఎవరితో అపార్ధం వచ్చినా మొదటి ఇదే గుర్తొస్తుంది. నన్ను అవతలి వాళ్ళు అపార్ధం చేసుకోవడమే కాదు, వారిని నేను సరిగా అర్ధం చేసుకోని సందర్భాలూ చాలా ఉన్నాయి. మొదట్లో ఇలా జరగడానికి ఎవరో ఒకరి ప్రభావం ఉండేది. అంటే ఓ స్నేహితుడి గురించి మరో స్నేహితుడు చెప్పే మాటలో ఇలా.. సొంతంగా ఆలోచించేటప్పుడు కూడా ఎస్టిమేషన్ లో ఎక్కడో పొరపాటు దొర్లక మానదు. ఫలితం అపార్ధం.

నేను మొదట ప్రస్తావించిన సామెత అపార్ధాలు కలిగించడానికే కాదు, తొలగించడానికీ వర్తిస్తుంది. అపార్ధం పొడసూపినప్పుడు చాలా సార్లు మాట కన్నా మౌనమే సమస్యని పరిష్కరిస్తుంది. మౌనం అవతలి వాళ్లకి ఆలోచించుకునే అవకాశం ఇస్తుంది. నెమ్మదిగా సమస్యనూ పరిష్కరిస్తుంది. ఐతే మౌనం సర్వ రోగ నివారిణి కాదు. పైగా అవతలి వాళ్ళు మౌనాన్ని అపార్ధం చేసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. మాటలతో సమస్య పరిష్కారం కానప్పుడు మాత్రం మౌనమే ప్రత్యామ్నాయం. దానితో పాటు వేచి చూడగల ఓపిక కూడా అవసరం.

శనివారం, ఏప్రిల్ 18, 2009

కుర్రాడు మంచాడేనా?

ఉదయం ఒక తెలిసినతను కలిశాడు. ముఖ పరిచయం కన్నా ఎక్కువ, స్నేహం కన్నా తక్కువ. కాసేపు అవీ, ఇవీ మాట్లాడి మీకు ఫలానా కుర్రాడు తెలుసుకదా అన్నాడు. గత అనుభవాల దృష్ట్యా అతను ఏం చెప్పబోతున్నాడో సరిగానే ఊహించా. "మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం.. ఆ కుర్రాడైతే బాగుంటాడని అన్నారు. మీరు కొంచం అతని మంచీ, చెడూ కనుక్కుని ఓ మాట చెప్తే మేం ముందుకు వెళ్తాం.." అతను చెప్పేసి నాకేసి చూస్తున్నాడు. "సరే" అనడం తప్ప ఇంకేమీ అనలేని పరిస్థితి.

పెళ్లి సంబంధం వెతకడం అంటే మాటలు కాదు. అమ్మాయికైనా, అబ్బాయికైనా ఒకే తరహా జాగ్రత్త అవసరం. ఐతే సహజంగానే అమ్మాయికి సంబంధం విషయంలో కొంచం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అబ్బాయి ఎలాంటి వాడో అన్న విషయంలో ఒకటికి పది సందేహాలు ఉంటూ ఉంటాయి. ఓ ఆడ పిల్లకి పెళ్లి చేసిన అనుభవం తో ఈ ఆదుర్దాను నేను అర్ధం చేసుకోగలను. సమానత్వం అని ఎంతగా మాట్లాడుతున్నా మనదింకా మేల్-డామినేటెడ్ సమాజమే. ఏ కారణం వల్ల పెళ్లి విఫలం అయినా అబ్బాయితో పోలిస్తే అమ్మాయికి నష్టం కొంచం ఎక్కువే.

చదువు, ఉద్యోగం, అందం, ఆస్తిపాస్తులు..ఇవన్నీ చూశాక అప్పుడు కుటుంబ నేపధ్యం గురించి కనుక్కుని.. ఇక చివరికి వచ్చేసరికి అబ్బాయి గుణగణాల దగ్గర ఆగుతారు. నిజానికి అన్నింటికన్నా క్లిష్టమైన విషయం ఇదే. అబ్బాయి ఎలాంటి వాడు? అన్నది నూటికి నూరుపాళ్ళు సరిగ్గా ఎవరు చెప్పగలరు? అతని తల్లిదండ్రులా, స్నేహితులా, సహోద్యోగులా? తల్లిదండ్రులకి, స్నేహితులకి అతని గురించి తెలిసినా వాళ్ళు మంచి గుణాలను మాత్రమే ఏకరువు పెడతారు. సహోద్యోగులు చెప్పేదాన్ని గుడ్డిగా నమ్మలేం. అతనికి, వాళ్ళతో ఏవైనా గొడవలుంటే మనకి బాడ్ రిపోర్ట్ రావొచ్చు.

సరిగ్గా ఇందుకే, తెలిసిన వాళ్ళు నలుగురికి చెప్పి ఎంక్వయిరీ బాధ్యత అప్పగిస్తారు. ఆ నలుగురూ 'పర్లేదు' అంటే దేవుడి మీద భారం వేసి ముందుకి వెళ్తారు. చాలా పెళ్ళిళ్ళలో 'ఆ నలుగురిలో' ఒకడినైన నాకు చిత్రమైన అనుభవాలు ఉన్నాయి. ఒకటి మాత్రం నాకు పెద్ద పాఠం నేర్పింది. ఓ కుర్రాడి గురించి నా పద్ధతి లో నేను ఎంక్వయిరీ చేసి, అమ్మాయి వాళ్ళకి ప్రొసీడవొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. వాళ్ళు తాంబూలాలు మార్చేసుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

నిజానికి ఇందులో నా తప్పు ఏమీ లేకపోయినా, అమ్మాయి వాళ్ళ దగ్గర నాకు ముఖం చెల్లలేదు. అబ్బాయి జీత భత్యాలు, అలవాట్ల గురించి వేరే వేరే సోర్సుల్లో కనుక్కున్నా, కాని అతనితో మాట్లాడ లేదు. బహుశా అతనితోనే నేరుగా మాట్లాడి ఉంటే ఈ విషయం తెలిసేదేమో. ఇంక అప్పటినుంచి, అబ్బాయితో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమో కాదో కనుక్కున్నాక మాత్రమే రిపోర్ట్ ఇస్తున్నా. కొన్ని కొన్ని విషయాలు మాత్రం నాకు అర్ధం కావు. అబ్బాయి సిగరెట్ కాలుస్తాడు.. కొంత మందికి ఇది పెద్ద విషయం. మరికొందరు ఈ రోజుల్లో కాల్చని వాళ్ళు ఎవరు? అంటారు. వారానికోసారి, అదీ రెండు పెగ్గులే, బీరు తాగుతాడు.. ఇదీ అంతే.

నేను తెలుసుకున్నది ఏమిటంటే, మనకి తెలిసిన విషయాలను యధాతధంగా అవతలి వాళ్లకు చెప్తే, వాళ్ళే నిర్ణయించుకుంటారు. అయినా ఇంకొకరి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు కదా. ఎన్ని చేసినా కళ్ళ ముందే పెళ్లి ఫెయిల్ కావడం చూసినప్పుడు మాత్రం 'పెళ్ళంటే ఓ పెద్ద లాటరీ' అనిపించక మానదు. కేవలం అరేంజ్డ్ మేరేజెస్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాయనే సాహసం చేయను కానీ, ప్రేమ పెళ్ళిళ్ళలో ఐతే అబ్బాయి, అమ్మాయి ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తుంటే అరేంజ్డ్ పెళ్ళిళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుందనిపిస్తోంది. అప్పుడు ఈ ఎంక్వయిరీ లు, అవి సరిగా చేయలేదని బాధ పడడాలు ఉండవు కదా..

గురువారం, ఏప్రిల్ 16, 2009

నా 'రచనా' చమత్కృతి

'నేనెందుకు రచనలు చేయకూడదు?' అన్న ఆలోచన నేను మూడో తరగతి లో ఉండగా వచ్చింది. అప్పటికి వార పత్రికల్లో జోకులు చదవడం మొదలుపెట్టాను. రచనల దిశగా నన్ను ప్రేరేపించింది మాత్రం రేడియో. ఇప్పటి పోర్టబుల్ టీవీల సైజులో మా ఇంట్లో ఓ రేడియో ఉండేది. ఒక రకంగా అది స్టేటస్ సింబల్ కూడా.. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖాళీ వేళల్లో రేడియో వినడానికి మా ఇంటికి వచ్చే వాళ్ళు. ఫలితంగా 'గూ' అని సౌండ్ వచ్చేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా మా ఇంట్లో రేడియో మోగుతూ ఉండేది.

ఒక సారి రేడియోలో విన్న ఒక నాటిక నాకు బాగా నచ్చింది. పిల్లలు వాళ్ళ అమ్మానాన్నల్లో మార్పు తేవడం అన్నది కథాంశం. సరిగ్గా అప్పుడే మా మేష్టార్లు మమ్మల్ని ఎక్స్ కర్షన్ కి తీసుకు వెళతామన్నారు. అక్కడ మాచేత నాటికలూ అవీ వేయిస్తామన్నారు. ఆ ఎక్స్ కర్షన్ కోసం నేను నాటిక రాయడం మొదలుపెట్టా.. ఓ చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న చేత సిగరెట్లు మాన్పించడం అన్నది ఇతివృత్తం. మా నాన్న సిగరెట్లు కాల్చేవాళ్ళని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

మూడు పాత్రలతో ఓ నాటిక రాశాను. ఇక అక్కడినుంచి నేను కలలు కనడం మొదలుపెట్టా.. మేము నాటకం వేయడం, అది చూసి మా నాన్న నన్ను మెచ్చుకుని సిగరెట్లు మానేయడం, అమ్మ బోల్డంత సంతోషపడడం ఇలా సినిమాటిక్ గా సాగేవి. రెండు కాగితాల మీద నేను రాసిన నా మొదటి రచనని నా మిత్రులు మేష్టారికి చూపించారు. అది చూసి ఆయన ఏమి మాట్లాడ లేదు. కారణాలు తెలియదు కానీ మా ఎక్స్ కర్షన్ కేన్సిల్ అయ్యింది. అన్నట్టు మా మేష్టారు కూడా సిగరెట్లు కాల్చేవాళ్ళు.

హైస్కూలికి వచ్చేసరికి పద్యాల మీద మోజు మొదలైంది. అందుకు కారణం మా తెలుగు మేష్టారు. ఆయన శ్రావ్యమైన గొంతుతో పద్యాలు చదివే వాళ్ళు. దానికి తోడు రవీంద్రనాథ్ టాగూర్ తన పదో ఏటే కవిత్వం రాయడం మొదలు పెట్టారని చెప్పారాయన. ఇక అది మొదలు నేను పద్యాలు అనుకుని ఏవేవో రాసి ఆయనకి చూపించడం.. ఆయనేమో కవిత్వం బాగా చదివితే బాగా రాయగలుగుతావు అని చెప్పడం. ఇది పని కాదని నేను జానపద గేయాల వైపు మళ్ళాను. ఇందుకు కూడా రేడియో స్ఫూర్తి. పల్లవి, ఒక చరణం చొప్పున నాలుగైదు పాటలు రాశాను.

అప్పుడే కథలు, సీరియల్స్ చదవడం మొదలుపెట్టడం తో పద్యం కన్నా గద్యం బెటరన్న భావన బలపడింది. ఓసారి సెలవుల్లో మా వీధిలో కూర్చుని ఉంటే పందుల్ని మేపే వాళ్ళు ఓ పెద్ద పందుల గుంపుతో వచ్చారు. వాటిని చూడగానే 'పంది' గురించి ఓ సీరియల్ ఎందుకు రాయకూడదు అన్న ఆలోచన వచ్చింది. పంది మీద నాకంత అభిమానం కలగడానికి ఓ కారణం ఉంది. 'పంది వెధవ' అన్న తిట్టు నా చిన్నప్పుడు చాలా కామన్. అది వినీ, వినీ పంది కూడా మనలాంటిదే కదా అనుకోవడం మొదలుపెట్టాను.

పందులు, పందుల్ని కాసే వాళ్ళ జీవన విధానం గురించి నేను రాసిన సీరియల్ సగం కూడా పూర్తవ్వక ముందే మా సెలవులు ఐపోయాయి. పేరాల మధ్యలో మూడు చుక్కలు పెట్టడం తో సహా ప్రముఖ రచయితల శైలిని అనుకరిస్తూ చేసిన రచన అది. చాలా రోజులు దాచాను కాని, పూర్తి చేయలేక పోయాను. 'నన్నయ భట్టు అంతటి వాడే మహా భారతం పూర్తి చేయలేక పోయాడు' అని సరిపెట్టుకున్నా.. ఈలోగా ఇతర కళల మీదకు దృష్టి మళ్ళడంతో రచన మూలన పడింది.

బుధవారం, ఏప్రిల్ 15, 2009

ధనలక్ష్మి

భార్యా భర్తల్లో, భర్త కన్నా భార్య తెలివైనది ఐతే...? ఆ తెలివి తేటలు కుటుంబానికి ఉపయోగ పడుతున్నప్పటికీ ఆ భర్తలో అసూయని పెంచుతున్నట్టైతే...? తెలివైన ఆ భార్య తనకి వచ్చే సమస్యలని ఎలా పరిష్కరించుకుంటుంది, తను చేయాలనుకున్నవి భర్త చేతే ఎలా చేయిస్తుంది అన్న పాయింట్ ని హాస్యభరితంగా చెబుతూ శ్రీరమణ రాసిన కథ 'ధనలక్ష్మి.'

ఇది ఓ పల్లెటూరి కిరాణా కొట్టు యజమాని ఈశ్వరయ్య గారి పెంపుడు కొడుకు రామాంజనేయులు, అతని భార్య ధనలక్ష్మి ల కథ. కథకుడు, అతని భార్య, పిల్లల విశేషాలూ ఉంటాయి. ఆకుపచ్చ హంబర్ సైకిల్ మీద హైస్కూలుకి వచ్చే రామాంజనేయులంటే ఎంతో ఆరాధన కథకుడికి. చాలా ముభావంగా ఉండే రామాంజనేయులు కథకుడితో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రామాంజనేయులికి హోం వర్క్ చేసిపెట్టి, నోట్స్ లు రాసిపెట్టి అప్పుడప్పుడు ఆ సైకిల్ మీద రౌండ్లు కొట్టి సంతోషపడుతూ ఉంటాడు కథకుడు.

ఈశ్వరయ్య గారికి అనారోగ్యం చేయడంతో పెంపుడు కొడుకు పెళ్లి కళ్ళారా చూడాలన్న కోరికతో ఎనిమిదో తరగతి చదువుతున్న రామాంజనేయులికి అదే స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ధనలక్ష్మి నిచ్చి పెళ్లి చేసేస్తారు. తీరా పెళ్ళయ్యాక ఈశ్వరయ్యగారు కోలుకుంటారు. రామాంజనేయులు మీద అకాల పెద్దరికం వచ్చిపడుతుంది. ఓ రోజు క్లాసులో సైన్సు మేష్టారు చేసిన అవమానం భరించలేక చదువు మానేస్తాడు రామాంజనేయులు. అతని వెంటే ధనలక్ష్మి.

కొట్లో కుర్రాళ్ళంతా కలిసి దొంగ లెక్కలు రాసి ఆస్తి దోచేశారన్న నిజం ఈశ్వరయ్య గారి మరణం తర్వాత బయట పడుతుంది. వేరే కొట్లో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానన్న రామాంజనేయులుని వారించి, తన నగలు తాకట్టు పెట్టి పిండి మర పెట్టిస్తుంది ధనలక్ష్మి. ఇందుకు కథకుడు మాట సాయం చేస్తాడు. ధనలక్ష్మి తెలివి తేటలు, రామాంజనేయులు కష్టం ఫలించి వాళ్ళ వ్యాపారం పుంజుకుంటుంది. వీధి గదిలో కిరాణా కొట్టు తిరిగి మొదలవుతుంది. వాళ్లకి 'ఈశ్వర్' పుడతాడు.

ఊరి చివర ఓ పల్లపు స్థలం కొని దాన్ని గోడౌన్ గా మారుస్తాడు రామాంజనేయులు. ఓ ఎరువుల కంపెనీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఏజెన్సీ ఇస్తారు. అలా 'ఈశ్వర్ ఏజెన్సీస్' వెలుస్తుంది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత, రైల్లో రావాల్సిన ఎరువుల లోడు ఆలస్యం కావడం తో రేటు బాగా పెరిగి విపరీతంగా లాభాలు వస్తాయి. ఎనిమిదో తరగతికి వచ్చిన ఈశ్వర బాబుని పట్నంలో చదివించాలని ధనలక్ష్మి కోరిక. తామూ ఉప్పు, చింతపండు అమ్మితే తన కొడుకు ఏ,బీ,సీడీలు అమ్మాలంటుంది.

'చదువుకొని మేమేం సాధించాం, చదువుకోక మా రామాంజనేయులు ఏం చేదు మేశాడని' అడిగిన కథకుడితో ధనలక్ష్మి ఇలా అంటుంది: "అన్నయ్యా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. తోడ బుట్టిన లాంటి వాడివి కనక చెబుతున్నా. అన్నిత్తో నా మాటే నేగ్గుతోందని తెగ ఉక్రోస పడి పోతున్నాడు. పనిగట్టుకుని కుళ్ళు మాటలు అంటాడు. అన్నీఉండి సంసారంలో సుకం లేకపోతె ఏంటి లాబం? కాపరం అన్నాక తగ్గూ మొగ్గూ ఉంటే సర్దుకు పోవాలి గండా.. లక్క బంగారం అంటి పెట్టుకుని ఉంటేనే తాళి బొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గితే పోలా?"

కథకుడు ప్రశ్నార్ధకంగా ముఖం పెడితే ఆమె ఇలా కొనసాగిస్తుంది: "మనసులో పెట్టుకో అన్నయ్యా. చిట్టీ పాడి పాతికవేలు స్థలం వాళ్లకి ఇచ్చా.. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా.. ఇదంతా తన తెలివి అని మురిసి పోతున్నాడు. ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు. గోడౌను ఆలోచన నాది. కాపరం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా.. తన తెలివి గుర్తించానని తెగ సంబరపడి పోతున్నాడు లే. పదేళ్ళు ఎనక్కి వెళ్లి పోయాడంటే నమ్ము.."

ఈశ్వరబాబుని పట్నం లో చదివించడానికి రామాంజనేయులు ని ధనలక్ష్మి ఎలా ఒప్పించిందన్నది ఈ కథ ముగింపు. 'నవోదయ' ప్రచురించిన 'మిధునం' కథల సంపుటి లోదీ కథ. శ్రీరమణ రాసిన 'షోడా నాయుడు' కథ గురించి పరిచయం ఉమాశంకర్ గారి 'అనంతం' బ్లాగులోనూ, 'మిధునం' కథ ఆధారంగా తీసిన మళయాళ సినిమా 'ఒరు చెరు పుంచిరి గురించి 'నవతరంగం' లోనూ చూడొచ్చు.

మంగళవారం, ఏప్రిల్ 14, 2009

ఆనంద తాండవం

సినిమా చూసి చాలా రోజులు అయ్యింది. మంచి సినిమాలు లేకపోవడం, పనుల ఒత్తిడి, పుస్తకాల మీద కొంచం ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ మధ్య సినిమాలేవీ చూడలేదు. ఓ ఫ్రెండ్ 'పర్వాలేదు' అని చెప్పడం తో నిన్నరాత్రి 'ఆనంద తాండవం' సినిమా చూశాను. ప్రయత్నం మంచిదే కాని లోపాలు చాలా ఉన్నాయి. 'చెత్త సినిమా' 'టైం వేస్ట్' అని నాకు అనిపించలేదు.. కాకపొతే శ్రద్ధ పెడితే మంచి సినిమా అయ్యేది అనిపించింది. ఈ సినిమా గురించి నేను రాసిన వ్యాసం 'నవతరంగం' లో...

ఆదివారం, ఏప్రిల్ 12, 2009

సత్యభామ-1

అమ్మ తన బాల్యాన్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మర్చిపోకుండా చెప్పే సంగతి ఒకటి ఉంది.. అది 'సత్యభామ' గురించి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ అక్కచెల్లెళ్ళు కలుసుకున్నప్పుడు మేము సత్యభామ ని గుర్తు చేసేవాళ్ళం. వాళ్ళంతా చిన్న పిల్లలై పోయేవాళ్ళు. తాతగారి ఊళ్ళో క్షురకుడి ఇల్లు చెరువు గట్టున, బడికి దగ్గరగా ఉండేది. ఆ క్షురకుడి భార్య ఉన్నట్టుండి ఒకరోజు తాను సత్యభామ ని అని ప్రకటించుకుంది.

ఈ వార్త వినగానే ఊరంతా ఉలిక్కిపడింది. ఇక అమ్మ వాళ్లకి ప్రతి రోజూ చేతినిండా పని. ప్రతిరోజూ బడికి వెళ్లేముందు, బడినుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సత్యభామ ఏం చేస్తోందో చూడాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. అసలే తాతగారు, పెద్ద మామయ్య 'అటువైపు వెళ్తే కాళ్ళు విరగ్గొడతాం' అని బెదిరించారట కూడాను. సత్యభామ ఇంటిదగ్గర రెండుపూటలా వీళ్ళ హాజరు తప్పని సరి.

సదరు సత్యభామ ఇంటి గుమ్మంలో ఓ జామి చెట్టు ఉండేదట. ఆవిడ పగలంతా ఆ జామిచెట్టు కొమ్మమీద కూర్చుని పిల్లనగోవి ఊదుతూ ఉండేదట. మధ్య మధ్యలో కృష్ణుడితో మాట్లాడుతూ, ఓ గ్రంధం రాస్తూ ఉండేదట. భర్తకీ, కొడుక్కీ పేర్లున్నా భర్త పేరుని 'కాకాసురుడు' అనీ కొడుకు పేరు 'ప్రహ్లాదుడు' అనీ మార్చేసిందిట ఆవిడ. ఆవిడకి దయ్యమో భూతమో పట్టిందని నమ్మిన 'కాకాసురుడు' ఆవిడకి భూత వైద్యం చేయించాలని ప్రయత్నించి విఫలమయ్యాడట.

ఆనోటా, ఆనోటా సత్యభామ గురించి విన్న ఊళ్ళో ఇద్దరు వయసు మళ్ళిన మహిళలు ఆవిడకి శిష్యులుగా మారారు. వాళ్ళిద్దరికీ 'కామాక్షి' 'వామాక్షి' అని పేర్లు పెట్టిందట సత్యభామ. వాళ్ళు మాత్రం ఆమెని 'సత్తెమ్మ గారూ' అని పిలిచే వాళ్ళట. సత్యభామ గా మారిన క్షణం నుంచే ఆవిడ వస్త్ర ధారణా మారిపోయింది. చీరకి బదులు ఓ పొడవాటి గౌను ధరించేది. జుట్టు విరబోసుకునేది. సర్వకాల సర్వావస్థల్లోనూ చేతిలో పిల్లనగోవి తప్పని సరి.

శిష్యుల పుణ్యమా అని సత్యభామ మహిమలు ఇరుగు పొరుగు ఊళ్లకీ పాకాయట. ఎలాంటి సమస్యకైనా ఆవిడ కృష్ణుడితో మాట్లాడి పరిష్కారం చెబుతుందనీ, ఆవిడ ఎప్పుడు పిల్చినా కృష్ణుడు పలుకుతాడనీ బాగా ప్రచారం జరిగింది. కనబడకుండా పోయిన కోడిపుంజు మొదలు, కట్టు తెంపుకు పోయిన గేదె వరకు ఏవైపు వెళ్తే దొరుకుతాయో ఆవిడ చెప్పేదట. రెండు మూడు సార్లు ఆవిడ చెప్పింది జరగడంతో జనం పెరిగారట.

తన కష్టాలు చెప్పుకోడానికి సత్యభామ దగ్గరికి వచ్చిన ఓ బహు కుటుంబీకుడికి 'కుచేలుడు' అని పేరు పెట్టి శిష్య పరివారంలో చేర్చుకుంది సత్యభామ. అప్పటికే ఆమె ఇల్లు ఆశ్రమం రూపు దాల్చింది. భర్త, కొడుకు పరాయివాళ్ళ లాగ మసలే వారట. కుచేలుడి రాకతో సత్యభామ రాసిన గ్రంధాన్ని పరిష్కరించాలన్న కోరిక మొదలైంది శిష్యులలో. అతను కొంచం చదువుకున్నవాడు. ఆవిడ రాసేది భాషే కాదని, కొక్కిరాయి గీతలని బాగా చదువుకున్నవాళ్ళు తేల్చేశారు. సరిగ్గా అప్పుడే సత్యభామ ఓ సంచలన ప్రకటన చేసిందట. (వివరాలు తర్వాతి భాగంలో)

శనివారం, ఏప్రిల్ 11, 2009

నాయికలు-రాజమ్మ

అందంగా పుట్టడం అన్నది ఏ ఆడపిల్లకైనా శాపం అవుతుందా? రాజమ్మకి మాత్రం ఆమె అందమే శాపమైంది. కాపురంలో కలతలకి కారణమయ్యింది. ఏ కొడుకు కోసం తాను బతకాలనుకుందో అదే కొడుకుని ఆమెకి దూరం చేసింది. జైలు గోడల మధ్య ఆమె తనను ఉరి తీయమనేలా (హేంగ్ మీ క్విక్) చేసింది. బీనాదేవి రాసిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవలలో నాయిక రాజమ్మ.

పట్టపు రాణి సరదాగా బీద వేషం వేసుకున్నట్టు ఉండే రాజమ్మది ఉత్తరాంధ్రలో ఓ పల్లెటూరు. కూటికి పేదలైనా కులానికి కాదు. ఆమె ఉయ్యాలలో ఉన్నప్పుడే మామ సింహాచలం తో పెళ్లి నిశ్చయమై పోయింది. ఈడేరిన రాజమ్మ, తన తల్లికి బదులుగా బుగత గారింట్లో పనిసాయానికి వెళ్ళింది.

బుగత గారబ్బాయి రాజమ్మ చేతిలో అర్ధరూపాయి పెట్టి, ఆమె బుగ్గ కొరికేస్తే తోక తొక్కినా తాచులా లేచిన రాజమ్మ అతని డబ్బు అతని మొఖాన కొట్టి ఇంటికి తిరిగొచ్చింది. కందిన బుగ్గ చూసిన తల్లి రాజమ్మనే తప్పు పట్టింది.. ఆమె చెప్పేది వినకుండా వీపు చిట్లకొట్టింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

సింహాచలాన్ని పెళ్ళాడి, ఓ కొడుక్కి తల్లైంది రాజమ్మ. ఆర్ధిక సమస్యలతో పొలాన్ని పోగొట్టుకున్నాడు సింహాచలం. తప్పని పరిస్థితుల్లో కూలిపనికి వెళ్ళిన రాజమ్మ, అక్కడి మేస్త్రి ప్రవర్తన కారణంగా పనిలో సాగలేక పోతుంది. పల్లెటూళ్ళో బతుకు తెరువు లేక కుటుంబాన్ని పట్నానికి మారుస్తాడు సింహాచలం. చేయి పట్టుకున్న స్టూడెంటు కుర్రాళ్ళు, శీలాన్ని గురించి చెడుగా మాట్లాడిన ఓ ఇంటి యజమానురాలు.. ఇలా అక్కడా చేదు అనుభవాలే ఆమెకి.

అద్దె రిక్షా తో జీవనోపాధి వెతుక్కున్న సింహాచలం ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన గొడవలో కాలు పోగొట్టుకుంటాడు. పార్టీ వాళ్ళు చేసిన సాయంతో ఆస్పత్రి ఖర్చులు, ఓ మూడు నెలలు కుటుంబ ఖర్చులు గడుస్తాయి. ఓ కాలేజి ప్రిన్సిపాల్ గారింట్లో పనికి చేరిన రాజమ్మ వాళ్లకి తలలో నాలుకలా మారుతుంది.

మరోపక్క కుంటికాలితో ఇంటికే పరిమితమైన సింహాచలం రాజమ్మని అనుమానిస్తూ, ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో యజమానురాలు ఆత్మహత్య చేసుకోవడంతో, రాజమ్మ మీద హత్యానేరం పడుతుంది. హత్య చేసినదాన్ని తన ఇంట్లో పెట్టుకోనంటాడు సింహాచలం. తనని కేసునుంచి విడిపించిన ప్రిన్సిపాల్ బాబుకి లొంగిపోతుంది రాజమ్మ.

సింహాచలం, కొడుకు జ్వరంతో మూసిన కన్ను తెరవడంలేదని తెలుసుకుని, ప్రిన్సిపాల్ జేబులోనుంచి డబ్బు తీసుకుని తన ఇంటికి, అక్కడినుంచి ఆస్ప్రత్రికి పరుగెడుతుంది రాజమ్మ. అప్పుడే పిల్లవాడికి టీబీ ఉందన్న విషయం తెలుస్తుంది. పది రోజుల తర్వాత ప్రిన్సిపాల్ గారింటికి వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంటుంది.. పిల్లల్ని తీసుకుని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు.

కొడుకుని బతికించుకోడానికి రాజమ్మకి మిగిలి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఒళ్లమ్ముకోవడం. కొడుకుని చంపుకోలేక అందుకు సిద్ధ పడుతుంది. బ్రోతల్ హౌస్ యజమానురాలు ఆమెనో ఇంగ్లీష్ దొర దగ్గరికి పంపుతుంది. మనశ్శాంతి వెతుక్కుంటూ ఇండియా కి వచ్చిన ఆ దొర, రాజమ్మని తాకనైనా తాకకుండా ఆమెకి డాలర్లు, బహుమతులు ఇచ్చి పంపుతాడు. తెల్లారేసరికి రాజమ్మ ఇంటిముందు పోలీసులు. దొరని హత్య చేసిందనే అభియోగంపై. దొర ఇచ్చిన కానుకలు వాళ్లకి సాక్ష్యంగా పనికొచ్చాయి.

కటకటాల వెనుక ఉన్న రాజమ్మని చూడడానికి వచ్చిన ఆమె రోగిష్టి కొడుకుని బూటు కాలుతో తన్ని వెనక్కి పంపేస్తాడు పోలీసు జవాను. అక్కడినుంచి జైలుకి మారిన రాజమ్మ తన భర్తా, కొడుకు లోకం నిందలు పడలేక ఎక్కడికో వెళ్లిపోయారని తెలుసుకుంటుంది. అప్పుడే దొర దేశం నుంచి ఓ జర్నలిస్టు వస్తాడు. రాజమ్మ చేతిలో చనిపోయిన వాడు తమ దేశం లో గొప్ప వాడనీ, అతన్ని ఎలా చంపిందో తనకి ఇంటర్వ్యూ ఇస్తే ఆమెకి కేసునుంచి బయట పడేందుకు సాయపడతాననీ ప్రతిపాదిస్తాడతను.

వ్యవస్థ ఎలా కుళ్ళి పోతోందో, పేదవాడికి ఏరకమైన అన్యాయాలు జరుగుతున్నాయో వివరిస్తూ రాసిన ఈ నవలలో రచయత (త్రి) (బీనాదేవి అంటే బి. నరసింగ రావు + బాలా త్రిపుర సుందరి దేవి, ఇద్దరూ భార్యాభర్తలు..కలిసి రచనలు చేశారు) అన్ని వ్యవస్థల బోలుతనాన్నీ కళ్ళకు కట్టారు. ఆస్పత్రిలో వైద్యం, కోర్టులో న్యాయం ఎలా అందుతాయో, డబ్బున్న వాళ్ళు తమకి కావాల్సిన వాటిని ఎలా సాధించుకో గలరో వివరించారు.

కష్టాలు భరించీ భరించీ ఓ దశలో తాను స్త్రీననే సంగతి మర్చిపోతుంది రాజమ్మ. ఆకలి కన్నా, సమస్యలకన్నా సింహాచలం తనని అనుమానించడం ఎక్కువ బాధిస్తుంది ఆమెని. సింహాచలం ఎప్పటికైనా తనని అర్ధంచేసుకుంటాడన్న ఆశతో ఉన్న రాజమ్మకి, అతను తనని వదలి ఎక్కడికో వెళ్లి పోయాడన్న వార్త ఓ ఆశనిపాతం. ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన జర్నలిస్టుని "మీ డబ్బు వద్దు, మీ బ్రతుకు వద్దు, సేతనైతే సెప్పి ఉరితీయించి పెట్టు బాబూ.." అని అడుగుతుంది.

విశాలాంధ్ర ప్రచురించిన 'పుణ్యభూమీ కళ్ళుతెరు' ప్రస్తుతం మార్కెట్ లో లేదు.

శుక్రవారం, ఏప్రిల్ 10, 2009

మనసు బాగోనప్పుడు...

మనసు బాగోకపోవడం అన్నది అందరికీ ఏదో ఒక సమయంలో వచ్చే సమస్య. బాగుండక పోడానికి ఒక్కోసారి కారణాలు ఉంటాయి. చాలా సార్లు ఉండవు.. కొన్ని సార్లు కారణాలు ఉన్నా మనకి వెంటనే తోచవు. పాడైన మనసుకు సాధ్యమైనంత తొందరగా మరమ్మతు చేయకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయన్నది స్వానుభవం. మరి ఈ మరమ్మతు చేయడం ఎలా?

నావరకైతే చాలా ఉన్నాయి. ఏకాంతంగా గడపడం, పాటలు వినడం, సినిమా చూడడం, పుస్తకాలు చదవడం, గతంలో జరిగిన మంచి విషయాలు జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, కుటుంబ సభ్యులతోనో మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులతోనో మాట్లాడడం.. ఇలా ఏదో ఒకటి చేసి మామూలై పోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను.

ఏకాంతంగా గడపడం వల్ల మన చిరాకుని మరొకరి మీద చూపించ కుండా తప్పించుకోవచ్చు. దానితో పాటు సమస్య గురించి కొంచం జాగ్రత్తగా ఆలోచించి పరిష్కారం వెతుక్కోడానికీ కృషి చేయచ్చు. ఒంటరిగా ఉండలేకపోయినప్పుడు ఇష్టమైన పాటల్ని తోడు తెచ్చుకోవచ్చు. టీనో కాఫీనో తాగుతూ నచ్చిన పాటల్ని వింటుంటే మూడ్ సగం బాగుపడుతుంది.

మూడ్ బాగోనప్పుడు సినిమా చూడడంలో ఓ చిన్న రిస్కు ఉంది. సినిమా బాగుంటే మూడ్ బాగుపడడానికి ఎంత ఛాన్స్ ఉందో, సినిమా చెత్త ఐతే మూడ్ మరింతగా దిగజారే ప్రమాదమూ ఉంది. ఇలాంటప్పుడు చూడడానికి నేను ఓసారి చూసి బాగుంది అనుకున్న సినిమాలనే ప్రిఫర్ చేస్తాను.

పుస్తకాలూ అంతే.. అసలు ఇలాంటప్పుడు చదవడానికి నవలల కన్నా కథలు బాగుంటాయి. బయటకి వెళ్ళే మూడ్ ఉంటె నేను వెళ్ళే మొదటి చోటు పుస్తకాల షాపు. రాకుల్లో ఉన్న పుస్తకాలను చూస్తుంటే సమస్యలనే కాదు, నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. కాసేపు పుస్తకాల మధ్య తిరిగి, అక్కడ పని చేసే నా ఫ్రెండ్స్ తో మాట్లాడి (నేను రెగ్యులర్గా వెళ్ళే అన్ని షాపుల లోను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు) ఒకటో రెండో పుస్తకాలు కొనుక్కుని వస్తుంటాను.

కుటుంబ సభ్యులతో, మిత్రులతో మాట్లాడడం అన్నది అవతలి వాళ్ళ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. పరిస్తితులు అనుకూలంగా లేనప్పుడు మనం మౌనంగా ఉండడమే ఉత్తమమన్నది నా అనుభవం. నగర పొలిమేరలను చూసి రావడం కూడా నన్ను మామూలు మనిషిని చేస్తుంది. నీళ్లనో పంట పొలాలనో, ఎగిరే పక్షులనో చూస్తే చాలు రీచార్జ్ ఐపోతా..

విచిత్రం ఏమిటంటే కొన్ని సార్లు వీటిలో ఏపనీ చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు ఆత్రేయ గారిని తలుచుకుని కాసేపు నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటా.. ఆత్రేయ గారిని తల్చుకోడం ఎందుకంటే ఆయనే కదా 'మూగమనసుల'కి 'కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది..' అని చెప్పారు.

గురువారం, ఏప్రిల్ 09, 2009

రెండు కార్యక్రమాలు

శ్రీరామ నవమి సందర్భంగా గత వారం మా కాలనీ లో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కావడంతో హాజరు వేయించుకోవడం తప్పని సరి. అదీకాక, ఏ కార్యక్రమాలు జరుగుతాయో అన్న కుతూహలం కూడా ఉండడంతో రెండు సాయంత్రాలను నవమి పందిట్లో గడిపాను.

మొదటి కార్యక్రమానికి మావాళ్ళు పెట్టిన పేరు 'డాన్స్ డాన్స్.' ఏ రోజు ఏ టీవీ చానల్ తిప్పినా వచ్చేదే. కాకపోతే ఇక్కడ డాన్స్ చేసేది మా కాలనీ పిల్లలు. ఎదురు పడినప్పుడల్లా నవ్వుతూ విష్ చేసే పిల్లలంతా కార్యక్రమం బాధ్యత తమ భుజాల మీద వేసుకోవడం చూడడానికి ముచ్చటగా అనిపించింది..

కార్యక్రమం మొదలవ్వక ముందే పందిరి నిండిపోయింది. వెండితెర వేల్పులను మరపిస్తూ పిల్లలు 'ఫాషనబుల్' గా తయారయ్యారు. తల్లిదండ్రులూ ఫోటో కెమెరాలు, వీడియో కెమెరాలు, సెల్ ఫోన్ లు రెడీ చేసుకున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకోడానికి. పిల్లలు సీడీ లతో రెడీ అయిపోయారు. వాళ్ళంతట వాళ్ళే ఓ జాబితా తయారు చేసుకున్నారు, ఏ పాట తర్వాత ఏ పాట అనే వివరాలతో.

వాళ్ళు డాన్స్ చేసిన పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా వరకు ఏకార్దాలున్న -- కనీసం ద్వంద్వార్దాలైనా కాదు -- పాటలే. తలిదండ్రులు ఈలలు చప్పట్ల తో ప్రోత్సహించడం. 'మీ పాపని టీవీ ప్రోగ్రాం కి పంపిచండి.. ఎంత చక్కగా చేస్తోందో..' అంటోంది ఒకావిడ తన పక్కావిడతో. ఈ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతున్నారు కాబట్టి పాటలకి అర్ధాలు తెలియక పోవచ్చు. తల్లిదండ్రులకి కూడా తెలియదా?

ప్రోగ్రాం అయిపోయిందని ప్రకటించేసరికి కొందరు ప్రేక్షకులు గొడవ చేశారు, ఇంకొన్ని పాటలు వెయ్యాలని. 'పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి.. మనం వాళ్లకి సహకరించాలి (!!)' అని మా కాలనీ ప్రెసిడెంట్ ఓ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఇంటికి పంపారు. ఇలాంటి ప్రోగ్రాములని టీవీలు అలవాటు చేసినా, కళ్ళముందు తిరిగే పిల్లలు చేస్తుంటే చూడడం ఇబ్బందిగానే అనిపించింది.

రెండో కార్యక్రమం శాస్త్రీయ నృత్య ప్రదర్శన. మా కాలనీ పిల్లలు కొందరు కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఆ మాస్టారు తన సీనియర్ శిష్యులు కొందరిని, మా కాలనీ పిల్లలు కొందరిని కలిపి ట్రూపుగా కూర్చి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లల తల్లి దండ్రులు, వారి బంధువులు తప్ప పెద్దగా జనం లేరు. కెమెరాలు మామూలే. డాన్స్ మాస్టారు నట్టువాంగం, ఆయన కూతురి గాత్ర సహకారం, మరో ఇద్దరి వాద్య సహకారం.

పిల్లలంతా ఆరు నుంచి పద్నాలుగేళ్ళ వయస్సు మధ్యలో ఉన్నారు. కొందరు చక్కగా చేస్తున్నారు. మరికొందరికి ముద్రలు పట్టడం కూడా రావడం లేదు. పాడుతూనే వాళ్లకి సూచనలిచ్చేస్తోంది మాస్టారి అమ్మాయి. మాస్టారు మాత్రం ప్రతి పాట చివర నృత్యం చేసిన అమ్మాయిలను పేరు పేరున అభినందిస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల కళాభిమానాన్నిపొగుడుతున్నారు.

బాగా చేస్తున్న వాళ్ళ పక్కన, అప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళని నిలబెట్టడంతో వీళ్ళ లోపాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'ఫారిన్ లో కూచిపూడికి బాగా డిమాండ్ ఉందంట.. అందుకే పాపకి నేర్పిస్తున్నాం' నా వెనుకాయన ఎవరికో చెబుతున్న మాట వినిపించింది. పూర్తిగా శాస్త్రీయం చేయించారా అంటే అదీ లేదు. జానపదం పేరుతొ ఇక్కడా సినిమా పాటలే.. కాకపొతే పాత పాటలు.

జనం పెద్దగా రానందుకు కొందరు తలిదండ్రులు నొచ్చుకున్నారు. 'ఈ రోజుల్లో కూడా మన కాలనీ పిల్లలు శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నందుకు మనమంతా గర్వించాలి. ఈ చిన్నారులు భవిష్యత్తులో అమెరికాలో ప్రదర్శన ఇచ్చి అక్కడ మన కాలనీ పేరు నిలబెట్టాలని ఆశీర్వదిస్తున్నా..' అంటూ మా ప్రెసిడెంట్ గారు కార్యక్రమం ముగించారు.

బుధవారం, ఏప్రిల్ 08, 2009

మాంద్యమేనా?

ఎండ భయంకరంగా కాస్తున్న మిట్ట మద్యాహ్నం వేళ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పోస్టాఫీస్ లో కొంచం పని పడి. ఇదే పని కోసం ఇప్పటికి మూడు సార్లు వెళ్లాను. మొదటి సారి టైం అయిపొయింది, రెండోసారి వాళ్లకి సెలవు, మూడోసారి లంచి బ్రేక్. ఇక ఇవాళ ఏమైనా ఆ పని పూర్తి చేయాల్సిందే అని నిర్ణయించుకుని బయట పడ్డా.. చాలా పెద్ద క్యూ ఉంది. కొన్ని లోకల్ కొరియర్లు మూత పడడంతో పోస్టాఫీస్ వాళ్లకి పని పెరిగిందిట. హమ్మయ్య నా పని పూర్తయ్యింది. ఇంతలొ రెండు మూడు రోజులుగా సూపర్ మార్కెట్ పని పెండింగ్ లో ఉన్నవిషయం గుర్తొచ్చింది. తిరిగొస్తూ అక్కడికి వెళ్లాను.

నిజానికి నేను ఎప్పుడూ వెళ్ళే సూపర్ మార్కెట్ వేరు. అక్కడి ప్రతి సెక్షనూ నాకు పరిచయం. అక్కడ ఏ వస్తువు ఏ చోట ఉంటుందో స్టాఫ్ కన్నా నాకు బాగా తెలుసు. అక్కడి వస్తువుల క్వాలిటీ గురించి మిత్రులకి వర్ణించి చెప్పేవాడిని. కొందరు నవ్వేవారు కూడా. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న ఆ సూపర్ మార్కెట్ మూడు నెలల క్రితం మూత పడింది. దానితో పాటు మరో రెండు మార్కెట్లు కూడా శాశ్వతంగా మూత పడ్డాయి, ఆర్ధిక మాంద్యం దెబ్బకి.. అలవాటైన మార్కెట్ ని వదల్లేక పోయినా, చేసేది లేక ప్రత్యామ్నాయం వెతుకున్నాం నా లాంటి వాళ్ళం.

కలర్ సోడా (సాఫ్ట్ డ్రింక్) నుంచి కలర్ టీవీ వరకూ దొరికే ఈ సూపర్ మార్కెట్లో పెద్దగా జనం లేరు.. మార్కెట్ వాళ్ళేమో రకరకాలు ఆఫర్లు ప్రకటించారు. నా పాత సూపెర్ మార్కెట్ స్టాఫ్ నలుగురైదుగురు కనిపించారు.. కొంచం సంతోషం అనిపించింది. ఓ అబ్బాయి నాకు సాయం చేస్తూనే రహస్యంగా చెప్పాడు 'ఇక్కడ కూడా సేల్స్ పెద్దగా లేవు సార్..' అతని కళ్ళల్లో ఉద్యోగం భయం. ఆర్ధిక మాంద్యం ప్రభావం మరీ ఇంతగా ఉందా? అనిపించింది. సీజన్ ఐపోయాక కూడా కనిపిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ బోర్డులు గుర్తొచ్చాయి.

తిరిగి వస్తుండగా దారిలో ట్రాఫిక్ జాం. ఎన్నికల్లో నిలబడ్డ ఓ మహా నాయకుడి ర్యాలీ. ఎయిర్ కండిషన్డ్ వాహనం టాప్ మీద మెడ నిండా దండలతో నిలబడ్డ సదరు నాయకుడు, ఎండనీ, ట్రాఫిక్ నీ, నాయకుడినీ కలిపి తిట్టుకుంటున్న జనమందరికీ అభివాదం చేస్తూ సాగుతున్నాడు. పార్టీ జెండాలు పట్టుకుని వందలాది మంది 'కార్యకర్తలు' జీపుల్లోనూ, మోటార్ సైకిళ్ళ మీదా అనుసరిస్తున్నారు. 'కనీసం మనిషికి వంద రూపాయలు అనుకున్నా.. మొత్తం ఎంత అవుతుంది.. వీళ్ళందరికీ భోజనాలు, ఇతర ఖర్చులు...' నేను మనసులో లెక్కేస్తున్నాను.

సాయంత్రం మిత్రులని కలిసినప్పుడు 'నానో' కార్ల గురించి చర్చ. నాలుగు వేలు అడ్వాన్సు కట్టిన వాళ్లకి టోకెన్ నెంబర్ ఇస్తున్నారట. కార్లు రాగానే టోకెన్ నంబర్ల వారీగా పంపిణీ చేస్తారట. మోడళ్ళు, రంగులు, ఫీచర్ల గురించి వివరిస్తూ మిత్రుడు అన్నాడు 'మిడిల్ క్లాస్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుందట..అందరూ క్యూ లో నిలబడి అడ్వాన్సు లు కడుతున్నారట..ఓవరాల్ గా నానో క్లిక్ అయినట్టే.. '

ఉదయం నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటే నాకు ఒకటే సందేహం.. ఇంతకీ ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్నట్టా, లేనట్టా?

మంగళవారం, ఏప్రిల్ 07, 2009

కొయిటా ఉత్తరం

రాయడం, చదవడం త్వరగా నేర్చేసుకువడంతో కనిపించిన ప్రతి కాగితం చదవడం అలవాటైపోయింది చిన్నప్పుడు. ఉత్తరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాతయ్య నాకు, నాన్నకి ఉత్తరాలు రాసేవారు. అత్తయ్యలు, బాబాయిలు కూడా నాన్నకి ఉత్తరాలు రాసేవాళ్ళు.

తాతగారు, పెద్దమ్మలు, పిన్నిలు, మావయ్యల నుంచి అమ్మకి ఉత్తరాలు వచ్చేవి. ఇవి కాక దూరపు బంధువులు కూడా అప్పుడప్పుడు ఓ కార్డు ముక్క రాసి పడేసే వాళ్ళు, క్షేమ సమాచారాలు కాని, శుభాశుభ వార్తలు కాని. ఒకరి ఉత్తరాలు మరొకరు చదవకూడదు లాంటి నియమం ఏదీ ఉండేది కాదు. పైగా మా మధ్యాహ్న భోజనాల సమయంలో పోస్ట్ వచ్చేది.

ఉత్తరం ఓ సారి నాన్నకి చూపిస్తే ఎవరు రాశారో చూసి చదవమనే వాళ్ళు. కొన్నాళ్ళకి చేతి రాత గుర్తుపట్టడం వచ్చేసి ఎవరు రాశారో నేనే చెప్పేసే వాడిని. వారానికి రెండు సార్లైనా మా ఇంట్లో భోజనాలు అయ్యే టైం కి ఒకరో, ఇద్దరో, నాన్న కోసం ఎదురు చూస్తూ వీధిలో కూర్చునే వాళ్ళు, చేతిలో సెంటు వాసన వచ్చే పొడవాటి రంగుల కవర్లు పట్టుకుని.. వాళ్ళు 'కొయిటా' వాళ్ళు.

అంటే వాళ్ళ పిల్లలు పని కోసం గల్ఫ్ దేశాలు వెళ్లారన్న మాట. వ్యవసాయ భూమో, స్థిరమైన ఉద్యోగమో ఉన్నవాళ్ళకి మా కోనసీమ భూతల స్వర్గమే అయినా, ఆ రెండూ లేని వాళ్లకి మాత్రం చాలా ఇబ్బందులు ఉండేవి. వ్యవసాయ పనులు సంవత్సరం పొడవునా ఉండకపోవడం, ఉపాధి కల్పించే పరిశ్రమలు వేరేవీ లేకపోవడం తో చాలా మంది 'కొయిటా' బాట పట్టారు. టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బొంబాయి వెళ్ళడంతో మొదలైన ఈ వలస, ఆ తర్వాత కూలీలకీ పాకి, ఇప్పటికీ కొనసాగుతోంది.

వాళ్ళు తెచ్చిన ఉత్తరాన్ని శ్రద్ధగా చదివి వినిపించే వాళ్ళు నాన్న. కొన్నాళ్ళు పోయేసరికి కొయిటా ఉత్తరాలు చదివే పని నాకు తెలియకుండానే నా దగ్గరికి వచ్చేసింది. ఒకటి రెండు సార్లు నాన్నఊళ్ళో లేక పోవడం, అమ్మ ఇంటి పనుల్లో ఉండడంతో నేను చదివాను. వాళ్లకి అది నచ్చడంతో ఇక నాతోనే చదివించుకునే వాళ్ళు.

కొయిటా ఉత్తరాలు చాలా పెద్దగా ఉండేవి. పది పదిహేను పేజీల వరకు. లేత రంగు పూలున్న పల్చని కాగితాల మీద, బాల్ పాయింట్ పెన్ గట్టిగా నొక్కిపెట్టి రాసేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళంతా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళే కావడం తో అక్షరాలూ కుదురుగా ఉండేవి కాదు. భాష కూడా కొంచం తేడాగా ఉండేది.

చదవగా, చదవగా నాకు కొయిటా ఉత్తరాలు తడబడకుండా చదవడం వచ్చేసింది. వాళ్ళు డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టమనీ, ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకొమ్మని, పిల్లల్ని బడి మానిపించొద్దనీ రాసేవాళ్ళు. ఇంకా ఊళ్ళో విశేషాలు అన్నీ అడిగేవాళ్ళు. అందరి కుశలాలు, ముఖ్యంగా మావి (ఉత్తరాలు మా ఇంట్లో వాళ్ళే చదువుతారని, జవాబులు రాస్తారని వాళ్లకి తెలుసు) అడిగేవాళ్ళు.

ఉత్తరాలు చదివి వినిపిస్తుంటే రకరకాల భావోద్వేగాలతో వినేవాళ్ళు. అక్కడ పని కష్టంగా ఉందని రాసినా, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని రాసినా వీళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకునే వాళ్ళు. విషయం అర్ధమయ్యాక నేను కొద్దిగా మార్చి చదివేవాడిని.. ఇక్కడ పని బానే ఉంది...అలా (పాపం శమించు గాక) ప్రతి నెలా చెక్కులు వచ్చేవి. మంచి భూమి చెక్క ఏదైనా అమ్మకానికి వస్తే బేరం చేయమని, పిల్లల పెళ్ళిళ్ళ గురించీ వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. వీటివల్ల వాళ్ళ ఇళ్ళ సంగతులు కూడా నాకు తెలుస్తూ ఉండేవి.

కొన్నాళ్ళకి నేనొకటి గమనించాను. ఉత్తరాలు వచ్చేవాళ్ళంతా నా చేత చదివించుకోడానికి, నాన్న చేత జవాబు రాయించుకోడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ కిటుకేమితో అర్ధం కాలేదు చాలారోజులు. విషయం ఏమిటంటే నా చేత చదివించుకోడం వల్ల వాళ్లకి కావాల్సిన విషయాలు మళ్ళీ మళ్ళీ చదివించుకోవచ్చు, మొహమాటం లేకుండా. నేను పెద్ద అక్షరాలు రాసేవాడిని. అందువల్ల నేను రాస్తే సగం విశేషాలు కూడా అవ్వకుండానే కవరు నిండిపోయేది. నాన్న చేతి రాత చీమల బారు. చాలా సంగతులు పట్టేవి కవర్లో.

నేను హైస్కూలుకి వెళ్ళేసరికి మా పోస్టు వేళలు మారిపోయాయి. సాయంత్రం వచ్చేవి ఉత్తరాలు. కొయిటా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళు. అప్పట్లో రేడియోలో వచ్చే అక్షరాస్యతా కార్యక్రమాలు విని చైతన్యం పొంది, 'మీకు నేను చదువు చెబుతాను, నేర్చుకోండి' అన్నాను. 'మీరు సదివి ఇనిపిత్తారు కదా బాబూ' అన్నారు కానీ, ఒక్కళ్ళు కూడా ఆసక్తి చూపించలేదు. తర్వాత కొయిటా వెళ్ళిన వాళ్ళ పిల్లలు చదువుకోవడం తో వాళ్ళ ఉత్తరాలు వాళ్ళే చదువుకో గలిగే వాళ్ళు.

కొయిటా ఉత్తరాలు చదివి వినిపించడం వల్ల కొన్ని బహుమతులు కూడా వచ్చేవి. ఉత్తరాలు రాసేవాళ్ళు ఊరికి వచ్చినప్పుడు ఫారిన్ సబ్బో, సెంటు సీసానో, షర్టు పీసో తెచ్చి ఇచ్చేవాళ్ళు ప్రేమగా.. అలా నాకు పెర్ఫ్యుమ్ ల మీద ఇష్టం మొదలైంది. ఈ ఉత్తరాలు చదివి పెట్టడం వల్ల ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలిసేది.

ఉద్యోగం కోసం ఊరు వదిలాక, నేనూ అలాగే ఆలోచించేవాడిని. ఇంటికి ఉత్తరం రాసినప్పుడల్లా వాళ్ళ ఉత్తరాలు గుర్తొచ్చేవి. సుధామూర్తి రాసిన 'అమ్మమ్మ చదువు' కథ తిరగేస్తుంటే ఈ సంగతులన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి.

ఆదివారం, ఏప్రిల్ 05, 2009

తపస్సు

రాయలసీమ కరవును ఇతివృత్తంగా తీసుకుని తెలుగు సాహిత్యం లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ, ఐదేళ్ళ క్రితం ప్రచురితమైన 'తపస్సు' కథది ఓ ప్రత్యేక స్థానం. చిత్తూరు జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న 'భారతాల' నేపధ్యం తో వి.ఆర్. రాసాని రాసిన ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురిత మయ్యింది. ప్రతి వేసవిలోనూ భారతాలని ప్రదర్శించే సంప్రదాయం చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతోంది.

చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఉండే కళాకారులు, మిగిలిన మాసాల్లో వ్యవసాయ పనులతో పొట్ట పోసుకుంటారు. పది నుంచి పదిహేను రోజుల పాటు సాగే భారతాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఐతే, భారతం ప్రదర్శిస్తే వర్షాలు పడతాయన్న నమ్మకం ఇక్కడ ఉంది.

'తపస్సు' కథలో నాయకుడు రంగప్ప ఓ వృద్ధ కళాకారుడు. వయసులో ఉన్నప్పుడు ఏటా భారతాలు ప్రదర్శించిన వాడు. ప్రస్తుతం కరవు కోరల్లో చిక్కుకున్నవాడు. భార్యకి ఒంటిమీద చీరతప్ప మారు చీర లేదు. పెళ్లి చేసి పంపాల్సిన కూతురిని కూలికి పంపుతున్నాడు. కరవు కారణంగా వ్యవసాయమూ లేదు, తను చేయగలిగే పనులూ లేవు. పక్కనున్న పల్లెటూరిలో భారతం ఆడుతున్నారని తెలిసి, ట్రూప్ యజమాని చిన వెంకటప్పని వేషం అడిగి భంగ పడతాడు. అప్పు కట్టలేదని అతని ఇల్లు జప్తు చేస్తారు.

భవిష్యత్తు గురించి రంగప్ప ఆందోళన పడుతున్న సమయంలోనే చిన వెంకటప్ప ట్రూప్ లో వేషగాడు ద్వారకుడు అతని ఇంటికి వస్తాడు. అర్జునుడి వేషం వేసేవాడు ఎవరో అమ్మాయితో వెళ్లిపోయాడని, రంగప్ప మినహా 'తపస్సు మాను' ఎక్క గలిగేవాళ్ళు మరెవరూ లేరని, చిన వెంకటప్ప తన మాటగా చెప్పి తీసుకు రమ్మన్నాడనీ చెబుతాడు ద్వారకుడు.

ఆట పూర్తయ్యేవరకూ ప్రతిరోజూ వేషం ఇస్తామని, పారితోషికం కూడా మిగిలిన కళాకారులకి ఇచ్చిన దానికి రెట్టింపు ఇప్పిస్తాననీ ద్వారకుడు చేసిన ప్రతిపాదన రంగప్పని ఆలోచనలో పడేస్తుంది. డబ్బొస్తే ఆర్ధిక సమస్యలు కొంత వరకైనా గట్టెక్కుతాయనే ఆలోచనతో, ఒంట్లో ఓపిక లేకపోయినా వేషం వేయడానికి ఒప్పుకుంటాడు.

భారతం ఆడే బయలు మధ్యలో ఉన్న కొమ్మలు నరికేసి ఉన్న ఓ నిలువెత్తు అశోక వృక్షం స్వాగతం పలుకుతుంది రంగప్పకి . మర్నాడు అతను ఎక్కవలసిన తపస్సు మాను అదే. ఆ వృక్షం చిటారు కొమ్మన ఓ చెక్కముక్కని కడతారు. చెట్టుకు పొడుగునా ముణుకులు ఏర్పాటు చేస్తారు, ఎక్కడానికి వీలుగా. కాషాయ వస్త్రాలు ధరించి, భుజానికి ప్రసాదాలు ఉన్న జోలె తగిలించుకుని తపస్సు మాను ఎక్కడానికి సిద్ధపడతాడు రంగప్ప.

'పరా బ్రహ్మ పరాత్పర..' పాడుతున్న కళాకారులందరికీ సందేహమే, వృద్ధుడైన రంగప్ప తపస్సు మాను ఎక్కగలడా అని. పిల్లలు లేని స్త్రీలు స్నానం చేసి తడి బట్టలతో వస్తారు వర పడడానికి. దేవుడికో దండం పెట్టుకుని, తపస్సు మాను ఎక్కడం మొదలు పెడతాడు రంగప్ప. మాను చివరికి ఎక్కేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అతనికి. చుట్టూ చూస్తే బీడు భూములు, జనం ముఖాల్లో బతుకు భయం.. తనలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారని, తన ఊరిలాగే చుట్టుపక్కల ఊళ్లూ కరవు బారిన పడ్డాయని తెలుస్తుంది అతనికి.

అడ్డచెక్క మీద జాగ్రత్తగా కూర్చుని, కొబ్బరికాయ కొట్టి, ప్రసాదాన్ని కిందకి విసిరి, మాను చివర కట్టిన పూల దండలో పూలు కొన్ని తెంచుకుని జోలెలో వేసుకుని దిగడం ప్రారంభిస్తాడు. కిందకి చూసి ధైర్యం కోల్పోయిన రంగప్ప ఒకదశలో 'జాగ్రత్తగా దిగ గలనా' అన్న సందేహంలో పడతాడు. తోటి కళాకారులు, జనం దేవుడిని ప్రార్ధించడం మొదలు పెడతారు. కిందకి దిగి, స్పృహ కోల్పోయిన రంగప్ప, స్పృహలోకి వచ్చాక తాను గెలిచినట్టా? ఓడినట్టా? అని ప్రశ్నించుకుంటాడు.

ఈ కథ ప్రచురితమైనప్పుడు నేను తిరుపతి లో ఉన్నాను. అది మే నెల, వరుస కరవులు. పీలేరులో భారతాలు జరుగుతున్నాయని తెలిసి వెంటనే వెళ్లాను. అక్కడ అందరిదీ ఒకటే కోరిక 'వర్షం కురవాలి' అని. నేను వెళ్ళిన రోజు మహా భారత యుద్ధం ఆడుతున్నారు. పక్కన ఉన్నసినిమా హాళ్ళు ఖాళీ గా ఉనాయి, కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నా.. జనమతా 'భారతం బయలు' దగ్గరే. నాకు పరిచయం లేని ఓ కళా రూపాన్ని పరిచయం చేసింది 'తపస్సు' కథ.

శనివారం, ఏప్రిల్ 04, 2009

అమ్మ-ఆదివారం

ఆదివారం అంటే ఇష్టపడని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారా? నా చిన్నప్పుడైతే ఆదివారం కోసం సోమవారం నుంచి ఎదురు చూసేవాడిని. చక్కగా బడికి వెళ్ళే పని ఉండదు కదా. ఐతే అమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ చిన్నప్పుడు ఆదివారం అంటే చాలు చాలా భయపడే వాళ్ళట. ఆదివారం నాడు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళే అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళట. అలా ఎందుకు భయపడే వాళ్ళో అమ్మ చాలా సార్లు చెప్పింది. ఎందుకో చెప్పాలంటే ముందు వాళ్ళ ఇంటి సంగతి చెప్పాలి.

అమ్మ వాళ్ళు మొత్తం ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. మొత్తం ఈ తొమ్మిది మందితో పాటు బంధువుల పిల్లలు మరో ఐదారుగురు ఎప్పుడూ వీళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ ఇల్లే ఓ చిన్న వీధి బడి లా ఉండేదన్న మాట. అమ్మమ్మ ఒక్కర్తే పిల్లలందర్నీ చూడలేదు కాబట్టి అమ్మ వాళ్ళ పెద్దక్క కూడా ఆ బాధ్యత తీసుకునేది. వాళ్ళ అమ్మ అంటే పిల్లలెవరికీ భయం లేక పోయినా, పెద్దక్క అంటే మాత్రం భలే భయం.

ఆడపిల్లల సంరక్షణ అంటే మాటలు కాదు కదా. తల దువ్వి జడలు వెయ్యడమే ఓ పెద్ద పని. ఇక తల స్నానం అంటే ఓ పెద్ద ప్రహసనమే. అమ్మమ్మ, పెద్దమ్మ కలిసి ప్రతి ఆదివారం పిల్లలకి తలంటు కార్యక్రమం పెట్టేవారు. ఓ సారి 'బాల భారతం' సినిమా చూస్తూ, అందులో కౌరవుల స్నానం సీన్ వచ్చినప్పుడు 'మీ చిన్నప్పుడు మీ స్నానాలు కూడా ఇలాగే ఉండేవా?' అని అమ్మని అమాయకంగా అడిగా. దానికి అమ్మ ఎలా స్పందించిందో నాకు బాగానే గుర్తుంది కాని, ఇక్కడ చెప్పను.

అమ్మమ్మ, పెద్దమ్మ లతో పాటు మరో ఇద్దరు సహాయకులు ఉండే వాళ్ళట తలంట్లు పోయడానికి. ఒకరు బాపిరాజు, వాళ్ళింటి పని మహిళ. ఇక రెండో ఆవిడ సోమాలమ్మ. అమ్మ వాళ్ళు చదివే బడిలో ఆయా. సోమాలమ్మ గురించి ఒక్కమాటలో, అదీ అమ్మ చెప్పిందే, చెప్పాలంటే "బళ్ళో మేస్టారంటే భయపడని పిల్లలు ఉండేవాళ్ళు కాని, సోమాలమ్మ అంటే భయపడని వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు." బడికి రాని పిల్లల ఇళ్ళకి వెళ్లి, కాపు కాసి వాళ్ళని బడికి లాక్కు రావడం సోమాలమ్మ ప్రతిభకి ఓ మచ్చు తునక మాత్రమే.

బాపిరాజు నీళ్ళ పొయ్యి వెలిగిగించడంతో ఆదివారం మొదలయ్యేదట. పిల్లలంతా చద్దన్నాలు తినే వేళకి సోమాలమ్మ వచ్చేసేదట. ఇక అది మొదలు, తలలు లెక్క పెట్టుకుని, ఒకళ్ళ తర్వాత మరొకరిని కూర్చోబెట్టి తలంటేసే వారట ఇద్దరూ.. అక్కడితో అయ్యిందా.. మద్యాహ్నం అమ్మమ్మ పెట్టిన భోజనం చేశాక పిల్లలందరికీ పేలు చూసే కార్యక్రమం. అమ్మ మాటల్లో చెప్పాలంటే "సోమాలమ్మ తన రెండు కాళ్ళ మధ్య మా తల నొక్కిపట్టి, తను తెచ్చిన పేల దువ్వెనతో మా జుట్టు బలంగా లాగేది. ఆ ఊపుకి జుట్టూడి పోయేది. తలనుంచి రక్తం వస్తుందేమో అని భయం వేసేది మాకు."

పిల్లలెవరైనా సోమాలమ్మకి ఎదురు తిరుగుతారేమో అని, అమ్మ వాళ్ళ పెద్దక్క అక్కడే కావలి ఉండేదట. సాయంత్రం కాపీ తాగి, రాత్రి భోజనం లోకి కూర పచ్చడి తీసుకుని సోమాలమ్మ తిరుగు ముఖం పట్టే వరకు పిల్లలంతా బిక్కు బిక్కు మంటూ ఉండాల్సిందే. "సోమాలమ్మకి జ్వరం రావాలని కోరుకునే వాళ్ళం. అదేమిటో కాని, ఆ మనిషిది భలే ఆరోగ్యం.. ఎప్పుడూ జర్రున చీదేదైనా కాదు. మాకు మేము తల స్నానం చేయగలిగేంత వరకు సోమాలమ్మ బాధ తప్ప లేదు. ప్రతివారం ఆదివారాన్ని తిట్టుకునే వాళ్ళం..."

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

నాయికలు-మందాకిని

తూర్పున వెలుగు రేకలు విచ్చుకో బోతున్న వేళ కళ్ళాపి జల్లిన వాకిట్లో ఓ అందమైన పడతి తన పొడవాటి జడను వెనక్కి తోసుకుంటూ శ్రద్ధగా ముగ్గేస్తూ ఉంటే .. కేవలం ఆమెని, ఆమె ముగ్గునీ చూడడం కోసమే రాత్రంతా నిద్ర మేల్కొని ఎదురు చూసిన ఓ పదహారేళ్ళ కుర్రాడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆమెనే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటే.. ముగ్గు పూర్తి చేసి అలసటగా తనవైపు చూసిన ఆమెని అతను కళ్ళతోనే అభినందిస్తే.. అతని పేరు కచ్చితంగా సోమయాజి.. సరైన సమయంలో అతని జీవితం లో అడుగుపెట్టి, పక్కదారి పట్టబోతున్న ఆ కుర్రాడిని సరైన దారిలో నడిపించిన ఆమె 'మందాకిని' కాక మరెవరు?

జీవితాన్ని గురించి అందమైన కలలు కన్నది మందాకిని . పుట్టింది సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో అయినా, తండ్రి ప్రోత్సాహంతో చదువుకుంది ఆమె. కేవలం బడి చదువే కాదు, కావ్య గ్రంధాలలో ప్రపంచాన్నీ చదివింది. ఆమెకి పాడడం తెలుసు, చిత్రలేఖనం లోనూ అభినివేశం ఉంది. ఓ అందమైన పొదరింట్లో తను, తనని అర్ధం చేసుకునే భర్త .. ఇది మందాకిని కల. ఫుట్ బాల్ ఆటగాడు, ఓ చిరుద్యోగి ఐన సుబ్బారావుతో వివాహమైంది ఆమెకి.. "రాముడు పేరేం బాగుంది.. అయినా సీత పెళ్లి చేసుకోలేదూ.." అనుకుంటుంది మందాకిని.

తను కలగన్న జీవితానికి, వాస్తవానికి మధ్య పూడ్చలేనంత అగాధం ఉన్నదని తెలిసేసరికి జీవితం పట్ల ఓ నిర్లిప్తత ఏర్పడి పోతుంది మందాకినికి. సుబ్బారావు చెడ్డవాడేమీ కాదు.. కానీ ఆమె మనసుని అర్ధం చేసుకోలేదు అంతే .. ఓ కొడుకుని కనాలని, వాడిని స్త్రీ మనసు అర్ధం చేసుకునే మగవాడిగా తీర్చిదిద్దాలనీ కోరుకుంటుంది మందాకిని . సరిగ్గా అప్పుడే ఆమెకి సోమయాజి పరిచయమవుతాడు. చిన్నప్పుడే తల్లినీ, తండ్రినీ కోల్పోయిన అతనికి, టీనేజ్ లో తాతయ్యని పోగొట్టుకోవడం ఓపెద్ద షాక్. అప్పటివరకు తనవాళ్ళు అనుకుంటున్న వాళ్ళ ముసుగు వెనుక రూపాలు తెలియడం మరో పెద్ద షాక్.

ప్రపంచం పట్ల ద్వేషం పెంచుకుంటున్న సోమయాజిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది మందాకిని. ఓ మద్యాహ్నం సోమయాజి బడినుంచి వచ్చి, ఇంట్లో తనకి సరిపోయే అన్నం లేకపోవడం చూసి, ఆగ్రహించి మందాకినికి చెబితే ఆమె అడిగిన మొదటి ప్రశ్న 'నీ వయస్సెంత?' అంతేనా.. ఆ వయసు కుర్రాళ్ళు కష్ట పడి పనిచేసి రెండు అరటిపళ్ళు కొనుక్కుని తినగలరని చెబుతుంది. చిన్నప్పుడే తాతయ్య సహచర్యంలో వేదాలని ఔపోసన పట్టిన సోమయాజి, ఆ మద్యాహ్నం వేళ పని వెతుక్కుంటూ రోడ్డెక్కుతాడు. ఓ క్షురకుడి దగ్గర సహాయకుడిగా చేరి వారం రోజుల్లో సొంతం గా సంపాదించడం మొదలు పెడతాడు.

ఆకలంటూ వచ్చిన కుర్రాడికి, మందాకిని స్థానం లో మరే స్త్రీ ఉన్నా విస్తరేసి భోజనం వడ్డించేదేమో.. అలా చేయలేదు కాబట్టే ఆమె మందాకిని అయ్యింది. సోమయాజి తెలివితేటల్ని సరైన దారిలో పెట్టింది. అతనికో చనిపోయిన తన తండ్రిని చూసుకుంది. మందాకినిలో తన తాతయ్యని చూసుకున్నాడు సోమయాజి. ఐతే అతడు ఆమెని అపార్ధం చేసుకున్న సందర్భమూ లేకపోలేదు.. మందాకినిని సోమయాజి ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించినప్పుడు ఆమె స్థాణువే అయ్యింది. 'ఇక నీతో మాట్లాడను' అని మందాకిని చెప్పిన వాక్యం సోమయాజి చెవిలో పిడుగుపాటే.

ఎవరిచేతో మోసగింపడి గర్భవతి అయిన తమ కుమార్తెను గుట్టు చప్పుడు కాకుండా సోమయాజికి ఇచ్చి పెళ్లి చేసేయాలని బంధువులంతా నిర్ణయించుకున్నపుడు, అతను తన ఆవేదనను పంచుకున్నది మందాకినితోనే. 'వెళ్ళిపో సోమూ.. వీళ్ళకి దూరంగా వెళ్ళిపో.. నీ బతుకు నువ్వు బతకగలవు' అని మార్గదర్శనం చేస్తుంది మందాకిని. పేకాటలో సర్వం పోగొట్టుకున్న భర్త తో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి గోదారి ఒడ్డునున్న తమ ఊరికి వెళ్ళిపోతుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకున్నారా? అన్న ప్రశ్నకి జవాబు యండమూరి వీరేంద్రనాథ్ రాసిన 'ఆనందో బ్రహ్మ' నవల. (నవసాహితి ప్రచురణ, వెల రూ. 60)

...ఇది నా యాభయ్యో టపా...

గురువారం, ఏప్రిల్ 02, 2009

అలరాస పుట్టిళ్ళు

ఓ జమీందారు చెల్లెలు, వాళ్ళ దివాణం లో పనిచేసే ఓ రోజు కూలీ ని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. చెల్లెలంటే అపరిమిత మైన ప్రేమ ఉన్నా, పరువు మర్యాదలకి ప్రాణం ఇచ్చే ఆ అన్నగారు సహజంగానే ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి, ఆమె ప్రేమించిన అబ్బాయి ఊరినుంచి మాయమయ్యారు. ఆశ్చర్యకరంగా అప్పటినుంచి దివాణం ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? ఆ అమ్మాయి ఏమైంది?

నిడుమోలు కళ్యాణ సుందరీ జగన్నాధ్ రాసిన 'అలరాస పుట్టిళ్ళు' కథను అదేపేరుతో నాటికగా మలచి ప్రదర్శించారు 'కళా వాణి' ఉభయ గోదావరులు ట్రూప్ వాళ్ళు. ఈ కథ పేరే మకుటంగా శ్రీమతి జగన్నాద్ తన కథా సంపుటాన్ని విడుదల చేశారు. గంట నిడివి గల ఈ నాటిక ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లో సాగుతుంది. కూలిపోతున్న దివాణంలో వృద్ధుడైన జమీందారు సుబ్బారాయుడు మరణ దశలో ఉండడం నాటిక ప్రారంభం. అతని భార్య, ఓ వృద్ధురాలైన పనిమనిషి సుబ్బారాయుడికి సేవలు చేస్తూ ఉంటారు. సుబ్బారాయుడికి చెల్లెలి వరసయ్యే అక్కమ్మ తన టీనేజ్ మనవరాలితో కలిసి అన్నగారిని చూడడానికి వస్తుంది.

అక్కమ్మ మనవరాలిని చూసిన సుబ్బారాయుడు 'సత్యవతీ.. సత్యవతీ' అని కలవరించడం మొదలు పెడతాడు. 'సత్యవతి' కి కబురు పెట్టమంటాడు. అతన్ని నిద్ర పుచ్చి, అక్కమ్మ, ఆమె వదిన, పనిమనిషి గతాన్ని తలచుకుంటారు. సిరి సంపదలతో తులతూగుతున్న దివాణం లో సత్యవతి ఆడింది ఆట, పాడింది పాట . ఆమె కి పెళ్లి చేయాలని అన్నగారు సుబ్బారాయుడు ప్రయత్నాలు చేస్తుండగానే చెంగల్వ రాయుడు వాళ్ళింట్లో పనికి చేరతాడు.

సత్యవతి, చెంగల్వ రాయుడు ఒకరినొకరు ఇష్టపడతారు. వాళ్ళ పెళ్ళికి ససేమిరా అంటాడు సుబ్బారాయుడు. సత్యవతిని చెంగల్వ రాయుడితో వెళ్లి పొమ్మని సలహా ఇస్తుంది అక్కమ్మ. అక్కమ్మ-సత్యవతి ల సంభాషణ ని రహస్యంగా విన్న సుబ్బారాయుడు, ఆగ్రహంతో అక్కమ్మని ఇంట్లోనుంచి వెళ్ళ గొడతాడు. ఆ రాత్రి నుంచి సత్యవతి, చెంగల్వ రాయుడు కనిపించరు. దివాణం లో అందరూ వాళ్ళిద్దరూ ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు.

'సత్యవతీ' అన్న సుబ్బారాయుడి కలవరింతతో గతం నుంచి బయట పడతారు అక్కమ్మ వాళ్ళు. 'ఈ పాటికి బయలుదేరే ఉంటుంది అన్నయ్యా.. సత్యవతి వచ్చేస్తుంది' అంటుంది అక్కమ్మ. ఎగ శ్వాస తో ఉన్న సుబ్బారాయుడు ఆమెకి 'సత్యవతి ఎప్పటికీ రాదమ్మా' అని చెబుతాడు. ఆ రాత్రి సత్యవతి, చెంగాల్వరాయుడు యేరు దాటి పారిపోబోతుండగా తానె వాళ్ళిద్దరినీ పడవలో నుంచి ఏటిలోకి గెంటేశానని, వాళ్ళ శవాలు నీళ్ళలో కొట్టుకుపోవడం తానూ కళ్ళారా చూశానని చెప్పి ప్రాణం విడుస్తాడు సుబ్బారాయుడు.

క్షణాల్లో సెట్టింగులు మార్చడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. పాడుబడ్డ మహల్లో నాటిక ప్రారంభమవుతుంది. గతం లోకి వెళ్ళేటప్పటికి అదే మహల్ వైభవంగా ఉంటుంది. ప్రారంభంలో వృద్ధులుగా ఉన్న సుబ్బారాయుడు, అతని భార్య, పనిమనిషి, అక్కమ్మ ఫ్లాష్ బ్యాక్ లో యవ్వనంలో ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేసరికి మళ్ళీ వృద్ధులుగా కనిపిస్తారు. సత్యవతి గా వేసిన అమ్మాయే అక్కమ్మ మనవరాలిగానూ చేసింది. సుబ్బారాయుడు సత్యవతిని చంపే దృశ్యాన్ని నీడల్లో చూపించారు. 'అలరాస పుట్టిళ్ళు' కథా సంపుటాన్ని గురించి మరోసారి...

బుధవారం, ఏప్రిల్ 01, 2009

గోదారి గాలి

గోదావరి లో నీళ్ళు లేక ఎండిపోయిందని ఓ పత్రిక రాస్తే, అబ్బే అటువంటిది ఏమీ లేదు.. గోదావరిలో జలకళ అంటూ మరో పత్రిక కథనం. ఎవర్ని నమ్మాలో అర్ధం కాక కన్ఫ్యూజన్. గోదారి దర్శనం లేకుండా మా ఊరి ట్రిప్ ఎప్పుడూ పూర్తవ్వదు నాకు, మరీ హడావిడిగా ఒక్కరోజు మాత్రమే ఉండాల్సి వచ్చినప్పుడు తప్ప. ఈసారి పండుగ ముందురోజు సాయంత్రం గోదారి యాత్ర పెట్టుకున్నాను.. ఇంతకీ మా ఊరినుంచి నిండా మూడు కిలోమీటర్లు కూడా వెళ్ళక్కర్లేదు.. గోదారి పలకరించేస్తుంది. హమ్మయ్య.. గట్టుమీంచి చూస్తే నిండా నీళ్ళతో కనపడింది మా అన్నపూర్ణ.

రేవు ఏమీ మారలేదు. అదే గుడి, బాగా వృద్ధుడైన పూజారి గారు, నావ కోసం ఎదురుచూసే వాళ్ళ కోసం ఓ అరుగు, అక్కడ ఒకళ్ళిద్దరు బిచ్చగాళ్ళు. సాయంత్రం ఐదవ్వ బోతున్నా ఎండ చిటపట లాడుతోంది. రేవులోకి వెళ్ళానో లేదో గుడ గుడ మంటూ ఓ మోటారు బోటు వచ్చి ఆగింది. ఇది ఇంతకు ముందు లేదు.. కొత్త డవలప్మెంట్ అన్న మాట. 'అద్దరికి ఐదు నిమిషాల్లో తీసుకెళ్ళి పోద్ది.. వొచ్చే వోళ్ళు రండి..' బోటు కుర్రాడు ఆహ్వానిస్తున్నాడు. ఒకళ్ళిద్దరు వెళ్ళారు. నేను కదలక పోవడం చూసి 'రారా?' అని అడిగాడు. తల అడ్డంగా ఊపాను. నాకు గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యమని అతనికెలా చెప్పడం?

మరి కాసేపట్లో నేను ఎదురు చూస్తున్న నాటు పడవ వచ్చేసింది. అప్పుడే కాన్వెంటు నుంచి వచ్చిన పిల్లలు బిలబిలమంటూ అందులో ఎక్కేశారు. 'అద్దరికా బావూ..' పలకరించాడు సరంగు. 'వెంటనే వచ్చేస్తారా?' అడిగాను నేను. 'ఈల్లనాడ దింపేసి, రైతుల్ని ఎక్కించుకు నొచ్చేద్దారి.. వోయ్.. కూతంత జరిగి బాబుగోరికి సోటివ్వండి..' నాతోటి, పిల్లలతోటి ఒకేసారి మాట్లాడేశాడు. పడవ నెమ్మదిగా కదిలింది.. పిల్లలు హోం వర్క్ చేసుకుంటూనే అల్లరి చేస్తున్నారు. 'నీల్లు బాగానేఉన్నాయే..' నాతోపాటు పడవెక్కిన మరో ప్రయాణికురాలు పలకరించింది సరంగుని. 'అమాస రోజులు..' అన్నాడతను.

పడవ సుతిమెత్తగా సాగుతోంది. కొంచం దూరం వెళ్లిందో లేదో చల్లగాలి తిరిగింది హాయిగా.. గాలి వాలు ఉండడంతో తెరచాప కట్టేశాడు సరంగు. అతను పెద్దగా కష్టపడే అవసరం లేకుండానే పడవ సాగిపోతోంది. పిల్లలతో కబుర్లు మొదలు పెట్టాడతను. వాళ్ళంతా లంక గ్రామంలో ఉండే పిల్లలు. వాళ్లకి ఉన్న ఒకే ఒక్క ప్రయాణ సాధనం పడవ. సూర్యుడి ప్రభావం కొద్దిగా తగ్గింది. అవతలి ఒడ్డున ఆకుపచ్చని లంక గ్రామం ఆహ్వానిస్తోంది. బళ్ళో మేస్టర్ల గురించి, ఊళ్ళో గొడవల గురించి సరంగుతో చెబుతున్నారు పిల్లలు. సరంగు మనవడు 'ఐదరబాదులో ఏ బాదా లేకుండా ఉజ్జోగం' చేసుకుంటున్నాడట.

రేవు రాగానే పిల్లలంతా పుస్తకాల సంచులు నెత్తిమీద పెట్టుకుని నీళ్ళలోకి దూకేశారు. పాల కేన్లు, కూరల సంచులతో గట్టుమీద అప్పటికే పడవ కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. వీళ్ళు దిగడం, వాళ్ళు ఎక్కడం క్షణాల్లో జరిగిపోయింది. పడవ తిరిగి బయలుదేరింది. సూర్యుడికి అభిముఖంగా కూర్చున్నాను. ఆకాశంలో నాకు ఇష్టమైన దృశ్యాన్ని చూడడానికి. మరి కాసేపట్లో గోదారిలోకి కుంగిపోబోతున్న సూర్యుడు నారింజ పండులా ఉన్నాడు. పెద్ద పెద్ద కొంగలు మా మీంచి ఎగురుకుంటూ వెళ్ళాయి. సరంగు, రైతులు పంటల గురించి, ఎన్నికల గురించి తీవ్ర చర్చల్లో ఉన్నారు.

నా దృష్టి మాత్రం ఆకాశం వైపే ఉంది. రెప్ప వేయాలనిపించని విధంగా ఉంది ప్రకృతి. సూర్యుడి నారింజ రంగు నీళ్ళపై ప్రతిఫలిస్తోంది. ఒక్క క్షణం అది అమావాస్య సాయంత్రమా లేక పున్నమి రాత్రా అన్న సందేహం కలిగింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆకుపచ్చని లంక నల్లగానూ, నల్లని నీళ్ళు నారింజ వర్ణంలోకీ మారిపోతున్నాయి. నీళ్ళలోకి కుంగుతున్న సూర్యుడు, సూర్యుడికి అభిముఖంగా ఎగురుతున్న పక్షులు.. పడవ నది మధ్యకి వచ్చింది. 'ఈ జీవితానికి ఇది చాలు' అన్న అనుభూతి. లేత చీకటి తెర కట్టే సమయానికి పడవ రేవుకి చేరుకుంది. గుండెల నిండా గోదారి గాలి పీల్చుకుని 'మళ్ళీ ఎన్నాళ్ళకో' అనుకుంటూ ఇంటికి తిరుగుముఖం పట్టాను.