మంగళవారం, జులై 27, 2010

బేరం

బేరమాడడం అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పాలేమో. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వస్తువుని బేరం చేసే ఉంటారు. నిజానికి ఈ బేరం ఆడడం అనేది ఒక కళ అనిపిస్తుంది నాకు. ఈ కళలో మగ వాళ్ళతో పోల్చినప్పుడు మహిళలు నిష్ణాతులు అనడానికి కూడా ఎలాంటి అభ్యంతరమూ లేదు నాకు. ముందుగా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే నాకు బేరమాడడం పెద్దగా రాదు. అయినా అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను.

నా చిన్నప్పుడు మా ఊళ్లోకి బట్టల మూటల షావుకార్లు వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బట్టల మూటలు సైకిల్ వెనుక కట్టుకుని ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఎక్కువగా ఆడవారికి ఉపయోగ పడే వస్త్రాలు మాత్రమే దొరుకుతూ ఉండేవి. అందరూ మధ్యాహ్న భోజనాలు ముగించి, అరుగుల మీద చేరి పిచ్చాపాటీ లో పడే వేళకి సైకిల్ బెల్లు కొట్టుకుంటూ ఈ షావుకార్లు దిగిపోయే వాళ్ళు. ఒక్కసారిగా సందడి మొదలయ్యేది.

మా ఇంటి దగ్గర ఎవరు ఏం కొనుక్కోవాలన్నా నాడెం చూడడం (నాణ్యత పరిశీలించడం) మొదలు, బేరం చేయడం వరకూ అన్ని బాధ్యతలూ మా బామ్మే తీసుకునేది. బేరం చేయడం లో నోబుల్ బహుమతి లాంటిది ఏమన్నా ఉంటే ఆవిడకి నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు. చెప్పిన రేటుకి సగం నుంచి బేరం మొదలయ్యేది. డైలీ సీరియళ్ళు లేని ఆ రోజుల్లో ఆ బేరమే గంటల తరబడి సీరియల్లా సాగుతూ ఉండేది.

ఒక బేరం సాగుతూ ఉండగానే మరొకరెవరో వచ్చి ఇంకేదో ఎంపిక చేసుకునే వాళ్ళు. అలా అలా సాగి సాగి చివరికి కొనాల్సినవి అన్నీ కలిపి 'కండ గుత్త బేరం' కింద కొనేసి ఎవరి వాటా డిస్కౌంట్ ని వాళ్ళు పంచేసుకునే వాళ్ళు. మా బామ్మ స్పూర్తితో నేను స్కూల్లో చదివే రోజుల్లో మొదటి సారి బేరం చేశాను, బడి దగ్గర కొట్లో నిమ్మతొనలు. అంటే నిజం నిమ్మతొన కాదు, తియ్యగా పుల్లగా ఉండే ఒక చాక్లెట్. బామ్మకి ఉన్నంత టాలెంట్ నాకు లేకపోవడం వల్ల బేరం కుదర లేదు.

హైస్కూల్లో చదివే రోజుల్లో 'పెళ్లి బేరాలు' అనే మాట నా చెవిన పడింది. అంటే కట్న కానుకలు మాట్లాడుకోవడం అన్నమాట. వినడానికి కొంచం అదోలా అనిపించినా ఆ పేరు సరైనదే అనిపించింది తర్వాత్తర్వాత. మేష్టారు హాజరేస్తూ ఒకమ్మాయి పేరు దగ్గర ఆగి 'ఎందుకు రాలేదు?' అని అడిగారు. ఆమె స్నేహితురాలు లేచి నిలబడి 'ఇయ్యాల్దానికి పెళ్లి బేరాలండి' అనగానే క్లాసంతా గొల్లుమంది. మేష్టారు పాపం నవ్వాపుకుని సైలెన్స్ అని అరిచారు. మా వైపు 'దూడల బేరగాళ్ళు' అని ఉంటారు. మనం పశువులని అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ళని సంప్రదిస్తే చాలు.

కాలేజీ పిల్లలెవరి దగ్గరైనా 'బార్గెయిన్' అని చూడండి. ముఖం చిట్లిస్తారు. మా రోజుల్లో కూడా అంతే. అమ్మతో బయటికి వెళ్ళినప్పుడు తనేమైనా బేరం చేస్తుంటే 'అబ్బా.. ఎందుకమ్మా' అని విసుక్కునే వాడిని. 'నీకు తర్వాత తెలుస్తుందిలే నాయనా' అనేది. తెలిసింది, నిజంగానే. మన దగ్గర బేరమాడే టాలెంట్ లేనప్పుడు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తే ఉపయోగం అన్న సత్యం బోధ పడింది. వాళ్ళు బేరం చేసేటప్పుడు అమ్మకందారు మనం అడక్క పోయినా మనకి 'న్యాయమూర్తి' హోదా ఇచ్చేసినా, మనం ఆవేశ పడిపోకూడదనీ, మౌనంగా ఉండాలనీ కొన్ని అనుభవాలు నేర్పాయి.

ఇప్పటికీ నేను కూరగాయలు బేరం చేయడం లో వీక్. ఆ మాటకొస్తే ఎంపిక చేయడంలో కూడా. అందుకే బంగాళా దుంపలు, ఉల్లిపాయలు లాంటివే ఎక్కువగా కొంటూ ఉంటాను, నేను కొనాల్సి వచ్చినప్పుడు. వాడు అడిగింది చేతిలో పెట్టి, ఇంటికొచ్చాక ఓ రెండు రూపాయలు తక్కువ చెబితే చాలు, మన మనశ్శాంతికి లోటుండదు. వీధుల్లో అమ్మోచ్చే కూరగాయలు, పళ్ళు గీసి గీసి బేరం చేసేవాళ్ళు కూడా 'ఫ్రెష్' లకీ 'స్టోర్' లకీ వెళ్తే బేరం మాట మర్చిపోవడం వింతల్లోకెల్లా వింత. బేరం గురించి ఎంత చెప్పినా తరగని విశేషాలు పుడుతూనే ఉంటాయి మరి. అన్నట్టు ఈ టపా రాస్తున్నంత సేపూ 'భలే మంచి చౌక బేరము..' పాట గుర్తొస్తూనే ఉంది నాకు..

శనివారం, జులై 24, 2010

యజ్ఞం

కొందరు రచయితల్నీ, వారు చేసిన కొన్ని రచనలనీ వేరు చేసి చూడలేం. రచయిత పేరు చెప్పగానే రచన, రచన పేరు వినగానే రచయిత అప్రయత్నంగానే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. తెలుగు సాహితీ లోకానికి 'కారా మేష్టారు'గా చిరపరిచితులైన కాళీపట్నం రామారావు మేష్టారి పేరు తలవగానే గుర్తొచ్చే రచనల్లో మొదటి వరుసలో ఉండే రచన - నలభై నాలుగేళ్ల క్రితం ఆయన రాసిన కథ 'యజ్ఞం.' మామూలుగా మొదలై, ఊహించని మలుపులు తిరుగుతూ ఆలోచనలో పడేసే ముగింపుకి చేరే ఈ కథ ఈనాటికీ సమకాలీనమే అనిపించక మానదు.

కథా స్థలం ఉత్తరాంధ్రలోని 'సుందరపాలెం' అనే పల్లెటూరు. రచయిత మాటల్లో "మదరాసు నుండి కలకత్తాకు - విశాఖపట్నం మీదుగా విజయనగరం కెడంగా - పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుండి ఆరు మైళ్ళు కుడిగా, సముద్రానికి ఐదు మైళ్ళు ఎడంగా - కాకి మార్గాన పోతే శ్రీకాకుళానికి పదిహేను మైళ్ళ దూరంలో ఉందా గ్రామం." అంతా కలిసి నాలుగు వందల ఇళ్ళు. కొత్తగా వెలిసిన షాపులూ, హోటళ్ళూ. ఆరుమైళ్ళ పక్కా రోడ్డూ, విద్యుత్ వాహకాల ఏర్పాటు కారణంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నాయా ఊళ్ళో.

కథా వస్తువు ఒక తగవు. మూడేళ్ళ క్రితం పుట్టి, మూడు నెలలుగా ముడిపడి, మూడు రోజుల నుంచి నలుగుతూన్న తగవది. ఆవేళ అటో ఇటో తేలిపోవాలి. అప్పల్రాముడు - ఆ ఊరి పంచాయితీలో హరిజన మెంబరు, కుల పెద్ద మాత్రమే కాక వయసు మళ్ళిన వాడు. ఆ ఊరి వాడే అయిన బతికి చెడ్డ మాజీ షావుకారు గోపన్నకి రెండు వేలు బాకీ పడ్డాడు అప్పల్రాముడు. రెండు వేలంటే అప్పల్రాముడి కుటుంబానికి ఉన్న రెండెకరాల ముప్పై సెంట్ల మడి చెక్క విలువకి సమానం.

ఊరి వాళ్ళందరికీ గోపన్న మీద సానుభూతి ఉంది. కానీ తగవు తీర్చాల్సిన పంచాయితీ ప్రెసిడెంటు శ్రీరాములు నాయుడికి మాత్రం అప్పల్రాముడి మీద అభిమానం ఉంది. ఈ అభిమానం కారణంగా గోపన్నకి అన్యాయం జరుగుతుందేమో అని సందేహించే వాళ్ళూ లేక పోలేదు. అందుకే ఆ వేళ తగవుకి ఎన్నడూ లేనంతమంది హాజరయ్యారు. శ్రీరాములు నాయుడు చదువుకున్న వాడు. ఊరిని బాగు చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన వాడు. గడిచిన పదిహేనేళ్ళలో ఊరిని ఎంతగానో అభివృద్ధి చేసిన వాడు. ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉన్నా ప్రెసిడెంటుగానే మిగిలిపోయిన వాడు. తనఊరి తగువులు కోర్టు వరకూ వెళ్లకూడని బలంగా కోరుకునే వాడు.

ఆసాంతమూ ఉత్తరాంధ్ర మాండలీకంలో సాగే కథలో సన్నివేశాలని రచయిత వర్ణించే తీరు, ఆయా సన్నివేశాలు మన కళ్ళ ముందే జరిగాయా? అనిపించేలా సాగుతుంది. నిశ్శబ్దమైన సభ నడుమ సభ వారి ఎదుట నిలుచుని అప్పల్రాముడిలా చెబుతున్నాడు: "బాబయ్యా! మొన్న, నిన్నా, ఈ యేలా, నలిగిన నలుగుల్లని బట్టి సబవోరి ఉద్దేశమని నాకనిపించేదేటంటే 'నాయాన్నాయాల మాట ఎలాగున్నా, మూడేళ్ళ కిందట ముగ్గురు పెద్ద మనుషుల ముందు ఆరి మాట కాదనలేకో, అన్నాయానికి బయపడో, అప్పల్రావుడు అప్పంటూ ఒప్పుకున్నాడు; ఆ ఒప్పుకున్నా అప్పు ఈయాలటికి తీరుస్తానని ఆ పెద్దల ముందు మాటిచ్చినాడు; కాబట్టి ఈ నాడు ఆడికున్నా లేకపోయినా, ఆడమ్ముడుబోయో, ఆడి బూవులమ్ముడుబోయో సావుకారి ఋణం ఆడు తీర్చేయాలా! అన్నట్టుంది.

సబవోరి కంటిక్కనిపించేదేటంటే - గోపన్నబాబు కష్టం. ఆబాబుకీ నలుగురు కొడుకులున్నా ఆయన కొడుకులాయనకాడ లేరు. అప్పల్రాముడి కొడుకులందరూ ఆడికాడే ఉన్నారు. ఆల్లంతా ఏనుగ్గున్నల్లా ఉన్నారు. ఆల్లకి సెక్కాముక్కా లేకపోయినా ఆల్లు రెక్కల కష్టం సేసుకు బతగ్గలరు. ఒక పూట దప్పిక లేకపోయినా ఆల పేనాలు పోవు. అందుసేత ఆల్లను ఏదో ఓ పద్దతిని ఒప్పించి ఆల్లకున్న ఆ ఒక్క మడిసెక్కా అమ్మించేసైనా గోపన్నబాబు అప్పు తీరుమానం సేసేటట్టు సూడాల అన్నట్టుంది సబవోరి మనసులోమాట. బాబయ్యా! సబవోరికదే నాయవనిపించిన్నాడు ఆ నాయవే ఇప్పించండి. నెత్తిమీదెట్టుకుంటాను."

'ధర్మ ప్రెబువు' శ్రీరావులు బాబు కూడా అప్పల్రాముడు గోపన్నకి బాకీ తీర్చాల్సిందే అనడంతో ఆ వృద్ధుడిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఒకప్పుడు భూవి, బంగారంతో పచ్చగా ఉన్న తను అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో సుదీర్ఘంగా వివరిస్తాడు. గడిచిన పదిహేనేళ్ళుగా శ్రీరావులు బాబు చేసిన అభివృద్ధి 'ఎగ్గెం' తనవాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకు వచ్చిందో సాదోహరణంగా చెబుతాడు. అప్పల్రాముడి ఆక్రోశానికి సభ ఎలా స్పందించింది? గోపన్న బాకీ తీరిందా? ఊరివారెవరూ కోర్టుకి వెళ్లరాదన్న శ్రీరాములు బాబు ఆశయం ఏమైంది? ..ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు భీభత్స రసంతో కూడిన ముగింపు వాక్యాలు చెబుతాయి.

"ధర్మ పన్నాలెంత వరకూ? ...అంతా నువ్ చెప్పినట్టు వినేవరకూ; ఆ తరువాత....!" అనే వాక్యంతో ముగిసే ఈ కథ, పాఠకుల మదిలో ఎన్నో ప్రశ్నలని లేవనెత్తుతుంది. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ ఒక కొత్త దృష్టి కోణం నుంచి చూసేలా చేస్తుంది. అభివృద్ధి కావాలా? వద్దా? లాంటి సవాళ్ళని ఆలోచనల్లో నింపుతుంది. 'యువ' దీపావళి సంచిక (1966) లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ ఎన్నో పునః ప్రచురణలను పొందింది. తాజాగా 'మనసు ఫౌండేషన్' ప్రచురించిన 'కాళీపట్నం రామారావు రచనలు' (పేజీలు 548, వెల రూ. 180) లోనూ ప్రచురితమయ్యింది.

శనివారం, జులై 17, 2010

శుభప్రదం

సందేశాత్మకంగా సాగే కళా, సాహితీ ప్రక్రియ ఏదైనా సరే అది 'షుగర్ కోటెడ్ పిల్' లా ఉంటే ఇవ్వదల్చుకున్న సందేశం చేరాల్సిన వాళ్లకి సూటిగా చేరుతుంది. మందు గుళిక, పంచదార పూత వేటికవే విడివిడిగా ఉంటే...??? కొంత విరామం తర్వాత కళా తపస్వి కే. విశ్వనాధ్ తెర వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతల నిర్వహణతో పాటు, తెరపై ఓ ప్రత్యేక పాత్రలో నటించిన 'శుభప్రదం' సినిమా చూడడం పూర్తి చేసి థియేటర్ నుంచి బయటకి వస్తుండగా నాకు కలిగిన సందేహం "ఔషధం మోతాదులో తేడా ఎక్కడ వచ్చింది?" అని.

ఎనభై ఏళ్ళ వయసులో వయసులో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, మొక్కవోని దీక్షతో పని చేసి ఒక ఆహ్లాదకరమైన సినిమాని అందించిన విశ్వనాధుడికి ముందుగా అభినందనలు. ఆయన గత చిత్రం 'స్వరాభిషేకం' మిగిల్చిన తీవ్ర నిరాశ నుంచి నేనింకా బయట పడక పోవడం వల్ల ఈ 'శుభప్రదం' మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే మొదటి సగంలో కథ నడిచిన తీరు, ఎంతగానో ఆకట్టుకున్న సంగీతం (పాటల్ని మొదటి సారి విన్నది థియేటర్ లోనే) రెండో సగం మీద ఆశలు పెంచేశాయి.

చంద్రమోహన్, సులక్షణ నాయికా నాయకులుగా విశ్వనాధ్ రూపొందించిన 'శుభోదయం' సినిమా కథతో రేఖామాత్రంగా పోలికలున్న ఈ సినిమాలో కథలు రెండు. ఓ కథలో నాయకుడు చక్రి (అల్లరి నరేష్), ఓ అనాధ. అందరినీ మాటలతో బురిడీ కొట్టించి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఈ చక్రి ఓ సారి కేరళ వెళ్ళడం, అక్కడ స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి ఇందుమతి (మంజరి ఫడ్నిస్) ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మొదటి కథ. అక్కడక్కడా కామెడీ కాస్త విసిగించినా, ఈ కథతో, ఆకట్టుకునే పాటలతో మొదటి సగం సరదా సరదాగా గడిచిపోయింది.

మామూలు ట్విస్ట్ తో విశ్రాంతి ఇచ్చిన విశ్వనాధ్ రెండో సగానికి ఎంచుకున్న కథ, కథని నడిపిన తీరు ఆశ్చర్యానికి గురి చేశాయి. "మొదటి సగం తీసింది ఈయనేనా?" అన్న సందేహం కూడా కలిగింది అప్పుడప్పుడూ. కథ మొదటి సగం కేరళ లోనూ, రెండో సగం గోదారి ఒడ్డునా సాగింది. లొకేషన్లతో పాటు, హీరోయిన్ మంజరి ఫడ్నిస్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నాకైతే 'సాగర సంగమం' జయప్రద చాలా సార్లు గుర్తొచ్చింది, చక్రిగా నటించిన అల్లరి నరేష్ కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి.

మొదటిసగంలో అక్కడక్కడా మాత్రమే కనిపించిన నాటకీయత రెండో సగానికి వచ్చేసరికి అంతా తనే అయ్యింది. ప్రత్యేక పాత్రలో నటించిన విశ్వనాధ్ తెర మీద కనిపించేవరకూ సినిమా లో చర్చించదలచిన ముఖ్యమైన విషయం ఏమిటన్నది తెలియక పోవడం స్క్రీన్ ప్లే లోపమనే చెప్పాలి. ప్రధమార్ధం కన్నా ద్వితీయార్ధం నిడివి కొంచం ఎక్కువగా ఉండడం వల్ల కూడా సినిమాని సాగదీశారన్న భావన కలిగించింది. స్క్రీన్ ప్లే మీద మరికొంచం దృష్టి పెట్టి, నాటకీయతని తగ్గించి ఉంటే వందశాతం విశ్వనాధ్ మార్కు సినిమా అయి ఉండేది ఈ 'శుభప్రదం.'

శుక్రవారం, జులై 16, 2010

విరామం తర్వాత...

అస్సలు అనుకోలేదు, నేను ఎంతగానో ఆస్వాదిస్తున్న బ్లాగింగుకి ఇన్నాళ్ళు విరామం ఇవ్వాల్సి వస్తుందని. అతి కొద్ది రోజులు మాత్రమే అనుకున్నది అలా అలా పెరిగి పెద్దై ఇన్నాళ్ళకి చేరింది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఆకస్మికంగా వచ్చిన మార్పులు నన్ను బ్లాగులకి దూరంగా ఉండాల్సి వచ్చేలా చేశాయి. రాయడానికే కాదు, బ్లాగులు చదవడానికీ తీరిక లేని పరిస్థితి. ఇన్నాళ్ళ తర్వాత ఒక్కసారి బ్లాగులు ఓపెన్ చేయగానే "కొండలా కోర్సు ఉంది.. " పాట గుర్తొచ్చేసింది, అప్రయత్నంగా.

నా క్షేమాన్ని తెలుపమంటూ మిత్రులు రాసిన వ్యాఖ్యలు, ఉత్తరాలు చూడగానే యెంత సంతోషం కలిగిందో చెప్పలేను. అదే సమయంలో విరామాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పలేక పోయినందుకు నామీద నాకే కోపం వచ్చింది. నిజానికి ఇంత గ్యాప్ వస్తుందని నేనూ ఊహించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నా టపాలకి వ్యాఖ్యలు రాసిన మిత్రులకి జవాబులు ఇవ్వాలి, ఇన్నాళ్ళూ పెండింగ్ పెట్టిన టపాలన్నీ చదవాలి.. అమ్మో.. చాలా పని ఉందిప్పుడు. ఇంతకీ నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే ... నేను వచ్చేశాను.