సోమవారం, జనవరి 03, 2011

పడవ ప్రయాణం

ఆమె అతణ్ణి ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది. అతని కోసం ఎల్లాంటి పనన్నా చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఒక ఆదర్శమూ కాదు, భక్తి కాదు, ప్రేమాకాదు. ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో, ఈసులతో అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం. అయినా ఆ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకే చోట లగ్నమయింది. ఆమె పేరు రంగి. ఆమె ప్రేమని పొందిన అదృష్టవంతుడు పద్దాలు.

పాలగుమ్మి పద్మరాజుకి కథారచయితగా యెనలేని ఖ్యాతి తెచ్చిన రెండు కథల్లో మొదటిది 'గాలివాన' కాగా, రెండో కథ 'పడవ ప్రయాణం.' నాయికా నాయకులు రంగి, పద్దాలు. స్త్రీ ఒక మగవాడిని మనసా వాచా 'తనవాడిగా' నమ్మిందంటే, అతడి కోసం ఆమె ఏమైనా చేయగలదు. అది కూడా అతడిని అతడిగా అంగీకరిస్తూ, అతడి నుంచి తిరిగి ఏమీ ఆశించకుండా. ఇందుకు ఉదాహరణ రంగి, ఓ పల్లెటూరి మనిషి.

రంగి, పద్దాలు తాళి కట్టిన భార్య కాదు. అతడు లేవదీసుకుని వచ్చిన మనిషి. ఆమెకి అతడే లోకం. కానీ అతడి లోకంలో ఆమె స్థానం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే, తను మనసు పడ్డ మరో ఆడ మనిషి రంగి మెడలో ఉన్న నగ మీద మోజు పడితే, ఆ నగ ఇవ్వడానికి రంగి తిరస్కరిస్తే, రంగిని గుడిసెలో పెట్టి తాళమేసి గుడిసెకి నిప్పంటించడానికి వెనుకాడనంత.

అయితే రంగి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె తన మగవాడికోసం నిరంతరం తపిస్తుంది. కానీ అతడు నిర్దుష్టంగా, నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు. అతని సుగుణాలతో, అవగుణాలతో అతణ్ణి ఆమె అంగీకరించింది. పద్దాలు రంగిని "తాగి సావగొడతాడు.." కానీ ఉత్తప్పుడు "ఎన్నలా కరిగిపోతాడు. వొంద మందితో పోయినా సరే ఆడు నాకాడికొచ్చి తీరతాడు. నేను లేకపొతే గుండగిలి సచ్చిపోడూ?" అని అడుగుతుంది రంగి.

మానవ మనస్తత్వ చిత్రణమీద పద్మరాజు గారికి ఉన్న పట్టు కథా ప్రారంభం నుంచే తెలిసిపోతూ ఉంటుంది. ప్రారంభ వాక్యాలతోనే పాఠకులని కథ తాలూకు మూడ్ లోకి తీసుకుపోతారాయన. "పొద్దు కుంకిన తరువాత లోకమంతా దిగులుగా ఉంది. పడవ మెల్లగా నీటి మీద జారుతోంది. నీరు పడవ పక్కని కలకలమంటూ రాసుకున్తోంది. చూపురలా జీవ సంచలనం లేని ప్రపంచం నిశ్శబ్దంగా జుమ్మంటోంది. ఆ ధ్వని చెవులకు వినపడక దేహాన్నంతనీ తాకుతోంది. మనస్సులో లోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది..." ఇవీ 'పడవ ప్రయాణం' ప్రారంభ వాక్యాలు.

గోదావరి కాలవ మీద బెల్లం, చింతపండూ తదితర సరుకులని రవాణా చేస్తున్న పడవ టాపు మీద వెల్లకిలా పడుకున్న రచయిత తనతో పాటు పాఠకులనీ పడవలో తీసుకుపోతారు. ఓ రాత్రి వేళ రంగీ, పద్దాలూ పడవలో చేరతారు. అప్పటికే రెండు మూడు దొంగతనాలు చేసిన పద్దాలు పడవలో ఉండడానికి వీల్లేదంటారు గుమస్తా గారు. రంగి ఆయన్ని బతిమాలుకుంటుంది. ఆ తర్వాత చుక్కాని కాసే వాణ్ణి మంచి చేసుకుని, వాణ్ణి నిద్రపొమ్మని చుక్కానిని తను అందుకుంటుంది.

ఓ రాత్రివేళ కొంత సరుకుతో పద్దాలు పడవ దిగిపోతాడు. పడవ వాళ్లకి రంగి దొరికిపోతుంది. మిగిలిన ప్రయాణంలో రంగితో మాట కలుపుతాడు రచయిత. "ఈ సొమ్మంతా మళ్ళీ ఆ గుంటకే దక్కుడు. దానిమీద మోజు తగ్గీదాకా దాన్నొదలడు. నేను ఈ కట్టాలన్నీని. దొంగనెంజ! నా ఉసురోసుకుంటది," అంటుంది రంగి, ఏమాత్రం ఉద్రేకం వినిపించని స్వరంలో. అంతేనా? "ఆడు నావోడు! ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నావోడు. నా దగ్గరికే వొత్తాడు" అని తనలో తను అనుకుంటుంది. "అందులో ఒక ఆశ, ఒక ధైర్యం, ఒక విశ్వాసం తొణికిసలాడాయి.." అంటాడు రచయిత, కథని ముగించబోతూ.

8 కామెంట్‌లు:

  1. brillaint story.
    పద్మరాజుగారి మరి కొన్ని కథల్లో కూడా జీవితాన్ని జడ్జ్ చెయ్యని ఒక అరుదైన గుణం కనిపిస్తుంది. అంతగా ప్రాచుర్యం పొందని కొన్ని కథలనైనా ఇక్కడ పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మంచి కథను పరిచయం చేశారు మురళి. నన్నూ ఈ కథ చదవగానే ఆకట్టుకుంది. "అసలు ఒక మనిషిని ఇలా ప్రేమించగలగడం సాధ్యమేనా" అని అచ్చెరువొందేలా రంగిని సజీవంగా కళ్ళముందు నిలిపారు పాలగుమ్మివారు. తరచి చూస్తే ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో..

    రిప్లయితొలగించండి
  3. మురళీ గారు ధన్యవాదాలు. మంచి కధను మళ్ళీ గుర్తుచేసారు .

    రిప్లయితొలగించండి
  4. ఈ కథ నో, లేక పరిచయాన్నో ఈ మధ్యనే ఎక్కడో చదివాను. సాక్షి కథా పరిచయం లొనో లేక ఆదివారం ఎడిషన్ లొనో. బాగుంది. మొత్తానికి నాకు తెలిసిన కథ మీ బ్లాగులో!

    రిప్లయితొలగించండి
  5. @కొత్తపాళీ: నాకైతే పద్మరాజు గారి ప్రతి కథ గురించీ రాయాలని ఉందండీ.. తప్పక రాస్తాను.. ధన్యవాదాలు.

    @వేణూ శ్రీకాంత్: పాత్ర చిత్రణతో పాటు ప్రకృతి వర్ణన లోనూ పద్మరాజు గారిది ప్రత్యేకమైన శైలి అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @లలిత: ధన్యవాదాలండీ..

    @రూత్: చాలా రోజుల తర్వాత మీరిక్కడ!! ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. మీరు ఈ కథ గురించి రాసిన తరువాత ఇప్పటికి చదవడం అయ్యింది.
    ఇంతకుముందు ఈ సంకలనంలోని "గాలివాన" కథ చదివాను కాని ఈ కథ చదవలేదు.
    మంచి కథని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    ఇంతకుముందెప్పుడో ఇలాంటి కథతో సినిమానో, టెలిఫిల్మో చూసినట్లు గుర్తు.
    మీకేమైనా ఐడియా ఉందా?

    రిప్లయితొలగించండి
  8. @బోనగిరి: లేదండీ.. కథే చాలాసార్లు చదివాను నేను.. ఎందుకో ప్రతిసారీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి