శుక్రవారం, జనవరి 14, 2011

హరిదాసు

"అమ్మా.. హరిదాసు అవ్వాలంటే ఏం చదవాలమ్మా?" చిన్నప్పుడు అమ్మనీ ప్రశ్న ఎన్నిసార్లు అడిగానో లెక్కలేదు. నాకు అక్షరాభ్యాసం అయ్యింది మొదలు, ఎలాంటి సందర్భం వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళంతా దీవించే మొదటి దీవెన "పెద్ద ఉద్యోగస్తుడివై... దోసెడు రూపాయలు సంపాదించుకుని..." అవ్వడంతో పెద్దయ్యాక నేను ఉద్యోగం చేయాలన్న విషయం అర్ధమైపోయింది. అయితే, ఏ ఉద్యోగం చెయ్యాలో ఎవ్వరూ స్పష్టంగా చెప్పకపోవడం వల్ల, రకరకాల ఉద్యోగాలు నా ఊహల్లో మెదిలేవి. అదిగో, వాటిల్లో ఈ 'హరిదాసు' ఒకటి.

ధనుర్మాసపు ఉదయాల్లో, మంచు వర్షంలా కురిసే సమయంలో నిండా రగ్గు కప్పుకుని నిద్రపోవడం నాకు ఎంత ఇష్టమో. ఈ ఇష్టాన్ని నాకు తీరనివ్వకుండా చేసినవాడు హరిదాసు. అయినా కూడా నాకు హరిదాసంటే బోల్డంత ఆరాధన. హరిదాసు ఊళ్లోకి వచ్చాడన్న సూచనగా తంబురా శ్రుతో, చిరతల చప్పుడో, గజ్జెల ఘల్లు ఘల్లులో లేక "శ్రీమద్రమారమణ గోవిందో హరి.." అన్న పాటో అలలు అలలుగా చెవిని తాకేది. అంతే, నిద్ర మత్తు ఒక్కపెట్టున యెగిరిపోయేది. ముఖ ప్రక్షాళనకి పరిగెత్తేవాడిని, వెంటనే. ఎందుకంటే, ధనుర్మాసం నెల్లాళ్ళూ హరిదాసుకి బియ్యం పోసే డ్యూటీ నాదేకదా మరి. పాచి ముఖంతో బియ్యం పోస్తే పాపం చుట్టుకుంటుంది కూడాను.

ఉదయం ఏడవుతుండగా ఊళ్లోకి వచ్చేవాడు హరిదాసు. పట్టు పంచె, ఖద్దరు బనీను. మెడలో, చేతులకీ పూల దండలు. భుజాల చుట్టూ శాలువా. ఓ భుజం మీద తంబురా, చేతిలో చిరతలు. తలకి పాగా, ఆ పాగా మధ్యలో కొలువు తీరిన తళతళలాడే రాగి పాత్ర. గుమ్మడికాయ ఆకారంలో ఉండే ఆ పాత్రకి అలంకారంగా ఓ పూలదండ. నల్లనివాడైనా కళగల ముఖం మా హరిదాసుది. నుదుట, భుజాలమీద శ్రద్ధగా నామాలు దిద్దుకుని వచ్చేవాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చే వాడేమో, క్రమక్రమంగా దగ్గరయ్యే ఆ గజ్జెల చప్పుడు, తంబురా నాదం వింటుంటే ఏమిటో ఒకటే కంగారుగా ఉండేది.

హరిదాసు ఎవ్వరింటి ముందూ ఆగేవాడు కాదు. "శ్రీమద్రమారమణగోవిందో హరీ.." అంటూ ముగ్గు చుట్టూ ఒకసారి తిరిగి, గుమ్మంలో ఎవరూ నిలబడి లేకపొతే వెంటనే మరో ఇంటికి వెళ్ళిపోయేవాడు. హరిదాసలా తిరిగి వెళ్ళిపోతే అరిష్టం కదా, అందుకని మనం వీధి గుమ్మంలో కాసుకుని కూర్చోవాలి. హరిదాసు కోసం చూస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా వేరే పనులేమీ చెప్పరు. మనం బియ్యం పళ్ళెంతో గుమ్మంలో నిలబడి ఉన్నామనుకో, ముగ్గులో మోకాళ్లమీద వంగి కూర్చుంటాడు హరిదాసు. గొబ్బిళ్ళు ఉన్నాకానీ అస్సలు తొక్కడు. చేతుల్లో తంబురా, చిరతలూ వాటిపని అవి చేస్తూనే ఉంటాయి, తలమీద పాత్ర కదులూమెదులూ లేకుండా అలాగే ఉంటుంది.

అలా చేయి నేలకి ఆన్చకుండా వంగి కూర్చోడానికి ఇంట్లో వాళ్ళెవరూ చూడకుండా నేను రెండు మూడుసార్లు ప్రయత్నించానుకానీ, నా వల్ల కాలేదు. ఇంతకీ హరిదాసు అలా కూర్చున్నప్పుడు మనం పళ్ళెంలో బియ్యాన్ని, రాగి పాత్రలో జాగ్రత్తగా పోసేయాలి. పాత్రని పొరపాటున కూడా తాకకూడదు. బియ్యం ఒలక కూడదు. మనం బియ్యం పూర్తిగా పోసేసిన సంగతి హరిదాసుకి ఎలా తెలుస్తుందో కానీ "కృష్ణార్పణం" అని, తంబురా మీటుతాడు. కొంచం భయంవేసినా అస్సలు భయపడకుండా దండం పెట్టుకోవాలి.

అమ్మకి నాతో పనున్నప్పుడల్లా ప్రశ్నలతో వేధించే వాడిని. హరిదాసు ఎక్కడ ఉంటాడు? తనకి పిల్లలు ఉంటారా? (హరిదాసుకి పిల్లలుండడం నాకు నచ్చలేదు ఎందుకో..), రోజూ రాకుండా నెలపట్టినప్పుడు మాత్రమే ఎందుకు వస్తాడు? మనం ఇచ్చే బియ్యం ఏం చేసుకుంటాడు? ...ఇలా ఉండేది ప్రశ్నల పరంపర. అమ్మ అప్పటికప్పుడు యేవో సమాధానాలు చెప్పేది కానీ, నాకేవీ నచ్చేవి కాదు. రోజూ హరిదాసు కట్టుకునే పట్టు పంచలనీ, కప్పుకునే శాలువలనీ శ్రద్ధగా చూసేవాడినేమో, ఒక్కసారైనా వాళ్ళ ఇంటికి వెళ్లి తనకి మొత్తం ఎన్ని పంచలు ఉన్నాయో చూడాలని భలే కోరికగా ఉండేది.

హరిదాసుతో మాట్లాడ్డం అస్సలు కుదరదు. ఎందుకంటే తను చాలా తొందర తొందరగా ఊరంతా తిరిగేస్తాడా? మనం ఇంట్లో వాళ్ళు చూడకుండా తన వెంట పడ్డా, మనతో మాట్లాడడు. తలమీద పాత్ర ఉన్నంతసేపూ తను మాట్లాడ కూడదు మరి. ఊళ్ళో తిరిగినంతసేపూ తలమీద భిక్ష పాత్ర తప్పనిసరి. వేళ్ళు నలిగిపోకుండా తంబురా, చిరతలూ ఎలా వాయిస్తాడో అడగాలనీ, పాటలు ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోవాలనీ ఇలా చాలా చాలా అనుకునే వాడిని. ఓసారి ఆ తంబురా మీటి, చిరతలని అలా అలా వాయించడం నా తీరని కోరికల జాబితాలో శాశ్వత స్థానాన్ని సంపాదించేసుకున్నాయి.

ధనుర్మాసం నెల మొత్తమ్మీద హరిదాసు కొంచం తాపీగా ఊళ్ళో తిరిగే రోజు ఒక్కటే ఉండేది. అది పెద్ద పండుగ. ఆవేళ హరిదాసు తలమీద పాత్ర పెట్టుకునేవాడు కాదు. తనతో పాటు తీసుకొచ్చిన మరో మనిషి మోసే కావిడిలో ఆ పాత్ర ఉండేది. రోజూ పొద్దు పొద్దున్నే వచ్చే హరిదాసు, ఆవేళ మాత్రం మధ్యాహ్నం భోజనాలప్పుడు వచ్చేవాడు. వీధిలో ఇంకా ఆరకుండా వెలుగుతున్న భోగి మంటని జాగ్రత్తగా దాటుకుని వాకిట్లోకి వచ్చి, ముగ్గులు తొక్కకుండా ఓ పక్కగా నిలబడి, ఇంట్లో అందరినీ పలకరించి మాట్లాడే వాడు. "అయ్య" "అమ్మ" "బాబు" అని మాట్లాడేవాడు.

అమ్మ, నాన్న పక్కనే ఉండేవాళ్ళు కదా.. అందుకని నాకు హరిదాసుతో మాట్లాడడానికి భయంగా ఉండేది. అదీకాక, ఏం అడిగితే ఏమంటాడో అని భయం కూడాను. తనేమో ప్రతిసంవత్సరం నా చదువు గురించి అమ్మానాన్నలని కనుక్కునేవాడు. ఆవేళ బియ్యంతో పాటు, పిండివంటలు, కొబ్బరికాయ, డబ్బులు ఇచ్చేవాళ్ళు హరిదాసుకి. నేను పండగ భోజనమన్నా చేయకుండా మా వీధి చివరివరకూ దిగబెట్టేవాడిని హరిదాసుని. ఇంక మళ్ళీ ఏడాది వరకూ తను కనిపించడంటే భలే దిగులేసేది. ఒకటి మాత్రం నిజం.. హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం.

....మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు....

20 కామెంట్‌లు:

  1. మురళి గారు చాల బావుంది మీ పోస్టు
    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  2. అబ్బ! మురళిగారూ...పోస్ట్ అంతా ఎంతో ఉత్సాహంగా చదివి...మీరు చెప్పినవన్నీ ఒక స్క్రీన్ మీద సినిమాలా ఊహించేసుకుని సంబరపడుతున్నప్పుడు....ఆ చివరిలో అన్న మాట కొంచెం గుండెలో కలుక్కుమంది.హ్మ్! నేను చిన్నప్పుడు రెండు,మూడు సార్లు అమ్మమ్మావాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూశాగానీ అవన్ని లీలగా గుర్తు.మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో కదా! పట్టణాల్లోనే కాదు ఇప్పుడు పల్లెల్లో కూడా కనిపించట్లేదుట హరిదాసులు :(

    రిప్లయితొలగించండి
  3. మల్లా ఒక్కసారి నా బాల్యాన్నంతా కళ్ళ ముందు చూసినట్టు వుంది, మీ పోస్ట్ చదివాక..నాకు అలా చాల boubts vundevi, అందులో ఒకటి పాత్ర నిండగానే బియ్యాన్ని ఎక్కడ పెడతాడా అని ?,kani మా హరిదాసు తన పాత్ర నిండగానే ఆ బియ్యాన్ని మా పెద్దనానమ్మ గారి ఇంట్లో దాచుకునేవాడు అని కొంచం పెద్ద అయ్యాక తెలిసింది . ఆ నెల చివరికి ఒక 2/3 బస్తాల ధాన్యం అయ్యేది , చక్కగా పట్టుకెల్లెవాడు.

    రిప్లయితొలగించండి
  4. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  5. "పెద్ద ఉద్యోగస్తుడివై... దోసెడు రూపాయలు సంపాదించుకుని..." అవ్వడంతో పెద్దయ్యాక నేను ఉద్యోగం చేయాలన్న విషయం అర్ధమైపోయింది. అయితే, ఏ ఉద్యోగం చెయ్యాలో ఎవ్వరూ స్పష్టంగా చెప్పకపోవడం వల్ల, రకరకాల ఉద్యోగాలు నా ఊహల్లో మెదిలేవి. అదిగో, వాటిల్లో ఈ 'హరిదాసు' ఒకటి"

    కృష్ణార్పణం

    "హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం"
    మాక్కూడానండీ

    చిన్న సందేహం ఇంతకీ అవి చిరతలా? చిడతలా?

    రిప్లయితొలగించండి
  6. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    శి. రా. రావు
    సంక్రాంతి లక్ష్మి_శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు, మీకూ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ రోజు మీ టపా తప్పనిసరిగా ఉంటుందనుకున్నాను.ధనుర్మాసంలొ మీలా నాకు హరిదాసు అనుభవాలు లేవు కాని నెల రొజులు మా అమ్మమ్మ నానమ్మ ల తిరుప్పావయ్ పటనాలు, రొజు విడిచి రొజు పొంగల్లు చాల చాల ఉండెవి, కాలెజి అయిపొవడం తొటె అన్ని అయిపొయాయి. సంక్రాంతి కి మా ఊరెల్లి 4 ఎండ్లు అయ్యింది. ఈ ఏడు కూడా పొవడం పడలేదు.

    రిప్లయితొలగించండి
  8. అద్భుతంగా ఉంది. బుడుగు లో లా మీరు బాల మురళి లా narrate చెయ్యడం ఇంకా అందాన్ని తెస్తోంది మీ ప్రతీ టపా కి .
    పండగలలో మీ బ్లాగ్ చదివినప్పుడల్లా తెలుగు నాట కనపడే దృశ్యాలు (సంబరాలు, ఆచారాలు, వృత్తులూ ) ఒక్కొక్కటీ కనుమరుగైపోతున్నాయని దిగులేస్తుంది.

    మీ టపాలు కథల పుస్తకం గా త్వరలో ఎవరొకరు ప్రచురించాలని కోరుకుంటున్నాను.

    సంక్రాంతి శుభాకాంక్షలు!

    వాసు

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగున్నాయండీ మీఙ్ఞాపకాలు, నేను హరిదాసుని చూసి చాలా ఏళ్ళే అవుతుంది. చిన్నప్పటి రోజులన్నీ గురుతొచ్చాయి.
    మీకూ మీ కుటుంబానికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  10. హరి దాసు జ్ఞాపకాలను అన్నీ తట్టి లేపారు..
    శ్రీమద్రమారమణగోవిందో హరీ..ఇక్కడికి వచ్చాక మా హరిదాసు గొంతు వినపడింది
    సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు, చాలా చాలా నచ్చింది మీ టపా నాకు.
    >>హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం.
    నో కమెంట్స్..:( నేనసలు చూడలేదు హరిదాసుని...

    రిప్లయితొలగించండి
  12. మా సాయి కుడా హరిదాసువస్తే ఇలానే అడుగుతాడు ప్రశ్నలు .హరిదాసుకి బియ్యం పొయ్యడం మా పిల్లలలికి చాలా ఇష్టం
    >హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం>.
    చాలా బాగుంది మీ పోస్ట్ .
    మా ఊరి హరిదాసు ని చుడండి ?
    http://saisatyapriya.blogspot.com/2011/01/blog-post_08.html.

    రిప్లయితొలగించండి
  13. @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
    @ఇందు: నిజమేనండీ.. ఇప్పుడు పల్లెల్లో కూడా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నారు.. ధన్యవాదాలు.
    @విరిబోణి: నాకూ అలాంటి సందేహాలే ఉండేవండీ... ఆ రోజులే వేరు కదా... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @శ్రీనివాస్ పప్పు: బహుశా 'చిడతలు' కావొచ్చండీ.. నాకు 'చిరతలు' అని వినడం అలవాటైపోయింది.. ధన్యవాదాలు.
    @SR Rao: ధన్యవాదాలండీ..
    @స్ఫూర్తి: రాను రాను ఊళ్లలో కూడా పండగ కళ తగ్గిపోతోందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @వాసు: చాలా పెద్ద ప్రశంశ అండీ.. మార్పుని అంగీకరించాలికదా మనం.. సౌకర్యాలూ కావాలి, పాత పద్ధతులన్నీ అలాగే కొనసాగాలి అని కోరుకోవడం అత్యాశో, దురాశో అవుతుంది కదా.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @హరేకృష్ణ: నాకు రాస్తున్నంతసేపూ మా హరిదాసు గుర్తొస్తూనే ఉన్నాడండీ ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @మనసుపలికే: మరి మేము మా చిన్నప్పుడు కంప్యూటర్లు, గ్రాఫిక్స్ సినిమాలు చూడలేదండీ :-) :-) ధన్యవాదాలు.
    @రాధిక (నాని): మీ హరిదాసుని తప్పకుండా చూస్తానండీ.. ధన్యవాదాలు.
    @ఎన్నెల: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. >>>హరిదాసులు పల్లెటూళ్ళలో తిరిగిన రోజుల్లోనే నేను పుట్టి పెరిగానని చెప్పుకోవడం నాకెప్పటికీ గర్వ కారణం.

    నాక్కూడా. :) ఇంకో విషయం. ఇప్పటికీ అప్పుడప్పుడు హరిదాసులని చూస్తున్నానన్న ఆనందం కూడా నాసొంతం. :)

    రిప్లయితొలగించండి
  18. @శిశిర: అదృష్టవంతులండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  19. mee Tapanu chadivaanu..chaala baagundi.chaala roajula tarvaata maLLi telugu vyaasaalanu chaduvutunnaa.chaalaa aanamdamgaa undi.haridasulu anagaane naaku modaTa gurtukocchindi sutradhaarulu sinimaa.anduloa modaTi paaTa maha raaja raaja Sria. enta chakkani vaatavaraNam anDi alaanTi roajulu maLLi eppuDostayo

    రిప్లయితొలగించండి