గురువారం, మే 26, 2011

(ఉ)గ్రామ సింహాలు

రోజులెలా మారిపోయాయో.. సింహానికి భయపడని మగధీరులు సైతం గ్రామసింహం పేరు చెప్పగానే ఉలిక్కి పడుతున్నారు. ఉగ్ర రూపం దాల్చిన గ్రామసింహాలు అంతగా భయపెట్టేస్తున్నాయి అందరినీ. పిల్లలాడే దొంగాటలో దాగి ఉండి వెనుక నుంచి 'భౌ' అంటూ ఉరికే ఆటని నిషేధించాల్సిన రోజులు వచ్చేసినట్టే ఉన్నాయి. ఇప్పుడలా ఎవరితోనన్నా సరదాకి భౌ అన్నా, అవతలి వాళ్ళు స్పృహ తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జంతు రక్షణ సంస్థల కార్యకలాపాలు విస్తరించిన ఫలితంగా, వీధికుక్కల సంఖ్య బాగా విస్తరించింది. ఇప్పుడిప్పుడు ఎందెందు చూసిన అందందే తోకూపుకుంటూ శునకాలు చేసే సందడి కనిపిస్తోంది. మునిసిపాలిటీ కుక్కలబళ్ళు దాదాపు అదృశ్యం అయిపోగా, కుక్కల్ని నేర్పుగా పట్టుకుని బండిలో వేసి పొట్టపోసుకునే వాళ్ళు ఇతరత్రా వృత్తులకి మళ్ళిపోయారు. ఫలితంగా కుక్కలన్నింటికీ ఓ రోజొచ్చింది.

కుక్కల్ని చంపొద్దని ఉద్యమాలు చేసిన సంస్థలు, ప్రత్యామ్నాయం ఏమిటన్నది చెప్పలేదు. ఎవరూ చెప్పనప్పుడు ఎందుకు పట్టించుకోవడం అనుకున్నారో లేక సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారో కానీ ఏలిన వారుసైతం ఎప్పటిలాగే దూరదృష్టి చూపలేదు. బట్టకట్టక పోయినప్పటికీ బతికి ఊపిరి పీల్చుకున్న కుక్కలన్నీ తోచీతోచకా రోడ్లమీద తిరుగుతూ పిక్క కనిపించిందే తడవుగా చటుక్కున కొరికి పారేస్తున్నాయి.

కుక్కకాటు వల్ల సంక్రమించే రేబిస్ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై ఐదువేల మంది కన్నుమూస్తున్నారట.. వీళ్ళలో అక్షరాలా ఇరవై రెండువేల మంది భారత దేశంలో తనువు చాలిస్తున్నారట. ఇవి అధికారిక గణాంకాలు. వాస్తవ సంఖ్యలు ఇంతకన్నా కొంచం ఎక్కువ ఉండొచ్చేమో కానీ, తక్కువ మాత్రం ఉండవు. ఈ లెక్క ప్రకారం ప్రతి పది నిమిషాలకీ ఓ రేబిస్ మరణం సంభవిస్తోంది. నాటుగా చెప్పాలంటే జనం కుక్కచావు చస్తున్నారు.


ఓ పక్క శునకాలు వీధుల్లో వీర విహారం చేస్తుండగా మరో పక్క మన ఆస్పత్రుల్లో యాంటీ-రేబిస్ వ్యాక్సీన్స్ అందుబాటులో లేవు. సకాలంలో వ్యాక్సిన్ అందని కారణంగా ప్రాణాలు పోయిన వైనం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చాక ప్రభుత్వంలో చలనం మొదలయ్యింది. మొత్తానికి వ్యాక్సీన్లయితే అందుబాటులోకి వస్తున్నాయి కానీ, కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మనుషులే కాదు, మూగజీవాలూ ఈ కాటుకు బలవుతున్నాయి.

జీవకారుణ్యం చూపి శునకాలని చంపకుండా ఆపుతున్నారు సరే. మరి వాటిని ఇలా జనం మీదకి వదిలేయడమేనా? కుక్కలన్నింటికీ యాంటి-రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, శునకాలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనే ప్రతిపాదన ఒకటి ఆ మధ్యన వినిపించింది. దానికి కూడా యేవో అడ్డంకులు వచ్చాయి. ఏదో ఒకటి చేసి ప్రజల ప్రాణాలని గ్రామ సింహాల బారినుంచి కాపాడాల్సిన బాధ్యత మాత్రం ఏలినవారి మీద ఉంది. ఎందుకంటే ఇదేమీ చిన్నాచితకా సమస్య కాదు.

ఒకవేళ మన సర్కారు స్పందించే లోగానే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా కుక్కకాటు బారిన పడితే? ముందుగా గాయమైన ప్రదేశాన్ని ట్యాప్ కింద ఉంచి, నీళ్ళు ధారగా పడేలా ట్యాప్ తిప్పి గాయాన్ని బాగా కడగాలి. మామూలు నీళ్ళతోనూ, సబ్బుతోనూ మళ్ళీ మళ్ళీ కడిగాక, యాంటీ-సెప్టిక్ క్రీమ్ లేదా లోషన్ పూసి, కట్టు కట్టకుండా వదిలేయాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

ఇదివరకటిలాగా ఇప్పుడు బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ల బాధ లేదు, మూడు నెలల వ్యవధిలో ఆరు ఇంజెక్షన్ల కోర్సు తీసుకోవడం ద్వారా రాబిస్ బారిన పడకుండా బయట పడొచ్చు. పన్నెండు వారాల వయసు దాటిన పెంపుడు కుక్కకి ఏడాదికోసారి యాంటి-రేబిస్ వ్యాక్సిన్ వేయించడం మరిచిపోకూడదు. మన కుక్కే కదా అని ఊరుకోవడం అస్సలు మంచిది కాదు. ఏమో, మనం ముద్దు చేసినప్పుడు దానికి సరదాగా కరవాలనిపిస్తే.....

4 కామెంట్‌లు:

  1. YES, UR TRUE. WITHOUT SHOWING SOLUTION SOME ANIMAL WELFARE SOCIETIES ARE SHOWING UNNECESSARY LOVE ON DOGS. THEY MUST WALK ON ROADS LIKE US MIDDLE CLASS PEOPLE. THEN THEY WILL KNOW THE PROBLEMS, SO THERE IS ONLY ONE SOLUTION IN MY MIND ALL VICTIMS PLEASE BE UNITED AND FILE A CASE IN HIGHCOURT AGAINST ON STAY OF KILLING DOGS, AND WE MUST LEAVE SOME DOGS IN THE HOUSE OF THESE ANIMAL LOVERS OR ANIMAL EQUAL HOUSES.

    రిప్లయితొలగించండి
  2. jeeva kaarunyam manchide kaani tanaku maalina dharmam cheddadi kadaa. Safety comes first before their freaky love on Dogs. We cant walk on roads even in Mumbai due to these Dogs.

    రిప్లయితొలగించండి
  3. హ్మ్.. నిజమే మురళి గారు. మా ఆఫీసులోకి కూడా వచ్చేస్తున్నాయి ఈ శునకాలు. ఎప్పుడు మీద పడి కరుస్తాయో తెలీదు. చంద్ర శేఖర్ గారు చెప్పినట్టు నిజంగానే వాళ్లంతా మనలాగా రోడ్ల మీద కుక్కలతో పాటు కలిసి నడవాల్సొస్తే గానీ తెలీదు అందులో ఉన్న కష్టమేంటో...

    రిప్లయితొలగించండి
  4. @చంద్రశేఖర్: కుక్కల్ని చంపడం మాత్రమే ఈసమస్యకి పరిష్కారం అని నేను అనుకోవడం లేదండీ.. అలా అని ఇలా వదిలేయడాన్నీ సమర్ధించను.. ధన్యవాదాలు.
    @సూర్య: దాదాపు అన్ని నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఈ సమస్య ఉందండీ.. రోజు రోజుకీ పెరుగుతోంది కూడా.. ధన్యవాదాలు.
    @మనసుపలికే: నిజమేనండీ.. చాలా పెద్ద సమస్య అయిపోతోంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి