శనివారం, జూన్ 04, 2011

చెహోవ్ కథలు

పందొమ్మిదో శతాబ్దపు రష్యన్ రచయితలలో ప్రముఖుడు అంతర్జాతీయ కథా సాహిత్యంలో చెహోవ్ గా పేరుతెచ్చుకున్న ఆంటన్ పావ్ లోవిచ్ చెహోవ్. పేదరికంలో పుట్టి పెరిగి, వైద్యుడిగా ఎదిగిన చెహోవ్ చిన్ననాటే కలం పట్టారు. కేవలం నలభై నాలుగేళ్ళు మాత్రమే జీవించి, క్షయ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన చెహోవ్ తన జీవితకాలంలో ఎనిమిదివందల పైచిలుకు కథలు రాశారు. వందేళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ సమకాలీన కథలు అనిపించడమే చెహోవ్ కథల ప్రత్యేకత.

చెహోవ్ కథల్లో తెలుగు కథా, నవలా రచయిత ముక్తవరం పార్థసారథి అనువదించిన యాభై నాలుగు కథల్ని 'చెహోవ్ కథలు' పేరిట పుస్తకంగా వెలువరించారు వికాసం బుక్స్ వారు. రెండువందల డెబ్భై పేజీల ఈ సంకలనంలో ఏ కథా నాలుగైదు పేజీలకి మించదు. చదివాక ఒకపట్టాన మనల్ని వదిలి వెళ్ళదు. చెహోవ్ పాత్రలన్నీ నేల మీద నడుస్తాయి. మన చుట్టూనే కనిపిస్తాయి.

ఆకలినీ, పేదరికాన్నీ చిన్ననాడే రుచి చూసిన చెహోవ్ కి తండ్రి ప్రేమంటే ఏమిటో తెలీదు. జీవిక కోసం ఓ చిన్న కిరాణా కొట్టు నడిపిన ఆ తండ్రి ఓ చండశాసనుడు. "నా బాల్యంలో బాల్యం లేదు" అని చెప్పుకున్న చెహోవ్ కథల్లో ఎక్కువగా కనిపించేది కూడా పేదరికమే. మంచు గాలులు, వడగళ్ళ వానల నేపధ్యంలో రష్యా గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేసే పాత్రలతో పాటు పాఠకులూ ప్రయాణం చేయాల్సిందే.

ఆకలి తీర్చుకోవడం కోసం యాపిల్ తోటలో పళ్ళు దొంగతనం చేస్తూ యజమానికి దొరికిపోయిన పడుచు ప్రేమ జంట మొదలు, అదే కారణానికి వృద్ధుడైన మావగారి నస భరించే సాషా తల్లీ, గడ్డ కట్టించే చలిలో అర్ధ నగ్న మోడలింగ్ కి సిద్ధపడ్డ బక్క పలుచని పనిపిల్ల అన్యూటా... వీళ్ళనెవరినీ ఓ పట్టాన మర్చిపోలేం. అయితే, అదే ఆకలి కారణంగా బ్యాంక్ మేనేజర్ ని విసిగించి పబ్బం గడుపుకునే ముసలమ్మనీ, హోమియోపతి వైద్యురాలిని మోసం చేసే జనాన్నీ కూడా చిత్రించారు చెహోవ్.

చెహోవ్ కథలన్నీ ఆకలి కథలు మాత్రమే కాదు. అన్ని విషయాల్లోనూ కచ్చితంగా ఉండే 'ఆదర్శ పురుషుడి'నీ, తొలి కేసు వాదించడంలో 'బెరుకు' చూపి న్యూనత పడ్డ న్యాయవాదినీ, కిరోసిన్ ని వోడ్కాగా పొరబడి తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్న కథానాయకులనూ పలకరించ వచ్చు ఈ కథల్లో. 'విరహిణి' 'వేటగాడు' లాంటి వివాహేతర సంబంధాలని ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథలూ ఉన్నాయి.

కేవలం సీరియస్ కథలు మాత్రమే కాదు, హాస్య, వ్యంగ్య కథలకూ లోటు లేదు ఈ సంకలనంలో. చదువుతున్నప్పుడు నవ్వు పుట్టించడమే కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి గిలిగింతలు పెట్టించడం వీటి ప్రత్యేకత. ఎక్కడా విసుగు కలిగించకుండా ఆసాంతమూ ఆసక్తిగా చదివించే గుణం పుష్కలంగా ఉందీ కథల్లో. ఊహకందని ముగింపు మెజారిటీ కథల ప్రత్యేకత.

అనువాదం చాలా వరకూ సాఫీగా సాగినప్పటికీ కొన్ని లోపాలు లేకపోలేదు. కొన్నిచోట్ల వ్యతిరేకార్దాలనిచ్చే పదాలని వాడారు. ఉదాహరణకి నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని గురించి చెబుతూ 'నిస్తబ్దంగా' అనీ, విమర్శించారు అనడానికి 'శ్లాఘించారు' అనీ వాడడం లాంటివి పరిహరిస్తే బాగుండేది. అలాగే, కొన్ని కథల్లో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని కలగాపులగం చేసేయడం వల్ల, కథ ఏ 'టెన్స్' లో నడుస్తోందన్నది ఓ పట్టాన అర్ధం కాదు. అచ్చు తప్పుల విషయంలోనూ జాగ్రత్త అవసరం. కథల్ని ఇష్టపడే వారు ఇష్టంగా చదువుకునే కథలివి. (నవోదయ, ఏవీకెఎఫ్ లలో లభ్యం, వెల రూ. 125).

2 కామెంట్‌లు: