ఆదివారం, ఆగస్టు 28, 2011

కూర్మావతారం

చూడ్డానికే గట్టిగా అనిపిస్తూ, మిలమిలా మెరిసే రక్షణ కవచం, అందులోనుంచి అప్పుడప్పుడూ బయటికి కనిపించే నాలుగు బుల్లి బుల్లి కాళ్ళూ మరియూ వాటి కన్నా కూసింత పెద్దదైన తల. నీళ్ళలో ఈదుతున్నా, నేలపై నడుస్తున్నా రెప్పవెయ్యకుండా చూడాల్సిందే ఆ జీవిని. అదే తాబేలు. మెట్ట తాబేలు కథ చెప్పేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు నీటి తాబేళ్ల గురించి. అమ్మమ్మా వాళ్ళ పెరట్లో ఉండే నిండా నాచు పట్టిన, సగానికి పైగా వరలూడిపోయిన పేద్ద దిగుడు బావిలో సర్వకాల సర్వావస్తల్లోనూ డజనుకి తక్కువ కాకుండా దర్శనమిచ్చేవి నీటి తాబేళ్లు. వీటి పుణ్యమాని సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే, మధ్యాహ్నాలు తోచకపోవడం అనే సమస్య ఉండేదే కాదు.

నూతికి ఓ పక్క పెద్ద పెద్ద నేరేడు, వేప చెట్లు ఉండేవి. వాటుకి వేప చెట్టుకి కూసింత చరిత్ర ఉంది. ఇక, నేరేడు చెట్టయితే మేం అడక్కుండానే పళ్ళు రాల్చేసేది. నల్లగా నిగనిగలాడుతూ, అక్కడక్కడా చిన్న చిన్న గుంటలతో చూడగానే నోరూరేలా ఉండేవి నేరేడు పళ్ళు. నేరేడు చెట్టుకి వెనగ్గా కొంచం దూరంలో ఓ మడుగు ఉండేది. ఆ మడుగులో తామర మొగ్గలు ఉండేవి. అయితే ఆ మడుగు దొంగూబి. పొరపాటున ఎవరన్నా దిగారంటే పైకి రావడం కష్టం. ఇటు చూస్తే దిగుడు బావికి వరల్లేకపోవడం వల్ల పిల్లలు పడిపోతారన్న భయం ఉండేది పెద్ద వాళ్లకి.

దాంతో మేం పెరట్లో ఆడుతున్నామంటే, హమేషా ఎవరో ఒకళ్ళు మాకు కాపలా ఉండాల్సిందే. ఎంత వేసంకాలం మధ్యాహ్నమైనా నూతి దగ్గర మహా చల్లగా ఉండేది. పిల్లలే కాదు, పెద్దాళ్ళు కూడా అక్కడకి చేరిపోయేవాళ్ళు. పెద్దాళ్ళు వాళ్ళ కబుర్లలో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ, పిల్లలకి అలా కుదరదు కదా. ఎప్పటికప్పుడు కొత్త ఆటలు కనిపెడుతూ ఉండాలి. ఘటోత్కచుడు చెప్పినట్టు ఎవరూ కనిపెట్టకపోతే ఆటలెలా వస్తాయి? (అంటే అచ్చంగా ఇలాగే చెప్పలేదు కానీ, ఈమాత్రం అన్వయించుకోకపోతే ఇంక 'మాయాబజార్' చూడడం ఎందుకూ, దండగ). మేం అనగా, నాతో కలిపి ఓ అరడజనుమంది పిల్లలం ఎప్పుడూ అలా కొత్త ఆటలు కనిపెట్టే పనిలో ఉండేవాళ్ళం.

అలా ఓ మధ్యాహ్నం మేం కనిపెట్టిన ఆటని చాలా రోజులే ఆడుకున్నాం. అసలు నూతి దగ్గరకి వెళ్ళగానే ముందర నేరేడు పళ్ళు ఏరేసుకుంటాం కదా. ఆ నూతి నీళ్ళు ఉప్పగా తాగడానికి పనికి రాకపోయినా, ఇళ్ళలో వాడుకోడానికి ఎవరో ఒకళ్ళు వచ్చి పట్టికెడుతూనే ఉంటారు. అలా పట్టికెళ్ళే వాళ్ళు ఓ చేదడు నీళ్ళు అక్కడ పెట్టి వెళ్ళాలి. అది రూలు. ఏరి తెచ్చుకున్న నేరేడు పళ్ళని ఆ చేదలో వేసేసి బాగా కడిగేస్తామా, ఇప్పుడాపక్కనే చూడ్డానికి పనసాకుల్లా ఇంకొంచం పెద్దగానూ, పల్చగానూ ఉండే ఆకులు కోసుకుని శంఖంలా చుట్టేసి కడిగిన పళ్ళని అందులో వేసేసుకోవడం.

ఒక్కొక్కళ్ళం ఒక్కో పండు తీసుకుని తినడం. గింజ తీసి చేదలో కడగడం -- ఈ కడగడం ఎందుకంటే నూతిలో ఎంగిళ్ళు వెయ్యకూడదు కదా అందుకు -- దానిని సూటిగా చూస్తూ నూతిలో ఉన్న తాబేళ్ళలో మిగిలిన ఫ్రెండ్సులు చూపించినదానికి కొట్టడం. మనం నెగ్గామనుకో, ఇంకో పండు తిని, మళ్ళీ తాబేలుని కొట్టొచ్చు. ఓడిపోతే మన తర్వాత వాళ్లకి వెళ్తుంది ఆట. తాబేళ్లు ఎంతంత ఉంటాయంటే, మన దోసిలి మొదలు, అమ్మ దోసిలి, ఇంకా అమ్మదీ పిన్నిదీ కలిపితే ఎంత దోసిలవుతుందో అంతంత పెద్దవికూడా ఉంటాయి నూతిలో.

మనకి పెద్ద తాబేలు వస్తే సుళువుగానే నెగ్గేస్తాం కానీ, చిన్న తాబేలు కానీ వచ్చిందా, ఇంక అంతే. ఎందుకంటే, చిన్న చిన్న తాబేళ్లు చకచకా కదిలిపోతాయి, నూతిలో. ఒక్కోసారి వాటిల్లో అవి ఆడుకుంటూ పెద్ద తాబేళ్ల కిందకి కూడా వెళ్ళిపోతాయి. అప్పుడేమో మనం కొట్టే నేరేడు గింజ చిన్న తాబేలుకి కాకుండా, పెద్ద తాబేలుకి తగిలి మనం ఓడిపోతాం. చెట్టు మీద నుంచి నేరేడు పళ్ళు ఎప్పుడూ రాలుతూనే ఉంటాయి కాబట్టి, పళ్ళు అయిపోడం అనే సమస్యే ఉండదు. పైగా ఉప్పు నీళ్ళలో కడిగితే బోల్డంత రుచి వస్తుంది కూడాను.

అసలీ పెద్దోల్లున్నారే.. (!!) వీళ్ళు పిల్లల్ని వాళ్ళ పాటికి వాళ్ళని ఆడుకోనివ్వరు. పైగా ఏం ఆడుకున్నా అందులో తప్పులే కనిపిస్తాయి కూడాను. మేమందరం బుద్ధిగా తాబేళ్ళని కొట్టే ఆట ఆడుకుంటున్నామా? ఎలా గమనించిందో కానీ, ఓరోజు పిన్ని గమనించేసింది. ఇంకేవుందీ? "తాబేలంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారం. అలా కొట్టకూడదూ, దండం పెట్టుకోవాలీ" అంటూ పాఠం చెప్పేసింది. పైగా, అంతగా అయితే ఆరబోసిన పిండిల దగ్గరకి వచ్చేస్తున్న కాకుల్ని కొట్టే ఆట ఆడుకోండీ అంటూ సలహాలు. తాబేళ్ళయితే దొరుకుతాయి కానీ, కాకులు మన దెబ్బకి దొరుకుతాయా? ఏంటో, పిన్నికి ఈ చిన్న విషయం కూడా తెలీదు. ఏం చేస్తాం మరి.. తాబేళ్ళకి దండం పెట్టుకుంటూ కొత్త ఆటలు ఆలోచించుకున్నాం.

4 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హ! నేనింకా ఏ శ్రీకూర్మం గురించో చెప్పే టపా అనుకున్నా :) వెరీ క్యూట్!!!
    >> తాబేళ్లు ఎంతంత ఉంటాయంటే, మన దోసిలి మొదలు, అమ్మ దోసిలి, ఇంకా అమ్మదీ పిన్నిదీ కలిపితే ఎంత దోసిలవుతుందో అంతంత పెద్దవికూడా ఉంటాయి నూతిలో.
    పై వాక్యంలో ఇంకా అమాయకత్వం తొంగిచూస్తునే ఉంది :)

    రిప్లయితొలగించండి
  2. @ఇందు: శ్రీకూర్మం చూడాలని చాలారోజులుగా ప్రయత్నమండీ.. టపా రాస్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది :-) :-) ..ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: :)) ధన్యవాదాలండీ..
    @మురళి: :)) ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి