శనివారం, సెప్టెంబర్ 01, 2012

నాయికలు-నతాష

నతాష అందమైన అమ్మాయి. నికోలాయ్-అన్నా దంపతుల ఏకైక కుమార్తె. వాళ్ళింట్లోనే పెరిగిన వాన్యా, నతషని ఎంతగానో ఆరాధించాడు. ఆవిషయం బాగా తెలుసు నతాషకి. కానీ, అతని ప్రేమకి ఆమె అవునని చెప్పలేదు. అలాగని కాదనీ చెప్పలేదు. పేదరికం నుంచి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ నికోలాయ్ తో స్నేహం చేస్తాడు. నికోలాయ్ నిజాయితీ, శ్రమించే తత్వం నచ్చి, ఎస్టేట్ వ్యవహారాల బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. అంతే కాదు, లోకజ్ఞానం లేని తన కొడుకు అయోషాని కూడా నికోలాయ్ ఇంట్లో ఉంచుతాడు ప్రిన్స్.

నతాష-ఆయోష ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఆయోషలో, నతాషకి నచ్చింది ఏమిటి? అని అడిగితే జవాబు చెప్పడం కష్టం ఆమెకి. అతని అమాయకత్వం, స్వచ్చత ఆకట్టుకుంటాయ్ ఆమెని. అతను మిగిలిన కుర్రాళ్ళ కన్నా భిన్నం అని తెలుసు. జ్ఞానంలో తనకన్నా ఓ మెట్టు తక్కువేననీ బాగా తెలుసు నతాష కి. అయినప్పటికీ అతనంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతటిదంటే, దానికోసం తనని ఎంతగానో ప్రేమించిన తల్లిదండ్రులని విడిచిపెట్టేయడానికి సైతం వెనకాడదు నతాష.

జరిగింది ఏమిటంటే, నతాష-ఆయోషల ప్రేమ గురించి విన్న ప్రిన్స్ భగ్గుమంటాడు. నతాష అంతస్తు తన అంతస్తుకి ఏమాత్రం తూగదు మరి. కూతుర్ని తన కొడుకు మీదకి ఉసిగొలిపాడని నికోలాయ్ మీద ఎగిరిపడతాడు. ఎస్టేట్ వ్యవహారాల వంకన నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు. ఫలితం, ఆయోష తో కూతురి ప్రేమని ఏమాత్రం ఆమోదించడు నికోలాయ్. ఆయోష కోసం ఇల్లు విడిచిపెడుతుంది నతాష. ఓ చిన్న ఇంట్లో నతాష ని ఉంచుతాడు ఆయోష. అప్పుడప్పుడూ వచ్చి చూసి వెడుతూ, పెళ్ళి చేసుకుంటానని హామీలు ఇస్తూ ఉంటాడు.

ఆయోషకి తన మీద ఉన్న ప్రేమమీద అంతులేని నమ్మకం నతాషకి. అయితే, ఆ నమ్మకానికి బీటలు పడే పరిస్థితులు వస్తాయి. నతాష విషయంలో కొడుకుని నయానో, భయానో ఒప్పించడానికి ప్రయత్నించి భంగపడ్డ ప్రిన్స్ అతనికోసం మరో గొప్పింటి సంబంధం చూస్తాడు. ఆ గొప్పింటి అమ్మాయి పేరు కాత్య, ఓ జమీందారీకి ఏకైక వారసురాలు. ఆయోషకి స్థిరమైన అభిప్రాయాలు లేవని బాగా తెలుసు నతాషకి. అతను తండ్రి చేతిలో పావుగా మారడం, కాత్యలో ప్రేమలో పడడం ఆమె దృష్టిని దాటిపోవు.

తల్లిదండ్రులని విడిచి వచ్చిన నతాష కి మిగిలింది వాన్య మాత్రమే. అతని దగ్గర ఆమెకి దాపరికాలు ఏవీ లేవు. నతాష-వాన్యాల స్నేహం గురించి బాగా తెలుసు అయోషకి. అతనికి కూడా వాన్య అంటే ఇష్టం. ఎంతగా అంటే, తను అటు నతాషా ప్రేమకీ, ఇటు కాత్య  ప్రేమకీ మధ్య నలిగిపోయినప్పుడు వాన్యని సలహా అడిగేటంత. ఓపక్క ఆయోష, కాత్యాలని దగ్గర కానిస్తూనే, ఆయోషతో పెళ్ళి జరిపిస్తానని నతాష కి మాట ఇస్తాడు ప్రిన్స్, అది కూడా తన కొడుకు, వాన్యాల సమక్షంలో.

ప్రిన్స్ ఎలాంటివాడో నతాషకి బాగా తెలుసు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఆమె మర్చిపోయేది కాదు. అలాంటి అన్యాయాన్నే తనకీ తలపెడుతున్నాడని సులభంగానే అర్ధం చేసుకుంది. మరోపక్క ఆయోష ఊగిసలాట కూడా తెలుసు నతాషకి. పరిస్థితులు తనకి పూర్తిగా ఎదురు తిరిగినా, ఆమె ఆయోష పక్షాన్నే నిలబడుతుంది. ఆయోష విషయమై, కాత్య తనని కలుసుకున్నప్పుడు సైతం ఎంతో స్థిత ప్రజ్ఞత చూపుతుంది నతాష.

చిన్న వయసులోనే జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తిన్న ఆ అమ్మాయి, వ్యతిరేక పరిస్థితులని ఎదుర్కొన్న విధానం, తన భవిష్యత్తుని నిర్ణయించుకున్న తీరు ఆమె మనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. సమస్యల నుంచి ఎన్నడూ పారిపోలేదు నతాష. అలాగే, ఆయోష మీద ఆమె ప్రేమలోనూ ఎలాంటి మార్పూ లేదు. అతని స్వచ్చత మీద ఎలాంటి సందేహమూ లేదామెకి. ఈ లక్షణాలే నతాషని ప్రత్యేకంగా నిలుపుతాయి. రష్యన్ రచయిత దస్తయే వస్కీ నవల 'తిరస్కృతులు' లో ఒక నాయిక నతాష. ఈమెతో పాటుగా, మరోనాయిక నీలీ సైతం పాఠకులని వెంటాడుతుంది, పుస్తకం పక్కన పెట్టాక చాలా రోజులపాటు.

4 కామెంట్‌లు:

  1. Looks like it is the translation to "Humiliated and Insulted". A beautiful novel.
    అనువాదకులు ఎవరు?

    రిప్లయితొలగించండి
  2. మంచికథను పరిచయం చేసారు. నతాషా పేరు నాకు భలే నచ్చింది!

    రిప్లయితొలగించండి
  3. ఇది చదివినట్లే గుర్తు. తెలుగులోనా, ఇంగిలీషులోనా గుర్తులేదు. లేక ఎక్కడన్నా రివ్యూ చదివానా???

    రిప్లయితొలగించండి
  4. @పద్మవల్లి: అదే నవలండీ.. సహవాసి (జంపాల ఉమామహేశ్వర రావు) అనువదించారు తెలుగులోకి 'తిరస్కృతులు' పేరుతో.. లంకె ఇచ్చాను చూడండి, పోస్టులో.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @సునీత: ఈనవల ('తిరస్కృతులు') గురించి నేనో టపా రాశానండీ.. ఇంగ్లీష్ నవల 'ది ఇన్సల్టేడ్ అండ్ ఇంజర్డ్' చదివి ఉంటారు బహుశా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి