ఆదివారం, మార్చి 31, 2013

గోదావరి గాథలు

"ఈ కథల్లోది వేదంలా ప్రవహించే గోదావరి కాదు. ఊళ్లూ నాళ్ళూ ఏకం చేసి, పంట పొలాలను ఇసుక మేటలు గా మార్చి, ఎన్నెన్నో నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుని శంకరాభరణ రాగాలాప కంఠియై ఉరకలేస్తూ, ఉప్పొంగి పోతూ, తెప్పున ఎగిసి పడుతూ నిర్దాక్షిణ్యంగా సాగిపోయే గోదావరి ఈ కథల్లో కానవస్తుంది," అన్నారు విఖ్యాత కథకుడు మధురాంతకం రాజారాం, ఫణికుమార్ రాసిన 'గోదావరి గాథలు' కి రాసిన ముందు మాటలో. నిజమే, ఎందుకంటే ఈ గాథల్లో గోదారి పాపికొండల నడుమ ప్రవహించే అందమైన నది కాదు, దారీ డొంకా లేని, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ రికార్డుల్లో ఊళ్లుగానే నమోదు కాని అటవీ ప్రాంతాలగుండా సాగిపోయే ప్రవాహం. రెవెన్యూ శాఖలో ఉన్నతోద్యోగిగా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఫణికుమార్, పాతికేళ్ళ క్రితం వెలువరించిన ఈ పదిహేను గాథల సంకలనం గోదావరిలోని కొత్త కోణాలని ఆవిష్కరిస్తుంది.

రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు మొదటి వరసలో ఉంటాయి.పక్కనే నదీ ప్రవాహం ఉన్నా, కరువు బారిన పడుతూ ఉండడం ఈ ప్రాంతాలకి ఒక శాపం. ఇక ఏటా వచ్చే వరదలు తెచ్చే భీభత్సం అంతా ఇంతా కాదు. గోదావరి వరదలకి 'ప్రజా జీవితం స్థంభించి పోవడం' అంటే ఏమిటో చెబుతుంది సంకలనంలో మొదటి గాథ 'వరదలలో నాగారం.' వరద ప్రాంతాల్లో ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో రెవిన్యూ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలని వివరించే గాథ ఇది. అయితే, ఇదే వరదల నేపధ్యంలో రాసిన రెండో గాథ 'నువ్ మంచిగుండు మామా...' మనసుని మెలి పెట్టేస్తుంది. పుస్తకం పక్కన పెట్టాక కూడా వెంటాడే కొన్ని గాథల్లో ఇదీ ఒకటి.

రాజ్యాలు పోయినా రాజులే రాజులే. రాజసం తగ్గడాన్ని రాజులే కాదు, ప్రజలూ ఒప్పుకోరు. గోండులలో ఈ పట్టింపు మరీ ఎక్కువ. అందుకే అంబలి కాచుకోడానికి జొన్నలు లేకపోయినా, రాజా అత్రాం భగవంత రావు మరో పని చేసి పొట్ట పోసుకోడానికి ఒప్పుకోలేదు. దారుశిల్పాలు చెక్కడాన్ని అభిరుచితో నేర్చుకున్నారు ఆయన. దానినే ఆయనకీ ఉపాధిగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసిన ఓ ఉద్యోగికి ఎదురైన అనుభవమే 'రాజా సాబ్' గాథ. ఊహించని ముగింపు ఇచ్చి, రాజా భగవంత రావుని పాఠకులు మర్చిపోకుండా చేసేశారు రచయిత. ఇలాంటిదే మరో గాథ 'గోండ్వానా భీష్ముడు.' తన తెగని అభివృద్ధి చేయడానికి ఎన్నెన్నో పథకాలు రచించి, జిల్లా ఉన్నతాధికారులకే సలహాలిచ్చిన గోండు రాజ కుటుంబ పెద్ద అత్రాం భీమ్ రావ్ పటేల్ ని గురించిన స్కెచ్ ఇది.


కొత్తగా వచ్చిన వాళ్ళని అనుమానంగా చూడడం మానవ సహజం. ప్రకృతికి దగ్గరగా మసిలే గిరిజనుల్లో ఈ లక్షణం కొంచం అధికం. మరీ ముఖ్యంగా, నాగరీకులని ఓ పట్టాన నమ్మరు వాళ్ళు. అలాంటి వారి మధ్య విధులు నిర్వహించడం ఉద్యోగులకి కత్తిమీద సాము. 'శాస్త్రి గా'రి లాంటి అధికారులు అందుకు మినహాయింపు. అంతేకాదు, ఈ దేశం కాకపోయినా, గిరిజనులని సొంత మనుషులని చేసేసుకున్న హేమండార్ఫ్ దంపతులూ అంతే. ఎవరికో తప్ప వాడని గౌరవ వాచకం 'పేన్' (దేవుడు) ని వీరి విషయంలో గిరిజనులు సునాయాసంగా వాడేశారు అంటారు ఫణి కుమార్. అంతేకాదు, ఎలిజబెత్ హేమండార్ఫ్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలని పరిచయం చేశారు కూడా.

గిరిజనేతరుల నుంచి గిరిజనులని రక్షించడం కోసం చట్టాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో గిరిజనేతరులు చేసింది తప్పు కాకపోయినా, చట్టం దృష్టిలో అది నేరంగా పరిణమించే పరిస్థితులు ఉంటాయని చెబుతూ, కర్తార్ సింగ్ తో తన అనుభవాన్ని ఉదహరించారు రచయిత, 'కృష్ణాష్టమి' గాథలో. గిరిజనేతరుడైన సింగ్ కి వ్యతిరేకగా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితిని చెబుతూ, "నేను కృష్ణాష్టమి రోజున గోకులానికి వెళ్ళిన కంసుడిని అనిపించింది. నా చర్యల వల్ల ఎప్పుడు ఏ మల్లెలు నవ్వాయి గనుక?" అన్న ప్రశ్నని సంధిస్తారు. కీలకమైన పదవుల్లో ఉన్నవారికి మెదడుతో పాటు, మనసుకూడా పనిచేసే సందర్భాలలో ఎదురయ్యే సందిగ్ధత ఇది.

మన్యంలో సౌకర్యాల లేమి, ప్రజల అమాయకత్వంతో పాటు, తీవ్రవాదం పెచ్చరిల్లడానికి అవకాశాలు పెరుగుతూ ఉండడాన్ని కూడా ప్రస్తావించారు ఈ గాథల్లో. 'నేను రాయని గాథలు' పేరిట రచయిత రాసిన చివరి మాటలో "నేను రాసిన గాథలలో అసత్యమైన విషయం కానీ, వర్ణన కానీ లేదు. అయితే నేనెరిగిన సత్యమంతా చెప్పలేదు," అన్న వాక్యం చూసినప్పుడు, సీనియర్ అయ్యేయెస్ అధికారి పీవీఆర్కె ప్రసాద్ రాసిన 'అసలేం జరిగిందంటే...' గుర్తొచ్చింది. "జీవించి ఉన్న వ్యక్తుల సెంటిమెంట్లు గౌరవించాలి అన్నది ఇలా రాయలేకపోడానికి ఒక కారణం," అంటారు ఫణికుమార్. ఫోటోగ్రఫీ లో అభినివేశం ఉన్న ఈ రచయిత, తను తీసిన ఒక ఫోటోని పుస్తకానికి కవర్ పేజీ గా అలంకరించారు. ఆ ఫోటో వెనుక ఉన్న 'రాకి తల్లి' గాథ కదిలిస్తుంది. అలకనంద ప్రచురణల ద్వారా మూడో ముద్రణ పొందిన ఈ 92 పేజీల పుస్తకం వెల రూ.75. ఆపకుండా చదివించే ఊరుకునే రచన కాదు, ఆలోచనల్లో పడేసే పుస్తకం ఇది.

శనివారం, మార్చి 30, 2013

సూర్యుడు చూస్తున్నాడు...

'ఎండలు మండిపోతున్నాయి...' ప్రతి వేసవిలోనూ ప్రతి ఒక్కరూ అనుకునే మాట ఇది. అంతేనా? ఏడేళ్ళ పసి వాడు మొదలు, ఎనభై ఏళ్ళ వృద్ధు వరకూ 'ఇంతలేసి ఎండలు ఎప్పుడూ చూడలేదు' అనడం కూడా ప్రతి వేసవిలోనూ వినిపిస్తూ ఉంటుంది. 'నక్క పుట్టి నాలుగు ఆదివారాలు అవ్వలేదు కానీ, ఇంతటి గాలి వాన ఎప్పుడూ చూడలేదు అందిట' అని ఓ సామెత. గాలివాన మాట ఏమోగానీ, ఎండలకి మాత్రం ఇది తప్పకుండా వర్తించేస్తుంది. ఆబాల గోపాలమూ 'హమ్మో ఎంత ఎండా? ఎప్పుడూ చూడనే లేదమ్మా' అన్న డయిలాగుని నాలుక చివర ఉంచుకునే కాలం వచ్చేసింది. ఎప్పటి లాగే ఈసారి కూడా ఎండలు గాట్టిగానే ఉన్నాయి మరి.

మనింట్లో కరెంట్ పోయినప్పుడు, పక్క వాళ్ళ ఇంట్లో దీపాలు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే మన హృదయం వెయ్యి ముక్కలు అయితీరుతుంది. అలాగే మన ఊళ్ళో మాత్రమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసినా అదే బాధ. ఇన్నాళ్ళూ లోపలి పేజీల్లో ఉండే 'ఉష్ణోగ్రత'లు ఈ నాలుగు నెలలో న్యూస్ పేపర్ల మొదటి పేజీలోకి వచ్చేస్తాయి కాబట్టి, ఉదయాన్నే మనకన్నా వేడిగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి, చల్లగా ఉన్నవాళ్ళ మీద అసూయ పడొచ్చు. ఎటూ కరెంట్ గురించి మాట వచ్చింది కనుక, విద్యుత్ సరఫరా గురించి ఏమన్నా మాట్లాడుదామా అంటే మాట్లాడడానికి ఏమీ లేదక్కడ. ఒకప్పుడు కరెంట్ అనేది ఉండేదిట అని చెప్పుకునే రోజుని చూసేస్తానేమో అన్న అనుమానం రోజు రోజుకీ పెరిగిపోతోంది మరి.

ఎండాకాలంలో తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ లాంటివి తాగుతూ ఉండాలనీ, వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ దూరదర్శన్ వాళ్ళు వివరంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడూ చెబుతూనే ఉండి ఉంటారు కానీ, కొత్త న్యూస్ చానల్ ఏదో మొదలైన సంరంభంలో కేబుల్ అబ్బాయి దూరదర్శన్ ని తాత్కాలికంగా పక్కకి తప్పించినట్టు ఉన్నాడు.. న్యూస్ ఛానళ్ళు కూడా వార్తలు, లైవుల మధ్యలో అప్పుడప్పుడూ ఎండల జాగ్రత్తలు చెబుతున్నాయి కానీ, అవి కూడా మిగిలిన కమర్షియల్స్ లో కలిసిపోతున్నాయి. రోజంతా సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు చూపించి, మధ్యలో ఎప్పుడో పాప పరిహారం కోసమా అన్నట్టు కొబ్బరి నీళ్ళు తాగండి అని ఓ ముక్క చెప్పడం చూసినప్పుడల్లా నవ్వొచ్చేస్తూ ఉంటుంది.


వార్తలంటే గుర్తొచ్చింది... ఎండలు ముదురుతున్న సందర్భంగా పాదయాత్రల పధికులు నడకలకి ఏమన్నా కామా పెడతారా అన్న ఆలోచన పూర్తిగా ఓ కొలిక్కి రాకముందే, ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి.. ఇంత నడకా కేవలం రికార్డుల కోసం కాదు కదా... వాళ్ళలా నడవాల్సిందే.. ఎండలకి ఎండిపోకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారని భోగట్టా, టీవీ వాళ్ళు చెప్పిందే ఇదికూడా. పిల్లలకి పరిక్షల హడావిడి ముమ్మరంగా ఉంది. కరెంట్ లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తుకి మాంచి భరోసా కనిపిస్తోంది. అనుమానం ఉంటే గొప్ప గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు తిరగేయండి. వాళ్ళల్లో మెజారిటీ లాంతర్ల దగ్గరా, వీధి దీపాల దగ్గరా చదువుకున్న వాళ్ళే.

ఈ పరిక్షలు కాస్తా అయిపోయాయి అంటే, నెలన్నా తిరక్క ముందే టీవీల్లో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళ కొత్త డబ్బింగ్ సినిమా విడుదలవుతున్నంత హడావిడి మొదలైపోతుంది. అంకెలంటే విరక్తి పుట్టేలా ర్యాంకులు అరిచేస్తూ ఉంటారు, కొన్నాళ్ళ పాటు. పరిక్షల పుణ్యమా అని కొత్త సినిమాలేవీ పెద్దగా విడుదల అవ్వడం లేదు. దొరికిందే చాన్స్ అనుకుని ఎప్పటినుంచో ల్యాబుల్లో నిరీక్షిస్తున్న చిన్న సినిమాలు ఒక్క ఉదుటన థియేటర్ల లోకి లంఘించాయి. ఒకటీ అరా మినహా నిలబడేవి ఏవీ లేవనే సమాచారం. టిక్కట్టు కొన్న అందరికీ లాటరీ తగలదు కదా. భారీ సినిమాలు వచ్చి ఏం చేస్తాయో చూడాలి. థియేటర్ కి వెళ్లి చూసే సినిమా వస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నా, చాలా రోజులుగా.

ఆవకాయ తదాదిగా ఊరగాయలు పెట్టుకునే హడావిడి ఇంకా మొదలవ్వ లేదు. ఈసారి మామిడికాయ రావడం కొంచం ఆలస్యం కావొచ్చని మా పక్కవాళ్ళు చెప్పారు. మల్లెపూలు అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి.. మే నెలలో చాలా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయిట. మల్లెల మాసంలో ఒకటి కాబోతున్న జంటలకి ముందస్తు అభినందనలు. చల్లనైన ప్రదేశాలకి హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్టాయనా, పుణ్యం మాట ఎలా ఉన్నా పురుషార్ధానికి లోటు ఉండదు. మండే ఎండలని తట్టుకోడానికి మానసికంగా సిద్ధ పడిపోతే, ఆ తర్వాత ఇక జల్లులే జల్లులు.. నాలుగు జల్లులు చాలు కదూ ఈ ఎండల బాధ మర్చిపోడానికి... తలచుకుంటేనే యెంత హాయిగా ఉందో... ఎందుకూ ఆలస్యం.. మీరూ తల్చుకోండి..

మంగళవారం, మార్చి 19, 2013

నాయికలు-నరేంద్ర ప్రభ

ఆమె అధ్బుతమైన సౌందర్య రాశి కాదు. నిజానికి అందం కన్నా, ఆకర్షణే ఎక్కువ ఆమెలో. అదిగో, ఆ ఆకర్షణే సాక్షాత్తూ కాశ్మీర చక్రవర్తినే ఆమెతో పీకలోతు ప్రేమలో మునిగిపోయేలా చేసింది. అంతటి గొప్పవాడు ప్రేమిస్తున్నా, ఆమె ఆ ప్రేమని స్వీకరించే స్థితిలో లేదు. అతనిమీద తనకి ఉన్న ఇష్టాన్ని ప్రకటించేందుకు బదులుగా, దానిని ఆగ్రహంగా మార్చేసుకుంది. ఎందుకంటే, ఆమె అందమైన భవిష్యత్తుని కలలుకనే పదారేళ్ళ కన్నెపిల్ల కాదు. బాధ్యతాయుతమైన గృహిణి. చక్రవర్తికే అప్పు ఇవ్వగల ఆర్ధిక స్తోమతు ఉన్న వజ్రాల వర్తకుడు నోణక శ్రేష్ఠి భార్య. పేరు నరేంద్ర ప్రభ.

కాశ్మీర  ఓ మామూలు మధ్యతరగతి ఇంట పుట్టింది నరేంద్ర ప్రభ. కళల మీద ఉన్న మక్కువ చేత చిన్నప్పుడే వీణ, నృత్యం అభ్యసించింది. యుక్త వయసు వచ్చిన ప్రభని, ఆర్ధికంగా ఎన్నో మెట్లు పైనున్న నోణక శ్రేష్ఠి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. చెల్లెలు ఓ గొప్పవాడికి భార్య అయినందుకు ఎంతో సంతోషించారు ఆమె అన్నలు. అయితే, ఆర్ధిక వ్యత్యాసాల ప్రభావం పుట్టింటి తో ఆమె అనుబంధం మీద బాగానే ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా, తండ్రి మరణం తర్వాత ఆ దూరం బాగా అర్ధమయింది నరేంద్ర ప్రభకి.

అన్నీ ఉన్నా, సంతానం లేదనే లోటు పీడించడం మొదలు పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని బాధ చూడలేని నరేంద్ర ప్రభ తన దూరపు బంధువు కమలాలయని ఇచ్చి మరీ తన భర్తకి రెండో వివాహం జరిపిస్తుంది. కొంతకాలం ఏ పొరపొచ్చాలు లేకుండానే ఉంటారు ముగ్గురూ. ఉన్నట్టుండి, చక్రవర్తి ప్రతాపాదిత్యుడు నోణక శ్రేష్ఠి దగ్గర నాణ్యమైన వజ్రాలు కొనాలని సంకల్పించి, తనకు తానుగా బయలుదేరి శ్రేష్ఠి ఇంటికి రావడంతో ప్రభకి కష్టాలు మొదలవుతాయి. చక్రవర్తి గౌరవార్ధం వీణ కచేరీ చేసిన ప్రభని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు చక్రవర్తి.

తన భవంతికి చక్రవర్తి రాకపోకలు పెరగడం ఎంతగానో సంతోష పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని వ్యాపారం ఊహించనంత పెరుగుతుంది. ఉన్నట్టుండి చక్రవర్తి రాకపోకలు ఆగిపోతాయి. ప్రధానమంత్రి ద్వారా శ్రేష్ఠి తెలుసుకున్నది ఏమంటే, చక్రవర్తి ప్రభని ఇష్టపడుతున్నాడని, అయితే ధర్మం తప్పని వాడు అవ్వడం వల్ల, తన ప్రేమని ప్రకటించకుండా ఉండడం కోసం, ఆమెకి దూరంగా మసలుతున్నాడనీను. చక్రవర్తి ధోరణి వల్ల తన వ్యాపారానికి ఎంత నష్టమో ఇట్టే అంచనా వేసుకున్న శ్రేష్ఠి, కాశ్మీర దేశంలో అప్పటికి అమలులో ఉన్న ధర్మం ప్రకారం ప్రభకి తాను విడాకులు ఇచ్చి ఆమెని అంతఃపురానికి సమర్పించడానికి సిద్ధ పడతాడు.

భర్త ప్రతిపాదనకి ససేమిరా అంటుంది నరేంద్ర ప్రభ. అటు శ్రేష్ఠి, ఇటు కమలాలయ ఆమెని దూరం పెడతారు. భవంతిలో పనివాళ్ళు సైతం ఆమె మాట వినని పరిస్థితి. భర్తా, సవతీ కలిసి తనకి పొగ పెడుతున్నారని గ్రహించుకున్న ప్రభ, పుట్టింటికి ప్రయాణం అవుతుంది. అక్కడా ఆదరం అంతంత మాత్రమే కావడంతో వారం రోజులన్నా గడవక మునుపే తిరుగు ప్రయాణం అవుతుంది. భర్త చాటున కాపురం చేసుకుంటున్న తనను ఈ స్థితికి తెచ్చిన చక్రవర్తి మీద పట్టరాని ఆగ్రహం కలుగుతుంది ఆమెకి. అతనిపై అంతకు మునుపు కలిగిన అభిమానం ఆవిరై పోతుంది.

అంతఃపురానికి వెళ్ళడానికి ఏ మాత్రమూ ఇష్టపడని ప్రభకి ఇంట్లో నిలబడలేని పరిస్థితులు కల్పిస్తారు శ్రేష్ఠి, కమలాలయ. బాగా ఆలోచించుకున్న నరేంద్ర ప్రభ దేవదాసిగా మారిపోడానికి సిద్ధ పడుతుంది. తనని అంతఃపురానికి కాక ఆలయానికి అర్పించమని కోరుతుంది భర్తని. శ్రేష్ఠి అందుకు ఇష్టపడక పోవడంతో, తనని ఆలయానికి అప్పగించని పక్షంలో, స్వచ్చందంగా వేశ్యావాటిక లో చేరిపోతానని బెదిరిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో, అంగరంగ వైభవంగా ఓ వేడుక జరిపి, ఆమెని దేవదాసిని చేస్తాడు శ్రేష్ఠి. స్వతంత్ర జీవితం మొదలు పెట్టిన ప్రభ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది పిలకా గణపతి శాస్త్రి రాసిన 'కాశ్మీర పట్టమహిషి' నవలలో తెలుసుకోవల్సిందే..

సోమవారం, మార్చి 11, 2013

అనురాగ ప్రస్తారం

హరిప్రసాద్, కామాక్షి ల పెళ్లై ఏడేళ్ళు గడిచింది. కామాక్షి అందగత్తె. హరిప్రసాద్ ప్లీడర్, గాయకుడు కూడా. ఇద్దరి జాతకాల్లోనూ సంతాన రేఖ బలంగా ఉన్నా, ఇంకా పిల్లలు కలగలేదు. అన్నీ బాగానే ఉన్నా ఏదో స్థబ్దత.కామాక్షి కోపం, అలకా, అనుమానం ఇవన్నీ హరిప్రసాద్ కి అలవాటై పోయాయి. అటు శాస్త్రీయ సంగీతం లోనూ, ఇటు లలిత సంగీతంలోనూ ప్రావీణ్యం ఉన్న హరిప్రసాద్ పాట అందరినీ మెప్పిస్తుంది, ఒక్క కామాక్షిని తప్ప. మొదట్లో క్రమం తప్పకుండా అతని కచేరీలకి హాజరైన కామాక్షి, క్రమంగా వెళ్ళడం మానుకుంది.

హరిప్రసాద్ లో అసంతృప్తి పెరుగుతున్న తరుణంలోనే అతని జీవితంలో శోభాసుందరి ప్రవేశించింది. కాకినాడ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన శోభాసుందరి ఆ ఊరి ఆస్పత్రికి వైద్యురాలిగా వస్తుంది. ఆమెని ముఖాముఖిని కలవడానికి మునుపే, ఇద్దరు ముగ్గురినుంచి శోభని గురించి వింటాడు హరిప్రసాద్. అందరి మాటల సారమూ ఒక్కటే. శోభ అచ్చుగుద్దినట్టు కామాక్షి లాగే ఉంటుందని. తన భార్యలాగే ఉండే మరో స్త్రీని చూడాలన్న కుతూహలం మొదలవుతుంది అతనిలో.

అటు శోభాసుందరి లోనూ అదే కుతూహలం. అచ్చం తనలాగా ఉండే ఆమెనీ, ఆమె భర్తనీ చూడాలని. ఇద్దరినీ కలిసి చూడడం వీలు పడదు ఆమెకి. మొదట కామాక్షిని ఆమె ఇంట కలుస్తుంది. ఆ తర్వాత హరిప్రసాద్ కచేరీకి వెళ్లి, అతని పాట విని, అతన్ని పరిచయం చేసుకుంటుంది. కచేరీలో ఉన్న హరిప్రసాద్, దూరంగా శ్రోతల్లో ఉన్న శోభని చూసి కామాక్షిగా పొరబడతాడు. దగ్గరగా వచ్చినప్పుడు, ఆమె కామాక్షి కాదని గ్రహిస్తాడు. అప్పటికే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి కుతూహలం ఉండడం వల్ల చాలా తొందరలోనే స్నేహితులు అవుతారు హరిప్రసాద్, శోభాసుందరి. శోభని చూసిన కళ్ళతో కామాక్షిని చూసినప్పుడు ఆమె ప్రత్యేకంగా కనిపించడం మొదలవుతుంది హరి ప్రసాద్ కి.

అంతేకాదు, శోభ కన్నా కామాక్షి అందగత్తె అన్న సత్యాన్ని గ్రహించి, ఆ ఇద్దరు స్త్రీల దగ్గరా అంగీకరిస్తాడు కూడా. శోభ మీద ప్రేమని పెంచుకుని, దానిని కామాక్షి యెడల ప్రదర్శించే చిత్రమైన స్థితికి వెడతాడు హరిప్రసాద్. శోభాసుందరి సైతం హరిప్రసాద్ మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. కానీ తన పరిమితులు ఏమిటో బాగా తెలుసు ఆమెకి. ఉన్నట్టుండి ఒకరోజు శోభని 'ప్రేమిస్తున్నా' అంటాడు హరిప్రసాద్.అయితే, ఆమె నుంచి ఏమీ కోరడం లేదని కూడా చెబుతాడు.

రెండు నెలలు గడిచాక ఒక రోజున, హరిప్రసాద్ వచ్చేసరికి హడావిడిగా ఉంటుంది ఇల్లు. కామాక్షిని పరీక్ష చేసిన శోభాసుందరి ఆమె గర్భవతి అని చెబుతుంది అతనికి. శోభని ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్ళిన హరిప్రసాద్ అడుగుతాడు ఆమెని, "మీరు నా జీవితంలో ప్రవేశించక పొతే అది జరిగేదే కాదంటే నమ్ముతారా?" అని. తన మనసు శోభ దగ్గరా, శరీరం కామాక్షి దగ్గరా ఉన్నాయని చెబుతాడు. అంతేకాదు, "మీకు నేనంటే నమ్మకం లేదా? ఏం కావాలి?" అని అడుగుతాడు కూడా.

శోభాసుందరి యేమని జవాబు చెప్పింది? వాళ్ళిద్దరి కథా చివరికి ఏమయ్యింది? నేను చెప్పడం కన్నా, బుచ్చిబాబు రాసిన 'అనురాగ ప్రస్తారం' కథ చదివి తెలుసుకోడమే బాగుంటుంది. తన రచనల్లో మానసిక విశ్లేషణలకి పెద్దపీట వేసే బుచ్చిబాబు, ఈ కథలోనూ అదే చేశారు. కథోచితమైన, పాత్రోచితమైన వర్ణనలు తళుక్కున మెరుస్తాయి అక్కడక్కడా. ఆరంభం కథలా కాక, వ్యాస ధోరణిలో ఉన్నా, అసలు కథ మొదలు కాగానే విడిచిపెట్టకుండా చదివించే కథనం. విశాలాంధ్ర ప్రచురించిన 'బుచ్చిబాబు కథలు' మొదటి సంపుటంలో చదవొచ్చీ కథని.

శుక్రవారం, మార్చి 08, 2013

పెదవికి ఇది తప్పదా...

ఇప్పటినుంచి సరిగ్గా ఏడాది గడిచేసరికి, భారతదేశంలో మేకప్ సామగ్రి అమ్మకాల మొత్తం విలువ ఇరవైవేల కోట్ల రూపాయల పైమాటే. వీటిలో సింహభాగం పెదవుల రంగు, గోళ్ళ రంగుల అమ్మకాల ద్వారా రాబోతోంది. అసోసియేటెడ్ చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచాం) నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశం లో కాస్మటిక్స్ మార్కెట్ ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు దాటేసింది. అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్ గా కాస్మటిక్స్ ని గుర్తించింది అసోచాం.

ఉన్నట్టుండి కాస్మటిక్స్ మార్కెట్ ఇంతగా ఎలా ఊపందుకుంది? చుట్టూ వస్తున్న మార్పులని గమనించే వాళ్లకి ఇదేమంత అశ్చర్య పరిచే పరిణామం కాదు. ముఖ్యమైన కారణం ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడం. కాస్మటిక్స్ అమ్మకాల్ని ప్రభావితం చేస్తున్న మరో అంశం మీడియా. టెలివిజన్ చానెళ్ళ ప్రసారాలు పల్లెటూళ్ళ కి కూడా విస్తరించడం మొదలయ్యాక, చిన్నపాటి పట్టణాల్లో సైతం బ్రాండెడ్ కాస్మటిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

ఉద్యోగాలు చేసే మహిళలు మేకప్ చేసుకోక తప్పదా? రిసెప్షనిస్ట్, ఎయిర్ హోస్టెస్ లాంటి కొన్ని ఉద్యోగాలకైతే ఇది తప్పనిసరి విషయమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆయా ఉద్యోగినులు విధి నిర్వహణలో ఉన్నంత సేపూ మేకప్ లో ఉండాల్సిందే. మిగిలిన చాలా ఉద్యోగాల విషయంలో ఇది కేవలం ఐచ్చికం. మూడున్నర దశాబ్దాల క్రితమే "నేను గాడిద బరువు మోస్తున్నా.. అందుకే ఈ బూడిద పూసుకుంటున్నా..ఈ బట్టలు మోస్తున్నా.." అంటూ తన నాయిక చేత బాలచందర్ పలికించిన డైలాగు గుర్తొస్తోంది.


గడిచిన పదేళ్ళ లోనూ భారతదేశంలో అడుగుపెట్టిన మల్టీనేషనల్ కాస్మటిక్ కంపెనీల సంఖ్య తక్కువేమీ కాదు. పది పన్నెండేళ్ళ క్రితం విశ్వ సుందరి, ప్రపంచ సుందరి కిరీటాలు భారతీయ వనితలకే దక్కడం వెనుక, ఈ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీ పాత్ర తక్కువదేమీ కాదన్న వాదన ఉంది. అలాగే, పెరుగుతున్న కాస్మటిక్స్ అమ్మకాలకి ప్రపంచీకరణకీ ఉన్న సంబంధాలపైనా లోతైన చర్చలే జరిగాయి అప్పట్లో. మొత్తానికి, కాస్మటిక్స్ మార్కెట్ విస్తరిస్తుందంటూ పదేళ్ళ క్రితం చేసిన ఊహాగానాలు ఇప్పుడు వాస్తవాలై కనిపిస్తున్నాయి.

కాస్మటిక్స్ అమ్మకాల పెరుగుదలని, భారతీయ సమాజం సంప్రదాయ ధోరణి నుంచి ఆధునికత వైపు వడివడిగా అడుగులు వేస్తోంది అన్న దృష్టి కోణంలో చూడాలా? కొన్ని దశాభ్దాల క్రితం వరకూ మహిళలు ఫేస్ పౌడర్ రాసుకోడానికే వెనుకాడిన పరిస్థితులు ఉన్నాయిక్కడ. మేకప్ అంటే కేవలం నాటకాల వాళ్ళు, సినిమా వాళ్లకి సంబంధించిన విషయం. బ్యూటీ పార్లర్లు వీధివీధికీ విస్తరించడం అన్నది ఇటీవలి పరిణామంగా గుర్తించాలి మనం. ఈ నేపధ్యంలో, వచ్చిపడుతున్న బ్రాండ్లు, పోటాపోటీ ప్రమోషన్లు, ఏ కొత్త బ్రాండ్ కనిపించినా ఆదరించే వినియోగదారులు... ఇవన్నీ తరచి చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించేవే.

సౌందర్యం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమేనా? ఒక ఫేషియల్, మరికొన్ని కాస్మటిక్స్ తో సౌందర్యాన్ని 'సొంతం' చేసేసుకోవచ్చా? సౌందర్య సాధనాలు కేవలం ఉన్న సౌందర్యాన్ని మెరుగులు దిద్దగలవే తప్ప, లేని సౌందర్యాన్ని రప్పించలేవు అన్నది నిజం. అసలంటూ సౌందర్యం ఉన్నప్పుడు మెరుగులు అవసరమా? అన్న ప్రశ్నకి, 'బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం' అన్న సమాధానం సిద్ధంగా ఉంటుంది. మేకప్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమే, కానీ ఇది చిన్న విషయం కాదనీ, అంతర్జాతీయ సంస్థలు మార్కెట్ కోసం పోటీ పడేంత పెద్ద విషయం అనీ గుర్తించాలి.

సౌందర్య సాధనాలని శ్రుతిమించి వాడడం, ఎంపికలో అజాగ్రత్తల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. ఎలర్జీ మొదలు, స్కిన్ కేన్సర్ వరకూ అనేక ఆరోగ్య సమస్యలకి కాస్మటిక్స్ కారణం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగించేవే. అయితే ఇవేవీ కాస్మటిక్స్ అమ్మకాల మీద ప్రభావం చూపించడం లేదనే చెప్పాలి. నేటి మహిళలు బ్రహ్మరధం పడుతున్న ఈ సౌందర్య సాధనాల విషయంలో రేపటి మహిళల ధోరణి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

బుధవారం, మార్చి 06, 2013

రాజీవలోచన

నలుపు తెలుపు సినిమా తెరమీద కదులుతూ ఉంటుంది.. ఉన్నట్టుండి ఆమె ప్రత్యక్షమవుతుంది. మన కళ్ళు మన మాట వినవు. మిగిలిన దృశ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం ఆమెని మాత్రమే చూస్తాం అంటాయి. అలాగని ఆమెని అద్భుతమైన సౌందర్య రాసి అనలేం.. ఎందుకంటే, ఆమెని మించిన అందగత్తెలు తెలుగు తెరమీదే ఎందరో ఉన్నారు. అయితే, ఆ అందగత్తెలని మించినది ఏదో ఆమె దగ్గర ఉంది. అది ఆకర్షణ. ఆకర్షించే గుణం పుష్కలంగా ఉన్న ఆ తార పేరు రాజ సులోచన. అసలు పేరు రాజీవలోచన. ఆ కళ్ళని చూసే పెట్టి ఉంటారాపేరు.

డెబ్భై ఎనిమిదేళ్ళ రాజ సులోచన ఇక లేరు అన్న వార్త తెలిసినప్పటినుంచీ, ఏ పని చేస్తున్నా ఆమె నటించిన సినిమాలు, మరీముఖ్యంగా వాటిలో పాటలు గుర్తొస్తూనే ఉన్నాయి నిన్నటి నుంచీ. పదేపదే గుర్తొస్తున్న పాటయితే 'రాజమకుటం' సినిమాలో లీల పాడిన 'సడిసేయకో గాలి...' తెలుగుభాషలో ఉన్న అత్యంత అందమైన మాటలని ఏర్చి కూర్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆ పాటని రాస్తే, అంతే అందంగా ఆ పాటని పాడారు పి.లీల. తెరమీద సాత్వికాభినయం రాజసులోచనది.

అంతటి ఎన్టీ రామారావూ చొక్కా లేకుండా ఆమె ఒడిలో పడుకున్నా, మహిళా ప్రేక్షకుల చూపుని సైతం తనవైపు తిప్పుకునే నటనని ప్రదర్శించారు రాజసులోచన. 'చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే...' అన్నప్పుడు అనునయాన్నీ, ఆదేశించడాన్నీ ఏకకాలంలో అభినయించారు ఆమె, అది కూడా కేవలం కనుపాపల కదలికలతో. అలాగే 'నిదుర చెదిరిందంటే నేనూరుకోనే..' 'విరుల వీవన పూని విసిరిపోరాదే...' అన్నప్పుడు ప్రత్యేకంగా చూడాలి ఆమెని.


స్త్రీత్వం కన్నా, పురుషత్వం పాలు కొంచం ఎక్కువగా అనిపించే మూర్తి రాజసులోచనది. అందుకే కాబోలు, అంజలీ పిక్చర్స్ వారి 'సువర్ణ సుందరి' సినిమాలో పాత్ర ఆమెకి అతికినట్టు సరిపోయింది. హీరో నాగేశ్వర రావు ఓ శాపం కారణంగా స్త్రీ గా మారిపోవాలి, కథ ప్రకారం. ఆ స్త్రీ వేషం రాజసులోచనది. ఆ సినిమాలో అంజలీదేవి తర్వాత ఆకట్టుకునే మరో నటి రాజసులోచనే. సినిమా భాషలో చెప్పాలంటే ఆ పాత్ర 'టైలర్ మేడ్' అయ్యింది ఆమెకి. నృత్యంలో ఆమెకి ఉన్న అభినివేశాన్ని ప్రేక్షకులకి చూపే అవకాశమూ దొరికింది.

'రావె రాణీ... రాధా రావే... రాధ నీవే... కృష్ణుడ నేనే... రమ్యమైన శారద రాత్రి... రాసలీల వేళ ఇదే...' ఈ పాట నాకు నచ్చడానికి కారణం బహుశా ఆ పాటకి అభినయించింది రాజసులోచన కావడమేనేమో అనిపిస్తుంది నాకు. 'శాంతి నివాసం' సినిమాలోది ఈ పాట. ఇలాంటిదే మరో పాట 'ఖైదీ కన్నయ్య' లో 'తియతీయని మాటలతో తీస్తారు సుమా గోతులు.. నమ్మవద్దు...' రాజసులోచనలో ఉండే గ్రేస్ ఆమె నటననీ, పాటలనీ గుర్తు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేలా చేసింది అనిపిస్తుంది.

పరభాషల్లోనూ రాణించిన తెలుగు నటి రాజసులోచన. కన్నడంతో మొదలు పెట్టి, అటుపై తెలుగులో తనని తాను నిరూపించుకుని, తమిళ సినిమాల పైనా తనదైన ముద్ర వేసిన నటి ఆమె. అందం లోనూ అభినయంలోనూ గట్టి పోటీ ఉన్న ఆరోజుల్లో తనదైన ముద్రని వేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు తెరమీద తెలుగుదనం తో పాటు, తెలుగు నటీమణులూ కరువైపోతున్న కాలం ఇది. రాజసులోచన లాంటి వాళ్ళు మన కోసం, తర్వాతి తరాల కోసం మిగిలించి వెళ్ళిన సంపద మరేదో కాదు, వాళ్ళు నటించిన సినిమాలు. అవి ఎటూ చిరంజీవులే కాబట్టి... వారందరూ కూడా చిరంజీవులే..

ఆదివారం, మార్చి 03, 2013

శ్రీరమణ పేరడీలు

పెద్ద పెద్ద కవుల్నీ రచయితలనీ అనుకరించే వాళ్ళు బోల్డంత మంది. ఈ ఔత్సాహిక కవులూ, రచయితలూ తమకంటూ ఓ సొంత బాణీని ఏర్పరుచుకునే క్రమంలోనో, లేక ఏర్పరుచుకోలేకో పెద్దవారిని అనుకరించేస్తూ ఉంటారు కానీ, ఆ విషయాన్ని బాహాటంగా ఒప్పుకోరు. ఆయా కవుల్నీ, రచయితల్నీ అనుకరించి, ఇది ఫలానా వారి రచనకి అనుకరణ అని ప్రకటించడమే కాకుండా, ఆ అనుకరణలో హాస్యాన్ని మేళవిస్తే అది 'పేరడీ' అవుతుంది. తెలుగునాట పేరడీకి పేరు తెచ్చినవాడు సాహితీలోకం రుక్కాయిగా పిల్చుకునే జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి (జరుక్ శాస్త్రి) కాగా, దానిని నవతరం పాఠకులకి చేరువ చేసినవాడు శ్రీరమణ.

ఏ ఒక్క సాహితీ ప్రక్రియకో తన పేరడీని పరిమితం చేయకుండా అటు పద్యాన్ని, ఇటు గద్యాన్ని అనాయాసంగా తిరగారయడంతో పాటు, ఆయా కవులు, రచయితల మాటతీరుని, ప్రవర్తననీ కూడా కళ్ళకి కట్టారు శ్రీరమణ. తమ కథా నాయకులని ఇంపాలా కారుల్లో తప్ప, మామూలు కార్లలో తిప్పడానికి ఇష్టపడని రచయిత్రులనీ వదలలేదు ఈ పేరడీ ప్రక్రియలో. వచనం, కవిత్వం, పీఠిక, ఫీచర్, ప్రేమలేఖ, సినిమా సమీక్ష... ఇలా అనేక అంశాలని ఆయా ప్రముఖులు ఎలా రాస్తారో ఊహించి పేరడీ రాశారు శ్రీరమణ.

"నట్టడివి లోంచి/నయా దిల్లీకి/మహాప్రస్థానం/మర్చిపోకు నేస్తం/నీ వాణ్ణి నేను/జాతీయ జంతువుని/మనిషిని" అంటారట శ్రీశ్రీ, నెమలిని జాతీయ పక్షిగా ప్రభుత్వం గుర్తించిన సందర్భంలో స్పందించమంటే. ఇదే సందర్భంలో కృష్ణశాస్త్రి అయితే "కరిమబ్బు మేనితో/స్వామివచ్చే వేళ/చివురాకు జంపాల/పురివిప్పి యాడేవు..." అంటారట!! "నీ రెక్కల సవ్వడికి సప్త తంత్రుల విపంచి/తూరుపు ఆకాశం నుంచి మహాభినిష్క్రమణం చేసినప్పుడు..." అంటూ మొదలు పెడితే ఆ కవి, తిలక్ కాక మరెవరు చెప్పండి. "జాతీయ విహంగం/సౌందర్య తరంగం/కాళిదాస కావ్య మరందం/పురివిప్పిన విపిన మయూరం" అంటే అది 'ప్రాస కోసం భావాన్ని బలిపెట్టడానికైనా సిద్దపడే' కవి సినారె.


శ్రీరమణ, మిగిలిన కవులనీ, రచయితల్నీ పేరడీ చేయడం ఒక ఎత్తు. విశ్వనాథ సత్యనారాయణని పేరడీ చేయడం ఒక్కటీ ఒక ఎత్తూ. విశ్వనాథ పీఠిక రాస్తే "సర్వశ్రీ గారి గ్రంధమును జూచితిని. చదివితిని. నా వద్దకు బరిచయ వాక్యముల నర్ధించుచు వచ్చెడువారి సంఖ్య యధికము. బహుశః నేడాంధ్ర దేశమున నాకు గల పేరు ప్రతిష్ఠలు అందుకు కారణము గావచ్చును" అంటారు. అదే ప్రేమలేఖ రాస్తే, "బాలామణీ! ఆశీః నిన్ను జూచితిని తదాది ఆలోచనలన్నియు నీ చుట్టూ పరిభ్రమించును. వదలి వచ్చుటకవి మొరాయించుచున్నవి. నా వంటి వాని మనస్సు సైతము బందీకృతమొనర్చిన నీదగు రూపలావణ్యములు అసామాన్యమే అయి ఉండవలె. మునుపే సరస్వతి నన్ను వరించెననుట లోక విదితము. అందులకై ఎందరు ఈర్ష్యబడిరో, బడుతుండిరో అది వేరు విషయము..." ఈ ప్రకారం సాగుతుందిట.

'మధురవాణి ఇంటర్యూలు' పేరిట ఎందఱో ప్రముఖుల్ని కన్యాశుల్కం మధురవాణి చేత ఇంటర్యూ చేయించారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆ పురాణం వారినే, మధురవాణి చేత ఇంటర్యూ చేయించారు శ్రీరమణ. "నువ్వు పురాణం చేతిలో టాకింగ్ డాల్ వి. నీ పెదాలు అడ్డుపెట్టుకుని వారే మాట్లాడేశారు. పురాణం మహ లావు వెంట్రి లాక్విస్టు అన్నారు గిరీశం గారు" అంటుంది మధురం. అంతేనా? "ఈ బుక్కు మీరు భరాగో గారికి అంకితం ఇస్తే ఆయన తిరిగి ఆలపాటి రవీంద్రనాథ్ గారికి దత్తం చేశారు. చివరికి కృతిభర్త విషయంలో కూడా నా వృత్తి ధర్మాన్ని వదలనిచ్చారు కారు. మీరంతా మేధావులు" అంటూ చురక అంటిస్తుంది కూడా.

ఎంతటివారైనా నవ్వపుకోలేని పేరడీ 'రైలుబండిలో వైతాళికులు.' రచయితలూ, కవులూ అందరూ కలిసి ఓ రైలు బండిలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహకి అక్షర రూపం ఇది. "ఏపిల్... ఏపిల్... పావలా.. పావలా.. అని గుక్క తిప్పుకోని పళ్ళబ్బాయ్ కంపార్ట్మెంట్ లోకి వచ్చాడు. 'కొంటే బావుంటుంది' అన్నారు పింగళి. 'తింటే మరీ బావుంటుంది' అన్నారు కాటూరి. 'జంటకవిత్వం బానే ఉంది.. అయితే నేను కొనాల్సిందేనా..' అంటూ ఎంపిక చేసి పది పళ్ళు బేరం చేశారు విశ్వనాథ. 'మిగిలితే మాత్రం నాకోటి ఇవ్వండి' అన్నారు గణపతి శాస్త్రి. విశ్వనాథ వారు తలొకటి పంచి తానొకటి నోటికి తగిలించారు. పక్క క్యూ లోనుంచి శ్రీశ్రీ బుస కొట్టిన శబ్దం చేసి 'ఏపిల్ బూర్జువా వ్యవస్థకి ప్రతీక' అన్నారు. 'అయితే మీరు జామి పళ్ళు తప్ప తినరా ఏమిటి? ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ ఉంటాను.." విశ్వనాథ ఏపిల్ నములుతూ అన్నారు..." ఈ ప్రకారంగా సాగుతుంది ఈ పేరడీ..

తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్వాదించే ఈ పుస్తకాన్ని నవోదయ వారు ప్రచురిస్తున్నారు, 1980 నుంచీ. విశేష ఆదరణ పొందిన పుస్తకం ఇది. ఇప్పటికీ జరుగుతున్నపునర్ముద్రణలే సాక్ష్యం. శ్రీరమణ రచనలకి బాపూ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. (పేజీలు 154, వెల రూ.75, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, మార్చి 01, 2013

పరిచయాల మలుపు...

పరిచయం.. ఇది కేవలం ఓ అందమైన మాట మాత్రమే కాదు.. ఓ చక్కని సందర్భం కూడా.. నిత్యం ఎంతోమంది మనకి కొత్తగా పరిచయం అవుతూ ఉంటారు.. కొన్ని ఆ క్షణానికే పరిమితమయ్యే పరిచయాలు అయితే, అతికొద్ది మాత్రం తర్వాతి కాలంలో గుర్తుండి పోయేవిగా మారతాయి. అంతేకాదు, అప్పుడు ఆ పరిచయం జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవీ ఉండి తీరతాయి. అయితే, ఏ పరిచయం తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్నది చాలా సందర్భాల్లో పరిచయాలు జరిగే క్షణాలలో తెలియదు మనకి.

తొలిపరిచయంలోనే అవతలి వ్యక్తిలో ఉన్న ఏదో ప్రత్యేకత మనల్ని ఆకర్షిస్తే, అ ఆవ్యక్తిని తప్పక గుర్తు పెట్టుకుంటాం. నిజానికి ఈ గుర్తుపెట్టుకోడం అన్నది మనుషుల విషయంలో మాత్రమే కాదు, ట్రైలర్ చూసి సినిమా మీద, టైటిల్ చూసి పుస్తకం మీద ఆసక్తి పెంచుకోడం అన్నది కూడా ఈ పరిచయాల జాబితాలోకే వస్తుంది కదా మరి.పెట్టుకోడానికి ఉన్న మరోకారణం, పరిచయం అయిన తీరు. పరిచయం ఎవరి ద్వారా జరిగింది అన్నది కూడా బాగానే ప్రభావితం చేస్తుంది మనల్ని. ఒకటి రెండు ఎదురు దెబ్బలు కనుక తగిలినట్టయితే, ఆ చానల్ ద్వారా జరిగే పరిచయాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం మనం.

క్రమం తప్పకుండా కొందరిని మనం కలుస్తూనే ఉన్నా, వారితో పరిచయం మరో మెట్టు ఎక్కదు. పరిచయం దగ్గరే ఆగిపోతుంది. మనం క్రమం తప్పకుండా కూరగాయలు కొనే చిరు వ్యాపారులు, బిల్లింగ్ కౌంటర్ ఉద్యోగులు, క్రమం తప్పకుండా ప్రయాణం చేసే వారికైతే బస్ కండక్టర్లు, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చే కుర్రాళ్ళు, పేపర్ బాయ్స్, సెలూన్/బ్యూటీ పార్లర్ లో పని చేసేవాళ్ళు, పాలవాళ్ళు.... వీళ్ళంతా ఈ జాబితాలోకి వస్తారు. వీళ్ళలో చాలామంది పేర్లు కూడా మనకి తెలియవు.వాళ్ళకీ మన వివరాలు తెలియవు.

ఓ పెద్ద సంస్థలో పని చేసేవారికి, సహోద్యోగులు మొత్తం అందరితోనూ స్నేహం కాదు కదా, పరిచయం కూడా ఉండదు. అలా ఉండడానికి అవకాశం ఉండదు నిజానికి. కొందరితో స్నేహం, మరి కొందరితో పరిచయం, చాలామందితో కేవలం ముఖ పరిచయం.. అంతే. సంస్థకి కనుక డ్రెస్ కోడ్ ఉన్నట్టయితే, ఈ ముఖ పరిచయం సహోద్యోగులు యూనిఫాం లో కాక మామూలు దుస్తుల్లో బయట తారస పడితే ఎదురయ్యే అవస్థ అంతా ఇంతా కాదు.పాపం, అవతలి వాళ్ళ పరిస్థితీ అలాగే ఉంటుంది. పలకరింపుగా నవ్వాలో, కూడదో తెలియని సందర్భం మరి. 

కొన్ని కొన్ని పరిచయాలు అందమైన మలుపులు తిరుగుతాయి. ఇప్పటి మన ప్రాణ స్నేహితులలో చాలామంది ఒకప్పుడు యాదృచ్చికంగా పరిచయం అయిన వాళ్ళే అవుతారు, గుర్తు చేసుకుంటే. కొన్ని పరిచయాలు బంధుత్వాలకి దారితీస్తే, మరికొన్ని ఉద్యోగంలో మార్పుల వైపు నడిపిస్తాయి. మంచినీ, చెడునీ విడదీసి చూడడం సాధ్యపడదు కాబట్టి, అన్ని పరిచయాలూ మంచి వైపు మాత్రమే దారి తీస్తాయి అనుకోలేం. అందుకే, ఎక్కడికక్కడ తగుమాత్రం జాగ్రత్త చూపడం అవసరం. చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం కదూ.

ఎప్పుడో జరిగిన పరిచయాన్ని, చాలా ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకోడం బాగుంటుంది. అది కూడా అస్సలు ఊహించని విధంగా అయితే మరింత బాగుంటుంది. ఎప్పుడో పరిచయమైన వాళ్ళు, ఊహించని విధంగా ఎదురై పలకరించి, అప్పటి కబుర్లు చెబుతూ ఉంటే, 'అప్పుడు మనం వీళ్ళని నిర్లక్ష్యం చేశామా?' అన్న ఆలోచన కలగక మానదు. ఇందుకు పూర్తిగా బిన్నమైన సందర్భమూ ఉంది. మనం మర్చిపోడానికి ప్రయత్నిస్తున్న విషయాలు, పరిచయస్తుల రూపంలో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం రావడం. తప్పదు... పరిచయాలు మనచేతుల్లో ఉండవు మరి.