బుధవారం, ఏప్రిల్ 17, 2013

కన్నీటి కెరటాల వెన్నెల

చాలా రోజులుగా చదవాలనుకుంటున్న నవల ఓల్గా రాసిన 'కన్నీటి కెరటాల వెన్నెల.' మొన్నామధ్య వేరే పుస్తకాల కోసం వెతుకుతుండగా పుస్తకాల షాపులో కనిపించింది. లోతైన, భావుకత్వంతో నిండిన శీర్షిక ఉన్న ఈ నవలని చదవడం పూర్తిచేశాక, కథకీ శీర్షికకీ ఉన్న సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అయితే, సినిమా అంటే నాకున్న ఆసక్తి వల్ల కావొచ్చు, పేజీలు చకచకా తిరిగిపోయాయి. ప్రపంచ సినిమా పరిణామ క్రమాన్నీ, భారతీయ సినిమా నడకనీ చర్చిస్తూనే, నవలలో ప్రధాన పాత్రలకీ, కొన్ని పేరొందిన సినిమాల్లో జీవితాలకీ సామ్యాన్ని చూపించడం ద్వారా ఎక్కడా బిగి సడలని విధంగా కథని నడిపించారు ఓల్గా. 'చతుర' పత్రిక మార్చ్, 1988 సంచికలో తొలిసారి ప్రచురితమైన 'కన్నీటి కెరటాల వెన్నెల' 1999 లో తొలి ముద్రణనీ, 2010 లో మలిముద్రణనీ పొందింది.

పాతికేళ్ళ వయసుకే భర్త రవిని కోల్పోయి, ఏడాదికాలంగా నిర్వేదంలో కూరుకుపోయిన రేణు కథ ఇది. రవి తన జీవితంలోకి రాడానికి ముందు, తనకంటూ ఇరవయ్యేళ్ళ జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోయి అతని జ్ఞాపకాల నుంచి బయటకి రాడానికి ఏమాత్రమూ ఇష్ట పడని రేణూని ఆమె స్నేహితురాలు శిరీష పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆరువారాల ఫిలిం అప్రిసియేషన్ కోర్సులో చేర్చడంతో మొదలయ్యే కథ, రేణూ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనుభవాలతో వేగం అందుకుంటుంది. రూం మేట్లు ఉమ, గమనల పరిచయం, క్లాసులో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన భిన్న మనస్తత్వాలు ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులు... వీళ్ళందరి మధ్యనా రోజులో పద్దెనిమిది గంటలు సినిమాలు చూస్తూ, సినిమాల గురించి వింటూ రవి తాలూకు ఆలోచనల నుంచి కొంచం బయటికి రాగలుగుతుంది రేణూ.

మరో పక్క క్లాసులో చెప్పే పాఠాలు, చర్చలు వీటన్నింటినీ వివరంగా రాయడం ద్వారా ప్రపంచ సినిమా చరిత్రని పాఠకుల ముందు ఉంచారు రచయిత్రి. మూకీ సినిమా మొదలు, టాకీలు, వాటి పరిణామ క్రమం, సినిమా తీసే పద్ధతులు, సినిమాలని చూడాల్సిన పద్ధతులు, టెక్నిక్, ఫిలిం మేకర్స్ ఆలోచనలు, వాటిని ప్రేక్షకులు అర్ధం చేసుకునే తీరు... ఇలా ఎన్నో విషయాలని కథలో భాగం చేశారు. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే రేణూ కి స్నేహితురాలైపోయిన గమన జీవితాన్ని గురించీ వివరంగానే చెప్పారు. సిక్కు కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి, ఇందిరా గాంధీ మరణానంతరం దేశ రాజధానిలో జరిగిన మారణ కాండకి ప్రత్యక్ష సాక్షి. అలాగే ఉమ పాత్రని చిత్రించిన తీరు, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు గుర్తుండిపోతాయి.


కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది రేణూ. క్లాసులో మేష్టార్లు, స్టూడెంట్స్ తో కలిసి సిగరెట్లు కాల్చడం, గమన లాంటి కొందరు అమ్మాయిలు కూడా సిగరెట్లు, మందు పార్టీలు అనడం మొదట ఆమెకి కొరుకుడు పడదు. అయితే, సిగరెట్ కాల్చడం తప్పు అయితే అది మగాడు చేసినా, ఆడపిల్ల చేసినా కూడా తప్పే. మగవాడు సిగరెట్ కాల్చడాన్ని ఆమోదించేసి, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి తప్పు పట్టడం ఎంతవరకూ సబబు? అన్న దగ్గర ఆగుతుంది ఆమె ఆలోచన. రేణూ మీద గమన ప్రభావమూ తక్కువదేమీ కాదు. ఆధునిక భావాలున్న ఆ అమ్మాయి "ఇది మగవాళ్ళ సమాజం" అంటుంది.

"ఒక ఆడపిల్ల పదేళ్ళ వయసు నుంచి పెళ్ళయ్యే దాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్ని రకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో కదా. ఇదంతా మగాళ్ళ సమాజం. ఈ సమాజం మనది కాదు అనిపిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్ర్యం లేకుండా మసిలినట్టుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు పెదవులు సాగదియ్యాలో అంతవరకూ మాత్రమే సాగదీసి నవ్వాలి. ఎక్కువయిందో ఏదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకడం పెద్ద బోరు. మగ సమాజాన్ని మనుషుల సమాజంగా చేయాలి.. ఎప్పటికి మనుషుల సమాజం వస్తుందోగాని..." అంటుంది గమన. మాధవి, రజని... ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.

పూణే లో తెలుగుకి మొహం వాచిన రేణూకి, అదే కోర్సు కోసం విజయవాడ నుంచి వచ్చిన లెక్చరర్ సూర్యం పరిచయం అవుతాడు. తొందరలోనే స్నేహితులు అవుతారు ఇద్దరూ. 'కొకు' అభిమాని అయిన సూర్యం పాత్ర ద్వారా కొడవటిగంటి కుటుంబరావు కథలు, నవలల గురించి కొంత చర్చ చేశారు రచయిత్రి. ఆరువారాల ఫిలిం అప్రిసియేషన్ కోర్సు రేణూ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందీ అన్నది ముగింపు. సినిమా - మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సినిమా- అంటే ఆసక్తి ఉన్న వారిని ఆకట్టుకునే నవల. (స్వేచ్చ ప్రచురణలు, పేజీలు 160, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు:

  1. రావూరి భరద్వాజ గారి గురించి ఏమన్నా రాస్తారనుకున్నా .

    రిప్లయితొలగించండి
  2. ఈ పుస్తకం చాలా చదివి చాలా కాలం అయింది. కథ గుర్తుండి పోయింది కాని పేరు మరచిపోయాను. సమీక్ష బావుంది. మళ్ళీ చదవాలి. థాంక్యు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  3. @వాసు: వారి 'పాకుడురాళ్ళు' 'కాదంబరి' గురించి ఇదివరకే రాశాను కదండీ.. ధన్యవాదాలు

    @బంగినపల్లి మ్యాంగో: ధన్యవాదాలండీ..

    @జ్యోతిర్మయి: 'సినిమా' మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి బాగా నచ్చే నవలండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి