శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

మెలకువ

చదువుతున్నంత సేపూ సాధారణంగానే అనిపించిన కథ, పుస్తకం పక్కన పెట్టాక కూడా మన ఆలోచనల్లో ఏదో మూల నేనున్నానంటూ స్థిరపడి పోయి తరచుగా గుర్తొస్తోందంటే అది మామూలు కథ కాదన్న మాట. ఏదో ప్రత్యేకత ఆ కథని వేరుగా నిలబెట్టిందన్న మాట. ఇలాంటి కథలు ఒకటీ రెండూ కాదు, పదికి పైగా ఉన్న సంకలనం 'మెలకువ.' అన్నీ చిన్న కథలే. పాత్రలు కూడా మనకి నిత్య జీవితంలో తరచుగా తారస పడేవీ, మనం పెద్దగా పట్టించుకోనివీను. అయితేనేం, చదవడం పూర్తి చేశాక ఆ కథలూ, పాత్రలూ కొన్నాళ్ళ పాటైనా విడవకుండా వెంటాడతాయి మనల్ని.

తెలుగు సాహిత్యం చదివే వాళ్లకి పి. సత్యవతి అనే పేరుని పరిచయం చేయబోవడం సాహసమే అవుతుంది. 'సత్యవతి కథలు' 'ఇల్లలకగానే' 'మంత్రనగరి' కథా సంకలనాల తర్వాత, ఆమె వెలువరించిన నాలుగో సంకలనం 'మెలకువ.' మొత్తం పద్నాలుగు కథలున్న ఈ సంకలనంలో మొదటగా ఆకర్షించేది జీవిత చిత్రణ. పుస్తకం పేరే శీర్షికగా ఉన్న 'మెలకువ' కథనే తీసుకుంటే, ప్రధానపాత్ర 'సుశీలమ్మ పెనిమిటి' లాంటి వాళ్ళు ప్రతిచోటా కనిపిస్తారు. పేరు, డబ్బు, హోదా అన్నీ ఉన్నా ఎవరినీ కలుపుకు పోలేని అతని తత్త్వం అతగాడిని 'ఈశ్వర్' గా కాక 'సుశీలమ్మ పెనిమిటి' గా గుర్తింపబడేలా చేసింది. అతనిలో కలిగిన 'మెలకువ' ఏమిటన్నది ముగింపు. 

మిగిలిన కథల్లో మొదటగా చెప్పుకోవాల్సింది 'భార వాహిక.' అపార్ట్మెంట్ జీవితాలని గురించి చాలా మంది కథలు రాసినా, ఇదో కొత్తకోణం. ఈ కథ అపార్ట్ మెంట్ జీవితానికి సంబంధించిందే. అపార్ట్ మెంట్ లో ఉండే దుర్గ కథ. వాచ్మన్ భార్య దుర్గ. నాలుగు ఫ్లాట్ల వాళ్లకి పని మనిషి, మొత్తం అన్ని ఫ్లాట్ల వాళ్ళకీ బట్టలు ఇస్త్రీ చేసే మనిషీ కూడా. పేరుకి ఆమె భర్త పానకాలు వాచ్మన్ అయినా, ఆ పని కూడా ఆమెదే. అతగాడు తాగేసి పడుకుంటే ఆ లోపాన్ని కమ్ముకు వచ్చేసే నోరున్న మనిషి. ఇద్దరు పిల్లల్ని పోషించడమే గగనంగా ఉన్న సమయంలో, తన కొద్దిపాటి ఆస్తీ కూతురికి ఇచ్చేసి, అల్లుడు గెంటేయడంతో కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన పానకాలు తండ్రిని దుర్గ ఎలా ఆహ్వానించింది అన్నదే ఈ కథ. దుర్గని మర్చిపోవడం అంత సులభం కాదు.


'కాడి' కథలో స్వర్ణ, 'మూడేళ్ళ ముచ్చట' కథలో భవాని, 'పేపర్ వెయిట్' కథలో సూర్యుడు, 'రత్నపాప' కథలో రత్న.. నలుగురూ ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళే. వీళ్ళలో స్వర్ణ, భవానీ ఉన్నంతలో బాగా బతకాలి అనుకుంటే, సూర్యుడు ఒళ్ళు దాచుకోకుండా పని చెయ్యాలి అనుకునే అమ్మాయి. ఇక, రత్న పూర్తిగా తల్లి చాటు బిడ్డ. పేదరికం ఒక్కటే వీళ్ళలో సామ్యం. వీళ్ళ వ్యక్తిత్వాలు, ఆలోచనలు అన్నీ ఎవరివి వారికే ప్రత్యేకం. స్వర్ణ తల్లి స్వర్ణకి దన్నుగా నిలబడితే, రత్న తల్లి తీసుకున్న నిర్ణయం ఆమెని తన గురించి తను ఆలోచించుకునేలా చేసింది. 'పేపర్ వెయిట్' కథ చివర్లో సూర్యుడి వ్యక్తిత్వం తళుక్కున మెరిస్తే, 'మూడేళ్ళ ముచ్చట' కథలో భవాని నిర్ణయం 'తొందరపాటేమో కదూ' అనిపిస్తుంది.

'ఆవిడ' 'నాన్న' కథలు ఒకే నాణానికి బొమ్మా బొరుసూలా అనిపిస్తాయి. వీటిలో 'నాన్న' కథ 'మేఘ సందేశం' సినిమాని జ్ఞాపకం చేస్తుంది. అలాగే 'ఒక రాణీ-ఒక రాజా' కథ కొంతవరకూ 'బొమ్మరిల్లు' సినిమాని గుర్తు చేస్తుంది. అయితే ఆ సినిమా కన్నా ముందే ఈ కథ రాశారు సత్యవతి. సంకలనంలో మొదటి కథ 'భాగం,' చెప్పీ చెప్పకుండా కథని చెప్పేశారు. పాత్రల సంభాషణల కన్నా 'నువ్వులు ఎక్కువగా వేసి చేసిన నేతి అరిసెలు' ఎక్కువ కథ చెబుతాయి. మిగిలిన కథల కన్నా ప్రత్యేకంగా, కవితాత్మక ధోరణి లో సాగే కథ 'నేనొస్తున్నాను..' కథకన్నా, కథనం ఆకట్టుకుంటుంది. మిగలిన కథలు సాధారణంగానే అనిపించాయి, వీటితో పోల్చినప్పుడు.

మొత్తం మీద చూసినప్పుడు, సత్యవతి కథల్లో పాత్రలు కాల్పనికం అనిపించవు. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అనడం కూడా అసత్యమే. ఎందుకంటే, వాస్తవికంగా ఉండే పాత్రలు. ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న పాత్రలు. నాటకీయమైన మలుపులు, సంభాషణలూ కనిపించని కథలివి. ఈ కథల్లో పాత్రలు ఆదర్శాలు మాట్లాడవు. ఉపన్యాసాలు ఇవ్వవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి అంతే. కథలు చదివాక, మన చుట్టూ ఉండే.. మనం రోజూ చూసే మనుషులనే కొత్తగా చూడడం మొదలు పెడతాం. (నవోదయ పబ్లిషర్స్ ప్రచురణ, పేజీలు 120, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2014

తెలంగాణ

లోక్ సభ, రాజ్యసభ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదించాక, రాష్ట్రపతి ఆమోదం కేవలం ఒక లాంఛనమే కాబట్టి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న మిత్రులకి అభినందనలు చెబుతూ వస్తున్నాను. వీళ్ళలో సుదీర్ఘ కాలంగా ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యమం కోసం ఉద్యోగం వదులుకోడానికి సిద్ధపడ్డ వాళ్ళు, చిన్న ఉద్యోగాలతో సద్దుకుపొయిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యంగా, వాళ్ళ నాయకుల ప్రసంగాలలో విద్వేషపూరితంగా వినిపించే ప్రాంతానికి చెందిన నాతో స్నేహం చెయ్యడం వాళ్ళెవ్వరికీ అభ్యంతరం కాలేదు. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు అనుకున్నారేమో బహుశా.

ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయాలని తెలంగాణా సాహిత్యం కోసం కేటాయించి, ఈమధ్యనే రిటైరైన మిత్రులొకరితో కొంచం సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లాకి చెందిన వ్యక్తి. వామపక్ష భావజాలం నుంచి తెలంగాణా ఉద్యమానికి వచ్చిన మధ్యతరగతి మనిషి. "తెలంగాణ వచ్చేసింది కదా.. ఇప్పుడేమిటి?" అన్నాను నేను. "నిజానికి ఇదే కీలకమైన సమయం. జరగాల్సింది అంతా ముందుంది. రాబోయే కాలంలో చాలా సవాళ్ళే ఉన్నాయి. నిజం చెప్పాలంటే, ఇప్పటి తెలంగాణ పరిస్థితి, స్వతంత్రం వచ్చిన తొలిరోజుల్లో ఇండియా పరిస్థితి లాంటిది," అన్నారు.

"స్వతంత్రం వచ్చిన కొత్తలో అన్ని సమస్యలనీ గాంధీ నెహ్రూలు పరిష్కరించేస్తారన్న ఆశ ఒకటి చాలామందిలో ఉండేది. ఆ ఆశ వాళ్ళని ఏళ్ళ తరబడి మంచి రోజుల కోసం ఎదురు చూసేలా చేసింది. మరి, తెలంగాణ లో అలాంటి ఆశ ఉందా?" అని అడిగాను. "ఉంది. గాంధీ, నెహ్రూల మీద ఉన్నంత కాకపోయినా కేసీఆర్ మీద కొంత ఆశ ఉంది అందరికీ. ప్రాజెక్టులు వస్తాయన్న ఆశ ఉంది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశ ఉంది. మన బతుకులు మనం బతకొచ్చు అన్న ఆశ ఉంది. ఇవి ఎంతవరకూ తీరతాయి అన్నది చూడాలి. ఇవి తీరడం ఆలస్యం అయ్యే కొద్దీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 47 లో స్వతంత్రం వచ్చాక, అరవైల నుంచీ ఉద్యమాలు మొదలై, డెబ్భైల నాటికి బాగా బలపడ్డాయి కదా.." 



"ఇన్నాళ్ళూ తెలంగాణ సమస్యలు అన్నింటికీ కారణం ఒకటి సిద్ధంగా ఉండేది.. 'ఆంధ్రోళ్ళు' అనో 'వలస పాలకులు' అనో.. ఇప్పుడు, పాలన మారాక ఏమని జవాబు చెబుతారు? జనాన్ని ఎలా ఒప్పిస్తారు?" అని అడిగాను. "నిజమే.. ఇది కొంచం కష్టమైన విషయమే. ఎందుకంటే ఉద్యోగాలిచ్చి అందరినీ తృప్తి పరచగలిగే పరిస్థితి లేదు. లక్ష ఉద్యోగాలు ఉంటే, పది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం రాని వాళ్లకి నిరాశ ఉంటుంది. అయితే, రాన్రానూ వలసలు ఆగొచ్చు. ఉన్నవాళ్ళలో కొందరు వెనక్కి వెళ్ళొచ్చు. దీనివల్ల తెలంగాణ వాళ్ళు కొందరికి పని దొరకొచ్చు. ఉద్యోగం తర్వాత చూడాల్సింది వ్యవసాయం. కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. రైతులకి, కూలీలకి పని దొరుకుతుంది.." 

"వెనక్కి వెళ్ళడం అంటే? అందరూ వెనక్కి వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే పనేనా?" అని అడిగాను. "అట్లా కాదు. ఇప్పుడు ఆంద్ర లో కూడా పనులు మొదలవుతాయి. రాజధాని కట్టాలి.. అక్కడికీ కొన్ని ప్రాజెక్టులు ఇస్తారు.. వాటిలో పని చేయడానికి వలస వచ్చిన వాళ్ళు కొందరు వెనక్కి వెళ్ళొచ్చు. అందరూ వెనక్కి వెళ్ళడం సాధ్యం కాదు. అలా వెళ్ళిపోవాలని ఎవరూ అనుకోడం లేదు కూడా. ఇక్కడ దళితుల సమస్యలు, ఆదివాసీల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి.." అని చెబుతూ ఉండగా నాకు గుర్తొచ్చింది..."తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు?" ..."చెయ్యాల్సిందే.. లేకుంటే ఊర్కునే పరిస్థితి లేదు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ బయటికి వస్తాయి. ఇప్పటి కన్నా, ఒక ఐదేళ్ళ తర్వాత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.." 

"మళ్ళీ స్వతంత్ర భారత దేశం పోలికేనా?" అని అడిగాను. "చెప్పాను కదా.. అసలు పనంతా ఇప్పటినుంచీ ఉంది. ఏమేం చెయ్యాలి అన్నది నిర్ణయించుకోవాలి. అందరి సమస్యలూ చూడాలి. అందరికీ కూడా తెలంగాణ వచ్చేసింది కదా.. అన్నీ బాగవుతాయి అన్న ఆశ ఉంది. అది పోగొట్ట కూడదు. సమస్యలుంటాయి కానీ, స్వతంత్రం అన్నది చాలా పెద్ద విషయం కదా. ఇప్పటికైతే ఆ సంతోషం బాగా ఉంది. సిటీల్లో కన్నా, పల్లెల్లో బాగా కనిపిస్తోంది. వలసలు మొదలైన కొత్తలో వచ్చినవాళ్లు ఉర్దూ నేర్చుకునేవాళ్ళు. రాన్రానూ, ఇక్కడి వాళ్ళే అక్కడి భాష నేర్చుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మారుతుంది కదా ఇప్పుడు..అదీ సంతోషం, ఇకపై అన్ రెస్ట్ పెరక్కుండా చూడాల్సింది పాలకులే.." అంటూ ముగించారు.

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

అందని చందమామ - నాగమల్లిక

"అయితే ఆ స్వారోచిష మన్వంతరంలో స్త్రీ పురుషుల కందరికి స్వరోచి తల్లిదండ్రుల వలపుల తారుమారులే సంక్రమిస్తాయేమో! ఆ తరవాత కూడా మానవుల కొందరిలోనైనా ఆ సంప్రదాయాలలాగే స్థిరపడి పోతాయేమోనే" అంటూ స్నేహితురాలు హేమ చెవిలో ఛలోక్తి విసిరింది హరిణి. హేమకా ఛలోక్తి అర్ధం కాలేదు. అదే విషయాన్ని స్నేహితురాలికి చెప్పింది. "దీనిలో అర్ధం కానిదేమిటి? వలపొకచోట, మనువింకొక చోట. ఇంతకన్నా వేరే వింతయిన తారుమారేమిటే?" పొడుపు కథ విప్పింది హరిణి.

పెద్ద జబ్బు పడి కోలుకున్న బాలుడు స్వరోచి, స్వారోచిష మనువన్న ప్రపంచ ప్రఖ్యాత నామధేయంతో మన్వంతరాధిపతి కాగలడని రజతగిరి స్వామి అనుగ్రహించిన సందర్భంలో హరిణి, హేమల మధ్య జరిగింది ఈ సంభాషణ. స్వరోచి మరెవరో కాదు, ఈ ఇద్దరు గుమ్మల నెచ్చెలి వరూధినీ ప్రియ పుత్రుడు. వరూధిని అంటే, అల్లసాని పెద్దన ఘంటపు కొస నుంచి ఆవిర్భవించిన నాయికే.. ప్రవరాఖ్యుడిని మోహించి, భంగ పడిన ఆమె కథ లోక విదితమే కదా. అల్లసాని వారి వరూధినికి మరిన్ని వన్నెచిన్నెలు అద్ది, ఆమె ప్రేమకథని తనదైన శైలిలో ఆవిష్కరించారు పిలకా గణపతి శాస్త్రి తన 'అందని చందమామ' నవలికలో.

పిలకా వారి వరూధిని, ప్రవరుడిని వలపించుకుంది. తన దగ్గరే ఉండిపోయేలా ఒప్పించింది.. ప్రేమఫలంగా స్వరోచికి జన్మనిచ్చింది. ఆ తర్వాతే మొదలయ్యింది అసలు కథ. ఆ జంట మధ్యన దూరం పెరిగింది.. తల్లిదండ్రుల భవంతుల మధ్య తిప్పబడుతూ, బెంగతో జబ్బు పడుతూ, కోలుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు, ఆటపాటలతో కాలం గడపాల్సిన స్వరోచి. అదిగో, ఆ సందర్భంలోనే స్వరోచి భవిష్యత్తు ని గురించి తన ఆందోళనలని రజతగిరి స్వామి ముందుంచింది వరూధిని. ఆమెని ఓదార్చి, ఆ బాలుడి భవిష్యత్తు చెప్పారు స్వామి. అది విని, తన స్నేహితురాలితో పరాచికం ఆడింది హరిణి. హరిణి పరాచికం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలంటే 'అందని చందమామ' చదవాల్సిందే.'


నందయశోదా నందనుడి లీలావినోదాల గురించి ఎంతోమంది కవులూ, రచయితలూ ఎన్నో గ్రంధాలు రచించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దృష్టి కోణం. ఎవరి శైలి, శిల్పం, రచనా చమత్కృతి వారిదే. రాసే వారికే కాదు, చదివే వారికీ తనివి తీరనివి శ్రీకృష్ణ లీలలు. బాల్య చాపల్యాలు వీడి, యవ్వనంలో అడుగుపెట్టిన కృష్ణుడు రేపల్లె పడుచులతో నెరపిన సరాగాలని ఇతివృత్తంగా తీసుకుని పిలకా గణపతి శాస్త్రి రాసిన నవలిక 'నాగమల్లిక.' "మల్లిక గుండె ఒక్కమారుగా జల్లుమన్నది. ఒకింత దూరంలో పిల్లనగ్రోవి పాట సన్నగా జాలిగా పిలుస్తున్నట్టు వినిపించింది" అన్న ప్రారంభ వాక్యాలతో అమాంతం కథలోకి తీసుకుపోయి, పాఠకులని రేపల్లె వీధుల్లో తిప్పి తీసుకు వస్తారు పిలకావారు.

ఒద్దికగా సంసారం చేసుకుంటున్న గోపవనిత మల్లిక. ఆమె భర్త నాగమణి, ఇద్దరు పిల్లలు చిత్ర, చిన్నారి. ఆలమందలు, వ్యవసాయంతో ఆనందంగా జీవితం గదిపెస్తున్నదా జంట. మల్లికది ప్రేమవివాహం. ఆమెని ఏరికోరి వివాహం చేసుకున్నాడు దగ్గరి బంధువు నాగమణి. కార్తీక పున్నమి నాడు, నిండు జాబిల్లి చుక్కలతో కలిసి కొండమీద కొలువు దీర్చి కూర్చోగానే గోపూజ జరుపుకుని, ఒక్కొక్క ఆవుచేత ఏటి నీరు తాగించి, రవ్వంత ఆలస్యంగా ఇల్లుచేరాడు నాగమణి. ఆ లోగానే, మల్లిక జీవితంలో ఊహించని మార్పు ఒకటి ప్రవేశించింది. ఫలితంగా ఏం జరిగింది? సంతోషంగా సాగిపోతున్న మల్లిక జీవితం ఏ మలుపు తిరిగింది? అన్నదే 'నాగమల్లిక' నవలిక.

కృష్ణలీలల్లో అంతగా చర్చకి రాని అంశాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం ఒకరకంగా సాహసమే. నిజానికి ఈ నవలని గురించి విశేషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. కానైతే, అలా జరిగిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. రష్యన్ రచయిత చెహోవ్ కథ గురించి ఎక్కిరాల వేదవ్యాస తో జరిగిన ఒక చర్చ నుంచి ఈ నవలిక పుట్టింది అన్నారు గణపతి శాస్త్రి తన ముందుమాట లో. 'విశాల నేత్రాలు,' 'గృహిణి,' 'హేమపాత్ర-అశోక వర్ధనుడు,' 'కాశ్మీర పట్టమహిషి' పుస్తకాలని ప్రచురించిన ఎమెస్కో 'వారే 'అందని చందమామ' 'నాగమల్లిక' నవలలు రెంటినీ కలిపి ఒక సంకలనంగా విడుదల చేశారు.(పేజీలు 216, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

లవ్ లీ ...

'వన్ ఫోర్ త్రీ... వన్ ఫోర్ ఫోర్... వన్ ఫోర్ ఫైవ్... వన్ ఫోర్ సిక్.....' అబ్బా.. స్కిప్పింగ్ రోప్ షూ కింద పడింది. ఇంకొక్క ఐదు స్కిప్పులైతే నూట యాభై అయ్యేవి కదా.. సరే.. తీసుకునే బ్రేకేదో ఐదు స్కిప్పుల ముందే తీసుకుందాం. కౌంటర్ మీద సైలెంట్ మోడ్ లో పెట్టిన ఫోన్, కార్ కీస్, చిన్న టర్కీ టవల్.. హమ్మయ్య ఎవరూ కదపలేదు. ఫోన్ ప్రశాంతంగానే ఉంది. ట్రెడ్ మిల్ అంకుల్ పలకరింపు నవ్వుకి రిప్లై ఇచ్చేసి, మళ్ళీ నా స్కిప్పింగ్ రోపూ నేనూ. ఇటు పక్క కుర్రాడు బైసెప్స్, ఆ వెనుకతను పుషప్స్. 'కాంటా లగా' ఫుల్ వాల్యూం లో ఉంది, అందరినీ హుషారించడానికి కాబోలు.

"అంత పైకి గెంతద్దు.. త్వరగా అలిసిపోతావ్. అతను చూడు, ఫుట్ సౌండ్ కూడా వినిపించడం లేదు" ట్రైనర్ వచ్చి గుసగుసలాడాడు చెవిలో. మొట్ట మొదటిరోజు వందో స్కిప్పు అయ్యీ అవ్వడం తోనే వంటి నిండా చెమటలతో కూలబడి పోయిన నన్ను చూసి టెన్షన్ పడిపోయింది ఇతగాడే. "థౌజండ్ స్కిప్స్ అయ్యాక సైక్లింగ్, ట్రెడ్ మిల్ కంప్లీట్ చేసేస్తే, కొత్త ఎక్సెర్సైజ్ నేర్పిస్తా.." నేను పళ్ళు నూరడం తనకి వినిపించే చాన్స్ లేదు. సో, ఇవన్నీ అయితే తప్ప ఇతగాడు నన్ను విడుదల చెయ్యడు.. అప్పటికి స్వీటీ నిద్దరోతుందో ఏమిటో. ఈపాటికి ఈవెనింగ్ వాక్ అయిపోయి ఉంటుంది. తనెలాగూ టీవీ చూడదు కాబట్టి ఇక నిద్రే.

స్కిప్పింగ్ అయ్యేసరికి, ట్రెడ్ మిల్ ఖాళీ అయ్యింది. ఇంకెవరో వచ్చెయ్యక ముందే గబుక్కున అటు గెంతేసా. ట్రైనర్ రాక్షసుడు నన్ను ఖాళీగా చూశాడంటే ఏ రాళ్లో రప్పలో ఎత్తిస్తాడు.అంతకన్నా ట్రెడ్ మిల్ సుఖం. ఫోన్ వెలిగింది ఎందుకో. "రిపోర్ట్ నార్మల్ వచ్చింది బడ్డూ. నేను బజ్జుంటున్నా.. ఉదయం కాల్ చేస్తానూ.. లవ్యూ" స్వీటీ టెక్స్ట్. తల పైకెత్తితే అద్దంలో నేను. ముఖం కడుక్కుని తుడుచుకోడం మర్చిపోయినట్టుగా. "టూమచ్చాఫ్ ఫ్రెట్టింగ్ బడ్డీ.. తుడుస్తా ఉండు," అంటూ మంచం పక్కనే లుంగ చుట్టుకు పడున్న తన ఎర్రంచు తెల్ల పట్టు చీరని స్వీటీ అందుకోవడం నిన్నో, మొన్నో జరిగినట్టుంది. రోజులో ఇరవై మూడు గంటలు పరిగెత్తేస్తున్నాయి, ఈ ఒక్క గంటా తప్ప. ఇంటికెళ్ళి నిద్దరోతే, స్వీటీ కాల్ కే మళ్ళీ లేవడం.

ఆయనెవరో మహాకవి సంధ్యా సమస్యల గురించి కవిత్వం రాశాడు కానీ, నాకు మాత్రం తెల్లారుతూనే సమస్య మొదలవుతుంది. అటు చూస్తే డెనిమ్ జీన్సూ, ఇటు చూస్తే రేమాండ్ ట్రౌజర్స్.. ఇంకా కొత్త మెరుపు కూడా పోలేదు. కానీ, ఏం లాభం? ఎంత బలంగా ఊపిరి పీల్చుకున్నా బటన్ పట్టనంటుంది. వాటిని నిర్లిప్తంగా చూస్తూ, ఈ మధ్య కొనుక్కున్న ట్రౌజర్స్ నుంచి ఏదో ఒకటి పిక్ చేసుకోడం అలవాటైపోయింది. అదృష్టం బావుండి, షర్ట్స్ కి ఇంకా ఆ సమస్య రాలేదు. లేకపోతేనా? ట్రైనర్ రాక్షసుడు ఇంకెన్ని హింసలు పెట్టేవాడో. "మా వైజాగ్ లో బీచ్ ఉంది కదా.. రెగ్యులర్ గా రన్ చేసేవాడిని.. అందుకే ఇప్పటికీ నేను చాలా ఫిట్" టీమ్మేట్ పెళ్ళికాని ప్రవీణ్ ఎంత గర్వంగా చెప్పాడో, ప్రాజెక్ట్ మొదలైన కొత్తల్లో. "కమాన్ మేన్" అనాలనిపించినా, పైకి అనలేదు.

"మాణింగ్ బడ్డూ.. బ్రేక్ఫాస్ట్ ఏ రెస్టారెంట్ లో?" స్వీటీ పలకరింపు. "సలాడ్" అని చెబితే ఏమనేదో కానీ, నేను చెప్పలేదు. డాక్టర్ కబుర్లు అయ్యాక తనే అడిగింది "కొత్త ప్రాజెక్ట్ లో వర్క్ హెక్టిక్ గా ఉందా బడ్డూ?" అని.. దీనికీ సమాధానం చెప్పలేదు. ఒకప్పుడు 'బడ్డీ' అని ముద్దుగా పిలిచిన స్వీటీ, ఇప్పుడు 'బడ్డూ' అని అంతే ముద్దుగా పిలుస్తోంది. ముద్దుకి లోపం లేదు కానీ, పిలుపే.. ప్చ్. ప్రవీణ్ ని అయితే, "పెళ్లి కానీ, నీకూ తెలిసొస్తుంది" అని తిట్టేసుకున్నాను కానీ, అసలు పెళ్ళితో సంబంధం ఏముందీ? పెళ్ళయ్యాక కూడా మొన్నటి ప్రమోషన్ వరకూ ఆ డెనిమ్, రేమాండ్స్ చక్కగా సరిపోయాయి కాదూ? ఆ వేళ రెండు రకాల స్వీట్స్ తెప్పిస్తే కలీగ్స్ అంతా అనుమానంగా చూశారు, "ఒక్క ప్రమోషన్ కి రెండు స్వీట్సా?" అన్నట్టు. వద్దనుకుంటూనే ప్రవీణ్ చెవిలో వేశా, "ఇంట్లో కూడా ప్రమోషన్" అని. వందకోతులు కదూ. చూపించేసుకున్నాడు జాతి లక్షణం.

అసలు స్వీటీ సర్కిలే బోల్డంత పెద్దది. న్యూస్ మెలమెల్లగా అందరికీ తెలిసిపోయింది. అది మొదలు ఇంట్లో ఈట్ స్వీట్స్, డ్రింక్ స్వీట్స్. అక్కడికీ చాలాసార్లే చెప్పాను, "ఇవి నువ్వు తినడానికి స్వీటీ" అని. వింటే కదా.. పైగా "నీ కంట్రిబ్యూషనే కదా బడ్డీ.. కాబట్టి, నీకూ వాటా ఉంది" అని మురిపించేసింది. వాళ్ళ అన్న, తనని తీసుకెళ్ళడానికి వచ్చిన రోజున స్వీటీ కి ఇచ్చిన హగ్ నాకే చాలా ఆడ్ గా అనిపించింది. తనైతే కిసుక్కున నవ్వేసింది. "బేబీ బయటికి రాగానే నా టమ్మీ ఫ్లాట్ అయిపోతుంది. బట్, వాటెబౌట్ యువర్స్ బడ్డూ?" స్వీటీ లేని ఇంటికి ఆఫీస్ అవుతూనే వచ్చి మాత్రం ఏం చేస్తాను? బుద్ధిగా గూగుల్ చేస్తే బ్రహ్మాండమైన ఇన్ఫో దొరికింది. మా ఆఫీస్ కాంప్లెక్స్ వెనుకే ఉంది జిమ్. కొత్త ప్రాజెక్ట్ మొదలైన మొదటి వారంలోనే సైనప్ చేసేశా.

"గుడ్ ప్రోగ్రెస్ ఇన్ టు మంత్స్ యా.. కీప్ గోయింగ్," రాక్షసుడికి చీరప్ చెయ్యడం మాత్రమే వచ్చనుకున్నా, నవ్వడం కూడా తెలుసు. అబ్డామినల్ పూర్తి చేసి ముఖం తుడుచుకుంటూ అలవాటుగా ఫోన్ వైపు చూస్తే నాలుగు మిస్డ్ కాల్స్. స్వీటీ వాళ్ళన్న. సిజేరియన్ కి ప్రిపేర్ అవ్వమన్నారట డాక్టర్. ఎలా రెడీ అయ్యానో, జర్నీ ఎలా చేశానో అస్సలు గుర్తు లేదు. థియేటర్ బయట వెయిట్ చేస్తున్నారు అందరూ. "డోంట్ వర్రీ.. ఇట్స్ నార్మల్ డెలివరీ.. బై ద వే.. కంగ్రాట్స్.." డాక్టర్ చెబుతున్నవి పూర్తిగా అర్ధం కావడం లేదు. బెడ్ మీద వైట్ గౌన్ లో నీరసంగా స్వీటీ.. పక్కనే ఉయ్యాల్లో ఒత్తుగా వేసిన పక్క మధ్యలో చిన్న కదలిక.. గులాబీ రంగు పాదం,గాలికి కదులుతున్న గులాబి మొగ్గలా..స్వీటీ మగతలో ఉన్నట్టుంది.

ఉయ్యాల్లో సన్నని గొంతు కేర్ మంది. పాపని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకునే లోగానే, స్వీటీ కదిలింది "బడ్..డ్..డ్డీ" అంటూ. పాపని, తనని మార్చి మార్చి చూసుకుంటున్నా మురిపెంగా.. మళ్ళీ పిలిచింది. చాలా మాట్లాడాలని ఉంది..కానీ, మాటలు రావడం లేదు. "బడ్డీ" ..నా మోకాలి పైన చుర్రుమంది. "కొత్త ప్రాజెక్ట్ ఇదేనా?" నీరసంగా అడుగుతోంది స్వీటీ. అప్పుడు చూసుకున్నా, నేను వేసుకున్నది నా లాస్ట్ బర్త్ డే కి స్వీటీ కొన్న డెనిమ్. "లవ్ లీ" అంది తను. "ఎస్.. షీ ఈజ్ లవ్ లీ" అన్నాను, పాపని తనకి చూపిస్తూ.

(మిత్రులందరికీ 'వేలంటైన్స్ డే' శుభాకాంక్షలు!!)

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

సీత జడ

ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తగల అవతార పురుషుడు కాదు జానకి రామారావు. ఎమ్మే పాసయ్యి, ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ, అమెరికా వెళ్లి పై చదువులు చదవాలని ఆశపడే మధ్యతరగతి మనిషి. కానీ అతగాడి పల్లెటూరి ఇల్లాలు సీతది మాత్రం అచ్చంగా సీత జడే. ఆ జడని చూస్తే అతగాడికి అప్పుడప్పుడూ సరసం, మిగిలినప్పుడంతా విరసమూను. 'దీని పొగరంతా దీని జడలో ఉంది' అని లోలోపలే పళ్ళు నూరుకుంటూ ఉంటాడా సగటు భర్త. రామాయణంలో సీతకి మల్లేనే ఈ సీతకి కూడా ప్రకృతంటే వల్లమాలిన అభిమానం.

రైలు ఆగీ ఆగడం, పుట్టింటి ఉత్సాహంతో తణుకు ప్లాట్ఫాం మీదికి బంతిలా గెంతిన సీత అప్పటినుంచీ మొగుడి మాట బొత్తిగా పట్టించుకోడం మానేస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండుకి, అక్కడి నుంచి ఎర్ర బస్సెక్కి పల్లెటూరికి చేసిన ప్రయాణంలో జానకి రామారావుని ఏమాత్రం ఖాతరు చేయదామె. దానితో జానకి రామారావు పరిస్థితి గొప్పింటి స్త్రీని ప్రాణాలకి తెగించి అనుసరించి వెళ్ళే బానిస ప్రియుడిలా ఉంది తప్ప, అత్తారింటికి వెంట బెట్టుకుని వెళ్ళే హైక్లాసు పురుషుడిలా ఏమాత్రమూ లేదు.

ఇంతకీ అతనా పల్లెటూరికి వెళ్ళడం అదే మొదటిసారి. గురజాడ వారి గిరీశం లాగే పల్లెటూళ్ళో క్యాంపెయిన్ కి అవకాశం ఉండదు అనుకున్నాడు కానీ, గుమ్మంలో ఎదురొచ్చిన మరదలు సత్యవతిని చూసి కళ్ళు తిప్పుకోలేక పోతాడు జానకి రామారావు. సత్యవతి, సీతకి సయానా చెల్లెలు కాదు. పిన్ని కూతురు. చిన్నప్పుడే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్న సీతని ఆమె పిన్ని వరలక్ష్మే పెంచి పెద్ద చేసి, పెళ్లి చేయడం మాత్రమే కాదు, ఆమెకున్న కొద్దిపాటి ఆస్తినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. అదిగో, ఆ ఆస్తి అమ్మేసి, ఆ డబ్బుతో సీతని తీసుకుని అమెరికా వెళ్లిపోవాలి అన్నది జానకి రామారావు ఆలోచన. అందుకోసమే ఢిల్లీ నుంచి ఆ పల్లెటూరికి ప్రయాణం కట్టాడు.

మరదలు సత్యవతిని మొగుడు వదిలేశాడు అని తెలియగానే జానకి రామారావులో వంద ఆలోచనలు కలిగాయి. వాటిని ఇట్టే గ్రహించింది సత్యవతి. సీతా, వరలక్ష్మీ బయటికి వెళ్ళగా చూసి బావగారితో సరసం ఆడింది. అదే అదనుగా జానకి రామారావు 'అడ్వాన్సు' అవ్వబోయినప్పుడు, అతన్ని బయటికి పంపేసింది. ఆశ్చర్యంగా, ఆ రాత్రి సీతే స్వయంగా జానకి రామారావుని సత్యవతి గదిలోకి పంపి, బయటి నుంచి గడియ పెట్టి, వరలక్ష్మి పక్కలో చేరి భోరుమంది. పల్లెటూళ్ళో పుట్టి పెరిగి, ఢిల్లీ లో కాపురం చేసొచ్చి, చెట్టంత మగాడిని తన చెప్పుచేతల్లో పెట్టేసుకున్న ఆ జాణ, బేలగా ఎందుకు మారిపోయింది? సీత చేసిన ఆ పనికి పూర్వాపరాలు ఏమిటి? వీటికి సమాధానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగే 'సీత జడ' కథలో దొరుకుతాయి.

పురాణం సీత పేరుతో 'ఇల్లాలి ముచ్చట్ల'ను తెలుగు ప్రజలకి వినిపించిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాసిన 'సీత జడ' కథ మొదటి సగం 'ఇల్లాలి ముచ్చట్లు' పంథాలోనే సాగుతుంది. కథానాయిక సీత, చింతచిగురు పప్పు బ్రిలియంట్ గా వండగల సీతేనేమో అనిపిస్తూ ఉండగా కథాగమనం ఒక్కసారిగా మారిపోయి, పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేన్ని మలుపులు తిరిగి, 'సీత జడ' ఏమయ్యిందో చెబుతూ ముగుస్తుంది. కించిత్ నాటకీయతని సర్దుకుంటే, ఆపకుండా చదివించే కథ. 'జెయింట్ వీల్' లాంటి కథలున్న 'పురాణం సుబ్రహ్మణ్య శర్మ కథలు' సంకలనంలో ఉందీ కథ.

'రచయితగా పురాణం రెండు భిన్న సంస్కారాలు కలగలిసి పోయిన వ్యక్తి. ఒకవైపున విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం చాలా ఇష్టం. గురుభావం. మరోవైపు, శ్రీశ్రీ, కుటుంబరావు, చాసో, రావిశాస్త్రి అంటే ప్రాణమే. అసలు పురాణం స్వభావంలోనే ఒక తీవ్రత ఉంది,' అంటూ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ చెప్పిన ముందుమాట లోని మర్మం అర్ధం కావాలంటే 'సీత జడ' కథ చదవాల్సిందే. ('పురాణం సుబ్రహ్మణ్య శర్మ కథలు,' నవోదయ బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 411, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

అడవి శాంతిశ్రీ - అంశుమతి

చారిత్రిక నవలలు రాయడంలో అడివి బాపిరాజుది ప్రత్యేకమైన శైలి. ఎప్పుడో ఎక్కడో జరిగిన కథని పాఠకులకి తను వివరిస్తున్నట్టుగా కాకుండా, కథా స్థలంలో తను స్వయంగా నిలబడి పాత్రలని, సన్నివేశాల్నీ పరికించి చూస్తూ ఒక్కో వ్యక్తిని గురించీ, సంఘటనని గురించీ విపులంగా చెబుతున్నట్టుగా ఉంటాయవి. ఆంధ్ర పాలకుల చరిత్రలని అందమైన నవలలుగా మలచిన బాపిరాజు కలం నుంచి వెలువడిన రెండు నవలలు 'అడవి శాంతిశ్రీ' 'అంశుమతి.' బాపిరాజు సాహిత్యాన్ని నవతరం పాఠకుల కోసం మళ్ళీ ముద్రించి అందిస్తున్న 'విశాలాంధ్ర' ఆరో సంకలనంగా ఈ రెండు నవలల్నీ కలిపి విడుదల చేసింది.

ఆంధ్ర పాలకులు అనగానే మొదట గుర్తొచ్చేది శాతవాహనులే. తొలితరపు శాతవాహనుల పాలనా వైభవాన్ని 'హిమబిందు' నవలలో అందంగా చిత్రించిన బాపిరాజు, శాతవాహనుల అవసాన దశని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవల 'అడవి శాంతిశ్రీ.' శాతవాహనుల్లో బలవంతుడైన చివరి చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి పాలన కథా కాలం. యజ్ఞశ్రీ అల్లుడు, అతి బలవంతుడూ అయిన ఇక్ష్వాకు శాంతిమూల ప్రభువు, వృద్ధుడైన చక్రవర్తికి అండదండగా నిలబడి రాజ్యానికి కాపు కాస్తూ ఉంటాడు. శాంతిమూలుడికి అభిమాన పాత్రుడైన శాతవాహన సామంతుడు అడవి బ్రహ్మదత్త ప్రభువు.

తను సృష్టించే కథానాయక పాత్రల మీద అపరిమితమైన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోని బాపిరాజు, అదే ధోరణి ని కొనసాగించారు ఈ నవలలో కూడా. 'అడవి బ్రహ్మదత్త ప్రభువు ఉత్తమ కవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతి విశారదుడు. అతనికి కవిత్వావేశం కలిగితే ఆంద్ర ప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాధలు, కావ్యాలు సృష్టిస్తాడు. అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతి సేనాపతిత్వాన్ని మరచిపోతాడు. ఆపస్తంబ సూత్రుడు, కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి' నవల ప్రధమ భాగంలో ప్రారంభ వాక్యాలు ఇవి. ఇంతటి ఉత్తముడైన బ్రహ్మదత్త ప్రభువుని తన అల్లుడిగా చేసుకోవాలన్నది ఇక్ష్వాకు శాంతి మూలుడి కోరిక.


శాంతిమూలుడికి పట్టమహిషి సారసికాదేవికి కలిగిన కుమార్తె శాంతిశ్రీ. సారసికా దేవి, బౌద్ధ మతావలంబకులైన మాఠరీ ప్రభువుల ఆడపడుచు. తండ్రి హైందవ ధర్మం ఆచరిస్తున్నా, తల్లి ప్రభావంతో బౌద్ధం మీద ఆరాధన పెంచుకున్న శాంతిశ్రీ ఐహిక బంధాలని విడిచిపెట్టి బౌద్ధ భిక్కుణి గా మారాలని తలపోస్తుంది. కుమార్తె మనసు మార్చడం ఎలా అన్నది శాంతిమూలుడిని వేధిస్తున్న సవాలు. బాగా ఆలోచించి, ఆమెని అవివాహితుదైన అడవి బ్రహ్మదత్తుడి దగ్గర శిష్యరికం చేయవలసిందిగా ఆదేశిస్తాడు. తొలిచూపులోనే శాంతిశ్రీతో ప్రేమలో పడతాడు బ్రహ్మదత్తుడు. గురువు యెడల భక్తితో మెలిగే శాంతిశ్రీలో ప్రేమ భావనలు ఏమాత్రం లేవు. ఈ విషయాన్ని గ్రహించ గలిగాడు బ్రహ్మదత్తుడు.

చక్రవర్తి యజ్ఞశ్రీ మరణించడంతో, అతని కుమారుడు విజయశ్రీ ధాన్యకటక సింహాసనం అధిష్టించడం, కొన్నాళ్ళకే అతడు మరణించడంతో, అతని కుమారుడు, అయోగ్యుడు అయిన చంద్రశ్రీ ని సింహాసనం పై నిలిపి పాలన భారం మొత్తం తనే వహిస్తూ ఉంటాడు శాతిమూలుడు. అడవి బ్రహ్మదత్తుడు ఆ మహారాజుకి కుడి భుజం. శాతవాహన వంశం అంతరించాక, ధాన్యకటకం ఎవరి ఏలుబడిలోకి వచ్చింది? వివాహాన్ని గురించీ, ఆర్ష ధర్మాన్ని గురించీ శాంతిశ్రీ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? ఇత్యాది ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ముగుస్తుందీ నవల. బాపిరాజు మిగిలిన నవలల్లాగే, మొదటి ఇరవై పేజీలని ఓపికగా చదివితే అటుపై జవనాశ్వంలా పరిగెత్తే కథనం ఆపకుండా చదివిస్తుంది మిగిలిన పేజీలని. మొత్తం 226 పేజీలున్న ఈ నవలలో అనేక సన్నివేశాలు 'హిమబిందు' నవలని పదేపదే గుర్తు చేశాయి.

విష్ణు కుండినులలో చివరి వాడైన మాచర భట్టారకుని ఏకైక కుమార్తె అంశుమతీదేవి ప్రేమకథ 'అంశుమతి' నవలిక. యాభైమూడు పేజీల ఈ నవలికని తన అర్ధాంగి సుభద్రకి అంకితం ఇచ్చారు బాపిరాజు. సౌందర్యవతి అయిన అంశుమతి ని వివాహం చేసుకుంటామంటూ ఎందరో రాకుమారులు వర్తమానం పంపుతున్నారు మాచన భట్టారకుడికి. అందాలరాశి అంశుమతితో పాటు, మహారాజుకి పుత్ర సంతానం లేని కారణాన వేంగీ సామ్రాజ్యం కూడా తమ వశమవుతుందన్నది వారిలో చాలామంది ఆలోచన. యువరాణి అంగీకారం కోసం ఎదురుచూస్తున్న రాకుమారుల్లో దుర్మార్గుడైన కళింగ యువరాజు కూడా ఉన్నాడు.

పృధ్వీ వల్లభ వాతాపి నగర చక్రవర్తి చిన్నతమ్ముడు విష్ణు వర్ధనుడు. వాతాపి నగర చాళుక్య చక్రవర్తులు అందరూ ఆరడుగుల పొడవు వారు. కానీ, విష్ణు వర్ధనుడి ఎత్తు మాత్రం కేవలం నాలుగడుగుల పదకొండు అంగుళాలు. ఈ కారణానికి ఇష్టులు అతన్ని 'కుబ్జ విష్ణు వర్ధనుడు' అనీ, శత్రువులు 'పొట్టి చాళుక్యుడు' అనీ అంటూ ఉంటారు. ఏ ఆడపిల్లా తక్కువ ఎత్తున్నతనని ప్రేమించ లేదు అనే సందేహంతో అవివాహితుడిగా ఉండిపోయి, రాజ్యవిస్తరణ చేస్తూ ఉంటాడు విష్ణువర్ధనుడు. కళింగ యువరాజు కారణంగా ఒకరికి ఒకరు తారస పడతారు అంశుమతి, విష్ణువర్ధనుడు. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. కానీ చిత్రంగా ఇద్దరికీ ప్రేమ భావనలు అంకురిస్తాయి. వారి ప్రేమకథ ఏ మలుపు తిరిగింది అన్నదే 'అంశుమతి' నవలిక ముగింపు. 'గోన గన్నారెడ్డి' నవలని గుర్తు తెచ్చే కథనం. ఆంధ్ర పాలకులందరి కథల్నీ బాపిరాజు నవలలుగా మలచి ఉంటే బావుండేది కదా.. (అడవి శాంతిశ్రీ - అంశుమతి, విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 284, వెల రూ. 160, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

యాత్రాస్మృతి

జీవితం అంటే ఒక యాత్ర. ఆద్యంతాలు తెలియని ప్రయాణం. అందరూ చేసేదే.. కానీ కొందరుంటారు. వాళ్ళు యాత్రలో ప్రతి మజిలీనీ అనుభవించి, ఆస్వాదించి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోడమే కాదు, భవిష్యత్ తరాలకి వాళ్ళ జ్ఞాపకాలని అందంగా అందిస్తారు కూడా. అలాంటి ఓ యాత్రికుడి అనుభవాల, అనుభూతుల సమాహారమే 'యాత్రాస్మృతి.' దాశరథి కృష్ణమాచార్య పేరు వినగానే లలితలలితమైన సినీ గీతాలు, విప్లవాన్ని కాంక్షించే 'అగ్నిధార' లూ, 'రుద్ర వీణా'లాపనలూ ఏకకాలంలో గుర్తొస్తాయి.

గాలిబ్ గీతాలని తెలుగు లోగిళ్ళలోకి తీసుకొచ్చిన ఈ సుకుమారుడే, 'నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో; అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను; నిప్పుల్ వోసి హేమంత భామా గాంధర్వ వివాహమాడెదను' అంటూ 'అంతర్నాదా'న్నీ వినిపించారు. 'గోరొంక గూటికే చేరావు చిలకా' 'పాడెద నీ నామమే గోపాలా' లాంటి సుతిమెత్తని గీతాలు రాసిన కవే, స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహిగా జైలు జీవితం గడిపి, నిజాముకి వ్యతిరేకంగా గొంతెత్తి పాడారన్నది ఒక్కటే కాదు, కృష్ణమాచార్య జీవితం అడుగడుగూ ఆశ్చర్యాలమయమే.

సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టి పరమశివుణ్ణి భక్తిగా కొలవడం మొదలు దుర్భర జైలు జీవితం అనుభవించే సమయంలో మోదుగు పూలను చూస్తూ చిలిపి ఊహల్లోకి వెళ్ళడం వరకూ.. ఎన్నని చెప్పాలి? తన యాభై ఐదో ఏట 'యాత్రాస్మృతి' రాయడం ఆరంభించిన కృష్ణమాచార్య 'యాభై ఐదులో రెండు అయిదులున్నాయి కదా! ఐదు తో ఐదు ప్లస్ చేస్తే బాల్యం (పదేండ్లు). ఐదు తో ఐదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక) ఐదు పక్కన ఐదు వ్రాస్తే యాభై ఐదు. వార్ధక్య ద్వారం!' అంటూ వేసిన చమత్కార బాణం, పాఠకుల్ని అలవోకగా పుస్తకంలోకి తీసుకుపోతుంది. 'ఒకే వస్తువు చలికాలంలో వేడిగా, ఎండాకాలంలో చల్లగా ఉండడం ప్రకృతిలో విశేషం. వటచ్చాయ, కూపోదకం, తాంబూలం.. నాలుగవది తమకు తెలిసిందే..' లాంటి చమక్కులకి లోటు లేదు.


ఆకాశవాణి కోసం రాసిన 'తుంగభద్ర' నాటకంలో భద్ర పాత్ర పోషించిన శారదాశ్రీనివాసన్ ని మనసారా మెచ్చుకోవడం లోనూ, సురవరం ప్రతాపరెడ్డి రాసిన 'మొగలాయి కథలు' ని పరిచయడంలోనూ దాశరథి వారి సున్నితత్వం కనిపిస్తే, ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా జైల్లో నిరసన దీక్షలో పాల్గోవడం ఆయన పట్టుదలని పట్టి చూపుతుంది. జైలు జీవితాన్ని గురించీ, రజాకార్ల ఆగడాలు, హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనమైన వైనాన్నీ విశదంగా చెప్పారు ఈ రచనలో. కేవలం తెలుగు కవిత్వాన్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ కవితలు ఎన్నింటినో స్పృశించారు ఈ రచనలో.

తన సోదరుడు రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు', సమకాలికుడు వట్టికోట ఆళ్వారు స్వామి 'ప్రజల మనిషి' నవలల్లో ఉండే సామ్యాలని గురించి మాత్రమే కాదు, ఆరుద్ర 'త్వమేవాఽహమ్' లోతుల్నీ పరిచయం చేశారు దాశరథి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆరుద్ర రచనని అర్ధం చేసుకోవాలి అంటారు కృష్ణమాచార్య. మొత్తం పుస్తకాన్ని అరవై చిన్న చిన్న అధ్యాయాలుగా విభజించి, ప్రతి అధ్యాయానికీ సరిపోయే విధంగా ఉండే దాశరథి కవితని జతచేశారు ప్రకాశకులు 'తెలుగు సమితి' వారు. చివర్లో జోడించిన చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణ.

'ఈ యాత్రాస్మృతి వ్యాసాలలో డాక్టర్ దాశరథి ఆనాటి తెలంగాణ పరిస్థితులను, నిరంకుశ పరిపాలన కింద నలిగిపోయిన ప్రజల ఇక్కట్టులను, రాక్షసమైన యేలుబడిలో అణచి వేయబడిన ప్రజల భాషల దయనీయ స్థితిని, సంస్కృతిని, ఆనాటి చెరసాల లోని పరిస్థితులను, ఏవిధమైన ప్రాథమిక స్వత్వాలు లేని సమాజాన్ని చక్కగా చిత్రించినాడు,' అన్నారు దేవులపల్లి రామానుజరావు, 1988 లో వెలువడిన తొలి ప్రచురణకి రాసిన ముందుమాటలో. 'మహారచయిత టాల్ స్టాయ్ యుద్ధము శాంతిగా పర్యవసించడాన్ని ఒక నవలగా రాశాడు. కాని దాశరథి విషయంలో 'యుద్ధము-శాంతి' ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి. ఈ యాత్రాస్మృతి ఆ శాంతాశాంతాలకొక అభిజ్ఞ' అంటారు వాడ్రేవు చినవీరభద్రుడు తాజా ముద్రణకి రాసిన ముందుమాట 'మహాంధ్రకవి' లో. అవుననకుండా ఉండలేం, 'యాత్రాస్మృతి' పూర్తి చేసి పక్కన పెట్టాక. (పేజీలు , 247, వెల రూ. 100, ఎమెస్కో ద్వారా లభ్యం).