శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

మెలకువ

చదువుతున్నంత సేపూ సాధారణంగానే అనిపించిన కథ, పుస్తకం పక్కన పెట్టాక కూడా మన ఆలోచనల్లో ఏదో మూల నేనున్నానంటూ స్థిరపడి పోయి తరచుగా గుర్తొస్తోందంటే అది మామూలు కథ కాదన్న మాట. ఏదో ప్రత్యేకత ఆ కథని వేరుగా నిలబెట్టిందన్న మాట. ఇలాంటి కథలు ఒకటీ రెండూ కాదు, పదికి పైగా ఉన్న సంకలనం 'మెలకువ.' అన్నీ చిన్న కథలే. పాత్రలు కూడా మనకి నిత్య జీవితంలో తరచుగా తారస పడేవీ, మనం పెద్దగా పట్టించుకోనివీను. అయితేనేం, చదవడం పూర్తి చేశాక ఆ కథలూ, పాత్రలూ కొన్నాళ్ళ పాటైనా విడవకుండా వెంటాడతాయి మనల్ని.

తెలుగు సాహిత్యం చదివే వాళ్లకి పి. సత్యవతి అనే పేరుని పరిచయం చేయబోవడం సాహసమే అవుతుంది. 'సత్యవతి కథలు' 'ఇల్లలకగానే' 'మంత్రనగరి' కథా సంకలనాల తర్వాత, ఆమె వెలువరించిన నాలుగో సంకలనం 'మెలకువ.' మొత్తం పద్నాలుగు కథలున్న ఈ సంకలనంలో మొదటగా ఆకర్షించేది జీవిత చిత్రణ. పుస్తకం పేరే శీర్షికగా ఉన్న 'మెలకువ' కథనే తీసుకుంటే, ప్రధానపాత్ర 'సుశీలమ్మ పెనిమిటి' లాంటి వాళ్ళు ప్రతిచోటా కనిపిస్తారు. పేరు, డబ్బు, హోదా అన్నీ ఉన్నా ఎవరినీ కలుపుకు పోలేని అతని తత్త్వం అతగాడిని 'ఈశ్వర్' గా కాక 'సుశీలమ్మ పెనిమిటి' గా గుర్తింపబడేలా చేసింది. అతనిలో కలిగిన 'మెలకువ' ఏమిటన్నది ముగింపు. 

మిగిలిన కథల్లో మొదటగా చెప్పుకోవాల్సింది 'భార వాహిక.' అపార్ట్మెంట్ జీవితాలని గురించి చాలా మంది కథలు రాసినా, ఇదో కొత్తకోణం. ఈ కథ అపార్ట్ మెంట్ జీవితానికి సంబంధించిందే. అపార్ట్ మెంట్ లో ఉండే దుర్గ కథ. వాచ్మన్ భార్య దుర్గ. నాలుగు ఫ్లాట్ల వాళ్లకి పని మనిషి, మొత్తం అన్ని ఫ్లాట్ల వాళ్ళకీ బట్టలు ఇస్త్రీ చేసే మనిషీ కూడా. పేరుకి ఆమె భర్త పానకాలు వాచ్మన్ అయినా, ఆ పని కూడా ఆమెదే. అతగాడు తాగేసి పడుకుంటే ఆ లోపాన్ని కమ్ముకు వచ్చేసే నోరున్న మనిషి. ఇద్దరు పిల్లల్ని పోషించడమే గగనంగా ఉన్న సమయంలో, తన కొద్దిపాటి ఆస్తీ కూతురికి ఇచ్చేసి, అల్లుడు గెంటేయడంతో కొడుకుని వెతుక్కుంటూ వచ్చిన పానకాలు తండ్రిని దుర్గ ఎలా ఆహ్వానించింది అన్నదే ఈ కథ. దుర్గని మర్చిపోవడం అంత సులభం కాదు.


'కాడి' కథలో స్వర్ణ, 'మూడేళ్ళ ముచ్చట' కథలో భవాని, 'పేపర్ వెయిట్' కథలో సూర్యుడు, 'రత్నపాప' కథలో రత్న.. నలుగురూ ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళే. వీళ్ళలో స్వర్ణ, భవానీ ఉన్నంతలో బాగా బతకాలి అనుకుంటే, సూర్యుడు ఒళ్ళు దాచుకోకుండా పని చెయ్యాలి అనుకునే అమ్మాయి. ఇక, రత్న పూర్తిగా తల్లి చాటు బిడ్డ. పేదరికం ఒక్కటే వీళ్ళలో సామ్యం. వీళ్ళ వ్యక్తిత్వాలు, ఆలోచనలు అన్నీ ఎవరివి వారికే ప్రత్యేకం. స్వర్ణ తల్లి స్వర్ణకి దన్నుగా నిలబడితే, రత్న తల్లి తీసుకున్న నిర్ణయం ఆమెని తన గురించి తను ఆలోచించుకునేలా చేసింది. 'పేపర్ వెయిట్' కథ చివర్లో సూర్యుడి వ్యక్తిత్వం తళుక్కున మెరిస్తే, 'మూడేళ్ళ ముచ్చట' కథలో భవాని నిర్ణయం 'తొందరపాటేమో కదూ' అనిపిస్తుంది.

'ఆవిడ' 'నాన్న' కథలు ఒకే నాణానికి బొమ్మా బొరుసూలా అనిపిస్తాయి. వీటిలో 'నాన్న' కథ 'మేఘ సందేశం' సినిమాని జ్ఞాపకం చేస్తుంది. అలాగే 'ఒక రాణీ-ఒక రాజా' కథ కొంతవరకూ 'బొమ్మరిల్లు' సినిమాని గుర్తు చేస్తుంది. అయితే ఆ సినిమా కన్నా ముందే ఈ కథ రాశారు సత్యవతి. సంకలనంలో మొదటి కథ 'భాగం,' చెప్పీ చెప్పకుండా కథని చెప్పేశారు. పాత్రల సంభాషణల కన్నా 'నువ్వులు ఎక్కువగా వేసి చేసిన నేతి అరిసెలు' ఎక్కువ కథ చెబుతాయి. మిగిలిన కథల కన్నా ప్రత్యేకంగా, కవితాత్మక ధోరణి లో సాగే కథ 'నేనొస్తున్నాను..' కథకన్నా, కథనం ఆకట్టుకుంటుంది. మిగలిన కథలు సాధారణంగానే అనిపించాయి, వీటితో పోల్చినప్పుడు.

మొత్తం మీద చూసినప్పుడు, సత్యవతి కథల్లో పాత్రలు కాల్పనికం అనిపించవు. వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అనడం కూడా అసత్యమే. ఎందుకంటే, వాస్తవికంగా ఉండే పాత్రలు. ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న పాత్రలు. నాటకీయమైన మలుపులు, సంభాషణలూ కనిపించని కథలివి. ఈ కథల్లో పాత్రలు ఆదర్శాలు మాట్లాడవు. ఉపన్యాసాలు ఇవ్వవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి అంతే. కథలు చదివాక, మన చుట్టూ ఉండే.. మనం రోజూ చూసే మనుషులనే కొత్తగా చూడడం మొదలు పెడతాం. (నవోదయ పబ్లిషర్స్ ప్రచురణ, పేజీలు 120, వెల రూ. 60, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి