మంగళవారం, జూన్ 24, 2014

తెరచాటు రచయిత

కొందరు రచయితలకి సంబంధించి కొన్నికొన్ని ఫిర్యాదులు అలా ఉండిపోతాయి. వీటిలో చాలా ఫిర్యాదులకి కారణం ఆయా రచయితలో లేక వారి రచనలో అవుతాయి. కానీ, పాలగుమ్మి పద్మరాజు విషయానికి వచ్చేసరికి మాత్రం, ఆ కారణం పాఠకులు. ఎందుకంటే, పద్మరాజు విషయంలో ఫిర్యాదు ఆయనకి రావలసినంత పేరు రాలేదని!! కథ, నవల, నాటకం, కవిత్వం, వ్యాసాల రచన, సినిమా స్క్రిప్టు, గీత రచన, దర్శకత్వ బాధ్యతలు.. ఇలా ఎన్నెన్నో పనులని సవ్యసాచిలా నిర్వహించి, చాలా పనులకి తనపేరు తనే దాచేసుకుని మరొకరి పేరు వేసుకోనిచ్చి, తెలుగు వారికి చదివి తీరవలసిన సాహిత్యాన్ని మిగిల్చి కీర్తి శేషులయ్యారు పద్మరాజు.

జయదేవుని అష్టపది 'ప్రియే.. చారుశీలే..' లో కొన్ని పంక్తుల్ని 'పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు.. కలికి నా ఎడద చీకటుల పోద్రోలు..' 'కౌగిలిని నలుగనీ.. పలుగాట్ల సిలుగనీ.. గాటంపు సుఖము నాకటులైన కలుగనీ..' అంటూ అలవోకగా తెనిగించడం పద్మరాజు ప్రతిభకి కేవలం ఓ అతిచిన్న తార్కాణం. తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే వారందరూ మొదట తలిచేపేరు దేవులపల్లి కృష్ణశాస్త్రిది. ఆ కృష్ణశాస్త్రి అభిమాన కవి, రచయితా పాలగుమ్మి పద్మరాజు!! "ఇతని వద్దనే, ఇతని ప్రక్కనున్నపుడే, నేను చిన్నవాడనుగా నాకు నేనే కనిపిస్తాను," అన్నారు కృష్ణశాస్త్రి. పద్మరాజు కవిత్వాన్ని గురించి చెప్పడానికి ఇంతకన్నా మరో మాట అవసరం లేదు బహుశా.

తెలుగు కథ అనగానే మొదట తలచుకోవాల్సిన పేర్లలో ఉండి తీరవలసిన పేరు పాలగుమ్మి పద్మరాజు. చాలా కథల్ని 'పా.ప' అనే పొట్టి పేరుతో రాశారు. కేవలం ఓ 'గాలివాన' ఓ 'పడవ ప్రయాణం' ఓ 'ఉద్వేగాలు' మాత్రమే కాదు, మానవ మనస్తత్వాన్ని కథావస్తువుగా చేసుకుని ఎన్నో లోతైన, గొప్పవైన కథలల్లారు పద్మరాజు. కథ చదవడం పూర్తి చేసిన చాలా సేపటి వరకూ, ఆ కథ తాలూకు భావ సంచలనం నుంచి పాఠకుడు బయటికి రాలేనివిధంగా ఉంటాయి పద్మరాజు కథలు. అందుకే, ఈయన సంకలనంలో కథలన్నీ ఏకబిగిన చదవడం అన్నది సాధ్యం కాని పని. ప్రతి కథా మళ్ళీ మళ్ళీ చదివించేదే, చదవాల్సిందే.


పద్మరాజు నవలల్లో ముందుగా చెప్పుకోవాల్సింది 'రామరాజ్యానికి రహదారి' గురించి. భారత స్వతంత్ర పోరాటం నేపధ్యంలో సాగే కథ. ఎన్నోపాత్రలు. రకరకాల మనస్తత్వాలు. నవలలో కథని ఒక్కో పాత్ర చేత కొంచం కొంచం చెప్పించారు పద్మరాజు. స్వతంత్ర పోరాటంలో  భాగంగా జరిగిన ఉద్యమాలు, వాటి వెనుక రాజకీయాలు, రెండు మూడు దశాబ్దాల కాలంలో ఓ పల్లెటూళ్ళో వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ మార్పులు.. వీటన్నింటినీ నిశితంగా చిత్రించిన నవల ఇది. 'ఓడ్ హౌస్'  తరహా హాస్యం 'బతికిన కాలేజీ' లో కనిపిస్తుంది. ఇక, 'నల్లరేగడి' అయితే అచ్చంగా సినిమా కథే. సినిమా కూడా వచ్చింది, ఈ నవల ఆధారంగా. 'భక్త శబరి' స్క్రిప్టు పద్మరాజుదే.

'మేఘసందేశం' తో సహా ఎన్నో సినిమాలకి దాసరి నారాయణరావు దగ్గర పనిచేశారు పద్మరాజు. ఆ సినిమాల కోసం రాసిన పాటల్లో ఆయన పేరుతొ వెలుగు చూసినవి కేవలం కొన్ని మాత్రమే. 'మేఘ సందేశం' లో ఎన్నో ఫ్రేముల వెనుక పద్మరాజు కృషి ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు లోకేషన్ల ఎంపిక వరకూ ఆయన తలకెత్తుకోని బాధ్యత లేదు. కానీ, టైటిల్స్ లో ఒక్క 'పద్యాలు' కి మాత్రమే ఆయన పేరు కనిపిస్తుంది. 'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లో 'రాకోయీ అనుకోని అతిథీ..' రాసిన పద్మరాజే 'బుచ్చిబాబు' కోసం 'సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి..' రాశారు!! ఇక, ఇతరత్రా పేర్లతో చలామణీ అయిన పాటల లెక్క తేలకపోవచ్చు ఎప్పటికీ.

పద్మరాజు రచనలు ఏమీ చదవని వాళ్ళు చాలా సులువుగా అనేయగలిగే మాట "ఇంగ్లీష్ నుంచి కాపీ కొట్టాడు" అని. ఇది ఎంతటి అపవాదో తెలుసుకోడానికి ఒకటే మార్గం, పద్మరాజు రచనలన్నీ చదవడం. ఏదన్నా విదేశీ కథో, నాటకమో చదివినప్పుడు తనకి 'ఫ్లాష్' అయ్యే ఆలోచనతో పాటే, ఆ ఆలోచనకి నేటివిటీని అద్దడాన్ని పూర్తి చేస్తారు పద్మరాజు. గత నాలుగైదు ఏళ్ళుగా పద్మరాజు సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్న విశాలాంధ్ర పుస్తకాలయం ప్రచురించిన 'పాలగుమ్మి పద్మరాజు రచనలు-4' లో వ్యాసాలు, కవితలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 'రోజువారీ ఊహలు' పేరిట ఉన్న డైరీ పేజీలని చదివితే పద్మరాజు రచనలు ఎలా పుట్టాయో అర్ధమవుతుంది. (పేజీలు  198, వెల రూ. 100)

విదేశీ నవలల్నీ, కథల్నీ తనదైన శైలిలో అనువదించారు పద్మరాజు. 'చచ్చిపోయిన మనిషి' నవల ఓ ఉదాహరణ. 'చచ్చి సాధించాడు' అనే డిటెక్టివ్ నవల, 'రెండవ అశోకుడి మూన్నాళ్ళ పాలన' అనే వ్యంగ్య నవల కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 'రెండవ అశోకుడి..' నవల రాజకీయాల మీద సెటైర్. ఏళ్ళు గడిచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ప్రాధమిక విద్యాభ్యాసం లోనే పద్య రచన ప్రారంభించిన పద్మరాజు, చివరి రోజుల వరకూ రచనని విడిచిపెట్టలేదు. తన అరవై ఎనిమిదో ఏట హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. ఇవాల్టి నుంచి పద్మరాజు 'శతజయంతి' సంవత్సరం ఆరంభం. పాలగుమ్మి పద్మరాజు సమగ్ర సాహిత్యం ఇంతవరకూ వెలుగు చూడకపోవడం పాఠకుల దురదృష్టం. కార్య నిర్వహణకి ఈ ఏడాదిని మించిన తరుణం మరొకటి ఉండబోదు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తూ...

బుధవారం, జూన్ 18, 2014

గురజాడ అడుగుజాడ

మహాకవి గురజాడ అప్పారావు నూట యాభయ్యో జయంతి (2012) సందర్భంగా రచయిత్రి ఓల్గా వెలువరించిన సాహిత్య వ్యాసాల సంకలనం 'గురజాడ అడుగుజాడ.' గురజాడ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం' నాటకం. ఒక్కమాటలో చెప్పాలతో గురజాడ మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, 'కన్యాశుల్కం' నాటకం ఒక్కటీ ఒక ఎత్తు. అర్ధం చేసుకోగలిగిన వారికి అర్ధం చేసుకోగలిగినంత. సమకాలీనం కాదనో, మరొకటనో పక్కన పెట్టేవారితో ఎలాగో ఏ పేచీ లేనే లేదు.

అత్యంత సహజంగానే ఓల్గా తన వ్యాసాల్లో కూడా 'కన్యాశుల్కం' కి పెద్ద పీట వేశారు. మొత్తం తొమ్మిది వ్యాసాలున్న ఈ సంకలనంలో ఆరు వ్యాసాలు 'కన్యాశుల్కం' నాటకాన్ని గురించీ, అందులోని పాత్రలని గురించీ ఉన్నాయి. 'మధురవాణి' అభిమానులకి మనసు నిండిపోయే వ్యాసం 'మానవత్వం పరిమళించే మధురవాణి' ఈ సంకలనంలో మొదటి వ్యాసం. "కన్యాశుల్కం ఆచారానికి బలైపోయిన బుచ్చెమ్మనూ, బలి కాబోతున్న సుబ్బినీ, వేశ్య అయిన మధురవాణి రక్షించడమే కన్యాశుల్క నాటక సారాంశం. అణచివేతకి గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే ఆ అణచివేత నుండి బయటపడగలరనే ఆశను కల్పించింది మధురవాణి" అంటారు ఓల్గా.

'బాల్య వివాహాల చర్చ - కన్యాశుల్కం' 'కన్యాశుల్కం - కుటుంబ వ్యవస్థ' ఈ రెండూ 'కన్యాశుల్కం' నాటక రచనా కాలం నాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులని లోతుగా చర్చించిన వ్యాసాలు. వృద్ధుడైన లుబ్దావధాన్లు పసిపిల్ల సుబ్బిని వివాహం చేసుకోవడం ద్వారా అటు సుబ్బి మీద, ఇటు తన కూతురు మీనాక్షి మీద పెత్తనం చేయాలనుకోడాన్ని విశ్లేషిస్తూ "ఇద్దరు స్త్రీలను రెండు భిన్న ప్రయోజనాలు కలవారిగా విభజించి పాలించడానికి హిందూ కుటుంబంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి" అంటారు రచయిత్రి.

ఇక, "కన్యాశుల్కం నాటకంలో కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించటమంటే మొత్తం పితృస్వామిక వ్యవస్థను గురించి ఆలోచించటమే అవుతుంది. అప్పటికి అమలులో ఉన్న కుటుంబ వ్యవస్థనూ, రాబోయే మార్పులనూ, మధ్యలో సంధి దశనూ సమర్ధవంతంగా ప్రతిఫలించిన నాటకం కన్యాశుల్కం" అన్న విశ్లేషణతో ఏకీభవించకుండా ఉండలేం. పూటకూళ్ళమ్మ, అసిరి, బైరాగి.. ఈ మూడూ కూడా చాలా చిన్నవిగా, నాటకాన్ని మొదటిసారి చదివినప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రల్లాగా అనిపిస్తాయి. ఒక్కో పాత్రనీ ఒక్కో వ్యాసంలో విశ్లేషించారు ఓల్గా.

నిజానికి గురజాడ వితంతువుల జీవితంలోని ఒక్కో పార్శ్వాన్ని ఒక్కో పాత్ర ద్వారా చిత్రించారు. బుచ్చెమ్మ, మీనాక్షి, పూటకూళ్ళమ్మ.. ముగ్గురూ వితంతువులే.. కానీ ముగ్గురివీ భిన్న జీవితాలు. "పూటకూళ్ళమ్మ గిరీశం తన ఇరవై రూపాయలూ అన్యాయంగా కాజేశాడని తెలియగానే అతన్ని తన్నడానికి చీపురు కట్టతో బయల్దేరింది. దెబ్బ రామప్పంతులికి తగిలింది గానీ తన్నే సమర్ధన పూటకూళ్ళమ్మ కి ఉందని నిరూపితమైంది. ఆ ధైర్యానికి కారణం ఆమె తన శ్రమను విలువకట్టి బతకడమే కావొచ్చు - అది గయ్యాళి తనం గా కనపడినా ఆమెకైతే ఒక  తెగింపు వచ్చింది" అన్నది ఓల్గా పరిశీలన.

'కన్యాశుల్కం' లోని బ్రాహ్మణ సమాజాన్ని బ్రాహ్మణేతర దృష్టి కోణం నుంచి చూపిన పాత్ర అసిరి. బహు చిన్నగా కనిపించే ఈ పాత్రని గురించి విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలు జరిగాయని విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది నాకు. ఓల్గా సైతం లోతైన పరిశీలన చేశారు అసిరిని గురించి. "కన్యాశుల్కం లో బ్రాహ్మణ భావజాలాన్ని, వారి కపటత్వాన్ని సూటిగా పదునైన మాటలతో విమర్శించింది మధురవాణి అయితే పరోక్షంగా వారి మాయలను, అవినీతిని వారికే తెలిసేలా మాడు పగలగొట్టింది అసిరి," అంటారు 'అసిరి' వ్యాసంలో. రాజ్యం, మతం, పితృస్వామ్యం, వ్యాపారాల మధ్య ఉన్న బలమైన ముడిలో బైరాగి లాంటి వారి పాత్ర ఏమిటో చెబుతుంది 'కన్యాశుల్కం లో బైరాగి పాత్ర' వ్యాసం.

ఇవి కాక, 'వందేళ్ళ కన్యక, పూర్ణమ్మలు,' 'ముత్యాల సరములు,' 'మానవ సహజీవన సౌందర్య స్వప్నం' ('లవణరాజు కల' గురించి) వ్యాసాలున్నాయి ఈ సంపుటిలో. గురజాడ అభిమానులు, మరీ ముఖ్యంగా 'కన్యాశుల్కం' అభిమానులు మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకం ఇది. (స్వేచ్చ ప్రచురణలు, పేజీలు  88, వెల రూ. 30, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).