ఆదివారం, ఆగస్టు 17, 2014

ప్రాణం ఖరీదు వంద ఒంటెలు

అవును, మనిషి ప్రాణం ఖరీదు వంద ఒంటెలు. ప్రాణానికి ఖరీదు కట్టిన షరాబులు భారతీయలు కాదు, అరబ్బులు. చెయ్యికి చెయ్యి, కాలికి కాలు శిక్ష అమలు చేసే ఎడారి దేశంలో ఒక్క ప్రాణానికి మాత్రం వెసులుబాటు ఉంది. హత్యకేసులో క్షమాభిక్ష ఖరీదు వంద ఒంటెలు. హతుడి కుటుంబానికి, హంతకుడి కుటుంబం వంద ఒంటెల ఖరీదుని న్యాయమూర్తి సమక్షంలో చెల్లించి క్షమాభిక్ష పొందవచ్చు, అది కూడా హతుడి కుటుంబం అందుకు అంగీకరిస్తేనే. అంగీకరించని పక్షంలో, ఉరి శిక్షే.

కేవలం న్యాయమూర్తి ముందు హాజరవ్వడం కోసమే తెలంగాణ పల్లె నుంచి దుబాయ్ వచ్చింది సావిత్రి. ఐదారేళ్ళుగా దుబాయ్ లో కూలీ పనులు చేస్తున్న ఆమె ఒక్కగానొక్క కొడుకు నాగరాజు ఉన్నట్టుండి శవమయ్యాడు. కేసు న్యాయమూర్తి దగ్గరకి వచ్చింది. వంద ఒంటెల ఖరీదు సావిత్రి కి చెల్లించి క్షమాభిక్ష పొందాలని ఆరాట పడుతోంది హంతకుల కుటుంబం. వంద ఒంటెలంటే తక్కువేమీ కాదు, పాతిక లక్షల రూపాయలు! సావిత్రి కోర్టు బోనులో నిలబడి 'తానాజిల్' అంటే చాలు, పాతిక లక్షలతో తిరుగు విమానం ఎక్కేయడమే. అలాకాక, 'కసాస్' అందో, హంతకులిద్దరికీ ఉరి శిక్షే.

సావిత్రి తండ్రి తెలంగాణా సాయుధపోరాటంలో అమర వీరుడయ్యాడు. భర్త నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి 'ఎన్ కౌంటర్' లో శవమై తేలాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాగరాజుని రక్షించుకోడానికి అతన్ని ఊరినుంచి దూరంగా పంపేయడం మినహా మరో మార్గం కనిపించలేదు సావిత్రికి. తండ్రి సాయంతో అక్షరాలని, భర్త సాయంతో సమాజాన్ని చదవడం నేర్చుకున్న సావిత్రి కొడుకుతో కలిసి బతుకు ఈదడాన్ని నేర్చుకుంది. ఇప్పుడా కొడుకు ప్రాణానికి ఖరీదు కట్టాలా? ఇదీ ఆమె ముందున్న ప్రశ్న.

న్యాయమూర్తి ఎదుట 'తానాజిల్' చెప్పి డబ్బు తీసుకోమనే చెబుతున్నాడు చంద్రం, ఆమెకి దూరపు బంధువు, నాగరాజుకి వరసకి తమ్ముడు. ఆమె ఊరినుంచి ఆ ఎడారిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అందరూ ఆమెని చూడవచ్చి, ఇచ్చిన సలహా కూడా అదే. కానీ, సావిత్రి ఆలోచనలు వేరు. ఆమె దృష్టిలో ప్రాణానికి ఖరీదు కట్టడం తప్పు. తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. డబ్బుతో కొనుక్కోలేనివి చాలానే ఉంటాయనీ, ఉండాలనీ ఆలోచించే మనిషామె.


సావిత్రి నాణేనికి ఒకవైపైతే, అర్ధం కాని అరవంలో మాట్లాడే బీద ముసలి వొగ్గు మరోవైపు. న్యాయమూర్తి ఎదుటికి వచ్చిన అవతలి పక్షం ప్రతినిధి ఆమె. శ్రీలంక తమిళుల కోసం పోరాడుతున్న కుటుంబ నేపధ్యం ఆమెది. నాగరాజులాగే, ఆమె కొడుకులిద్దరూ కూడా దుబాయి వచ్చారు. పనిలో చేరారు. డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. ఇంటి సమస్యలు ఓ కొలిక్కి వస్తుండగా, నాగరాజుని హత్యచేసి చట్టానికి చిక్కారు ఆ ఇద్దరూ. వంద ఒంటెల ఖరీదు సంపాదించడం ఆ వృద్దురాలికి సులువుగా అయిపోలేదు. నిజానికి, ఆ డబ్బు కోసం చెయ్యకూడని 'త్యాగం' చేసిందామె.

న్యాయమూర్తి ఎదుటికి ఒక్కో పక్షం నుంచీ ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. మనసులో 'కసాస్' అని పదేపదే వల్లె వేసుకుంటున్న సావిత్రి ఆ వృద్ధురాలిని చూసింది. ఒకరి భాష ఒకరికి తెలీదు. అయితేనేం, ఆమెని చూడడంతోనే జీవితంలో అప్పటి వరకూ తను చూసిన ఏ కష్టానికీ చలించని సావిత్రి పక్కున పగిలింది. కడుపులోంచి, నాభిలోంచి, నరనరాల్లోంచి పొంగిన దుఃఖం రోదనగా మారింది. పరిసరాలను మరిచి, ఆమెని గుండెకి హత్తుకుని బావురుమంది.

వారిద్దరి దుఃఖం వ్యక్తిగతమా, సామాజికమా? ఆ దుఃఖం, సావిత్రి నిర్ణయాన్ని మార్చగలిగిందా? నాగరాజు దుబాయి ఎందుకు వచ్చాడు? ఆ వృద్ధురాలు అంత డబ్బు ఎలా తేగలిగింది? ఈ ప్రశ్నలని జవాబులిస్తూ, ఎన్నెన్నో కొత్త ప్రశ్నలని పాఠకుల ముందుంచుతూ ముగుస్తుంది పెద్దింటి అశోక్ కుమార్ రాసిన 'ప్రాణం ఖరీదు వంద ఒంటెలు' కథ. జూన్ 2, 2013 ఆదివారం ఆంధ్రజ్యోతి లో తొలిప్రచురణ పొందిన ఈ కథ, కథాసాహితి ప్రచురించిన 'కథ-2013' లో చోటు సంపాదించుకుంది. చదవడం పూర్తవుతూనే, ఓ గొప్ప కథ చదివిన అనుభూతిని మిగిల్చింది. (ఈ కథతో పాటు, మరో పదమూడు కథలున్న 'కథ-2013,' అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లబిస్తోంది. పేజీలు 197, వెల రూ. 60).

2 కామెంట్‌లు:

  1. A bba entha goppa katha ni parichayam chesaru....
    dayachesi ee book details inka konni ivvagalaraa? Online lo order chestanu. Lekapote ee saari india vachinappudu konukkunta

    రిప్లయితొలగించండి
  2. @jvrao: కథా సాహితి, 164, రవి కాలనీ, తిరుమలగిరి, సికింద్రాబాద్-500015, ఫోన్: 040-27797691. ఇవండీ వివరాలు. పద్నాలుగు మంది రచయితలు రాసిన కథలతో (ఒక్కొక్కరిదీ ఒక్కో కథ) వెలువరించిన సంకలనంలో ఒక కథ ఇది. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి