సోమవారం, ఆగస్టు 25, 2014

సుకుమారి

'దేరీజ్ మెనీ ఏ  స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్'  అన్నాడు  ఇంగ్లిష్ వాడు. నవలాదేశపు రాణి యద్దనపూడి సులోచనా రాణి రాసిన 'సుకుమారి' నవల విషయంలో నాకీ స్లిప్పు అనుభవంలోకి వచ్చింది. ఈ నవల చదవాలనుకుని, మొదలుపెట్టబోతూ కూడా చదవలేకపోవడం అన్నది చాలాసార్లే జరిగింది. అయినప్పటికీ విడిచిపెట్టకుండా, 'ఇంకానా, ఇకపై సాగదు' అనే ధృడ నిశ్చయంతో చదవడం పూర్తిచేసేశా.

యద్దనపూడి నవల అనగానే కనిపించే మొదటి లక్షణం రీడబిలిటీ. ఆమె రాసిన మిగిలిన అన్ని నవలల్లాగే చదివించే గుణం పుష్కలంగా ఉన్న నవల 'సుకుమారి.' పేరుకు తగ్గట్టే ఎంతో సుకుమారంగా పెరిగి, తనకి ఎదురైన జీవితానుభవాలతో రాటుదేలి, పరిపక్వత గల మహిళగా ఎదిగిన అమ్మాయి కథ ఇది. ఆడపిల్లలు చదువుకుని, తమకాళ్ళ మీద తాము నిలబడాలి అనే  సందేశం ఇచ్చారు సులోచనారాణి.

ఆత్మాభిమానం పుష్కలంగా ఉన్న అమ్మాయి సుకుమారి. అన్నపూర్ణమ్మగారి మనవరాలు. సుకుమారి తండ్రి బొత్తిగా బాధ్యత లేనివాడు. తల్లేమో అత్తచాటు కోడలు. అన్నపూర్ణమ్మకి మనవరాలంటే తగని ప్రేమ.  అవడానికి స్థితిమంతులే అయినా ఆస్తంతా కోర్టు కేసుల్లో ఉండడంతో  మామూలు జీవితం  గడుపుతూ ఉంటారు వాళ్ళు. సుకుమారి  పక్కింటి కుర్రాడు బ్రహ్మానందం. అందరూ బ్రహ్మీ అని  పిలుస్తూ ఉంటారు. సుకుమారి-బ్రహ్మీ బాల్య స్నేహితులు.


సుకుమారికి చదువంటే పెద్దగా  ఇష్టం లేదు. హైస్కూలుతో చదువు ఆపేస్తుంది. డబ్బులేకపోవడంతో బ్రహ్మీ చదువు కూడా ఆగిపోవలసిందే. కానీ, అన్నపూర్ణమ్మ అతన్ని కాలేజీలో చేర్పిస్తుంది. బ్రహ్మీ చదువుకుని  ప్రయోజకుడు అయితే, సుకుమారిని అతనికిచ్చి పెళ్ళిచేసి ఇద్దరినీ కళ్ళముందు ఉంచుకోవాలి అన్నది ఆవిడ ఆలోచన. బ్రహ్మీ తల్లి ఇందుకు సంతోషంగా అంగీకరిస్తుంది. పల్లెలో ఉన్న సుకుమారి, పట్నంలో ఉండి చదువుకుంటున్న బ్రహ్మీ ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు.

అన్నీ అనుకున్నట్టే జరిగిపోతే అది యద్దనపూడి సులోచనారాణి నవలెందుకు అవుతుంది? కాబట్టి, ఇక్కడ కథలో ఇక్కడో ట్విస్టు. అన్నపూర్ణమ్మ కోర్టు కేసు గెలవడంతో ఆ కుటుంబం రాత్రికి రాత్రే బాఘా  డబ్బున్నది అయిపోతుంది. అత్యంత సహజంగానే ఇప్పుడు అన్నపూర్ణమ్మ కంటికి బ్రహ్మీ ఆనడు. వాళ్ళమ్మతో గొడవ పెట్టేసుకుని మాటల్లేకుండా చేసేస్తుంది. అంతేకాదు, ఓ గొప్పింటి సంబంధం చూసేస్తుంది సుకుమారి కోసం.

పెళ్లిచూపులు అని తెలియకుండానే పెళ్లిచూపులు జరిగిపోతాయి సుకుమారికి. పెళ్ళికి అభ్యంతరం చెప్పాలని కూడా తెలీదు ఆ అమ్మాయికి(!!) ప్రపంచం తెలియని సుకుమారి  బామ్మని వదిలి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. వాళ్ళెవరూ బామ్మకి కనిపించినంత మంచివాళ్ళు కారు. కానీ, వాళ్ళ చెడ్డతనం గురించి సుకుమారి చెప్పినా బామ్మ నమ్మదు. ఆ ఇంట్లో బందిఖానా లాంటి జీవితం మొదలెట్టిన సుకుమారి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి  తనదైన జీవితాన్ని ఎలా నిర్మించుకుంది అన్నది మిగిలిన కథ.

సులోచనారాణి హీరోలు, హీరోయిన్ల ఆత్మాభిమానాన్ని ఎంతో ఓపికగా భరిస్తూ, వాళ్లకి అవసరమైనప్పుడల్లా బోల్డన్ని సహాయాలూ అవీ చేసేస్తూ ఉంటారు. ఈ నవలలో బ్రహ్మీ కూడా అంతే. సుకుమారి మీద  ప్రేమని మనసులోనే దాచుకుని, ఆమెకోసం కష్టపడుతూ, ఆమె అపార్ధాలకి గురవుతూ ఉంటాడు నవలాఖరివరకూ. ముగింపు ఊహించ గలిగేదే అయినా ఆపకుండా చదివించే కథనం. ఏదన్నా సీరియస్ పుస్తకం చదివిన తర్వాతో, దూర ప్రయాణంలోనో చదువుకోడానికి హాయిగా ఉంటుంది. (ఎమెస్కో ప్రచురణ, పేజీలు  272, వెల రూ. 80, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

2 కామెంట్‌లు: