శుక్రవారం, మార్చి 20, 2015

ఎందుకీ అసహనం?

నాకు ప్రతిపక్షం అంటే ఇష్టం. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పక్షం నాకు నచ్చుతుంది. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ప్రతిపక్షమే అనీ, బలమైన ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం నియంతృత్వం/రాచరికంతో సమానమనీ నా వ్యక్తిగత అభిప్రాయం. అధికారంలో ఉన్నవాళ్ళలో 'మేము దైవాంశ సంభూతులం' అన్న భావన ప్రబలకుండా అడ్డుకోడమే కాదు, వాళ్ళు చేసే అడ్డగోలు నిర్ణయాలు చట్టాలుగా మారిపోకుండా ఆపగల శక్తి బలమైన ప్రతిపక్షానికి ఉంటుంది. అందుకే, ప్రతిపక్షం అంటే అధికారంలో ఉన్న వాళ్ళకీ, వాళ్ళ అనుయాయులకీ అసహనం కొంచం ఎక్కువగానే ఉంటుంది.

గోదావరి జిల్లా వాడిగా, రాయలసీమని గురించి కొంత అవగాహన ఉన్న వాడిగా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలని దశాబ్దాలుగా గమనిస్తున్నవాడిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ పథకం వల్ల కాంట్రాక్టర్లకి మినహా ఇంకెవరికీ ప్రయోజనం లేదని బలంగా నమ్ముతున్నాను. ప్రకటించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయిన పక్షంలో పట్టిసీమ పథకం నిరుపయోగంగా మారుతుంది. ఈ పథకంపై పెట్టే ఖర్చు వృధా వ్యయం తప్ప మరొకటి కాదు.

ఈ పథకం పూర్తిచేసినా, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకి గోదావరి జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రాయలసీమకి ఒనగూడే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. పైగా, గోదావరి 'మిగులు' జలాలకి కృష్ణా డెల్టాకి తరలించడం వల్ల గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలు ప్రశ్నార్ధకం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోనీ, ఈ జలాల వల్ల కృష్ణా డెల్టా రైతులకి ప్రయోజనం ఉందా అంటే, వీటి అంతిమ గమ్యం ప్రతిపాదిత రాజధాని నగరం తప్ప పంటపొలాలు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే, గోదావరి జలాలని కొత్త రాజధానికి తరలించే పథకం ఇది.

విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ రావడం అత్యవసరం. ఇందుకు బదులుగా తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పట్టిసీమ పథకాన్ని తెరమీదకి తేవడం అంటే, పోలవరం పథకాన్ని పక్కదోవ పట్టించడమే. పట్టిసీమ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల చూస్తుంటే 'పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం అడ్డుపుల్ల వేసిందా?' అన్న సందేహం పదేపదే కలుగుతోంది. రైతు రుణమాఫీ కాగితాలకే పరిమితం కావడం, బ్యాంకుల నుంచి అప్పు పుట్టక రైతులు ఇబ్బందులు పడుతూ ఉండడం లాంటివన్నీ వ్యవసాయ రంగంలో రాబోయే సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. రైతు పక్షాన ఓ గొంతు వినిపించాల్సిన సమయం ఇది.

ఈ నేపధ్యంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం విషయంలో అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్ష సభ్యుల నోటివెంట 'వ్యవసాయం' 'రైతు' 'పట్టిసీమ' అనే మాటలు రాకుండా ఉండేందుకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు అధికార పక్షం సభ్యులు. విషయాన్ని పక్కదోవ పట్టించడమే అంతిమ లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం వారందరిదీ నేరమయ చరిత్రే అనుకుంటే, అధికారంలో ఉన్న వాళ్ళందరూ పులు కడిగిన ముత్యాలేమీ కాదే? పోనీ, ప్రతిపక్షం అంతా నేరమయం, అధికార పక్షం అంతా మిస్టర్ క్లీన్ల మయం అనుకుందాం.. ఈ మిస్టర్ క్లీన్లందరూ స్థాయి తగ్గించుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఏమిటి?

పట్టిసీమ పథకాన్ని గురించీ, రైతు సమస్యల గురించీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోందన్నది కట్టెదుట కనిపిస్తోంది. తప్పించుకు తిరిగే ప్రయత్నంలో ప్రతిపక్షం మీద అవసరానికి మించి బురద జల్లుతోంది. ఊహకి అందనంత అసహనం చూపుతోంది. అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షమూ రాష్ట్ర ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తోంది. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి కారణం ఆ పక్ష సభ్యుల ప్రవర్తనే అయిన పక్షంలో, వ్యవసాయరంగానికి సంబంధించి సభలో లేవనెత్తిన ప్రశ్నలకి ప్రజలందరికీ సూటిగా జవాబులు ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రభుత్వం తన విశ్వసనీయతని నిలబెట్టుకోగలుగుతుంది.

శనివారం, మార్చి 14, 2015

కరుణకుమార కథలు

కొన్ని రచనలు కొందరు రచయితలకి ఇంటిపేర్లుగా స్థిరపడిపోతాయి. అలా, 'కరుణకుమార' పేరు చెప్పగానే గుర్తొచ్చే కథలు 'కొత్త చెప్పులు' 'బిళ్ళల మొలత్రాడు.' ఈ రెండు కథలూ కరుణకుమార ఇంటిపేర్లుగా స్థిరపడిపోయాయి. ఇవి మాత్రమే కాదు, 'ఉన్నతోద్యాగాలు' 'పోలయ్య' లాంటి కథలు అనేక కథా సంకలనాల్లో చోటుచేసుకున్నాయి. రాశిలో తక్కువే అయినా వాసిలో ఎన్నదగ్గ కథలు రాశారు కరుణకుమార. ఈయన కథ ప్రచురించని కథా సంకలనాలు అరుదు. చాలా రోజులుగా ఒకటే ప్రశ్న. ఎవరీ కరుణకుమార? మొత్తం ఎన్ని కథలు రాశారు??

మరీముఖ్యంగా, 'తెలుగు కథల్లో గాంధీ దర్శనం' పేరుతో వెలువరించిన పన్నెండు కథల సంకలనంలో రెండు కథలు కరుణకుమారవే ఉండేసరికి మరింతగా ఆసక్తి పెరిగింది. మొన్నామధ్యన పుస్తకాల షాపులో 'కరుణకుమార కథలు' చూడగానే వెంటనే తీసేసుకున్నాను. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టి నెల్లూరులో స్థిరపడిన కందుకూరి అనంతం (1901-1956) బస్సు కండక్టరుగా జీవితం మొదలుపెట్టి తహసీల్దారుగా ఎదిగారు. 'కరుణకుమార' కలంపేరుతో రాసిన కథల్లో నెల్లూరు జిల్లా గ్రామీణ జీవితం, దేశ స్వాతంత్రానికి పూర్వం ఉన్న గ్రామ రాజకీయాలు, సామాన్యులపై స్వతంత్ర పోరాట ప్రభావం చిత్రితమయ్యాయి.


కరుణకుమార కి కలంపేరుని నిశ్చయించింది ఆయన బావమరిదీ, ప్రసిద్ధ చరిత్ర పరిశోధకులూ అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ. బహుశా, ఒకట్రెండు కథలు చదివాకే కలంపేరు నిర్ణయించి ఉంటారు. బలహీనుల పట్ల వల్లమాలిన కరుణ కనిపిస్తుంది కథల్లో. మొత్తం పదిహేను కథలున్న ఈ సంకలనంలో ఎనిమిది కథల్లో ఇతివృత్తం బలహీనుడిపై బలవంతుడు చేసే దౌర్జన్యమే. ఏ రెండు కథలకే కాదు, ఏ రెండు పాత్రలకీ కూడా పోలిక లేని విధంగా కథల్ని తీర్చిదిద్దారు రచయిత. కొన్ని కథల్లో బలవంతులు గెలిస్తే, మరికొన్ని కథల్లో బలహీనులు ధైర్యంగా నిలబడడం కనిపిస్తుంది.

కామందు చిన్నపరెడ్డి కి 'కొత్తచెప్పులు' కుట్టి తేవడంలో ఆలస్యం చేసిన నరిసికి దొర వేసిన శిక్ష, అనంతర పరిణామాలూ సంకలనంలో మొదటి కథ 'కొత్తచెప్పులు.' 'ఉదయిని' పత్రికలో 1936 లో ప్రచురితమైన ఈ కథ కరుణకుమార మొదటికథ. అందుకే కావొచ్చు, ముగింపులో కొంత నాటకీయత కనిపిస్తుంది. 'హరిజనోద్యమం' ఇతివృత్తంగా సాగిన కథ 'పోలయ్య.' కథలో ప్రధాన పాత్రతో పాటు పాఠకులని కూడా చీకటి రాత్రి ఎడ్లబండి మీద ప్రయాణం చేయిస్తారు రచయిత. మెరుపుముగింపు ఈ కథ ప్రత్యేకత. మనసుపడ్డ పిల్లని పెళ్ళిచేసుకుని, గుర్రం మీద ఊరేగాలని ఏర్పాటు చేసుకున్న రొబ్బయ్య ఊళ్ళో పెద్దలకి కంటగింపుగా మారిన వైనం 'పశువుల కొఠం.'


రెవిన్యూ శాఖలో పనిచేసిన వాళ్ళు మాత్రమే రాయగలిగే కథ 'కయ్య, కాలువ.' భూలావాదేవీల మీద రచయితకి ఉన్న పట్టు ఎంతటిదో తెలుస్తుంది ఈకథలో. కామందుకీ, రోజుకూలికీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిదో చెబుతూ ముగుస్తుంది. గ్రామదేవత జాతర ఇతివృత్తంగా సాగే 'మొక్కుబడి' కథనీ, మరీ ముఖ్యంగా ముగింపునీ ఓ పట్టాన మర్చిపోలేం. 'చలిజ్వరం' గ్రాంధిక భాషా వాది' గల్ఫికల్లా సాగితే, 'జాకీ' వ్యంగ్యంగా ముగుస్తుంది. ధనిక, పేద జీవితాలని చిత్రించిన కథ 'కనువిప్పు.'  పేదవాడిది పైచేయి అనిపిస్తారు రచయిత. 'టార్చిలైటు' 'రిక్షావాలా' '512' 'బిళ్ళల మొలత్రాడు' ఈ నాలుగు కథలూ పేదవాళ్ళవే. ఒకప్పుడు 'సన్నజీవాలు' పేరుతో సంకలనంగా వచ్చాయివి.

'రిక్షావాలా' కథ గోపీచంద్ 'రిక్షావాడి'ని గుర్తుచేస్తుంది. 'బిళ్ళల మొలత్రాడు' పెద్ద కథలో సుబ్బులు, అతని భార్య రమణి గుర్తుండిపోయే పాత్రలు. కరుణకుమార ఎంతటి ఆశావాదో ఈ కథ ముగింపు చెబుతుంది. 'టార్చిలైటు' 'చలిజ్వరం' కథల ముగింపులలో పోలిక కనిపిస్తుంది. 'సేవాధర్మం' '512' కథలు చిన్నపాటి జర్క్ తో ముగుస్తాయి. ఇక, సంకలనంలో చివరి కథ 'ఉన్నతోద్యాగాలు.' గాంధీజీని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని గడిపే ఓ తహసీల్దారు కథ. యుద్ధం రోజుల పరిస్థితులు చదివేప్పుడు కొకు కథలు గుర్తొస్తాయి. కరుణకుమార కథలన్నీ సేకరించి ప్రచురించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థని ఎంతైనా అభినందించాల్సిందే. కాలపరీక్షకి నిలబడే ఈ కథల్ని, కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారందరూ తప్పక చదవాల్సిందే. (పేజీలు 278, వెల రూ. 125, విశాలాంధ్ర అన్ని శాఖలు).

శుక్రవారం, మార్చి 13, 2015

సినీ పేదరికం ...

మూడు రూపాయల డెబ్భై ఐదు పైసలు. ఏమిటీ మొత్తం అని కదూ సందేహం? తెలుగు సినిమా పరిశ్రమ గత సంవత్సరం చెల్లించవలసిన ప్రతి వందరూపాయల ఆదాయపు పన్నులోనూ ఇప్పటివరకూ చెల్లించిన మొత్తం. చెల్లించాల్సిన బకాయి అక్షరాలా నూటికి తొంభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైసలు! ఓ పక్క హీరోలు వాళ్ళ వాళ్ళ సినిమాలు వసూళ్ళలో ఆల్ టైం రికార్డ్ సాధించాయని తొడకొట్టి మీసాలు మెలేస్తూ, మరోపక్క వారి వారి అభిమానులు టీవీ కెమెరాల సాక్షిగా చొక్కాలు చింపుకుంటున్న తరుణంలో, పన్నుల వసూళ్లు ఇంతగా మందగించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 

కొందరు కొన్ని పనులు చేస్తే చూడ్డానికి ఏమాత్రం బావుండదు. సినిమా వాళ్ళు 'బీద కబుర్లు చెప్పడం' అలాంటి వాటిలో ఒకటి. ఇక్కడ 'సినిమా వాళ్ళు' అంటే పెద్ద పెద్ద స్టార్లు, బడా స్టార్ నిర్మాతలు, ఓవర్ స్టార్ దర్శకులే తప్ప రెండో పూట పని దొరుకుతుందో, దొరకదో అని నిత్యం భయపడే జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతమాత్రమూ కాదు. సినిమా వాళ్ళ నుంచి పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా, ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన 'అవగాహన' కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సినిమా పెద్దలు, పరిశ్రమ ఎన్ని కష్టాల్లో ఉందో కన్నీళ్ళే తక్కువగా వర్ణించి చెప్పారు.

సినిమా వాళ్ళ ఆదాయ వ్యయాలు ఒకప్పుడు గుట్టుగా ఉండేవేమో కానీ, ఈ ప్రచార యుగంలో అన్ని విషయాలతో పాటే అవీ బహిరంగ రహస్యాలు అయిపోయాయి. దీనికి తోడు, విడుదలైన రెండో రోజు నుంచే సినిమా ఎంతగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో స్వయంగా నిర్మాతలే ప్రకటిస్తున్నారు కూడా. ఒక్కో సినిమాకీ వాళ్ళ అభిమాన నాయికా నాయకులు పారితోషికాలు ఎంతగా పెరిగాయన్న లెక్కలు ప్రతి అభిమానికీ నాలుక చివర ఉండనే ఉంటాయి ఒకవేళ విధి వక్రించి సినిమా ఆడకపోయినా పారితోషికాలు ఆసరికే అందేసి ఉంటాయికాబట్టి నిర్మాత మినహా మిగిలిన ఎవరికీ ఇబ్బంది లేదు.



చాలామంది నిర్మాతలు షూటింగ్ అవుతూ ఉండగానే శాటిలైట్ తో సహా అన్ని హక్కులూ అమ్మేస్తున్నారు కాబట్టి, సినిమా సరిగా ఆడని పక్షంలో ఆశించిన మేరకి లాభాలు రాకపోవచ్చేమో తప్పించి, నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం లేదు. మరి, వీళ్ళెవరూ ఆదాయం పన్ను ఎందుకు కట్టడం లేదు? మామూలు ఉద్యోగుల దగ్గర ముందస్తు ఆదాయం పన్ను మినహాయించుకుని తప్ప జీతాలు చెల్లించని, చెల్లించనివ్వని ప్రభుత్వం, పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళ విషయంలో చూసీ చూడనట్టుగా ఎందుకు వదిలేస్తోంది?

'అవగాహన సదస్సు' లో పాల్గొన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు "తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆదాయపు పన్ను చెల్లింపులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి" అన్నారని పేపరు వార్త. వారి లెక్కల ప్రకారం గతేడాది మొత్తం వసూలు కావాల్సిన పన్ను రెండువేల కోట్లు కాగా, వసూలైన మొత్తం కేవలం డెబ్భై ఐదు కోట్లు! గౌరవ పార్లమెంట్ సభ్యులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ "గ్యారంటీ లేనివే సినిమా వాళ్ళ బ్రతుకులు" అన్నారట. అక్కడికేదో మిగిలిన సమస్త జీవకోటి జీవితాలకీ గ్యారంటీ ఉన్నట్టు. సినిమా పరిశ్రమని ప్రత్యేక విభాగంగా పరిగణించి పన్నులు వసూలు చేయాలన్నది వీరి సూచన.

ఇక కేంద్ర బొగ్గు శాఖ గౌరవ మాజీ సహాయ మంత్రి, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు సినిమా రంగం పరిశ్రమే కాదని కుండ బద్దలు కొట్టేశారు. ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించిందే తప్ప, వసతులు సమకూర్చలేదని ఆవేదన చెందారు. (స్టూడియోలకి భూముల కేటాయింపు మొదలు, స్థానికంగా షూటింగ్ చేస్తే పన్ను మినహాయింపు వరకూ ప్రభుత్వం చేసినవేవీ వీరు పరిగణించినట్టు లేరు). "సినిమా వాళ్ళ జీవితాలు బీడీ కార్మికుల కన్నా దుర్భరంగా ఉన్నాయి" అని దాసరి అన్నారంటే, ఆయన ఎంత బాధలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. (బీడీ కార్మికులు పెద్ద పెద్ద సినిమా వాళ్ళలా విలాసంగా జీవిస్తున్నారని అపార్ధం కూడదు).

కేంద్ర ప్రభుత్వం సినిమా వాళ్లకి 'పద్మ' అవార్డులు ప్రకటించేప్పుడు వాళ్ళ ఆదాయపు పన్ను చెల్లింపులని పరిశీలిస్తుందనీ, కొన్నేళ్ళ పాటు పన్ను సక్రమంగా చెల్లించని కారణంగానే ఓ ప్రముఖ నటుడికి 'పద్మ' అవార్డు ఆలస్యంగా వచ్చిందనీ ఫిలింనగర్లో ఒకానొక టాక్. ఒకవేళ అలాంటి నిబంధన ఏదీ లేకపోతే వెంటనే ప్రవేశ పెట్టాలి. అనుమతుల మొదలు అవార్డుల వరకూ ఐటీ రిటర్న్స్ కాపీ జత చేయడాన్ని తప్పనిసరి చేయాలి. మరీ ముఖ్యంగా, ఆదాయపు పన్ను బకాయిల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 'లోపాయకారీ ఇచ్చి పుచ్చుకోడాలకి' దూరంగా ఉండాలి. ఇవన్నీ జరిగే పనులేనా?

ఆదివారం, మార్చి 08, 2015

ఆరుగజాల అద్భుతం ...

సరికొత్త ఫ్యాషన్ల వెల్లువ అనునిత్యం మార్కెట్ ని ముంచెత్తుతున్నా, భారతీయ వస్త్ర విశేషం 'చీర' తన స్థానాన్ని కోల్పోలేదు సరికదా, ఏటికేడూ బలాన్ని పెంచుకుంటోంది. సామాన్య ధరకి అందుబాటులో ఉండే చేనేత, మిల్లునేత రకాల మొదలు లక్షలు విలువచేసే డిజైనర్ వెరయిటీల వరకూ భారతీయ మహిళల ఆదరణకి పాత్రం కాని చీర రకం లేదనడం అతిశయోక్తి కాదు. కేవలం మధ్య వయసు మహిళలని మాత్రమే కాదు, విద్యార్ధినులు, నవతరం ఉద్యోగినులను సైతం ఆకర్షిస్తోంది చీర. అందుకే, వెస్ట్రన్ వేర్ తాకిడికి తట్టుకుని నిలబడడమే కాదు, దేశీయ మార్కెట్లో బలమైన పోటీనీ ఇస్తోంది మన ఆరుగజాల అద్భుతం.

దేశీయ 'ఎత్నిక్ వేర్' మార్కెట్ లో మహిళల వాటా అక్షరాలా ఎనభై ఏడు శాతం. చీరలు, సల్వార్లు, లెహంగాలు, గాగ్రాల మధ్య పోటీలో మళ్ళీ చీరదే అగ్రస్థానం. ఈ మార్కెట్ ఏటా ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేసుకుంటోంది. మార్కెట్ లెక్కల ప్రకారం, గడిచిన సంవత్సరంలో 'ఎత్నిక్ వేర్' మార్కెట్ మొత్తం విలువ సుమారు యాభై ఐదు వేల కోట్లు కాగా అందులో కేవలం చీరల వాటా ఇరవైనాలుగు వేల కోట్లు! రానున్న ఐదేళ్ళలో 'అపారెల్' మార్కెట్లో వేగంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సెగ్మెంట్లలో 'శారీస్' ఒకటి. ఆ వెనుకే సల్వార్లు, గాగ్రాలూను. ఏ సంస్థ వేసిన అంచనాని చూసినా ఎనిమిది శాతానికి తగ్గడంలేదు వృద్ధిరేటు.


సింధు నాగరికత వెల్లివిరిసిన కాలంలోనే భారతీయ మహిళలు చీరలు ధరించారని చరిత్రకారులు పరిశోధించి కనుగొన్నారు. మెజారిటీ భారతీయలు 'పంచమవేదం' గా గౌరవించే మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం చీర ఉనికిని ప్రస్తావించింది. దేశంలో ఏ మూలకి వెళ్ళినా వనవాస కాలంలో సీతమ్మవారు నారచీరెలు ఆరేసుకున్న స్థలాలని భక్తితో పూజించే జనం నేటికీ కనిపిస్తారు. అయితే, కాలంతోపాటు అన్ని రంగాల్లోనూ వేగంగా వచ్చి పడిపోతున్న మార్పు, చీర విషయంలో కాస్త వెనక్కి తగ్గాల్సి రావడం ఆశ్చర్యమే. ఫ్యాషన్లకి అనుగుణంగా చీరల డిజైన్లలో ఊహాతీతమైన మార్పులు వచ్చాయి.  ధరలతో నిమిత్తంలేకుండా అమ్మకాలూ ఆ స్థాయి లోనే పెరిగాయి. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరగడం ఇందుకు ఒక కారణం.

భారతదేశంలో ఏటా సుమారు ఎన్ని చీరలు అమ్ముడవుతాయి? ప్రతి మగవాడికీ జీవితంలో కనీసం ఒక్కసారన్నా ఆలోచనలోకి వచ్చే ఈ ప్రశ్నకి ఠకీమని జవాబు చెప్పే వీలులేదు. ఎందుకంటే, చీరల మార్కెట్లో 'ఆర్గనైజ్డ్' సెక్టార్ కన్నా, 'అనార్గనైజ్ద్ ' సెక్టార్ వాటా అధికం. దీనికి కారణం, మొత్తం చీరల మార్కెట్లో అరవైశాతానికి పైచిలుకు గ్రామీణ భారతంలోనే ఉండడం, అక్కడి అమ్మకాలు నేటికీ  షాపుల ద్వారా కాక, చిరువ్యాపారుల ద్వారా ఎక్కువగా జరగడమూను. కాబట్టి, ఎవరికివాళ్ళు ఓ సంఖ్యని మనసులో అనేసుకోవచ్చు. (రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు ఉండవచ్చని ఓ అంచనా).

పల్లెలే కాదు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ ఈ తరహా వ్యాపారస్తులని చూడొచ్చు. మధ్యాహ్నపు వేళల్లో సైకిళ్ళ మీదో, మోటారు సైకిళ్ళ మీదో తిరుగుతూ ఏదో ఓ ఇంటి చావిట్లో చాప పరుచుకుని కూర్చుని చుట్టూ చేరిన మహిళలకి కొత్తచీరల గడివిప్పి నాణ్యతని వర్ణిస్తూ ఉంటారు వీళ్ళు. మంచి చీరలని చూపించి, మెప్పించి, వెంటనే విక్రయించి, సొమ్ముని మాత్రం వాయిదాలలో వసూలు చేసుకోవడం వీళ్ళ ప్రత్యేకత. అసలు 'మంత్లీ ఇన్స్టాల్మెంట్' అనే వ్యాపార సూత్రానికి ఆద్యులు వీళ్ళేనేమో అని సందేహం కలిగేస్తూ ఉంటుంది. నేతపనివారి మొదలు, ఈ చిరు వ్యాపారులు, టైలర్ల వరకూ ఎందరికి ఉపాధి చూపిస్తోందో కదూ చీర.

ఇంత గొప్ప చీరని ఊరికే వదిలేస్తారా మన సినిమా వాళ్ళు? 'పుట్టింటి పట్టుచీర' లాంటి సినిమాలతో అటు సెంటిమెంట్ నీ ఇటు బాక్సాఫీసునీ కూడా పిండేశారు. 'ఆరేసుకోబోయి పారేసుకో'డం మొదలు  'నీలిరంగు చీరలో చందమామ' వరకూ ఎన్ని పాటలకి వస్తువయ్యిందో కదూ ఈ చీర. దాదాపు పుష్కర కాలం క్రితం వచ్చిన ఓ సినిమాలో చీర గొప్పదనాన్ని వర్ణిస్తూ చొప్పించిన పాటని గురించి మిత్రులొకరు చేసిన వ్యాఖ్య గుర్తొస్తోంది. "ఆ పాట సాహిత్యాన్ని లైను పక్క లైను రాసుకుంటూ పోతే చీర మీద చక్కని వ్యాసం తయారవుతుంది.." టీవీలో ఆపాట వచ్చినప్పుడల్లా ఈ వ్యాఖ్య గుర్తొస్తూ ఉంటుంది.


అలనాటి ఆణిముత్యం 'మల్లీశ్వరి' చూసినవాళ్ళకి, నేతపని వారు ఒకప్పుడు ఎంత వైభవంగా జీవించారో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. (ఒంటినిండా నగలతో మెరిసిపోయే 'మల్లీశ్వరీ వాళ్ళమ్మ' కనీసం రెండు మూడు తరాల మగ పురుషులకి ఓ పీడకల!) మరి ఇప్పుడు, చీరల అమ్మకాలు విపరీతంగా పెరిగినా నేసే వారి జీవితాలు నానాటికీ తీసికట్టుగానే ఉంటున్నాయి ఎందుకని? ఎందుకంటే, వేలు, లక్షల రూపాయల ఖరీదుకి అమ్ముడయ్యే డిజైనర్ చీరలు మగ్గాల మీద తయారవ్వడంలేదు. చేనేత మార్కెట్లో పేరుకుపోయిన మధ్యవర్తుల పెత్తనం, కొన్ని షాపింగ్ మాల్స్ వాళ్ళు మిల్లునేత చీరలని చేనేతలుగా చలామణి చేసేయడం ఇవన్నీ నేత వృత్తిలో ఉన్న వారి ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

మనసుకి నచ్చిన చీరని కొనుగోలు చేసే విషయంలో ఏమాత్రం రాజీ పడని అతివలు, ఆ చీరకి వెచ్చిస్తున్న మొత్తంలో ఎక్కువ శాతం చీరని తయారు చేసేవాళ్లకి చెందాలన్న ఆలోచన చేస్తే నెమ్మదిగా అయినా చేనేత మగ్గాలకి పూర్వ వైభవం దక్కే అవకాశం ఉంది. దగ్గరలో మగ్గాలుంటే సరే. లేదూ, ఏటా ఒకరి రెండు టూర్లు ఏదో రూపంలో ఉంటాయి కాబట్టి, అలా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న మగ్గాలని దర్శించి, నచ్చిన చీరలని కొనుగోలు చేయడం ద్వారా ఇటు మహిళలు, అటు నేత పని వారూ కూడా లాభపడే వీలుంది. ఉత్పత్తి స్థలంలో నిర్ణయించే ధర, మార్కెట్ ధరకన్నా తక్కువగా ఉంటుందని కదా అర్ధ శాస్త్రం చెబుతోంది. తయారీ దారుల నుంచే నేరుగా కొనుక్కున్న చీరలు మరింత అందంగా కనిపిస్తాయి. కాదంటారా?

శుక్రవారం, మార్చి 06, 2015

బారతం బొమ్మలు

సృష్టికి విరుద్ధంగా ఏది జరిగినా అది పదిమంది దృష్టినీ యిట్టే ఆకర్షించడం అత్యంత సహజం. ఆ అడివిలో కూడా అదే జరిగింది. ఎక్కడెక్కడి నుంచో గుంపులు గుంపులుగా వచ్చిన చిలకలన్నీ కొమ్మల మీద వాలి ఉన్నాయి. ఆ అడివిలోని చిలుక సమాజంలో పంచాయితీ జరగబోతోంది. తీర్పు చెప్పడానికి పెద్ద చిలక సిద్ధంగా ఉంది. ఓ పెంటి చిలకకి కాకిపిల్ల పుట్టింది! ఆ చిలక పెనిమిటి పంచాయితీ పెట్టించాడు. జరిగిన కథని చెప్పడం మొదలు పెట్టింది పెంటి చిలక. 'కథా మాంత్రికుడు' గోపిని కరుణాకర్ రాసిన 'బారతం బొమ్మలు' కథలో ప్రారంభ సన్నివేశం ఇది.

రాశికన్నా వాశికి ప్రాధాన్యత ఇచ్చే కథా రచయిత కరుణాకర్ కి బాగా పేరుతెచ్చిన కథల్లో 'బారతం బొమ్మలు' ఒకటి. చిత్తూరు జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన సంప్రదాయం 'బారతాలు.' అక్కడి పల్లెల్లో ఇప్పటికీ ఏటా బారతాలాటలు జరుగుతూనే ఉన్నాయి. పద్దెనిమిది రోజులపాటు సాగే ఈ బారతాలు ఆడిస్తే, వేళకి వర్షాలు కురిసి, కరువుకాటకాలు ఉండవన్నది ఆ ప్రాంత ప్రజల విశ్వాసం. తిరుమల కొండపై పుట్టిన కరుణాకర్ ఈ బారతాలని నేపధ్యంగా తీసుకుని చెప్పిన కథ 'బారతం బొమ్మలు.' చిలక కడుపున కాకిపిల్ల పుట్టడం అనే విచిత్రంతో పాఠకుల్ని యిట్టే కథలోకి తీసుకుపోయిన కరుణాకర్, అటుపై వాక్యాల వెంట పరుగులు పెట్టిస్తారు.

నేరేడు పళ్ళ కాలంలో తన పెనిమిటితో కలిసి మేతకి వెళ్ళిన చిలక, ఊహించని విధంగా ఓ డేగ బారిన పడింది. రెక్కకి గట్టి దెబ్బ తగలడంతో ఎగరలేక ఓ చెట్టు మీద తల దాచుకుంది. ఆ చెట్టు కింద చలి కాచుకుంటున్న ఓ తాత, తన మనవడికి చెప్పిన కథే 'బారతం బొమ్మలు.' చలిమంట వెలుగులో తాత చేతిమీద ఉన్న దొరసాని పచ్చబొట్టుని చూసి ఆ కథ చెప్పమని మనవడు అడగడంతో, తన నూనూగు మీసాల యవ్వన కాలంలో జరిగిన సంఘటనని మనవడికి వివరంగా చెబుతాడా తాతయ్య. ఈ చెప్పడంలో దాదాపు అరవై-డెబ్భై ఏళ్ళ నాటి చిత్తూరు ప్రాంతాన్ని, మరీ ముఖ్యంగా భాకరాపేట అడవీ ప్రాంతాన్నీ కళ్ళకి కడతాడు.


నూరెకరాల సేద్యం కలిగిన రైతు పెద్దరెడ్డి దగ్గర జీతగాడిగా ఉన్న మాదిగ చిన్నోడంటే గోలకొండ అబ్బా అనేది. అరవదేశం నుంచి రైలు బండిలో నరసింగపురానికి వచ్చే బారతం బొమ్మలు - పంచపాండవులు, ద్రౌపదిల లక్క బొమ్మలు - బండిలో వేసుకుని తేవడం కోసం బయలుదేరాడు చిన్నోడు. తిరుగు ప్రయాణంలో, ఓ వయసులో ఉన్న కుర్రాడు రంగంపేట దగ్గర బండెక్కాడు, భాకరాపేటలో దింపమని బతిమాలాడు. అది అడవి మార్గం. పైగా దొరల రాజ్యం. అయినింటి ఆడవాళ్ళు ఒంటరిగా దొరికితే వదిలేవాళ్ళు కాదు దొరలు. కొంత ప్రయాణం జరిగాక చిన్నోడికి అర్ధమయ్యింది, తన బండిలో ఉన్నది కుర్రాడు కాదనీ, మారువేషంలో ఉన్న దొరసాని అనీ.

చిన్నోడు అడగడంతో దొరసాని నిజం ఒప్పేసుకుంది. పెళ్లై పదేళ్ళు గడిచినా సంతానం కలక్క పోవడంతో, సవడమ్మ తిరణాలలో మొక్కు తీర్చుకోడానికి వెళ్తోంది ఆమె. రంగంపేట చేరేసరికి తెల్ల దండు ఎదురు పడడంతో వేషం మార్చి చిన్నోడి బండెక్కింది. ఓ దొరసానిని ప్రత్యక్షంగా చూడడం అదే ప్రధమం చిన్నోడికి. "దొరసానులు దేవకన్నెలు. మనబోటి వాళ్లకి కనిపించరు" అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాట ఇంకా గుర్తే అతనికి. అందుకే, తన బండిలో ఓ దొరసాని ప్రయాణం చేయడాన్ని నిజమో, కలో తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయాడు. ఆమె మాత్రం పూలు రాలినట్టు పలపలా నవ్వింది. పులిగుండు వాగులో ఎడ్లు నీళ్ళు తాగుతూ ఉండగా, నీటిలో ఉన్న చందమామతో ఆడుకుంటున్న దొరసాని ఉన్నట్టుండి వాగులో పడిపోయింది.

భారతాలకి వెళ్ళవలసిన బొమ్మలు బూడిదగా ఎందుకు మారిపోయాయో, దొరసాని బొమ్మ చిన్నోడి చేతిమీద పచ్చబొట్టుగా మారిన వైనమేమితో, కాకిని కన్న పెంటి చిలకకి చిలకల పంచాయితీ విధించిన శిక్ష ఏమిటో తెలియాలంటే 'బారతం బొమ్మలు' కథ చదవాల్సిందే. కథ పూర్తయ్యాక ఆలోచనల నుంచి ఓ పట్టాన తేరుకోలేక పోవడమే కాదు, చదువుతున్నంత సేపూ ఒకటొకటిగా వచ్చే వర్ణనలూ ఓసారి ఆగి ముందుకు వెళ్ళమంటాయి పాఠకులని. ప్రారంభమే "చీకటింట సుక్కలాకాశం మిణుకు మిణుకు మంటూ వుండాది. గుడ్డి సుక్క నడిమింటి కొచ్చింది. గాలికి పలవరేణి మాను వూగింది.." అంటూ మొదలవుతుంది. "కందిచేను సీతాకోకచిలుకల్ని పూసింది," "చింతచెట్టు కొంగల్ని పూసినట్టు వుండాది," "చిలకల మొగాలు నల్లగా మాడిపోయినాయి.." లాంటి వర్ణనలెన్నో.

కరుణాకర్ రెండు కథా సంకలనాలు 'బారతం బొమ్మలు,' 'దీపం చెప్పిన కతలు' కలిపి 'గోపిని కరుణాకర్ కథలు' పేరిట సంకలనంగా ప్రచురించింది పాలపిట్ట బుక్స్. 'బారతం బొమ్మలు' తో సహా మొత్తం ఇరవై ఏడు కథలున్నాయి. కథలన్నీ ఓ ఎత్తూ, చివర్లో కరుణాకర్ 'వాగ్గేయకారుడిలా గానం చేస్తున్న కథలు' అంటూ రాసిన కథల వెనుక కథ ఒక ఎత్తూను. పల్లెల్నీ, ప్రకృతినీ, కథల్లో మార్మికతనీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన కథలివి. (పేజీలు  276, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాలు షాపులూ).

బుధవారం, మార్చి 04, 2015

పెసరట్టు కూర

ఉదయాన్నే అల్పాహారంగా పుచ్చుకోడానికి ఉప్మా, ఇడ్లీ, దోశ, పెసరట్టు వగయిరాలు బావుంటాయి. వగయిరాలు ఎందుకంటే కొందరు పొంగల్, వడ, పూరీ కూడా బ్రేక్ఫాస్ట్ జాబితాలో వేసి ఉంచేశారు. వీటిలో ఉప్మా అప్పటికప్పుడు చేసుకునే వంటకం. ఇడ్లీ పిండీ, దోశల పిండీ కూడా నిలవ ఉంటాయి కనుక కొంచం మిగిలినా మరేమీ పర్వాలేదు. కానైతే, పెసరట్టు పిండి ఉంది చూశారూ? ఇది నిలవ ఉంటే అస్సలు బాగోదు.. ఉహు, ఫ్రిజ్జులో పెట్టినా సరే. అందుకే, ఓసారి పెసలు కనుక రుబ్బితే పిండిని వెంటనే చెల్లగొట్టేయాల్సిందే. ఇదిగో, ఈ కండిషన్ కారణంగా పుట్టిన వంటకమే పెసరట్టు కూర.

పేరు బరువుగా వినిపిస్తోంది కానీ, పెసరట్టు కూర చేయడం బహు సింపుల్. కావాల్సిన వాటిలో మొదటిది పెసరట్టు. ఎంత కూర కావాలి అన్నదాన్ని బట్టి పెసరట్లు కాల్చి సిద్ధం పెట్టుకోవాలి. కూర కోసం కాల్చే పెసరట్లు కొంచం మందంగా ఉండాలి. ఈ మందపాటి పెసరట్టుని వేడి మీద ఉండగానే అట్లకాడతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పెట్టేసుకుంటే ముక్కలకి మంచి షేప్ రావడంతో పాటు, చివరి నిమిషంలో హడావిడి కారణంగా వంట పాడయ్యే ప్రమాదం ఉండదు. 'తనకున్న పని తినకున్నా తప్పదు' కాబట్టీ, కూర తినేదే మనమే కాబట్టీ ఆ ప్రకారం ముందుకు పోదాం.


రెడీగా ఉన్న పెసరట్టు ముక్కలని బట్టి, ఉల్లిపాయలు ఎన్ని వేయాలి అన్నది నిర్ణయించుకోవాలి. కొందరు 'ఎత్తుకి ఎత్తూ' వేసేస్తారు. అంటే, పెసరట్టు ముక్కల పరిమాణానికి సరి సమానంగా ఉల్లి ముక్కలు చేరుస్తారన్న మాట. మరీ అన్ని అక్కర్లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుంటే రెండో పని కూడా అయిపోయినట్టే. ఎటూ పెసలు రుబ్బేప్పుడే అల్లం, పచ్చిమిర్చి చేరుస్తాం కాబట్టి మళ్ళీ విడిగా వాటిని చేర్చనవసరం లేదు. ఇప్పుడు, పెసరట్టు ముక్కలు, ఉల్లి ముక్కల పరిమాణానికి అనుగుణంగా చింతపండు నానబెట్టుకోవాలి.

ఇప్పుడింక అసలు సిసలైన కూర వంటకం మొదలు. స్టవ్ మీద బాండీ పెట్టి రెండు మూడు చెంచాల నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్నని సెగ మీద వేగనివ్వాలి. వేగుతూ ఉండగానే ఉల్లిముక్కలని బాండీలోకి జారవిడిచి రెండు మూడు సార్లు కలియతిప్పాలి. ఉల్లిముక్కలు వేగుతున్నాయి అనగా చిటికెడు పసుపు, దూసిన కరివేపాకు చేర్చి మరికొంచం వేగనివ్వాలి. తొందరపడి మాడ్చేసే కన్నా, కొంచం ఓపికగా, మీడియం ఫ్లేం లో వేగనివ్వడమే మంచింది.


ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణానికి రాగానే, పెసరట్టు ముక్కల్ని బాండీలోకి బదలాయించాలి. తాలింపూ, ఉల్లిముక్కలూ బాగానే కలిసిపోతాయి కానీ, ఆ మొత్తం మిశ్రమం పెసరట్టు ముక్కలతో యుద్ధం ప్రకటిస్తుంది. కాసేపు ఎడమొహం, పెడమొహంగా ఉంటాయి రెండూ. ఒక్క క్షణం బాండీ మీద మూత పెట్టేసి, మనం చింతపండు రసం పని చూసి వచ్చేలోగా పెసరట్టు-ఉల్లి ముక్కలు అన్యోన్యంగా మారిపోతాయి కాబట్టి, బెంగ పడక్కర్లేదు. చింతపండు రసం మరీ చిక్కగానూ, మరీ పల్చగానూ కాకుండా చూసుకోవాలి. కూర రుచిని నిర్ణయించడంలో ముఖ్యపాత్ర ఈ రసానిదే. కాబట్టి, జాగ్రత్త అవసరం.

బాండీ మూత తీసి, చింతపండు రసం పోసి జాగ్రత్తగా కలపాలి. పెసరట్టు ముక్కల ఆకారం పాడవ్వకూడదు, అదే సమయంలో చింతపండు రసం ముక్కలన్నింటికీ పట్టుకోవాలి. వంట మొత్తంలో జాగ్రత్తగా చేయాల్సిన స్టెప్ ఇది. రెండు క్షణాలు మూత పెట్టి ఉంచి, తగినంత ఉప్పు వేసి మరోసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. నాలుగైదు నిమిషాల్లో చింతపండు రసం పీల్చుకుని పెసరట్టు ముక్కలు ముద్దుగా బొద్దుగా తయారయ్యాయి అంటే పెసరట్టు కూర రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో తినడానికి చాలా బావుంటుందీ కూర. రుచి నచ్చితే ఈవెనింగ్ స్నాక్ గా కూడా ప్రయత్నం చేయచ్చు. పెసర పిండి నిలవ ఉంచకుండా, వెంటనే అట్లు వేసేసుకుని, తర్వాత కూర చేసుకోవచ్చు.