సోమవారం, జూన్ 08, 2015

దాశరథి రంగాచార్య ...

అచ్చ తెలుగులో, అచ్చు పుస్తకంలో వేదాలని చదువుకోవడం అన్నది సాధ్యపడుతుందని ఇరవయ్యేళ్ళ క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. "అపౌరుషేయాలని అక్షరీకరించడమా?" అని ఆశ్చర్యపడ్డవారూ, ఆగ్రహం ప్రకటించిన వాళ్ళూ ఎందరో. ఓ సంస్కృతాంధ్ర పండితుడు ఆ కృషికి నడుం కట్టాడు. పేరున్న ఓ ప్రచురణ సంస్థ అచ్చొత్తి విక్రయించడానికి ముందుకొచ్చింది. ఫలితం.. ఇరవై శతాబ్దాలపాటు సాధ్యం కాని ఓ బృహత్కార్యం, ఇరవయ్యోకటో శతాబ్దం ప్రారంభానికి కొంచం ముందుగా సుసాధ్యమయ్యింది. ఎమెస్కో తలపెట్టిన వేదాల ప్రచురణకి అన్నీ తానై ముందు నిలిచి, విమర్శలకి తావులేని విధంగా వేదార్ధానికి పుస్తక రూపం ఇచ్చిన ఆ పండితుడు దాశరథి రంగాచార్య.

రంగాచార్య మరణ వార్త విన్న క్షణం నుంచీ ఎన్నెన్నో ఆలోచనలు. 'చిల్లర దేవుళ్ళు,''మోదుగుపూలు' నవలల్లో పాత్రల మొదలు 'జీవనయానం' లో పంచుకున్న విశేషాల వరకూ.. వీటితో పాటే తన సోదరుడిని గురించి దాశరథి కృష్ణమాచార్య చెప్పిన కబుర్లు.. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నాలుగైదు సార్లు ఆయన ఉపన్యాసాలు విన్నా, ఎప్పుడూ పలకరించి మాట్లాడాలి అనిపించలేదు. అలాగని, రంగాచార్య ఏమీ సీరియస్ గా కనిపించే మనిషి కాదు. అయితే చెదరని చిరునవ్వు, లేదా భ్రుకుటి ముడివేసి దీర్ఘాలోచన.. ఈ రెండు భావాలే ఎక్కువగా కనిపించాయి ఆయన ముఖంలో. పలకరించినవారితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు కూడా.

శిఖ, తిరునామం, విజ్ఞానంతో మెరిసే కళ్ళతో చూడగానే నమస్కరించాలనే భావన కలిగే సౌమ్యమైన మూర్తి రంగాచార్యది. అయితే, ఈ సౌమ్యత ఆయనలో కేవలం ఒక పార్శ్వం మాత్రమే. ఎందుకంటే, ఆయన పుట్టింది సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబం, నమ్మింది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం. వైష్ణవాన్ని వదులుకోకుండానే, మార్క్సిస్టుగా జీవించడం, ఆయుధం పట్టి తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొనడం ఒక్క రంగాచార్యకి మాత్రమే సాధ్యపడింది. భిన్న ధృవాలుగా అనిపించే రెండు సిద్ధాంతాలనీ ఏకకాలంలో ఆచరించి చూపించారు తన ఎనభై ఎనిమిదేళ్ళ జీవితంలో.


రామాయణ, భారత, భాగవతాలని అమితంగా ఇష్టపడిన రంగాచార్య వాటిని మార్కిస్టు దృష్టి కోణం నుంచి చూసే ప్రయత్నం చేయకపోగా, వాటినుంచి 'మంచి' ని తీసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "విడి విడిగా చూస్తే రామాయణంలో తప్పులు కనిపిస్తాయి. కానీ, సమగ్రంగా చూడాలి. మానవజీవితాన్ని విశ్లేషించిన గ్రంధం రామాయణం.. ఇది సెక్యులర్ గ్రంధం" అన్నారు రంగాచార్య అనేక సందర్భాలలో. రామాయణంతో పాటు, భారతాన్నీ సరళంగా తెనిగించారు. రంగాచార్య మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, వేదాల తెనిగింపు ఒక్కటీ ఒక ఎత్తు. ఎన్నో విమర్శల నడుమ చేపట్టిన ఈ రచనని విజయవంతంగా పూర్తి చేశారు.

గడిచిన కొన్ని తరాల జీవితాలని కళ్ళముందు ఉంచే రచన, రంగాచార్య జీవితచరిత్ర 'జీవనయానం.' అప్పట్లో 'వార్త' ఆదివారం అనుబంధంలో సీరియల్ గా వచ్చేది. కేవలం ఈ సీరియల్ కోసమే ఆదివారం కోసం ఎదురుచూసేవాళ్ళం అప్పట్లో. ఇంగ్లీష్ కంపెనీలు భారతీయులకి తేనీరు అలవాటు చేయడం కోసం చేసిన ఎడతెగని ప్రయత్నాల మొదలు రజాకార్ల ఆగడాల వరకూ ఎన్నెన్నో సంఘటనలని కళ్ళముందు ఉంచారు. సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే పుస్తకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేసిన రచన అది. రంగాచార్య నవలలతో పాటు. 'జీవనయానం' కూడా గడిచిన తరాల తెలంగాణా జీవితాలని గురించిన రిఫరెన్స్ పుస్తకం అనడం అతిశయోక్తి కాదు.

పద్యం నుంచి గద్య రచనకి మళ్ళిన రంగాచార్య రచనల్లో ఎక్కడా నాన్చుడు ధోరణి ఉండదు. ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం రంగాచార్య శైలి. మాటల్లోనూ, రాతల్లోనూ అదే నిర్మొహమాట ధోరణి. సోదరుడు కృష్ణమాచార్య విశాలాంధ్రని కోరుకుంటే, రంగాచార్య తెలంగాణాకి మద్దతు ఇచ్చారు. అయితే ఆయన కోరుకున్నది 'ప్రజా తెలంగాణా.' "నాయకులకి కాక, ప్రజలకి మేలు చేసే తెలంగాణా కావాలి"ఇది రంగాచార్య పదేపదే చెప్పిన మాట. నిండు జీవితాన్ని చూసిన రంగాచార్య మరణంతో తెలుగు సాహిత్యంలో ఓ శకం ముగిసిపోయింది అనిపిస్తోంది.

4 కామెంట్‌లు:

  1. ఆయన రాసిన శతాబ్ది ఒక గొప్ప చరిత్రక గ్రంథం...అలాగె శ్రీమద్రామనుజుల చరిత్ర కూడా

    రిప్లయితొలగించండి
  2. దాశరధి రంగాచార్య గారి ఆత్మకు శాంతి లభించాలని కోరుకుందాం. విరించి గారికి ఇతర కుటుంబ సభ్యులకు & అభిమానులకు నా సంతాపం తెలియచేస్తున్నాను.

    రంగాచార్య రావడంతో స్వర్గంలో ఉన్న కాళోజీ సోదరులు, గొట్టిముక్కల రాదాకిషన్ రావు (మా తాతాజీ), గార్లపాటి రాఘవరెడ్డి, పల్లా దుర్గయ్య, ఉదయరాజు శేషగిరి రావు, దాశరధి కృష్ణమాచార్య, పీవీ నరసింహా రావు, సామల సదాశివ లాంటి ఎందరో తెలంగాణా ఉద్దండ పండితుల సాహితీ చర్చలు ఇంకా రసవత్తరం అయ్యాయని అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. అవును మురళి గారూ, ఒక శకం ముగిసినట్లే. మీ టపా ఒక మహా పండితుడికి ఒక చక్కటి నివాళి.

    రిప్లయితొలగించండి
  4. @కృష్ణ: ధన్యవాదాలండీ..
    @జై గొట్టిముక్కల: ఇక్కడ సాహిత్యానికి మాత్రం లోటే కదండీ.. ..ధన్యవాదాలు
    @విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి