సోమవారం, నవంబర్ 16, 2015

అర్జున మంత్రం -2

(మొదటి భాగం తర్వాత)

ఏం చెయ్యాలో తోచక చుట్టూ చూస్తున్నా. కుర్చీ పక్కనే ఉన్న పెద్ద కిటికీ లోంచి ఇంటి ఆవరణ చాలావరకూ కనిపిస్తోంది. వీధి వైపు ప్రహరీ లోపల వరసగా అరటి, కొబ్బరి చెట్లు. సందు పొడవునా కాయగూర మళ్ళు, పూల మొక్కలు. పూర్వకాలపు మండువా లోగిలి పెంకుటిల్లే అయినా చాలా దిట్టంగా ఉంది కట్టడం. లోపల ఎన్ని గదులున్నాయో తెలియదు కానీ, ఎక్కడా శబ్దం అన్నది వినిపించడం లేదు.

అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా నా మొబైల్ రింగ్ అయ్యేసరికి ఉలికిపడ్డాను. మేఘన కాల్. 'హనీకి లేక్టోజెన్ పేకెట్ ఒకటి' తీసుకురమ్మని. "ఓ పేకెట్ ఉంది కానీ, మరొకటి దగ్గరుండడం సేఫ్ సైడ్ కదా.." అంటూ, త్వరగా వచ్చేయమని చెప్పి కాల్ కట్ చేసింది.

హనీకి ఇప్పుడు తొమ్మిది నెలలు. పుట్టినప్పుడు అచ్చం మేఘనలాగే ఉండేది కానీ, ఇప్పుడు నా పోలికలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏడాది నిండే వరకూ పిల్లలు ఎవరి పోలికో చెప్పలేం అంటూ ఉంటుంది అమ్మ. నిజమే అని నిరూపిస్తోంది హనీ. నా కూతురని చెప్పడం కాదు కానీ భలే బుద్ధిమంతురాలు. ఆ వయసు పిల్లల్లో ఉండే తిక్క, రాత్రుళ్ళు జాగారం చేయించడం లాంటివి అస్సలు లేవు. ఎప్పుడో తప్ప తిక్క పెట్టదు.

'హనీ ఇంత బుద్ధిగా కాకుండా బాగా అల్లరిచేసే పిల్లయినా బాగుండేదేమో' అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అసలు శ్రీకర్ పెళ్ళికి నేనొక్కడినే వద్దామనుకున్నాను. 'చంటి పిల్లతో అంతదూరం ప్రయాణం కష్టం ' అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాను కానీ, వాడి దగ్గరా నా ఆటలు? మొత్తం నాలుగు రోజుల ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. మేఘన కూడా ప్రయాణానికి సిద్ధ పడడంతో ఇక నేనేమీ మాట్లాడేందుకు  లేకపోయింది.

పెళ్లి కుదిరినప్పటినుంచీ సహజంగానే వాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. "పల్లెటూరి సంబంధం అంటే అమ్మాయి మరీ మందాకినిలా కాకపోయినా, కనీసం ప్రమద్వరలా అన్నా ఉంటుందనుకున్నానురా.. ఈమె చూడబోతే తరళ పోలికలతో పుట్టినట్టుంది," అన్నాడు ఆ మధ్య ఒకరోజు. నేనేమీ మాట్లాడకుండా ఓ ఫోన్ నంబర్ ఇచ్చాను వాడికి.

"యండమూరి నెంబర్రా.. నీకు సరిపోయేట్టుగా ఓ హీరోయిన్ ని సృష్టించి ఇమ్మని అడుగు.." అన్నాను. వాడిక్కోపం వచ్చి ఓ రోజంతా మాట్లాడడం మానేశాడు. అది చాలా పెద్ద శిక్ష నాకు. ఆ విషయం వాడికీ తెలుసు.

 స్టేట్స్ నుంచి రాగానే నన్ను రిసీవ్ చేసుకుంటూ, "అమెరికాలో జెండా పాతి వచ్చావా?" అని కన్ను కొట్టాడు. తల అడ్డంగా ఊపాను. "అసలు నిన్ను యూఎస్ పంపిన వాణ్ణనాలి," అంటూ నవ్వేశాడు వాడు.

నీళ్ళు తెచ్చిచ్చిన కుర్రాడు కాఫీతో వచ్చి "తాతయ్యగారు వచ్చేస్తున్నానని చెప్పమన్నారండీ," అని చెప్పి వెళ్ళాడు. కాఫీ తాగుతూ మళ్ళీ శ్రీకర్ ని గుర్తు చేసుకున్నాను. నా పెళ్ళిలో హడావిడంతా వాడిదే. ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టలేదు.

పెళ్ళైన మర్నాడు మధ్యాహ్నం నిద్రపోయి అప్పుడే లేచాను. వాడు హడావిడిగా నా గదికొచ్చి, లేపీ ఆన్ చేసి, కూడా తెచ్చిన మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేశాడు. తాతగారి పాటలతో ప్రత్యేకంగా చేసిన వీడియో. 'మౌనమేలనోయి' మొదలు 'కాయ్ లవ్ చెడుగుడు' వరకూ సెలెక్టెడ్ సాంగ్స్.

"చూసి బాగా ప్రిపేర్ అవ్వు.." సీరియస్ గా చెప్పాడు. మళ్ళీ వాడే "గురువుగారిదో నవలుంది, 'ప్రేమ' అని.. వేదసంహిత-అభిషేక్ ల మధ్య రొమాన్స్.. గొప్పగా ఉంటుందిలే.. తెచ్చిస్తాను క్విక్ బ్రౌజ్ చేద్దూగాని..."

వాణ్ని చెయ్యి పట్టుకుని ఆపి చెప్పాను "చాలబ్బాయ్.. టీవీ చూసి వ్యవసాయం, పుస్తకాలు చదివి సంసారం.. చేసినట్టే.." వాడు తన చెయ్యి లాక్కుని, రెండు చేతులూ నడుం మీద పెట్టుకుని "ఒక్క రోజులో ఎంత పెద్దవాడివి అయిపోయావ్ రా? ఈ లెక్కన రేపు తెల్లారేసరికి ఇంకెంత పెద్దవాడివి అయిపోతావో..." అంటూండగానే, చూపుడు వేలితో గుమ్మం వైపు చూపించాను కొంచం సీరియస్ గా.

అదొకటుంది వాడిదగ్గర, గీత దాటడు అలాగని పూర్తిగా వదిలెయ్యడు. మేఘన లేబర్ లో ఉన్నప్పుడైతే వాడు ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేదు. డాక్టర్ ఇచ్చిన డేట్ కన్నా ముందే మేఘన ని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అమ్మా నాన్నా అప్పటికప్పుడు హడావిడిగా బయల్దేరారు. రాడానికి టైం పడుతుంది.

మేఘన పేరెంట్స్ తనని చూసుకుంటున్నారు. నార్మల్ అవుతుందని ఒక రోజంతా వెయిట్ చేయించారు డాక్టర్. ఇరవై నాలుగు గంటల పాటు భయంకరమైన లేబర్.. ఆ పెయిన్స్ ని అనుభవించిన మేఘన మర్చిపోతుందేమో కానీ, విన్న నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీకర్ రోజంతా ఫోన్లోనే ఉన్నాడు నాతో. ఆమె మీద నాకు మొదలైన కన్సర్న్, టైం గడిచే కొద్దీ నామీద నాకు అసహ్యం కలిగే వరకూ వచ్చింది.

"ఆడవాళ్ళందరికీ తప్పదురా ఇది.. సృష్టి ధర్మం.. తను బాధ పడుతోంది కరెక్టే.. కానీ, నువ్వు ఇంత బాధ పడ్డం మాత్రం.. కరెక్ట్ కాదు.." వాడు చెబుతూనే ఉన్నాడు. మర్నాడు అమ్మా, నాన్నా రావడం, మేఘనకి డాక్టర్ సిజేరియన్ చేయడం ఒకేసారి జరిగాయి. ఆమెని కళ్ళెత్తి చూడ్డానికి కొంత సమయం పట్టింది నాకు.

హనీకి మూడో నెల వచ్చాక చెకప్ కోసం మేఘనని గైనిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఫార్మాలిటీస్ పూర్తి చేసి "మీరు మళ్ళీ మొదలుపెట్టొచ్చు.." ఎటో చూస్తూ అభావంగా చెప్పింది మా ఇద్దరికీ. నాకు అర్ధమయినా, కానట్టుగా ఉండిపోయాను. మేఘనని  తాకాలంటే ఏదో సంకోచం.

దాదాపు నెల్లాళ్ళ తర్వాత ఈ విషయాన్ని పసిగట్టాడు శ్రీకర్. నేరుగా నేనుండే చోటికి వచ్చేశాడు. ఇంటికి మాత్రం రానని చెప్పేశాడు. ఆ రాత్రి రెస్టారెంట్లో డిన్నర్. టేబుల్ దగ్గర కూర్చుంటూనే నేరుగా విషయంలోకి వచ్చేశాడు. వాడిదగ్గర నాకు దాపరికం ఏముంది? బీర్ బదులుగా విస్కీ ఆర్డర్ చేసి కాసేపు ఆలోచనలో ఉండిపోయాడు. నేను ఫోన్లో ఎఫ్బీ అప్డేట్లు చెక్ చేసుకుంటూ ఉండగా చాలా సీరియస్ గా మొదలుపెట్టాడు.

"మేఘన విషయం నువ్వు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నావు.. నీకొద్దు సరే, మరి తనకి?" వాడి ప్రశ్నకి జవాబు లేదు నాదగ్గర. "అండ్, ఈ వైరాగ్యం తాత్కాలికం.. ఇందుకోసం మీ ఇద్దరిమధ్యా దూరం పెరగకూడదు.." కళ్ళెత్తి చూశానోసారి.

"పెళ్లి, సంసారం నాకేమాత్రం తెలియని విషయాల్రా.. కానీ ఒకటి మాత్రం తెలుసు. మగాడికి బాధ్యతలు ఉంటాయి.. అవి నెరవేర్చడంలో ఒక్కోసారి ఇష్టంతో పని ఉండకూడదు.." కళ్ళముందు మెరుపులు మెరిశాయి నాకు. విస్కీ సిప్ చేస్తున్నాం ఇద్దరం.

"ఇంకొక్క స్మాల్ పెగ్ కి మాత్రమే పర్మిషన్ నీకు. ఫ్రెష్ అయిపోతావు పూర్తిగా.. ఇంటికెళ్ళు.. మొదలుపెట్టు.. ఒక్కసారి మొదలైతే..." మాటల కోసం వెతుక్కోడానికి ఆగాడు. విస్కీతో పాటు, వాడి మాటలూ పనిచేశాయి. కానీ, ఆవేళ రాత్రి మేఘన నన్ను బలంగా తోసేసి, హనీని పక్కలోవేసుకుంది. నిద్రపోలేదు, నిద్ర నటించింది.

మర్నాడు నేను ఆఫీస్ కి వెళ్లేసరికి రిసెప్షన్లో ఎదురు చూస్తున్నాడు శ్రీకర్. కేంటీన్ కి తీసుకెళ్ళి జరిగింది చెప్పాను. "నాకేమీ అర్ధం కావడం లేదురా.. కానీ, ప్రతీ సమస్యకీ పరిష్కారం ఉంటుంది.. డోంట్ వర్రీ.. ఆలోచిద్దాం.. నాకిప్పుడు ఫ్లైట్ టైం అవుతోంది.." అంటూ వెళ్ళిపోయాడు.

మేఘన ధోరణిలో ఏ మార్పూ లేదు. ఆ ఒక్క విషయం తప్ప, భూమ్మీద సమస్త విషయాలూ మాట్లాడుతోంది. పరిష్కారం వెతుకుతూ ఉంటే, సైకియాట్రిస్ట్ దొరికాడు. ఇద్దరి మధ్యా విషయం కాబట్టి, కౌన్సిలింగ్ లో మేఘన కూడా ఉండాలన్నాడు. ఆ మాట వింటూనే ఇంతెత్తున లేచింది మేఘన. కౌన్సిలింగ్ కి రాకపోగా, నాతో మాటలు తగ్గించేసింది. ఐదార్నెల్లుగా అశాంతి పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు.

"ఈ వైరాగ్యం తాత్కాలికం" ఎంత కరెక్ట్ గా చెప్పాడో శ్రీకర్!! 'అన్నీ ఉండీ ఏంటిదీ?' అనిపించని రోజు లేదు. అమ్మా, నాన్నలతో నేను కల్లో కూడా ఈ విషయం మాట్లాడలేను.

వాడి పెళ్లి హడావిడిలో ఉంటూ కూడా నాగురించి ఆలోచిస్తున్నాడు శ్రీకర్. "సోమయాజిగారనీ.. ఆ ఏరియా లో పెద్ద పేరుందిట్రా.. సిటీల్లో వాళ్ళలాగా కమర్షియల్ కాదు.. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేస్తారట.. అపాయింట్మెంట్ గొడవా అవీ ఏవీ ఉండవు.. నేరుగా ఇంటికి వెళ్లి కలవడమే..ఓ ప్రయత్నం చేసి చూడు," వాడి పెళ్ళికి నా ప్రయాణం ఫిక్స్ అయినప్పటినుంచీ చెబుతూ వస్తున్నాడు నాకు. ఇవాళ రాత్రి ముహూర్తానికి వాడి పెళ్లి.

గ్లాసు మీంచి జారిన కాఫీ చుక్కొకటి నా ఒళ్ళో ఉన్న కవర్ మీద పడింది. జేబులోంచి కర్చీఫ్ తీసి కవర్ తుడిచేశాను. నా పెళ్లి తర్వాత అమ్మిచ్చిన కవర్ అది. "అమ్మాయివీ, నీవీ జాతకాలు.. నీ దగ్గరుంచు," అంతకు మించి ఏమీ చెప్పలేదు. నేనూ అడగలేదు. అసలు వీటితో పని పడుతుందని కూడా అనుకోలేదు నేను.

విభూది పరిమళాలతో వచ్చారు సోమయాజి గారు. "కాస్త ముఖ్యమైన విషయం అయ్యేసరికి వెళ్ళాల్సొచ్చింది.. ఆలస్యానికి ఏమీ అనుకోకు బాబూ.." ఆయన అంటూండగానే కవర్ అందించబోయాను. అవసరం లేదన్నట్టుగా చేసైగ చేశారు.

"ఆడపిల్లా? మగపిల్లాడా?" ఆయన్నన్ను పరీక్షగా చూడడం ఇబ్బంది పెడుతోంది. "ఆడపిల్లండి.. పదోనెల వస్తుంది.." చెప్పాను. మళ్ళీ లోపలినుంచి పిలుపు రాక ముందే ఈయన విషయంలోకి వస్తే బాగుండును.

నా ఆలోచన చదివినట్టుగా "ఆ అరటి చెట్లు చూశావా బాబూ" అన్నారు. అరటి చెట్లలో చూడ్డానికి ఏముంటుందో అర్ధం కాక ఆయనవైపు చూశాను. 

"గెల పక్వానికి రాగానే చెట్టుని మొదలుకంటా నరికేస్తాం.. ఒక్కటే గెల.. మళ్ళీ కాపుండదు.. కదళీ వంధ్యత్వం అంటారు.." ఆయన చెప్పింది అర్ధమయ్యే కొద్దీ నా ముఖంలో రంగులు మారుతున్నాయి. అది గమనించి అభయం ఇచ్చారు..

"ఉహు, అది అరటి చెట్టుకే.. మనుషులకి కాదు.. కంగారు పడకు.. మనుషులకీ ఉంటే ఇంత సృష్టి జరుగుతుందా?"

నిజమే కదా! 

"సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోలేక, దోషాల వంకలు వెతుక్కుంటూ ఉంటారు ఓపికా, శ్రద్ధా లేని వాళ్ళు.. కొత్త రుచులు కోరుకునే వాళ్లకయితే ఇదో అవకాశం కూడాను..." సోమయజిగారి స్వరం గంభీరంగా మారింది.

"పాప పుట్టాక ఇంట్లో నువ్వు కేవలం తండ్రిగా ఉంటున్నావా? మొగుడిగా కూడానా?" కన్ఫ్యూజింగ్ గా అనిపించింది ఆ ప్రశ్న.

"అమ్మాయిని ఏమాత్రం పట్టించుకుంటున్నావు? పాప పుట్టక మునుపూ, ఇప్పుడూ ఒకేలా చూసుకుంటున్నావా?" సూటిగా అడిగారు. అమ్మాయంటే మేఘన అని అర్ధమయ్యింది. శ్రీకర్ గాడికీ, నాకూ రాని ప్రశ్న ఇది.

మేఘన నేనూ హనీకి తల్లిదండ్రులం. అంతకన్నా ముందు ఇద్దరం భార్యాభర్తలం. ఆ సంగతి ఇద్దరం మర్చిపోతున్నామా? ఆలోచనలు చదివే శక్తి ఏదో ఉన్నట్టుందీయనకి.

"కావాల్సిందల్లా కాస్త సహనం, ఓర్పు.. ఏమీ తెలియని వాడివి కాదు కదా.. ఇంతకన్నా అరటిపండు ఒలవనక్కర్లేదు నేను," నవ్వేశారాయన. నేనూ తేలిక పడ్డాను.

"జాతకం చూడకుండానే ..ఎలా చెప్పగలిగారు?" చాలా సేపటినుంచీ లోపల దాచుకున్న ప్రశ్న అడిగేశాను అప్రయత్నంగా.

"దీనికి జాతకం అక్కర్లేదు బాబూ.. అనుభవం చాలు.. మీ ఇంట్లో నా వయసు వాళ్ళు ఉండుంటే ఇంత దూరం వచ్చే శ్రమ తప్పేది నీకు.." వయసొక్కటే కాదు, సమస్యలతో వచ్చే వాళ్ళెంతోమందిని దగ్గరగా చూసిన అనుభవమూ ఉంది కదా. ఆయనకి మరోసారి నమస్కరించి బయల్దేరాను.

తెలియకుండానే హుషారొచ్చింది. "మనో వేగమున మరో లోకమున మనో రధములిటు పరుగిడగా..." తాతగారి పాట.. ప్లేయర్ కాదు, నేనే పాడుతున్నాను.

అమ్మాయి వాలుజడలా అందంగా కనిపిస్తున్న తార్రోడ్డు మీద కారు పరుగులు తీస్తోంది.

(అయిపోయింది)

(వచన రచనకి మేస్త్రి, 'టుప్ టీక' కథా రచయిత, కీర్తిశేషులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి కృతజ్ఞత)

20 కామెంట్‌లు:

  1. "అర్జునమంత్రం అపురూపం... "

    చప్పట్లు ..

    రిప్లయితొలగించండి

  2. ఆహా ! ఏమి కాల మహిమ ! ఆఖరికి మల్లాది వారిని కూడా గోదావరి కి లాగేసు కున్నారుస్మీ :) ఇక "కృష్ణా తీరం" ఏమి చేయును :)

    బాగు బాగు కథ ! ఇంత త్వరగా తెర పడుతుందని అనుకోలే ! :)

    అర్జునుడు తపానికి వెళితే ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా "వైభావాంగనలు" కిట్టె ! ఈ అర్జున మంత్రం తో తాత వారి వైద్యం పని జేస్తుందని ఆశిస్తో :)

    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. "దీనికి జాతకం అక్కర్లేదు బాబూ,అనుభవం చాలు..మీ ఇంట్లో నా వయసు వాళ్ళు ఉండుంటే ఇంతదూరం వచ్చే శ్రమ తప్పేది నీకు"

    కరక్ట్ గా చెప్పారండీ,పెద్దవాళ్ళు దాపు లేక కూలిపోతున్న కొత్తకాపురాలెన్నో చూస్తున్నాం/వింటున్నాం. తాతగారు బాగా పనిచేసారండోయ్

    రిప్లయితొలగించండి
  4. బాగుందండీ.. మంచి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు..

    రిప్లయితొలగించండి
  5. నాలుగు ఒకటి అరా, ఏడు ఒకటి అరా అనే సందిగ్ధంతో సిసింద్రీ పాళ్ళు తెలియకుండా గొప్పగా మొదలుపెట్టారు కానీ కథ చివర్లో తుస్సుమనిపించి తేలిపోయినట్టు. సూరేకారం ఎక్కువైపోయింది. సోమయాజులు గార్ని కలవడానికి ఇంత పెద్ద కధా, గోదావరి పరిసరాల వర్ణనా అవసరం లేదు. ఏ పెద్దాపురం దొంగేరు అయినా సరిపోయేది. ఏమనుకోకండి ఇలా నిర్మొహమాటం గా రాసినందుకు.

    రిప్లయితొలగించండి
  6. అవును, DG గారితో ఏకీభవిస్తాను. ఏమనుకోకండి, మీ కలం నుండి ఇంతకన్నా మంచి కథలు వచ్చాయి అనక తప్పదు.

    రిప్లయితొలగించండి
  7. @కొత్తావకాయ: చప్పట్లే!! చాలా సంతోషం అండీ.. ధన్యవాదాలు
    @జిలేబి: చిన్న కథే కదండీ మరి.. అందుకని త్వరగానే తెరపడిపోయిది :) ..ధన్యవాదాలు
    @శ్రీనివాస్ పప్పు: మల్లాది రామకృష్ణశాస్త్రి గారు చూపించిన దారండీ మరి.. ఆయన కథల్లో తాతగార్లదే హవా :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @DG: పెద్దాపురం దొంగేరైనా, బుడతనబిల్లి రాజేరైనా కథ తాలూకు స్థల కాలాదులు స్పష్టంగా ఉండాలని ఓ పాఠకుడిగా నేను కోరుకుంటానండీ.. నాకలా నచ్చుతుంది. జిహ్వకో రుచి కదా.. నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు..
    @విన్నకోట నరసింహారావు: అయ్యో అనుకోడానికి ఏముందండీ.. చదివేసి ఊరుకోకుండా మీ అభిప్రాయం పంచుకున్నారు, అది సంతోషం.. ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. మురళిగారు, ఈ కథా కథనం నాకు చా...లా నచ్చింది. ప్రబంధాల్లో అడుగడుగునా ఉండే వర్ణనలే గుర్తుకు తెచ్చాయి. అంతే కాదు మీ గోదావరి అభిమానాన్ని ఎంతో చక్కగా కళ్ళముందుంచింది.మీ ఇష్టులందరినీ పరిచయం చేసేసారు. నాకైతే మురళిగారే ఆ విషయాలన్ని ఎదురుగా కూర్చుని చెప్తున్నట్లుంది.:)
    కథ రెండో భాగంలో ఊహించని భావం తళుక్కున మెరిసింది.

    రిప్లయితొలగించండి
  10. కధ చెప్పేటపుడు మురళి గారు వ్రాసారని గుర్తుపట్టేటట్లు ఉండకూడదు. బ్లాగుల్లో రెగ్యులర్ గా పరిచయం వల్ల కధనంలో మీలోని పాఠకుడు రచయతని డామినేట్ చేస్తున్నాడు.(సరిగ్గా చెప్పానా?)

    సున్నితమైన అంశాన్ని మంచి విషయాన్ని (చర్చకు) తీసుకున్నందుకు అభినందనలు ! ఒకవైపు చప్పట్లు,మరొకవైపు తప్పట్లు అందుకున్నారు కదా :p

    యండమూరి టైం లో ఇలా నేరుగా పాఠకులకు దొరికే చాన్స్ లేదు.మీరు పాఠకులను ఎంత సమర్ధవంతంగా ఎదుర్కోగలిగితే రచయతగా అంత ఎదగగలుగుతారు.(ఉ బో స)

    ఒక పాఠకురాలిగా నా వంతు కొన్ని....

    కధనంపై శ్రద్ధ పెట్టిఉంటే బాగుండేది. తాతగారంట తాతగారు..ఆయనకో పేరుంది తెలుసా ?(రోహిణీ హట్టంగడి) మావూరి వాళ్ళు అంత త్వరగా తాతలవ్వరు.

    తెలంగాణా గోసా,గోదారి యాసా,నీహారిక బాసా మారవా ? (బ్లాగు సుమన్ లాగా తయారయ్యారు,వద్దన్నా గోదారిని తప్పించుకోలేకపోతున్నాం) మీకు తెలంగాణావారికంటే ఎక్కువ ప్రాంతీయాభిమానం ఉందని ఒప్పుకుంటున్నాం!

    మీకు రెగ్యులర్ పాఠకులం కాబట్టి మీరు ప్రతి కధలోనూ గోదారిని లాక్కొస్తుంటే విసుగు వస్తుంది.కొత్తావకాయ గారిలాగా "కాత్యాయినీ వ్రతం" నుండి "ఎంతెంత దూరం? "అని అమెరికన్ స్టైల్లోకి వెళ్ళగలరేమో ట్రై చేయండి.మాకు కొత్తదనం కావాలి.(బ్రహ్మానందం స్టైల్లో)

    అమెరికాలో జెండాలు పాతేటంతటి దృశ్యం గోదావరి వాళ్ళకు ఉందా ?( హైబ్రిడ్ మొక్కలు హైబ్రిడ్ మొక్కలే ....అందులోనూ క్రోటన్స్ మరీనూ ! )

    తరళ ఏ నవల హీరోయిన్ ?(సందేహం)

    ప్రసూతి వైరాగ్యం ఆడవాళ్ళకే అనుకుంటున్నాను,మగాళ్ళకూ వస్తుందా ?(అనుమానాస్పదం)

    మనసిక సమస్యలన్నిటికీ సైకియాట్రిస్ట్ అవసరం లేదనుకుంటా సైకాలజిస్ట్ అయితే ఒప్పుకునేదేమో ?(అపోహ)

    ఆడవాళ్ళ బాధ్యతలు గుర్తుచేసేటంతటి స్నేహితురాలు లేకపోవడం మేఘన దురదృష్టం .(జాలి)

    పెగ్ వేసుకుంటే మూడ్ వస్తుందా ? (భారతదేశం లో చాలామంది ఆడవాళ్ళకి ఇవ్వాలి)

    జిలేబీ గారన్నట్లు అర్జునమంత్రం పనిచేయకపోతే నీహారికా మంత్రం వేద్దాం. ఇద్దరూ దారిలోకి వస్తారు.(రహస్యం)

    వివాహం జరిగాక మోడీలాగా సన్యాసం తీసుకున్నవారి భార్యలూ,60 ఏళ్ళ తర్వాత సన్యాసంతీసుకోమని సలహా ఇచ్చే అమిత్ షా లాంటివాళ్ళ భార్యలూ ఏం చేయాలి ? అపుడు మగాళ్ళకు బాధ్యతేమీ ఉండదా ?

    చెప్పితీరాలని నా "ప్రత్యేక" డిమాండ్ !

    రిప్లయితొలగించండి
  11. గోదారోళ్ళమీదే రాళ్ళా? నేనొప్పుకోను.
    గోదారోళ్ళు గోదారి గురించి కాక నర్మద గురించి వ్రాస్తారా? (అన్నట్టు గోదారి మీద వందల పాటలుంటే నర్మద మీద ఒకే పాటుంది. తెలుసా?)
    అసలు శంకరాభరణం గోదారొడ్డున తియ్యకపోతే ఒక్క అవార్డు కూడ వచ్చుండేది కాదు. స్వాతిముత్యం ఆస్కారుకి వెళ్ళే ఆస్కారం ఉండేదే కాదు.
    వంశీ సినిమాలన్నింటినీ గోదారి మీదే తీసినపుడు మురళి గారు కథలన్నీ గోదారి మీదే ఎందుకు రాయకూడదు?
    బాపు గారి అందాల రాముడు నుంచి శేఖర్ కమ్ముల గోదావరి దాకా తెలుగు సినిమాలన్నింటికీ గోదారే దారి.
    అసలు ఆ రామోజీరావు ఫిల్మ్ సిటీని రాళ్ళల్లో, రప్పల్లో కట్టుకున్నాడు కాని, అదే మా రాజమహేంద్రవరం పక్కన గోదారొడ్డున కట్టుకొనుంటే ఎప్పుడో వరల్డ్ ఫేమస్సయ్యుండేది.

    రిప్లయితొలగించండి
  12. @జయ: చాలా చాలా సంతోషంగా ఉందండీ.. 'గులాబీరంగు వోణీ' కి మీర్రాసిన వ్యాఖ్య జ్ఞాపకం వచ్చింది. హహ్హా.. నా ఇష్టులు ఇంకా చాలా మంది ఉన్నారండీ.. వీళ్ళు మాత్రం కథలో హీరోకీ, ఫ్రెండుకీ ఇష్టులన్న మాట :) ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. @బోనగిరి: చాలా సంతోషం కలిగిందండీ, గోదారి మీద మీ అభిమానం చదివి.. నర్మద మీద నాకు రెండు పాటలు గుర్తొచ్చాయి.. "నర్మదా నది తీరంలో నవ మన్మధా అని అంటా" "నాలో పొంగెను నర్మదా.." ఇంకా ఉన్నాయేమో వెతకాలి :) అభిమానం పెరిగే కొద్దీ సూచనలు శాసనాలు అవుతాయేమోనండీ.. వారు అభిమానంతో చెప్పినట్టుగానే ఉంది నాకు.. మీ గోదారి అభిమానం ముందు నాదెంత అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ.. ..అనేకానేక ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  14. @udaya lakshmi Akula: మీ పేరు కన్నా ముందు మీ వ్యాఖ్య చదివి "నీహారిక గారి వ్యాఖ్య లాగా ఉంది" అనుకున్నానండీ.. ఒక్కొక్కరికీ ఒక్కో శైలి తెలియకుండా వచ్చేస్తుంది మరి..

    తాతగారు కాబట్టే పేరు పెట్టి చెప్పలేదు (రోహిణి హట్టంగడి డైలాగు, నిజానికి మీర్రాసింది నాగేసర్రావుది)

    మీకు రాముడు ఎలాగో, నాకు గోదావరి అలాగండీ.. (ఎవరు చెప్పినా, రాముడి ప్రస్తావన లేకుండా మీరు నాలుగు మాటలు మాట్లాడగలరా? ఇదీ అలాగే)

    కొత్తావకాయ గారు, she is a blessed writer, in deed. కాబట్టి, ఆ పోలిక కూడా సాహసం

    తరళ, ప్రమద్వర ఇద్దరూ ఒకే నవలలో హీరోయిన్లండీ. పేరు మీకు బోరు కొడుతుందేమో. అడిగారు కాబట్టి చెప్పక తప్పదు.. 'వెన్నెల్లో గోదారి.'

    మగవాళ్ళకి కూడా వస్తుందండీ, కాకపొతే బయటికి తెలిసే అవకాశం బాగా తక్కువ

    సైకాలజిస్ట్ తర్వాతి లెవెల్ సైకియాట్రిస్ట్ కదండీ.. చెప్పే విషయాలతో పాటు, చెప్పనివీ ఉంటాయి కదా కథలో..

    పెగ్ విషయం మహిళలెవరైనా ప్రయత్నించి చెప్పాలండీ ప్రపంచానికి.. కానీ, ఆ ప్రయత్నం చేసే వాళ్ళు తారస పడడం లేదు..

    కథ పరిధిలోకి వచ్చే ప్రశ్నలకి జవాబులిచ్చేశాను.. అనేకానేక కారణాలకి మీ వ్యాఖ్య నాకు చాలా చాలా నచ్చింది.. ప్రత్యేక ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. అన్యాయమండీ ! అంత పెద్ద వాఖ్య రాముడి ప్రస్తావన లేకుండా వ్రాసాను. మురళి గారి బ్లాగ్ సాక్షిగా ఇకమీదట రాముడి ప్రస్థావన తీసుకురాకుండా వ్రాస్తాను. నన్ను మీరు నమ్మి తీరాలి.

    రిప్లయితొలగించండి
  16. @నీహారిక: అయ్ బాబోయ్.. నా బ్లాగు మీదే ప్రమాణం చెయ్యాలా అండీ :)) సీరియస్లీ, మిమ్మల్ని ప్రస్తావించ వద్దని కాదండీ, అలవాటు గురించి చెప్పానంతే.. ఏదేమైనా, నేను మాత్రం గోదారి విషయంలో కమిట్ అవ్వను :) ..థాంక్యూ..

    రిప్లయితొలగించండి
  17. సరిగ్గా అర్ధం కాలేదు. మరాకృశా గారి కొన్ని కథల్లానే...
    ఎక్కడో ఏదో అసహజత్వం.
    అంత వ్యక్తిత్వం, సరదాలు, సరసాలు, సావాసాలూ, యండమూరి నవల్లూ, వేటూరి పాటలూ... ఆఖరికి విస్కీ విత్ ఎఫ్‌బీ ఉన్న జీవితంలోనూ ఇంతేనా?
    ఇంతకీ సమస్య నాయకుడిదా నాయికదా?
    బహుశా... నేనింకా ఈ స్థాయి కథలని అర్ధం చేసుకోలేనేమో...
    ఆఖరికి శీర్షికతో సహా...

    రిప్లయితొలగించండి
  18. @పురాణపండ ఫణి: పాఠకులకి ఏదన్నా అర్ధం కాలేదంటే రాసిన వాళ్ళకీ బాధ్యత ఉందని నమ్ముతానండీ.. స్పష్టంగా మీ అభిప్రాయం పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.. తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటాను..

    రిప్లయితొలగించండి
  19. మురళిగారు,

    కథ చాలా బాగుందండీ - తూచ్! నాకు బాగా నచ్చిందండీ! నిజానికి నాకు అనిపించేదేమిటంటే మీ కథలలో వస్తువు కంటే అనుభూతి ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఆ అనుభూతి కోసం, ఆ నోస్టాల్జియా, తెలుగుదనం వగైరాల కోసం మీ కథలు చదవాలి. మనస్సులో ఒక తీయని బాధను కలిగిస్తాయి మీ కథలు.

    "అర్జున మంత్రం" వాహ్! కథ కంటే కూడా, కథకు మీరెంచుకున్న శీర్షిక బాగుంది. ఈ శీర్షిక పూర్తిగా అర్థమవ్వాలంటే విజయవిలాసం చదవాల్సిందేనేమో!

    సమస్య పెనుభూతంలా కనిపిస్తున్నప్పుడు తార్రోడ్డు త్రాచుపాములా, దూదిపింజెలా తేలియినప్పుడు అమ్మాయి వాలుజడలా కనిపించడం సబబే మరి!

    రిప్లయితొలగించండి
  20. @సుభగ: ఎంత నిశితంగా చదివారండీ అసలు!! చాలా చాలా సంతోషంగా ఉంది..
    అలాగే, 'కథని మరికొంచం సరళంగా చెప్పాల్సిందేమో' అన్న ఆలోచనా ఏమూలో లేకపోలేదు.. మీ వ్యాఖ్యలో చివరి వాక్యానికి టోపీ తీశాను.. ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి